కుక్కలపాలెం పల్లెటూరేగానీ అక్కడ అన్ని సదుపాయాలూ ఉన్నాయి. నా ఉద్యోగం యిక్కడే అయిన పక్షంలో చాలా కంఫర్టబుల్ గా వుంటుందని నేను అనుకున్నాను. అక్కడ అన్నీ చౌకగా కూడా వున్నాయి. ఇంటి అద్దె, తిండి ఖర్చులు కలిపినా నూటయాభై రూపాయలకు మించకపోవచ్చు. రెండు సంవత్సరాలలో మా దరిద్రం తీరిపోతుంది. చాలా సంతోషంగా తిరిగి ఇంటి కెళ్ళాను.
రాయుడు నన్ను పలకరించి "మధ్యాహ్నం జీపువస్తుంది. నిన్ను నీ ఉద్యోగ స్థలానికి తీసుకువెడుతుంది. అదీ ఊళ్ళోకాదు-" అన్నాడు.
కొద్దిగా నిరుత్సాహపడ్డాను. ఉద్యోగం నాకెలావచ్చిందో కూడా నాకర్ధం కావడంలేదు. నా సర్టిఫికెట్లూ అవీ చెక్ చేయడం జరక్కుండా, ఉద్యోగమేమిటో నాకు తెలియకుండా నేను సెలక్టు కావడమూ, జీతం ఫిక్స్ అవడమూ, అయిదునెలల జీతం అడ్వాన్సుగా దొరకడమూ జరిగిపోయింది. సంతోషంగావున్నా సంతృప్తిగాలేదు నాకు. ఎక్కడో ఏదో లోపముందనిపిస్తోంది.
రాయుడిగారింట నాకు ఘనమైన ఆతిథ్యం లభించింది. ఆ భోజనమూ, ఆ రుచీ మరువడం యెలాగని అనుకొంటూండగానే నాకోసం జీపు వచ్చింది.
"వెళ్ళు నాయనా! బహుశా మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు-" అన్నాడు రాయుడు.
ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకొని, జీపు ఎక్కాను.
3
జీప్ నన్ను ఎక్కడో మారుమూల ప్రదేశంలో, జన సంచారం లేనిచోట వున్న బంగళా దగ్గరకు తీసుకెళ్ళింది. నేను నా బ్రీఫ్ కేసుతో దిగగానే "లోపలకువెళ్ళి తలుపు తట్టండి" అనిచెప్పి జీపు డ్రయివరు వెళ్ళిపోయాడు.
అక్కడ నాకు కాస్త భయం వేసిందనే చెప్పాలి. ఆ చుట్టుపక్క లెక్కడా జనంవుండే ప్రదేశంలాలేదు. అలాంటి చోట ఈ బంగళా యెందుకు వెలసిందో, అందులో నాకు వున్న పని ఏమిటో అర్ధంకాలేదు.
ఒక్కక్షణం ఆగి గుండె చిక్కబట్టుకుని ముందడుగు వేశాను. నేమందిగా నాలో ధైర్యం చోటుచేసుకున్నాక గబగబా అడుగులువేసి వెళ్ళి తలుపుతట్టాను.
లోపల్నుంచి ఏమీ అలికిడి కాలేదు. మళ్ళీ తలుపు తట్టాను.
ఈ పర్యాయం యెవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. కొద్ది క్షణాల్లో తలుపులు తెరుచుకున్నాయి. తలుపులు తీసిన మనిషిని చూడగానే నా భయమంత నశించిపోయింది. సుమారు పాతికేళ్ళ యువకుడతను.
"నాపేరు రామారావు. మీరు హరగోపాల్ కదూ!" అన్నాడతను.
"అవును...." అన్నాను.
"లోపలకు రండి...." అన్నాడు రామారావు. లోపలకు వెళ్ళాను.
ఓ పదినిముషాలు ఇద్దరమూ మామూలు కబుర్లు చెప్పుకున్నాక "మీరు ముందుగా కొంత పేపర్ వర్క్ చేయవలసి వుంటుంది" అన్నాడు రామారావు.
అతను అక్కడ నా గురించే ఎదురు చూస్తున్నాడని అర్ధమైంది అతను చెప్పిందాన్ని బట్టి. అతను పేపర్ వర్కు అనగానే నాకు కొంత తృప్తి కలిగింది-" అలాగే!" అన్నాను.
రామారావు కొన్ని తెల్లకాగితాలూ, మనియార్డరు ఫారాలూ తీసుకు వచ్చాడు. తెల్లకాగితాలమీద ఉత్తరాలూ, మనియార్డరు ఫారాలన్నీ నెలకు మూడువందల రూపాయల చొప్పున నా చేత ఫిలప్ చేయించాడు. ఉత్తరాలూ, మనియార్దార్లు కూడా మా ఇంటికే.
"ఏమిటిదంతా?" అన్నాను మధ్యలో.
"పూర్తయ్యేక చెబుతాను...." అన్నాడు రామారావు.
అంతా పూర్తయ్యేక-"ఓ ఏడాదిపాటు ఈ భవనంలో మీ మకాం. ఇక్కడ్నించి కదలడానికి వుండదు. అందుకని మీ తరఫున వుత్తరాలూ, మనియార్డర్లూ నేను పంపిస్తాను" అన్నాడు రామారావు. అతను నేనుపూర్తిచేసిన కాగితాలన్నింటినీ ఓ బ్రీఫ్ కేసులో సర్దేశాడు.
"ఇదేం ఉద్యోగం....." అన్నాను ఖంగారుగా.
"కంగారు పడకండి. మీ బాధ్యతా నిర్వహణ చాలా సులభం. ఇది కావడానికి నాగరికతకు దూరంగా వున్న బంగళా అయినా, ఇక్కడ లేని సదుపాయం లేదు. మీకు కావలసిన సదుపాయాలన్నీ భేమన్న చూసుకుంటాడు. నేను సెలవు తీసుకుంటాను...." అన్నాడు రామారావు.
నాలో ఏదో భయం ప్రారంభమయింది. అడక్కుండా మూడువేల రూపాయల అడ్వాన్సు వచ్చిన ఈ అజ్ఞాత వుద్యోగం ఏమిటో నా కంతుబట్టడం లేదుకానీ కంగారు పడవలసినది చాలా వున్నదని నాకు తోచసాగింది.
రామారావు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే ముందు "బహుశా మనం మళ్ళీ కలుసుకోకపోవచ్చు" అన్నాడు. అతను అన్న తీరులో జాలి ధ్వనించింది. నాకు మాత్రం ఆ తీరు భయాన్ని కలిగించింది.
"సార్-టిఫిన్!" అన్న మాటలు విని వులిక్కిపడ్డాను. అంతవరకూ ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా వున్నాను. ఆ పదాలన్న మనిషిని చూసేసరికి ధైర్యం చిక్కబట్టుకుంటున్న నా గుండెలు మళ్ళీ జారిపోయాయి.
ఆరడుగుల ఎత్తు విగ్రహం. అర్ధముండిత శిరంగుండ్రటి కుంకం బొట్టు రూపాయి కాసంత వుంది. చూపులు అదోలా వున్నాయి. మనిషి కండలు తిరిగి వున్నాడు. మాట మాత్రం మృదువుగా వుంది. అతని చేతిలో వున్న స్టీలుప్లేట్లోని ఇడ్లీలు ఇంకా మృదువుగా వున్నాయి.
నాకు ఆకలిగా వుంది. టిఫిన్ తినేశాను. తర్వాత నెమ్మదిగా మంచినీళ్ళందుకుని "ఎవర్నువ్వు?" అనడిగాను.
"నా పేరు భీమన్నండి...."
"ఏమిటి నీ పని......?"
"మీతోటే నా పని....." అన్నాడు భీమన్న.
"ఏమిటా పని?" అన్నాను అసహనంగా.
"మీ విషయం చూసుకోవడం" అన్నాడు భీమన్న.
అతన్నింకేమీ అడిగి ప్రయోజనం లేదనిపించింది. వూరుకున్నాను. టిఫిన్ ప్లేటూ, మంచినీళ్ళ గ్లాసూ తీసుకుని వెళ్ళిపోయాడు భీమన్న. మళ్ళీ అయిదు నిమిషాల్లో కాఫీతో తిరిగి వచ్చాడు. వేడిగా వున్నప్పటికీ గటగటా తాగెసి-"నీకు వంట వచ్చా?" అన్నాను.
"రాదు....." అన్నాడు భీమన్న.
"మరీ ఈ వంట ఎలా తయారయింది?" అన్నాను.
"అందుకు వేరే ఏర్పాటు వుంది."
"ఎవరు చేస్తున్నారు వంట?"
"వంట మనిషి...." అన్నాడు భీమన్న.
అతన్నిలా ప్రశ్న లడిగి లాభం లేదని గ్రహించాను. "ఓసారి బంగళా అంతా చూసి వద్దామనుకుంటున్నాను" అన్నాను.
"పదండి. నేనూ వస్తాను....." అన్నాడు భీమన్న.
ఇద్దరం కలిసి బంగళా అంతా తిరిగాం. ఓ గదిలో కత్తి నూరుకుంటూ ఓ మనిషి కనబడ్డాడు.
"అతనెవరు?" అని అడిగాను.
"మంగలి సూరయ్య...." అన్నాడు భీమన్న.
"ఎందుకున్నా డిక్కడ?"
"రాత్రి మీకు తలంటుతాడు...."
"ఎందుకు?"
"ఒక సంవత్సరకాలం మీరు దేవీ ఉపాసనచేయాలి......
"ఏ దేవికి?" అన్నాను ఆశ్చర్యంగా.
"చూపిస్తాను రండి....." అన్నాడు భీమన్న. అతన్ని అనుసరించాను. బంగళాలో ఓ గదిలో కాళికాదేవి విగ్రహం వుంది. చూడ్డానికి మహాభయంకరంగా వుంది.
"మహాకాళి. నిష్ఠగా పూజచేస్తే ఓ ఏడాదిలో అపరిమితమైన శక్తులు లభిస్తాయి. ఆ శక్తులతో ఏమైనా చేయవచ్చు. రాయుడిగారి తరఫున మీరా శక్తుల్ని పొందుతారు....."
