Previous Page Next Page 
జాగృతి పేజి 2


    "ఎందుకోబాబూ, మీరంతా ఇలాంటి పనులు చేస్తారు. ఇప్పుడు చూడు. పోలీసులు మీకోసం వెతుకుతున్నారు. ఎన్నాళ్ళు దాక్కుంటారు. పట్టుపడితే జైల్లో పడేసి తన్నరూ" అంది సానుభూతిగా చూస్తూ.
    "ఏడిశారు. ఇదంతా మాకలవాటే.. మా అన్న బెయిలుమీద మమ్మల్ని ఇడిపించి తీస్కపోతాడు" -నిర్లక్ష్యంగా అన్నాడు.
    "అయినా బాబూ, నాకు తెలీక అడుగుతా, మీరు పెట్రోలు ఊరికే పోయామంటే ఎవరన్నా పోస్తారా?"
    "పొయ్యాల మేం అడిగితే లేదంటే ఊరుకుంటామా?" పొగరుగా అన్నాడు.
    "బాగుంది. మీరు ఏది అడిగితే అది ఇయ్యాలి. లేదంటే ఇలా దౌర్జన్యం చేస్తారన్నమాట" - తిరస్కారంగా అంది.
    "అంతే మల్ల. నాయాల డబ్బడగడానికి ఆడికెంత ధైర్యం. అందుకే ఆడిపొగరు దించాం. బద్మాష్ మల్లా ఆరునెల్లదాకా గమ్మునుంటాడు.' నిర్లక్ష్యంగా అన్నాడు. ఇది వాళ్ళకి చాలా మామూలు విషయం అన్నది. అర్ధమైంది ఆవిడకి. పేపరు తెరిస్తే రోజూ గుండాల, రౌడీల ఆగడాలు దర్శనమిస్తూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు చదివింది ఇపుడు "అంటే మీ అందరినీ పోషిస్తూ, మీ అందరిచేతా వెధవ పనులు చేయిస్తాడన్నమాట మీ అన్న-" తిరస్కారంగా అంది లలితమ్మ.
    శ్రీను రోషంగా చూశాడు.
    "అన్నని ఎవరన్నా ఒక్కమాటంటే ఊర్కోం. అన్నమాకు తిండి పెట్టే దేముడు."
    "దేముడైతే వెధవ పనులు చేయించడు. ఇలా గుండాలుగా తయారు చేసి దౌర్జన్యాలు చేయిస్తూ ప్రోత్సహించడు" ధైర్యంగానే అంది.
    "మాకు తిండెట్టేవాడే దేముడు. మాకు ఎవరూ ఉద్యోగాలివ్వరు. వ్యాపారానికి డబ్బుండదు బేకారుగా తిరుగుతుంటే దగ్గరచేరదీసి తమ్ముళ్ళాచూస్తున్నాడు మా అన్న అందుకే మాకు దేముడు" పొగరుగా అన్నాడు.
    "హు.. తనస్వార్ధం కోసం చేరదీశాడు కాని మీమీద జాలితోగాదు - ఈ రాజకీయనాయకులకి జైకొట్టేవాళ్ళు, తగాదాలు, కక్షలు వచ్చినపుడు తన్నుకోడానికి, పొడుచుకోడానికి, రాళ్ళు రువ్వడానికి, బస్సులు తగలబెట్టడానికి మీలాంటివారిని పదిమందిని పోగేసి పోషిస్తుంటారు. అదేదో మీరంటే దయని, ప్రేమని పొంగిపోతుంటే జాలేస్తుంది. అంత దయామయుడయితే పదిమంది అనాథ పిల్లలని తిండి. బట్ట ఇచ్చి పోషించమను. పేపరు తెరిస్తే చాలు రోజూ ముఠాలు, కక్షలు, తగాదాలు, పొడుచుకోవడాలు....ఛాఛా...ఈ హింస, దౌర్జన్యం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి లోకంలో. మీరేదో వీరుల్లా, పెద్ద రౌడీల్లా అమాయకులమీద దౌర్జన్యం చేస్తారు. సినిమా టికెట్లు ఇవ్వకపోతే బంకులు తగలెడతారు, పెట్రోలు పోయకపోతే థియేటర్లు తగలెడతారు. టికెట్లడిగితే బస్సులు తగలెడ్తారు. మతకలహాలు సృష్టించి, అమాయకులని చంపుతారు. మిమ్మల్ని జనం ఎంత అసహ్యించుకున్నా మీకర్ధంగాదు నాయనా. ఎందుకిలాటి రొంపిలోకి దిగబడి మీ యువత నిర్వీర్యమయిపోతున్నది. ఈ హింస, దౌర్జన్యం రోజురోజుకి పెరిగిపోతే, శాంతి, సామరస్యాలకి చోటెక్కడుంటుంది. రేపటి భవిష్యత్తు కాపాడాల్సిన మీ యువతరం ఇలా పెడతోవ పడితే దేశం ఏంకావాలి?"
    "హూఁ..దేశం! మా సంగతి దేశానికేం పట్టింది. మాకుద్యోగాలు లేవు. డబ్బులు లేవు. మరి మేం ఎట్ట బతకాలి. అంతా కబుర్లు చెపుతారు. ఉపన్యాసాలొద్దు" కోపంగా అన్నాడు.
    "బాబూ దేశంలో ఉన్న అందరికి, చదివిన అందరికి. గవర్నమెంటు ఉద్యోగాలెక్కడ ఇవ్వగలదు? ఇప్పటికే ఉద్యోగులకీ జీతాలు ఇచ్చేసరికి ఖజానా ఖాళీ అవుతున్నది. డబ్బు సంపాదనకి గవర్నమెంటు ఉద్యోగమే ఉండాలా? కుర్చీలో కూర్చుని చేసేది ఉద్యోగమా? మీరేం చదివితే దానికి సరిపడ ఉద్యోగం ఇస్తానని గవర్నమెంటు వాగ్దానం చేసిందా?" రెట్టించింది లలితమ్మ.
    "మరి ఎందుకు చదవాలి మేం? మేం ఎలా బతకాలి మరి?"
    "బాబూ చదువు విజ్ఞానం కోసం. లోకజ్ఞానం కోసం మాత్రమే అనుకుని. విదేశాల్లో మాదిరి -చిన్నా పెద్దా అనుకోకుండా ఎవరికి ఏది వీలయితే ఆ పని చేసినవాడే దేశంప్రగతి సాధిస్తుంది. అక్కడ ఎవరికీ అందింది వారు చేస్తారు. పేపర్లు పంచుతారు. పెట్రోలు బంకుల్లో పనిచేస్తారు. బాత్ రూములు కడుగుతారు. షాపుల్లో పనిచేస్తారు. చదువుకున్నాం ఈ పని ఎలా చేస్తాం అనుకోకుండా చేస్తారు కాబట్టే వారికి సంపాదన కష్టంకాదు. నీతిగా నిజాయితీగా సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఏ పనీ నూన్యత అనుకోరు కనక ఆ దేశాలు ప్రగతి సాధించాయి....చదువన్నది జ్ఞానానికి గాని సంపాదనకిగాదు అనుకోవాలి ప్రతివారూ" ఆవేశంగా అంది.
    ఏమనాలో తోచనట్టు చూస్తుండిపోయాడు.
    "శ్రీను...బీకాం చదివావు. నలుగురి పిల్లలకి ట్యూషన్లు చెప్పచ్చు. బాగా చెపుతావన్న నమ్మకం కలిగిస్తే పదిమంది వారే వస్తారు. డ్రైవింగ్ వస్తే ఏ టాక్సీనో, ఆటోనో నడుపు. అదీ చాతకాకపోతే నాలుగు బజ్జీలు, వడలు వేసి అమ్ముకో. ఇంటింటికీ బజారుసామాన్లు అందించే వ్యాపారం పెట్టి - నాలాంటి ముసలివారికి, వంటరివారికి బిల్లు కట్టి పెట్టు. ఇద్దరు ముగ్గురు కలిసి ఆఫీసులకి మధ్యాహ్నంపూట లంచ్ టైములో ఇడ్లీ, వడలాంటివి ఇంట్లో తయారు చేయించి సప్లయ్ చేయండి. చూడు శీను, నీతిగా నిజాయితీగా పని చేస్తే ఎంతచిన్నపని చేసినా నిన్ను మెచ్చుకుంటుంది లోకం. ఈ గుండాగిరి, రౌడీయిజంతో మీరు ఎంత గొప్ప డ్రస్సులు వేసి, కార్లలో తిరిగినా మిమ్మల్ని అసహ్యించుకుంటారే గాని గౌరవించరు. కన్నవాళ్ళకి దూరంగా ఏ క్షణంలో పోలీసులకు దొరికిపోతామో అన్న భయంతో దొంగబతుకు బతికేకంటే స్వశక్తిని నమ్ముకుంటే ఈ హింస దౌర్జన్యాలమధ్య మీరెన్నాళ్ళు ప్రశాంతంగా బతకగలరు. కంటినిండా సుఖంగా ఎలా నిద్రపోగలరు. బాబూ ఈ పంథా విడిచి నీకు తోచిన చిన్నపనైనా చేసి హాయిగా తిని, ప్రశాంతంగా నిద్రపోండి నాయనా!"
    "ఆ ఇదంతా చెప్పడం సులువే. ఇలా బజ్జీలమ్మి, వడలమ్మి ఏం సంపాదిస్తాం ఎన్నాళ్ళు సంపాదిస్తాం..." హేళనగా అన్నాడు. లలితమ్మ విరక్తిగా నవ్వింది.
    "అవును బాబూ నిజాయితీతో సంపాదించేది తక్కువే కావచ్చు. ఇలా అక్రమంగా సంపాదిస్తే తేరగా వేలు. లక్షలు సంపాదించవచ్చు. బెదిరించి కార్లల్లో తిరగచ్చు". దర్జాగా బతకడానికి అలవాటు అనుభవంలోకి వచ్చింది. ఈ రాత్రంతా ఇక్కడే ఉంటాడేమో? అడిగితే ఏం అంటాడో? వంటరిగా ఇంట్లో వీడిని పెట్టుకుని ఎలా పడుకోవాలి. ఆమె ఆలోచన గుర్తించనట్టు" ఇదిగో అమ్మా, ఈ రాత్రికి ఈడనే పడుకుంటా. నీకేం ఫరవాలేదు. నీ వెళ్ళి గదిలో పడుకో. నేనేం మామూలు దొంగని కాను. నీ సామానేం పట్టుకుపోను. ఇదిగో ఈ తివాచిమీద పడుకుంటా. బైటికి పోతే పోలీసులకి దొరికిపోతా. తెల్లారి అన్నదగ్గిరకి పోత. మా అమ్మలాంటిదానివి నీకేం భయమొద్దు. పోయి పడుకో" అన్నాడు.
    లలితమ్మకి ధైర్యం వచ్చింది. గట్టిగా పొమ్మని ఎలాగూ చెప్పలేదు. ఇలాటివారితో మంచిగా ఉంటేనే నయం.
    "అలాగే బాబూ, నువ్వు కింద ఎందుకు. ఆ గదిలో మంచం ఉంది, పోయిపడుకో. ఇంతకీ ఏదన్నా తిన్నావా?" ఆప్యాయంగా అడిగింది. ఆ అభిమానానికి శ్రీను కదిలిపోయాడు. లేదన్నట్టుగా తల ఆడించాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS