Previous Page Next Page 
వసుంధర కధలు-5 పేజి 2

 

    దొంగతనం చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళాలి. అక్కడా వీధిలో జనసంచారం లేదు. ఎవ్వరూ నన్ను చూడలేదు. ఒకసారి ఆ వీధిలో చివరి వరకూ వెళ్ళి మళ్ళీ వెనక్కు వచ్చి చటుక్కున దొడ్డి గుమ్మం తలుపు తోసుకుని లోపలకు ప్రవేశించి తలుపు మళ్ళీ జారగిల వేశాను.
    ఒకసారి దొడ్డిని పరిశీలించి చూశాను. దాక్కునేందుకు చెట్లున్నాయి. మల్లె పోదలున్నాయి.
    ఎక్కడా దొడ్లో ఎవరి అలికిడి లేదు,
    నేను క్షణం తటపటాయించాను. ఇందాకా చూసిన హాలు గుమ్మం దగ్గరకు వచ్చి లోపలకు తొంగి చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు.
    చటుక్కున హల్లో ప్రవేశించాను.
    నేను హల్లో ప్రవేశించానో లేదో దూరంగా గజ్జెల చప్పుడు వినిపించింది. అప్రయత్నంగా అక్కడున్న కొట్టు గదిలో దూరాను. అదృష్టమేమిటంటే ఆ హడావుడిలో నేను ఏ వస్తువునీ తన్నలేదు.
    జానకి హాల్లోకి వచ్చి వీధి గుమ్మం వరకూ వెళ్ళి "తలుపు వేసే వుంది" అని స్వగతంగా అనుకుని మళ్ళీ లోపలకు వెళ్ళిపోయింది.
    నేను ఒక్క నిముషం ఆగి కాస్త కదిలాను. కొట్టు గదిలో మసక వెల్తురుగా ఉంది. అక్కడ నాకు పనికొచ్చే వసువులేమీ వున్నట్లు లేవు. ఒక మూల ట్రంకు పెట్టి లాంటిది వుంది. అది చాలా పాతది. ఒకసారి అలాంటి చోటే నిధులు దొరకవచ్చు. అలాగనుకుని చప్పుడుచెయ్యకుండా పెట్టె తెరిచాను.
    అందులో నాకు పనికొచ్చే వస్తువు లోక్కటీ లేవు. కొన్ని పాతగుడ్డలు , పాత నవారు, విరిగిన బొమ్మలు రంగు వెలసిన క్యారం బోర్డు బిళ్ళలు -- ఇంకా అంతకంటే చెత్త సరుకులూ ఉన్నాయి. నెమ్మదిగా పెట్టె మూసి వేశాను.
    ఇంట్లో హల్లో గజ్జెల చప్పుడు వినబడింది. నేను చటుక్కున గది మూలకు వెళ్ళాను. మరుక్షణం లో జానకి కొట్టు గది గుమ్మం ముందు ప్రత్యక్ష మయింది.
    నేను ఊపిరి బిగబట్టాను. నేనామెను కన్నబడ్డం లేదని తెలుసు. కానీ నాకామే కనబడుతోంది. ఆమె ఈ సమయంలో కొట్టు గదిలోకి ఎందుకొచ్చింది అన్న అనుమానం నన్ను పీడిస్తోంది. అప్రయత్నంగా జేబు తడుముకున్నాను. జేబులో కత్తి ఉంది. నాకు ధైర్యం పెరిగింది. అయినా ఒంటరి ఆడది -- యెలాగో అలా యెదిరించ వచ్చునామేను.
    ఆమె చేతిలో ఏవో బట్టలున్నాయి. అవి ట్రంకు పెట్టెలో పెట్టి వెళ్ళిపోయిందామె.
    ఆమె వెళ్ళేముందు కొట్టుగది తలుపులు దగ్గరగా జేరవేసింది. గొళ్ళెం , పెడుతుందేమోనని భయపడ్డాను. కానీ అలా జరగలేదు. తేలికగా నిట్టూర్చి ఆమె వేసిన బట్టలేమిటా అని చూశాను. అవి ఒక పురుషుడి బట్టలు పాంటు, షర్టు, బనియన్, అండర్ వేర్ ఉన్నాయి. నాలో నేనే నవ్వుకున్నాను.
    చాలామంది డబ్బున్న వాళ్ళు చేసే పనే ఇది. బట్టలన్నిటిని ఒక సెట్టుగా కలిపి వాడతారు. ఒక సెట్టుగానే విడిచి పెడతారు. ఈ బట్టలు కొట్టు గదిలోకి వచ్చాయంటే -- పాత బట్టల క్రింద మారాయన్న మాట. ఆమె వాటిని ఏ స్టీలు సామాను వాడికో ఇస్తుంది.
    చూడ్డానికవి యింకా గట్టిగానే వున్నాయి. వాళ్ళకప్పుడే దిగదుడుపు అయిపోయాయి. అయినా గదిలో వెళ్తురట్టే లేదు. బహుశా ఆ బట్టల రంగు బాగా  వెలసి ఉండవచ్చు. ఇవన్నీ నాకు ముఖ్యం కాదు. నేను ప్రాణాలకు తెగించి ఈ యింట్లో అడుగుపెట్టాను. విలువైనదేదో సంపాదించక పొతే నా ప్రయత్నం వ్యర్ధం.
    మొట్టమొదటి సారిగా నాకులా దొంగతనానికి ప్రయత్నించి యెక్కువ డబ్బు సంపాదించిన వారెవరైనా ఉన్నారో లేదో కానీ ఈరోజు నేను చాలా తెలివి తక్కువగా ప్రయత్నించినట్లు యిప్పుడే గ్రహించాను. ఇందాకా ఆమె మంచినీళ్ళ  అందించినపుడు నాకు మంచి అవకాశం వచ్చింది. అప్పుడు కత్తి చూపి బెదిరించి ఆమె నగలు కాజేయవలసినది. వాటి విలువ కొన్ని వేలుంటుంది. ఇంట్లో అంత విలువ చేసే  క్యాషు గానీ ఇతర సామాగ్రి గానీ దొరకదు గదా౧ దొరికినా అది బయటకు తీసుకు వెళ్ళడం కష్టం. నగలైతే జేబులో వేసుకుని పోవచ్చును.
    జరిగిందాని కప్పుడు విచారించి లాభం లేదు. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇందాకా దొరలా ప్రవేశించి ఇంటి ఆనుపానులు తెలుసుకున్నాడు ఇప్పుడు దొంగలా ప్రవేశించాను యింట్లో. నేనెవరో తెలియకుండా ఆమెను బెదిరిస్తాను.
    ఈ ఆలోచన రాగానే జుట్టు రేపుకున్నాను. ముఖానికి అడ్డంగా రుమాలు పెట్టుకున్నాను. నా పాంటూ, షర్టూ విప్పి ఆమె అక్కడ వదిలేసిన పాంటు, షర్టూ వేసుకున్నాను. బట్టలు నాకు చాలా లూజుగా వున్నాయి.
    ఉంటె ఉన్నాయి గానీ ఈ బట్టల్లో ముఖానికి అడ్డంగా రుమాలు కట్టి వున్న నన్నామే సులభంగా గుర్తించలేదు. నెమ్మదిగా కొట్టు గది తలుపులు తెరిచి -- సందులోంచి హాల్లోకి చూశాను. అక్కడేవ్వరూ లేరు. హల్లో ప్రవేశించి మళ్ళీ కొట్టు గది తలుపులు జేరగిలవేశాను.
    ఒక్క క్షణం ఊపిరి బిగాపెట్టాను. అప్పటికి నా ఉద్వేగం తగ్గింది. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంకో గుమ్మం దగ్గరకు నడిచి తెర పక్కనుంచి తొంగి చూశాను. అక్కడ చూసిన దృశ్యం నన్ను షాక్ తినిపించింది.
    అంతసేపూ నేను యింట్లో జానకి ఒక్కర్తే ఉందనుకున్నాను. కానీయింటి యజమాని కూడా యింట్లో ఉన్నాడని తెలియదు. గదిలో మంచం మీద యింటి యజమాని ఉన్నాడు. అతడి వీపు నావైపు తిరిగి ఉంది. అతడి వంటి పై అస్తవ్యస్తంగా లుంగీ పంచ ఉంది. అతడి కి అటుపక్క ఆమె ఉందనడానికి సూచనగా గుసగుసలు వినపడుతున్నాయి.
    వాళ్ళిద్దరూ భార్యాభర్తలు- మంచి మూడ్ లో వున్నట్లున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి?
    నేను నెమ్మదిగా వంగుని పాకుతూ గదిలోకి ప్రవేశించాను. వారు నన్ను గమనించలేదు.
    గది గుమ్మానికి యెదురుగా మంచం వుంది. మంచానికి కొంచెం అవతలగా డ్రెస్సింగ్ టేబుల్ వుంది. దాని పక్కన ఓ బీరువా వుంది. నేను డ్రస్సింగ్ టేబుల్ కూ, బీరువా కు మధ్య చేరుకున్నాను.
