Previous Page Next Page 
తామరకొలను పేజి 2


    "తొందరగా తాగేయ్. లేకపోతే చల్లారి పోతుంది."
    "అబ్బ! పాలు తాగడానిక్కూడా మీ గొడవే" అని విసుక్కునేవాడు రమేష్.
    శాంత చిన్నబుచ్చుకుని పాల గ్లాసు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయేది.
    శాంత అలా వెళ్ళిపోతే అతడి చదువు సాగేది కాదు. పాలు తాగి, గ్లాసు లోపల పెట్టే వంకతో వంట-గదిలోకి వెళ్ళేవాడు. అక్కడ శాంత లేకపోతే:
    "అమ్మా! వదిన ఏదీ" అని అడిగేవాడు.
    "పడుకుని ఉంటుంది."
    రమేష్ ఇహ వెనకా ముందు చూడకుండా తిన్నగా అన్నయ్య-గది తలుపు కొడుతూ:
    "వదినా! తలుపులు తీయండి. కాస్త పనుంది" అనేవాడు.
    "నేను పడుకున్నా; లేచి తియ్యలేను. ఏం పనున్నా రేపు ఉదయమే చెప్పు" అని జవాబు వచ్చేది శాంతనుండి.
    "అన్నయ్యా! నువ్వైనా తలుపు తీ" అని అరిచేవాడు రమేష్.
    "ఆయన నిద్రపోతున్నారు" అని శాంతే జవాబు చెప్పేది.
    "అయితే ఇప్పుడే లేపేస్తాను చూడండి" అటూ దబ దబా తలుపు తట్టేవాడు.
    ఇహ విధిలేక శాంత తలుపు తీసేది. కృష్ణ మూర్తి చదువుతూ ఉండేవాడు.
    "ఆఁ, అబద్దాలు చెప్తున్నారా ? అన్నయ్య నిద్రపోవటంలా."
    "నీ గొడవతో కుంభకర్ణుడు కూడా నిద్ర పోలేడు. అది సరేగాని, నీ కెన్నేళ్ళయ్యా?"
    'హఠాత్తుగా తమరికి వయస్సెందుక్కావాల్సి వచ్చింది" అంటూ తవో కుర్చీ లాక్కుని కూర్చునేవాడు.
    అలా కూర్చుంటే మరో గంటక్కూడా లేవడని కృష్ణమూర్తిక్కూడా తెలుసు.
    "అహ; ఊరికినే గాని, ఇంతకూ నీ కెన్నేళ్ళు చెప్పు?" అంటూ, తనూ ఇంకో కుర్చీమీద కూర్చునేది శాంత.
    "ఇరవై మూడేళ్ళు."
    "నీ కిన్నేళ్ళొచ్చింది వృధా రమేష్."
    "ఏం అలా అంటున్నారు? చదువుకోవటం లేదా? ఆఖరి సంవత్సరం ఎం.బి.లో ఉన్నాను గుర్తుంచుకోండి."
    'చదువుకుంటే సరా? రాత్రి, ఈ సమయంలో భార్యా భర్తలు పడుకున్న గది తలుపులు తెరిపించి ఇలా వచ్చి కూర్చోవచ్చా?"
    "ఓస్. ఇంతేనా! ఏమో అనుకున్నాను. మీ దగ్గర నాకు రూల్సేమిటి వదినా" అని ఎగర గొట్టేసేవాడు.
    "అలాగే అంటూ ఉండు. రేపు నీ పెళ్ళాం రానీ; నేనూ అలాగే చేస్తాను."    
    "వదినా! మీకు పెళ్ళయి ఎన్నేళ్ళయింది" రమేష్ ఎదురు-ప్రశ్న వేశాడు.
    "పన్నెండేళ్ళు నేనీ యింటికి వచ్చేసరికి నువ్వు పదకొండేళ్ళ కుర్రాడివి."
    "సరే; నాకూ పెళ్ళయ్యాక పన్నెండేళ్ళు టైమివ్వండి, తర్వాత అలాగే చేద్దురుగాని."
    శాంత మొండిగా "ఉహుఁ, అదేం కుదరదు. మీ ఆవిడ వచ్చిన రోజే నేను అల్లరి చేస్తాను" అనేది.
    "అయితే ఆ రోజు నేను ఇంటికే రాను. ఎక్కడి కన్నా వెళ్ళిపోతాను. ఆఁ. అన్నట్టు వదినా! మొన్న ఏదో సంబంధం వచ్చిందట. మీరు ఆ పిల్లను చూశారా?"
    "ఆఁ. చూశాను."        
    "ఎలా ఉంది?" కుతూహలంతో అడిగాడు రమేష్.
    "నేనే నయం-ఆ పిల్లముందు."
    "బాగాలేదన్నమాట."
    "ఆఁ. అందుకే నీదాకా తేలేదు. నువ్వు చూసి, పెళ్ళయితే చాలు అని ఎక్కడ ఒప్పేసుకుంటానో అనే భయంతో అమ్మా-నేనూ నీతో చెప్పకూడదని అనుకున్నాం."
    "అయ్యో! అన్యాయం" లేని బాధ వ్యక్తపరిచాడు రమేశ్.
    "డాక్టరుగారూ! ఆమెది వెన్నెల-కాంతిని విరజిమ్మే అందంకాదు. అతి సామాన్య రూపం గల పిల్ల."
    "నేను పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి ఎలా ఉండాలో తెలుసా? వెన్నెల-కాంతిని ...... విరజిమ్మే ....."
    కృష్ణమూర్తి పెద్దగా ఆవలించి:
    "రమేష్! నువ్విక వెళ్ళి పడుకోరా? నాకు నిద్దరొస్తోంది" అన్నాడు.
    "నువ్వు పడుకో అన్నయ్యా! నేను ఇంకా వదినకు చాలా కబుర్లు చెప్పాలి."
    "నువ్వు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిని వర్ణించదల్చుకుంటే మాత్రం విసుగే" అని భర్తతో ఏకీభవించేది శాంత.
    "నేను ఎలాంటి పిల్లను చేసుకున్నా, వదిన లాంటి మొండి ఘటాన్ని మాత్రం చేసుకోను."
    "మంచిమాటన్నావు రమేష్" అంటూ, తమ్ముడిని సమర్ధించేవాడు కృష్ణమూర్తి.
    అన్నయ్యా, వదినల బలవంతాన బయటికి వచ్చేవాడు రమేష్.
    "వాళ్ళ గదిలో ఇంతసేపు ఏం చేస్తున్నావురా" అని అప్పటివరకూ మేలుకున్న సుశీలమ్మగారు అడిగితే, బుద్దిగా:
    "నిద్ర పట్టలేదమ్మా. వదిన కథ చెప్తూంటే వింటూ కూర్చున్నాను." అనేవాడు.
    "ఊరికే కబుర్లు-కథలు అంటూ కూర్చోకు" నీ చదువేదో చూసుకో" అని గుర్తు చేసేవారు సుశీలమ్మగారు.
    శాంతకు తరచుగా తలనొప్పి రావటం మామూలైపోయింది. తలనొప్పే కదా అని మొదట్లో ఎవరూ అంతగా లెక్కచేయలేదు. కాని అస్తమానం తల నొప్పిగానే ఉండటం గమనించి కృష్ణమూర్తి:
    "ఎప్పుడూ కుట్టూ, అల్లికలూ చేతిలో పట్టుకుని కూర్చోకు. అందుకే ఇలా తలనొప్పిగా ఉంటుందేమో. పుస్తకాలు కూడా చదవటం మానేయి కొన్ని రోజులు" అని సలహా ఇచ్చాడు.
    శాంత భర్త చెప్పినట్టే కంటికి శ్రమ కలిగించే పనులు మానేసింది కాని, దానివల్ల తలనొప్పి ఏమాత్రం తగ్గలేదు.
    పొయ్యిదగ్గర కూర్చోవటం వల్ల అలా అవుతోందేమోనని సందేహం వెలిబుచ్చారు సుశీలమ్మగారు.
    "ప్రపంచంలో పొయ్యిముందు కూర్చున్న వాళ్ళకంతా తలనొప్పి వస్తుందా ఏం" అని ఎదురు పశ్న వేసింది శాంత.
    "వారానికో మారు శుభ్రంగా ఆముదం రాసుకుని నీళ్ళు పోసుకుంటే తలనొప్పి ఎందుకు వస్తుంది? ఈ కాలపు పిల్లలకు శాంపూ మీదనే నమ్మకం ఎక్కువ" అని గొణిగారు మామగారు.
    "వారానికోసారి సినిమా చూస్తే ఇంకేమవుతుందేమిటి?" అన్నాడు రమేష్.
    అందరి మాటలూ మౌనంగా వింటున్న శాంత, రమేశుడి మాటతో రెచ్చిపోయింది.
    "వారానికోసారి సినిమా చూసేది నువ్వా-నేనా?" అంది కోపంతో మండిపడుతూ.
    "చూసేదేమో నేనే కాని, తలనొప్పి మాత్రం మీకు. అది సరే కాని, వదినా! రేపు మిమ్మల్ని కళ్ళ డాక్టరు దగ్గరకు తీసుకుని వెడతాను."
    మరునాడు వదినను తీసుకుని హాస్పిటల్ కు వెళ్ళాడు. దారి పొడుగునా ఆమెను ఏడిపిస్తూనే ఉన్నాడు.
    "అక్కడ ఎ.బి.సి.డి. చదవమంటారు. చదవగలరా? లేకపోతే వేళ్ళు చూపెట్టి లెక్క పెట్టమంటారు. అది మరీ అవమానకరం."
    "రమేష్! నేను ఏమైనా చేస్తాను కాని, కళ్ళ జోడు మాత్రం పెట్టుకోలేను. ముందే చెబుతున్నా; నా కస్సలు ఇష్టం ఉండదు."
    "అలా అని కళ్ళు పాడుచేసుకోగలమా వదినా?"
    రమేష్, మెడికల్ కాలేజి విధ్యార్ది కావటంవల్ల కళ్ళ-డాక్టరుతో బాగా పరిచయం ఉందతనికి. దానివల్ల శాంత కళ్ళపరీక్ష తొందరగానే జరిగిపోయింది.
    "కళ్ళలో ఏ దోషమూ లేదు" అని చెప్పారు డాక్టరుగారు.
    "అయితే కళ్ళజోడు పెట్టుకో నక్కరలేదు" అని పొంగిపోయింది శాంత.
    కాని, రమేశుడి మొహం చింతాగ్రస్తమైంది.
    కళ్ళకు కావలసినంత విశ్రాంతి నివ్వమని మాత్రమే చెప్పాడు వదినతో. వంట-పని కూడా సుశీలమ్మగారే కావటంలో, శాంతకు ఇంట్లో పనేమీ లేకపోయింది. ఏమీ తోచేదికాదు. రమేశుడికి తీరికున్నప్పుడల్లా కబుర్లతో కాలక్షేపం చేసేది.
    ఒకరోజు సాయంత్రం రమేష్ ఇంటికి రాగానే శాంత:    
    "ఇంకెన్నాళ్ళు రమేష్! నా కీ శిక్ష" అని అడిగింది.
    "శిక్ష మీకు కాదు మాకు."
    "మీకా?"
    "అవును; మానసిక శిక్ష. మీ తలనొప్పి మాకు పెద్ద సమస్యగా తయారయింది."
    "ఏం డాక్టర్లో గాని; ఇంగ్లండు, అమెరికా అని విదేశాలకు వెళ్ళి పరీక్షలు పాసై వస్తారు గాని; జలుబు, తలనొప్పి కూడా నయం చెయ్యలేరు" అంది శాంత కొంటెగా.
    'ఆ మాటతో రమేశుడు నోరు మూసుకున్నాడు. దానికీ కారణం ఉంది. శాంత స్నేహితురాలొక మ్మాయి అస్తమానం జలుబుతో బాధపడుతూండేది.
    "నాకు బుద్ధి తెలిసినప్పటినుండి నా ముక్కులో తేమ ఆరాటం అంటూ జరగలేదు. జీవనదులైనా ఎండిపోతాయేమోగాని, ముక్కు మాత్రం ఎండదు' అని శాంతతో ఎన్నోమార్లు చెప్పుకుంది.
    ఆమెను శాంత రమేశుడి మొదటి రోగిగా అప్పగించింది.
    "ఈమె జలుబు నయం చేసేయ్. నువ్వు అడిగిన ఫీజు దొరుకుతుంది" అని శాంత చెప్పి నపుడు రమేశుడి సంతోషానికి పామె లేదు. ఇట్టే నయం చేసి, వదినను మెప్పించా ల నుకున్నాడు. రాజ్యాన్ని స్వయంగా హస్పిటల్ కి తీసుకునివెళ్ళి డాక్టర్ తో చెప్పి "కాటరైన్" చేయించాడు. కొన్ని రకాల 'వేసల్ డ్రాప్స్' కూడా సూచించాడు.
    కాని, ఆమె జలుబు దేన్నీ ఖాతరు చెయ్యకుండా, రమేశుడిని ఓడించింది. సైన్సు అతడికి సహాయపడకపోవటంలో కర్మ-సిద్దాంతాన్ని ఆశ్రయించి:
    "మీ కర్మ; మీరు అలా జీవితాంతం జలుబుతో బాధపడాలని రాసి ఉంటే నేనేం చేయగలను" అంటూ ఓటమిని అంగీకరించాడు.
    శాంత నిరాశ చెందినా, మరిదిని వేళాకోళం పట్టించటానికి మరో కొత్త విషయం దొరికిందామెకు.
    తన వృత్తిని గురించి, నిపుణత గురించి గొప్పలు చెప్పుకునేవాడు రమేశ్.
    రమేశ్ చదువులో మంచి తెలివైనవాడు. ఆ విషయం ఎవరూ కాదనలేరు. ఏ ఒక్క క్లాసులో కూడా అతడు ఫేలయింది లేదు. ఎప్పుడూ మొదటి లేక రెండవస్థానం అతడిదే.
    దీనివల్ల అతడిలో ఆత్మవిశ్వాసం ఓపాలు ఎక్కువగానే ఉండేది. అప్పుడప్పుడూ వదినముందు తన గొప్పలు చెప్పుకునేవాడు.
    గొప్పలు చెప్పుకోడానికి వదిన తప్ప మరింకెవరున్నా రతనికి?
    కాని, తరువాత రాజ్యం-జలుబు ప్రకరణం అతడి బడాయికి అడ్డుపడేది.
    "ఎక్కువగా మాట్లాడితే, రాజ్యం-ముక్కు లాక్కొస్తా" నని ఏడిపించేది శాంత.
    ఆ మాట వినగానే, రమేష్ ఏదో ఒక సాకుతో అక్కడినుండి జారుకునేవాడు.
    రమేష్ 'మానసిక శిక్ష' అనగానే శాంతకు భయం వేసింది.

 

                         
    "నయం కాకపోవట మేమిటి?" తప్పకుండా నయమవుతుంది కాని, కారణమే తెలియలేదు. ఈసారి పరీక్ష లయ్యాక, నేనే మిమ్మల్ని నెల్లూరుకు తీసుకువెడతాను" అన్నాడు రమేష్.
    'నెల్లూరా! దానికి బదులు అమెరికానైనా చూపించరా బాబూ" అంది శాంత.
    "వీలయితే అమెరికానూ చూపిస్తాను. అది కాకపోతే ఇంకో మార్గం ఉంది......"
    "ఏమిటది?"
    "నేను చదువుకోవటానికి అమెరికా వెడతాను. అక్కడే ఓ పిల్లను చూసి పెళ్ళి చేసుకుంటాను. అప్పుడు మీరు మీ తోడికోడలిని చూడటానికి వద్ధురుగాని. ఆమెకు వెన్నెలవంటి కాంతిని విరజిమ్మే......"
    "రమేశ్! నీ స్నేహితులెవరో పిలుస్తున్నారు. చూడు"-అంటూ శాంత రమేశుడి వాగ్ధాటిని దివినుండి భువికి మరల్చేది.
    రమేశుడు వెంటనే స్నేహతుల కోసం పరుగెత్తే వాడు.
    తన కాబోయే భార్య ఎలా ఉండాలో, వదిన ముందు వర్ణించేవాడు. ఆ వర్ణించటంలో తన్ను తానే మర్చిపోయి స్వప్నలోకంలో విహరించేవాడు.
    "విద్యాసరస్వతి, రూపలక్ష్మి, రసిక-శిరోమణి, సుగుణాలఖని, ప్రేమరాశి.... "ఇలాంటి పదాలు ఆ వర్ణనలో దొర్లిపోయేవి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS