విధవలు రెండో పెళ్ళి చేసుకోకూడదని నమ్ముతుంది. రెండోపెళ్ళి చేసుకున్నవారు తిరిగి సంసారంతో సుఖంగా వున్నారంటే నమ్మదుగాక నమ్మదు.
అలాంటి చెడ్డపనులు చేసేవాళ్ళు సుఖంగా వుండరని ఆమె అభిప్రాయం ఉదాహరణలతో చెప్పినా కళ్ళముందు అలా రెండోపెళ్ళి చేసుకుని సుఖపడుతున్న వాళ్ళని చూసినా ఆమె నమ్మదు.
అందుకే చెప్పి చెప్పి, తనవల్ల కాదని ముగించుకున్నాడు అతను. అలా నమ్మకపోవడమనేది డిఫెన్స్ మెకానిజంలో ఒక భాగం అని అతనికి తెలుసు. తన అభిప్రాయాలు కరెక్ట్ అని తనను తాను సమర్ధించుకోవడానికి ప్రతిఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అడాప్ట్ చేసుకుంటారు. అలా సత్యవతి 'నిజాన్ని గుర్తించడానికి నిరాకరించే' తత్త్వాన్ని అలవరచుకుంది. దీన్నే ఇంగ్లీష్ లో 'డినైల్ ఆఫ్ రియాలిటీ' అంటారు.
దీన్ని అలవర్చుకోవటం ఆమెకే నష్టం. కానీ ఇది ఆమె గుర్తించదు లేదా తెలియదు.
ఆ సమయంలో సత్యవతిని చూస్తే మళ్ళీ తాజాగా తయారైనట్టుంది. కానీ భర్త వున్నప్పుడు ఆ కళ్ళల్లో కన్పించిన కాన్ఫిడెన్స్ ఇప్పుడులేదు. ఏదో భయం భయంగా పరిసరాలను చూస్తూ నడుస్తోంది.
భజన అయిపోయినట్టుంది. అంతవరకూ లోపలున్న పిల్లలు బిరబిరా బయటకొస్తున్నారు.
ఎవరో మంత్రం వేసినట్టు చందమామను నల్లటిమబ్బులు వేటాడి మరీ మింగేశాయి. ఒక్కసారిగా చీకటి అలుముకుంది. ఆకాశంలో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ జరిగినట్టు మెరుపులు కళ్లను చీలుస్తున్నాయి.
నక్షత్రాలమీద బుల్ డోజర్ పోతున్నట్టు ఉరుములు, చెవులను తూట్లు పొడుస్తున్నాయి.
వేసవి కాలంలో ఇంతే- వాతావరణం క్షణంలో మారిపోతుంది. అంతా అదేదో ఇంద్రజాలంలా వుంటుంది. తప్ప ప్రకృతిలో జరిగిన మార్పులా అనిపించదు.
అతను వీధిలోంచి ఒక్కగెంతుతో ఆ ఇంటి వరండాలోకి ఎక్కాడు. సన్నపాటి జల్లు ప్రారంభమై బి.పి. పేషెంట్ కు కోపం వచ్చినట్టు దబదబమంటూ పెద్ద పెద్ద చినుకులు రాలడం మొదలయ్యాయి.
అయిదు నిముషాలు గడిచిందో లేదో ఎంత విచిత్రంగా ప్రారంభమయిందో, అంతే విచిత్రంగా వర్షం ఆగిపోయింది.
చందమామ మళ్ళీ వికసించాడు.
వర్షం వెలవడంతో జనం ప్రసాదాలకోసం వస్తున్నారు.
అతను అటెన్షన్ లోకి వచ్చాడు.
నారాయుడు మొదట గంధంను పంచుతున్నాడు. అలా వార్ని చూస్తూనే తనకూ గంధం కావాలనిపించి సురేష్ వర్మ అక్కడ్నుంచి దేవాలయం ముందుకు వచ్చాడు. నారాయుడి దగ్గర్నించి కొంచెం గంధం తీసుకున్నాడు. చేతుల్లోకి గంధం వాసన మొత్తం మనిషినే సుగంధభరితం చేసింది. అతను రెండు చేతులకీ గంధం రాసుకున్నాడు.
మళ్ళీ వాతావరణంలో మార్పు, తూర్పు ఆకాశాన్ని ఎవరో చించేస్తున్నట్టు మెరుపు మెరిసింది.
అతను తల పైకెత్తాడు. ఎదురుగా మరో ఇద్దరు స్త్రీలతో వస్తున్న శశిరేఖ కనిపించింది. మరి ఇంతకుముందు మెరుపు మెరిసిందో, లేక శశిరేఖ అందం అలా తన కళ్ళల్లో చిట్లిందో తేల్సుకోలేకపోయాడు.
"ప్రసాదం పెట్టెయ్యండయ్యా-వర్షం వచ్చేట్లుంది" ఎవరో అరుస్తున్నారు.
దేవాలయం ఆవరణలో తొక్కిసలాట ప్రారంభమైంది. ఆ జనాన్ని, హడావిడిని ఎంజాయ్ చేస్తున్నట్టు శశిరేఖ యధాప్రకారం బావిగట్టుకు ఆనుకుని నిలబడింది.
పందారం ప్రారంభమయింది. దాంతోపాటు చినుకులూ ప్రారంభమయ్యాయి.
జనం తొక్కిసలాట మరింత ఎక్కువైంది. ప్రసాదం పెట్టించుకున్న వాళ్ళు తలమీదకి భుజం మీది తువ్వాళ్ళు లాక్కుని పరుగులు పెడుతున్నారు.
చినుకులు మరింత ఎక్కువయ్యాయి.
శశిరేఖకు ఎటూ పాలుపోలేదు. మామూలుగా అయితే గంగారత్నం తోడుగా వచ్చేదిగానీ ఈ రోజు వర్షం వల్ల రాలేదు. తనతోపాటు వచ్చిన ఇద్దరు ఇంకా ప్రసాదం పెట్టించుకోలేదు. వాళ్ళని అరిచి గట్టిగా పిలవటానికి ఇబ్బందిగా అనిపించి అలానే వుండిపోయిందామె.
ఈసారి మరింత బలమైన వర్షం.
తుపాకీ శబ్దానికి పావురాళ్ళు చెల్లాచెదురైనట్టు జనం తలోదిక్కుకూ పరిగెత్తారు. శశరిఖ అక్కణ్ణుంచి తప్పుకుని పక్కనున్న ఇంటి వరండాలోకి ఎక్కింది.
అది విశ్వనాధం ఇల్లు. వాళ్ళు ఈ మధ్యే ఊరొదిలి వెళ్ళిపోయారు. అది ఆమెకి తెలియదు కాబట్టే ధైర్యంగా అక్కడికివచ్చి నిలబడగలిగింది.
ఇదే మంచి సమయం.ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదుగాక దొరకదని అనిపించింది. అందుకే సురేష్ వర్మ రెండు అంగల్లో రోడ్డును దాటి వరండా ఎక్కేశాడు. ఎవరో అక్కడికి రావడంతో ఆమె అటూఇటూ చూసింది.
లోపల ఎవరూ లేరన్న విషయం అప్పుడు గుర్తించింది శశిరేఖ.
అంతలో ఓ మెరుపు మెరిసింది. ఆ వెలుగులో ఒకరికొకరు బాగా కనిపించారు.
తెల్లటి పైజామా, లాల్చీలో అతను ప్రబంధనాయకుడిలా వున్నాడు. ఆమె కళ్ళు తిప్పుకుంది. అతనెవరో తెలియదు. చూసినట్టు కూడా అనిపించలేదు. ఉరుముల్తో తయారుచేసి మెరుపుల్తో పైపూత పూసినట్టు అతను కాఠిన్యంగానూ, నాజూకుగానూ అనిపించాడు.
ఆమె వెళ్ళిపోవడానికి కదుల్తున్నట్టు కదిలిందిగానీ వర్షం ఎక్కువ కావడంతో ఆ ప్రయత్నం మానుకుంది.
అతను ఆమె ముందుకు కదిలాడు.
ఆమె భయపడుతూ చూస్తోంది. భయంకన్నా అతనెవరన్నా కుతూహలం ఎక్కువగా ఉందామెకి. చటుక్కున మరో మెరుపు మెరిసింది.
"అపురూపమైన మీ అందం చూపించటానికే ప్రకృతి నాకు సాయం చేస్తున్నట్టు ఈ మెరుపులు ఏమంటారు?" అతను ఏదో లోకంనుంచి ఊడిపడే ఈ మాటల్ని తనతో అంటున్నట్టు వుంది ఆమెకి.
ఎవరో ముక్కూ ముఖం తెలియని వ్యక్తి తనకెదురుగా నిలబడి తన అందాన్ని అదేపనిగా పొగుడుతుండడం ఏదోగా వుంది. అంతకుమించి ఏం అనడానికీ శశిరేఖకి ధైర్యం చాలడంలేదు. అతను ఎంతో గౌరవప్రదమైన మనిషిలా కనబడుతున్నాడు. ఆ పర్సనాలిటీ, ఆ మాట తీరూ, ఆ గొంతులోని సభ్యతా సంస్కారాలు ఆమెకు కోపం కలిగించటం లేదు.
"చిన్నప్పుడు ఎప్పుడో చందమామ కథలు చదివేవాడిని. ఏనుగు పూలహారం వేస్తే భిక్షగాడు రాజు అయిపోయాడని కథలు చదివి వాడెంత అదృష్టవంతుడో అనుకునేవాడ్ని. కానీ ఇలా వర్షం కురుస్తున్నప్పుడు మీలాంటి సౌందర్యవతితో ఇంత దగ్గరగా మాట్లాడేస్తున్న నాకంటే ఆరాజు ఏమాత్రం అదృష్టవంతుడు కాదని ఇప్పుడనిపిస్తోంది" అని అలా నిలబడిపోయాడు.
ఆమెకి ఏం చెప్పాలో, ఎలా ప్రతిస్పందించాలో తెలియడం లేదు. షాక్ తిన్నట్టు నిలబడిపోయింది.
మరోసారి మెరుపు మెరిసింది.
అతను కళ్ళతోనే వస్తానన్నట్లు చెప్పి వరండా దిగేశాడు. వర్షంలో కలిసిపోయాడు.
గంగారత్నం ఆమెకోసం గొడుగు తీసుకొచ్చి ఎక్కడా కనబడకపోతే "శశిరేఖమ్మా!" అంటూ అరుస్తోంది.
అంతవరకు జరిగినదంతా గమనించిన చింతామణి పెదవులమీద చిర్నవ్వు అంత చీకట్లోనూ మెరిసింది.
* * * *