    వాళ్ళిద్దరూ మంచం మీంచి లేచి నిలబడితే తప్ప నేను కనబడను.
    అప్రయత్నంగా నా దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ మీదకు పోయింది. డ్రెస్సింగ్ టేబుల్ సొరుగు ఒకటి తెరిచి వుంది. అందులోంచి స్పష్టంగా ఆమె నగలు కనబడుతున్నాయి. ఆ నగలన్నీ ఇందాక నేను చూసినవే! మంగళసూత్రాలతో సహా ఆమె వదిలేసి ఆ సొరుగులో వుంచింది. అంటే అదృష్టం నన్ను వరించిందన్నమాట!
    అది ఆమె ఇల్లు. అక్కడున్నది ఆమె భర్త. అందువల్లనే నిర్భయంగా నగలన్నీ వలచి అక్కడ పెట్టింది జానకి. అయినా నగలన్నీ తీయడమెందుకో -- ఏమో- పెళ్ళైన వాళ్ళ సరదాలు నాకేం తెలుస్తాయి?
    హటాత్తుగా అతను మంచం మీంచి దిగాడు. లుంగీని వళ్ళంతా చుట్టబెట్టుకున్నాడు. నేను చటుక్కున డ్రెస్సింగ్ టేబుల్ అద్దం  వెనక్కు వెళ్ళాను. అదృష్టవశాత్తు నేనతని కళ్ళబడలేదు. అతన్ని మాత్రం నేను స్పష్టంగా చూశాను.
    మనిషి చూడ్డానికి వస్తాదులా వున్నాడు. కండలు తిరిగిన అతని శరీరం చూస్తుంటే నాకుకళ్ళు తిరిగాయి. ఇతగాడికి నేను దొరికానంటే చచ్చానన్న మాటే!
    అమె నెమ్మదిగా అతన్ని ఏదో అంటోంది. అతను అస్పష్టంగా  ఏదో గొణిగాడు.
    కధల్లో వర్ణించే ప్రణయ కలహం కాబోలు - ఒక నిముషం అతను అక్కడే నిలబడి ఏదో అని మళ్ళీ మంచం మీద పడుకున్నాడు.
    నేను వెంటనే డ్రెస్సింగ్ టేబుల్ ముందుకు వచ్చి యెంతో జాగ్రత్తగా పగలను నా జేబులోకి తోసేశాను.
    నా అదృష్టం చాలా గొప్పది. మొట్టమొదటి దొంగతనం లోనే పెద్ద బేరం కలిగింది.
    సొరుగు తెరిచే వుంది. అలాగే వదిలేస్తే నగలు పోయాయని వెంటనే తెలిసిపోతుంది గదా -- అందుకని సొరుగు నెమ్మదిగా వెనక్కు తోసేశాను.
    ఇప్పుడు నేనా గదిలోంచి బయట పడాలి.
    మంచం మీద వాళ్ళెం చేస్తున్నారో నాకు కనబడడం లేదు.
    వాళ్ళ ముఖాలు గుమ్మం కేసే తిరిగి వుంటే నాకు ప్రమాదం. నేను బయటకు పోవడానికి ఆ గుమ్మమే దారిలా వుంది. ఇటువైపు యింకో గుమ్మం వుంది కానీ పరిచయం లేదు. తెలిసిన దారిలో పారిపోవడం నాకు క్షేమం.
    నేను మంచాన్ని సమీపించాను.
    నా గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నేను పహిల్వాన్ కంట బద్దానంటే నా పని అయిపోయిందన్న మాటే! పులుసులోకి ఎముక లేకుండా చావగొట్టగలడతను నన్ను.
    నేను ముని కాళ్ళ మీద లేచి నిలబడి ఒకసారి మంచం వైపు చూశాను.
    మంచం మీద యిద్దరూ వున్నారు. ఆమె వెల్లకిలా పడుకుని వుంది. అతనామే వైపు తిరిగి వున్నాడు. హటాత్తుగా ఆ క్షణ మాత్రం లోనే ఆమె నన్ను చూసిందే మోనని అనుమానం కలిగిందినాకు. చటుక్కున డ్రెస్సింగ్ టేబుల్ అద్దం వెనక్కి వెళ్ళిపోయాను. ఆ స్థలం నాకు చాలా క్షేమంగా వుంది.
    నేనుననుకున్నంతా అయింది. "ఎవరో మంచం వెనుక నుంచి చూసినట్లుంది" అన్న ఆమె కంఠం నాకు వినబడింది.
    "అంతా నీ అనుమానం. ఇప్పుడెవరోస్తారు?" విసుగ్గా అన్నాడతను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS