Previous Page Next Page 
డాళింగ్ పేజి 2

 

    ఒకరివేపు ఒకరు చూసుకుని నడిచారు విమల్, మధురి .


                                              *    *    *    *

    కెమారా స్టార్ట్.....క్లాప్........
    సౌండ్ ...........టెక్.......
    అక్కడ డైరెక్టర్ మాటలు తప్ప, మిగతా అంతా నిశ్శబ్దంగా  ఉంది నగారా స్టార్టయింది నిశ్శబ్దంగా.
    దట్టంగా ఉన్న ఆకుపచ్చని పచ్చికలో హీరో విమల్, హీరోయిన్ మధురి నిలబడి ఉన్నాడు. ఇద్దరి మధ్యా దూరం పదడుగులు.
    "యాక్షన్."
    గట్టిగా అరిచాడు డైరెక్టర్. కెమెరా మూవ్ అవుతోంది.
    విమల్ నెమ్మదిగా ముందుకొచ్చాడు . మధురి అతని వేపు ఆశ్చర్యంగా చూస్తోంది.
    విమల్, మధురి ముఖం వేపు చూసాడు.
    రెండు క్షణాలు ......మూడు క్షణాలు......నాలుగు క్షణాలు.
    అతను గొంతులోంచి డైలాగ్ రావడం లేదు.
    డైలాగ్....డైలాగ్......
    డైరెక్టర్ గుండె లోతుల్లోనే అరుస్తున్నాడు.
    విమల్, మధురి చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకో .....తీసుకో."
    కిస్......కిస్.......కళ్ళ మీద కెమెరాలోని కలర్ నెగటివ్ కి కాళ్ళొచ్చి ఖర్చయి పోతోంది. ప్రొడ్యుసర్ కి గతంలో వేరే వ్యాపారం చేసేప్పుడు లేని బీపీ కొత్తగా వచ్చిపడింది.
    విమల్ ఆ సమయంలో అంతా మరచిపోయిన వాడిలా, అలా నిలబడిపోయాడు.
    తానెక్కడున్నాడో మరిచిపోయాడు.
    తన ఎదురుగా వున్న మధురి డైరెక్టర్. ప్రొడ్యుసర్, ప్రొడక్షన్ సిబ్బంది, రిఫ్లేక్తర్లు ......ఏవీ ...ఏవీ .....అతనికి కనిపించడంలేదు.
    "వాట్.....విమల్ ఏమైంది ..మీకు......కమాన్..." మధురి నెమ్మదిగా అంది.
    ముందుకు వెళ్తూ......తనే అతన్ని పట్టుకుని కౌగలించుకొబోయింది.
    ఒక్క క్షణం..........
    విమల్ కళ్ళు, మధురి కళ్ళను చూసాయి.
    దగ్గర కొచ్చిన మాధురిని గబుక్కున ముందుకి తోసేశాడు.
    "నో......నో........నో....."
    పిచ్చిగా అరిచాడు అతనూ ముందు కెళ్ళిపోయాడు. పరుగు, పరుగున దూరంగా పరుగెడుతున్నాడు. ఎంత దూరం పరుగెత్తాడో తెలీదు.
    అక్కడున్న ఒక పచ్చిక దిబ్బమీద ఆయాసంతో కూర్చుండి పోయాడు.
    డైరక్టర్ కి గానీ, ప్రొడ్యుసర్ కిగానీ ఏమీ అర్ధం కాలేదు.
    మొత్తం బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు.
    కెమెరా ఆగిపోయింది.
    డైరెక్టర్ కిందపడిపోయిన హీరోయిన్ మధురి దగ్గర కెళ్ళి ఆమెను చెయ్యందించి లేపుతూ :ఎవిటమ్మా! ఏమైంది!" కంగారుగా అడిగాడు.
    "నాక్కూడా ఏం అర్ధం కావడం లేద్సార్......" కుర్చీలో నీరసంగా కూర్చుంటూ అంది మధురి.
    నిర్మాత కంగారుగా డైరెక్టర్ ముఖం వేపు చూసాడు.
    "ఏంటండీ ......ఏమిటిదంతా! ఎప్పుడూ లేనిది ఏమిటిది?" సిగరెట్ పొగ గప్ గప్ ఊదుతూ అడిగాడు.
    "మీరు చూసారుగా! మళ్ళీ నేను చెప్పాలా....." విసుక్కున్నాడు డైరెక్టర్ కుర్చీలో కూర్చుంటూ .
    "సడన్ గా వెళ్ళిపోతే, చూస్తూ ఊరుకోడమేనా, వెళ్ళండి. పిల్చకు రండి." మళ్ళీ అన్నాడు ప్రొడ్యుసర్, పక్కనే ఉన్న అసోసియేట్ డైరెక్టర్ వేపు చూస్తూ.
    "పిల్చుకు రమ్మంటారా" అన్నట్లు డైరెక్టర్ వేపు చూసాడు.
    

                                                       *    *    *    *

    ఆయాసంతో కూర్చుండి పోయిన విమల్ ప్రస్తుతం ఈ ప్రపంచంలో లేడు. అతడి మెదడు నిండా , మెదడులోని నరాల నిండా, నరాలలోని ప్రకంపనాల నిండా భాషలేని బాధ. అతనికి నలిగిపోతున్నట్టుగా ఉంది. చల్లటి గాలి అతనికి వెచ్చగా తగులుతోంది. ఆయాసాన్ని అదుపులోకి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
    ఆ ఆయాసం వెనక, ఆ పరుగు వెనక , ఏదో శక్తి , ఏదో అద్భుత శక్తి అతన్ని శాసిస్తోంది. అతని శ్వాసలో ఏదో వేగం ----ఆ వేగం అతన్ని ఆలోచనా రహితుడ్ని చేస్తోంది.
    ఒక చల్లని గాలి తెమ్మర అతన్ని నెమ్మదిగా తాకి వెళ్ళిపోయింది. అంతవరకూ తలదించుకున్న విమల్ తలెత్తి చూసాడు.


                                                      *    *     *    *

    అసోసియేట్ డైరెక్టర్ వేపు చూడలేదు డైరెక్టర్.
    "పేకప్" గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి ప్రొడ్యుసర్ భయపడ్డాడు.
    ఇదేంటి ...సడన్ గా పేకప్ అంటాడు. అన్నట్టుగా డైరెక్టర్ వేపు చూసాడు.
    "అది కదండీ" ఏదో అనబోయాడు ప్రొడ్యుసర్.
    "విమల్ గారి దగ్గరకు నన్ను వెళ్ళమంటారా?" నెమ్మదిగా అంది మధురి.
    "వద్దు, ఇవాళ షూటింగ్ కాన్సిల్ .....రేపు చూసుకుందాం. డోంట్ డిస్ట్రర్బ్ హిమ్. లేట్ హిమ్ గో టూ హిజ్ ఒన్ వరల్డ్" విమల్ ను అర్ధం చేసుకున్న ఏకైక వ్యక్తిలా అన్నాడు డైరెక్టర్.
    "మీరెప్పుడు పేకప్ అంటారో మేకప్ అంటారో ........నాకేం అర్ధం కావడం లేదండి" ఓ కామెంట్ విసిరేసి సీరియస్ గా దూరంగా పార్క్ చేసి ఉన్న కారువేపు నడిచాడు ప్రొడ్యుసర్. ఒకింత అసహనంగా. సిబ్బంది ఒక్కక్కరూ సరంజామాతో కదులుతున్నారు. కాసేపటికి ప్రొడక్షన్ వేన్ ఊటీ టౌన్ వేపు బయలుదేరింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS