Previous Page Next Page 
తిలక్ కథలు పేజి 19

   
    చీకటి పడేవేళ అతను లేచాడు. ఇంక గంట మాత్రమే టైముంది రైలు రావడానికీ, తాను చావడానికీ, గబగబా నడవడం మొదలు పెట్టాడు. వంతెన  దాటాడు. పొలాలమ్మట పడిపోవడం మొదలు పెట్టాడు. అక్కడ రైలుపట్టాల వద్ద జనసంచారం ఉండదు. స్టేషన్ కి మైలుపైగా దూరం ఉంటుంది. అక్కడ అటూయిటూ చెట్లు గుబురుగా ఉంటాయి. రైలు అక్కడ మలుపు తిరుగుతుంది. అఖ్కడ తలపెట్టితే రైలు వస్తూన్నట్టే తెలియదు. హఠాత్తుగా రైలు మలుపు తిరిగి మీద నుంచి తెలియకుండా పోతుంది. వెంకటేశ్వర్లు పట్టుదలగా రెండు పొలాల మధ్య ఉన్న దారమ్మట నడుస్తున్నాడు.
 
    అరుణ వర్ణంలోనుంచి నలుపులోకి మారుతున్న మబ్బులూ, నల్లగా బొద్దుగా ఉన్న తుమ్మచెట్లు దిగులు దిగులుగా ఏడుస్తున్నట్టు వీచే గాలి, పిట్టల, పురుగుల అస్పష్టపు కూతలూ అన్నీ అతన్ని 'చచ్చిపో, చచ్చిపో' అని హెచ్చరిస్తున్నట్లున్నాయి. ప్రకృతి అంతా అతని చావు కోరుతూన్నట్లు, అతన్ని చావుకి తరుముతూన్నట్టు ఉంది.

    "ఏయ్ వెంకటేశ్వర్లూ -నిన్నే ఆగవోయ్" -కేక

    వెనకాల సైకిలుమీద సూర్యనారాయణ. వెంకటేశ్వర్లు నిలుచున్నాడు. సూర్యనారాయణ రోజూ బడి వదలగానే అడ్డదారిని అక్కడికి దగ్గర్లో వున్న అత్తవారి వూరు వెళతాడని -వెంకటేశ్వర్లుకి తెలుసును.

    "ఇలా ఎక్కడికోయ్" అన్నాడు సూర్యనారాయణ. వెంకటేశ్వర్లు మాట్లాడలేదు. సూర్యనారాయణ తను పనిచేసిన ఎలిమెంటరీ స్కూల్లో మేష్టరు.

    "నీకేమైనా బుద్ధి ఉందా! నువ్వేమైనా మనిషివా!" అన్నాడు సూర్యనారాయణ కోపంగా.

    హతబుద్దియై చూస్తున్నాడు. వెంకటేశ్వర్లు. అతనికి కోపం రాలేదు. సూర్యనారాయణ ఏమంటున్నాడో అర్ధం కాలేదు.

    "మన కులం మన గౌరవం ఏమైనా నిలబెట్టేట్టున్నావా? నీ మూలాన్ని మేం అందరం తలెత్తుకు తిరగలా అక్కర్లేదా? ఛీ, సిగ్గుందా కన్నకూతుర్ని పబ్లిగ్గా తారుస్తావా? అచ్చోసిన ఆంబోతులా వదిలివేస్తావా? ఈవేళ మధ్యాహ్నం సూర్యా లాడ్జిలోంచి వస్తూంటే చూసి నిశ్చేష్టుణ్నయి పోయాను. వాడు లేడు బ్రోకర్ వెంకయ్యగాడు -వాణ్ణి అడిగితే ఆ ఏజంటుగాడికి పదిహేను రూపాయలకి కుదిరింది అని చెప్పాడు. తల కొట్టేసినట్టయిపోయింది. నా కూతురైతే అకక్డే రోడ్డుమీద నరికేసి ఉండేవాణ్ణి. ఎందుకురా ఇన్నేళ్ళొచ్చి కుటుంబాన్ని అదుపులో పెట్టుకోలేనివాడవు. చావకూడదురా! ఇంకా తగుదునమ్మా అని బతికి ఉన్నావా! నేనయితే రైలుకింద తలపెట్టేసి ఉండేవాణ్ణి. ఛీ సిగ్గుమాలిన బతుకు. నీది ఒక బతుకేనా" అంటూ సూర్యనారాయణ నేలమీద కాండ్రించి ఉమ్మేసి సైకిలెక్కి వెళ్ళిపోయాడు.

    వెంకటేశ్వర్లు అలా స్తంభితుడై ఓ అయిదు నిముషాల పాటు సూర్యనారాయణ వెళ్ళిన వైపే వెర్రిగా చూస్తూ నిలుచుని పోయాడు. క్రమంగా అతని మొహంలో ఏదో ఆనందంలాంటి కాంతి కమ్మింది. నిర్జనమైన ఆ పొలాలమధ్య ఫక్కుమని నవ్వేశాడు. "ఇంక నేను చావనక్కర్లేదు" అనుకున్నాడు. నడిసముద్రంలో కొట్టుకుపోతున్న అతనికి ఏదో నావ దొరికినట్టయింది. అతనికి వెర్రి ఆనందం కలిగింది. ఎవరినైనా కౌగిలించుకుని తనకి పట్టిన అదృష్టాన్ని గురించి చెప్పకోవాలనిపించింది. ఇన్నాళ్ళకి తనకొకదారి దొరికింది. బతకడానికి ఆధారం దొరికింది. ఇక తాను చావనక్కర్లేదు.

    వెంకటేశ్వర్లు వెనక్కి తిరిగి కులాసాగా నడవడం మొదలుపెట్టాడు. అతనిలో నీరసం హరించుకుపోయింది. చీకట్లో ఒక్కడూ చేలదారినే నడిచి ఇంటికి వెళ్ళాడు. నడవలో ఎవరూలేరు. గదిలోకి తొంగి చూశాడు. పెళ్ళాం, పిల్లలూ అప్పుడే నిద్దట్లో ఉన్నారు. అరె! తనని గురించి వీళ్ళెవరూ ఆలోచంచడం లేదా! తన మాటే తన ఉనికే మరచిపోయారా! అతనికి కోపమొచ్చింది. పెరట్లో అరుగుమీదకు వెళ్ళి కూర్చున్నాడు. బాదంచెట్టు కొమ్మల్లో చీకటి దట్టంగా ఉంది. రెండు నక్షత్రాలు కొమ్మల మధ్య మెరుస్తున్నాయి.

    "నాన్నా అన్నానికి రా" అని పిలుపు. వెంకటేశ్వర్లు తన పైకెత్తి చూశాడు తన చిన్న కూతురు పన్నెండేళ్ళది. లేచి ఆమె వెనకాలే వంట యింట్లోకి వెళ్ళాడు కంచంనిండా అన్నం వుంది. వేపుడు ముక్కలు, పచ్చడి. చారు -ఓహ్ చాలా రుచిగా ఉన్నాయి. తృప్తిగా తిని త్రేన్చాడు వెంకటేశ్వర్లు.

    నడవలో పడుకున్న వెంకటేశ్వర్లుకి అర్ధరాత్రి మెలకువ వచ్చింది. అతనికి ఏదో ఎప్పుడూ ఎరగని సుఖమూ, తృప్తీ చుట్టుకొన్నాయి అతనికి అందర్నీ లేపి కబుర్లు సరదాగా చెప్పాలనిపించింది. చటుక్కున అతనికి ఏదో తప్పు చేసినట్లనిపించింది. ఇంత ఆనందానికి సుఖానికి కారణమైన పెద్ద కూతుర్ని తా నభినందించనేలేదు. దగ్గరగా వెళ్లి "అమ్మా నే సంతోషిస్తున్నాను" అనొ్దూ! తాను కృతఘ్నుడుగా ఎలా ఉండగలడు. అతను లేచి గదిలో చూచాడు. అక్కడ జయలేదు. నాలుగు వైపులా చూశాడు జయ లేదు. పెరటి తలుపు తీశాడు దొడ్లో బాదం చెట్టుక్రింద జయ కూర్చొని వుంది. చవితినాటి వెన్నెలలో స్పష్టాస్పష్టంగా గోచరిస్తోంది. ఆమె జుట్టు విడిపోయి మొహంమీద, భుజాలమీదా పడుతోంది. ఆమె కాళ్ళలో మొహం పెట్టుకొనివుంది. వెంకటేశ్వర్లు ఆమెవైపు రెండడుగులు వేశాడు. కాని యింతలో ఆమె వెక్కివెక్కి ఏడుస్తున్నట్టు చప్పుడు వినిపించింది. అతనికి అర్ధం అవలేదు. ఓ నిమిషం ఆమెవైపు చూసి చప్పుడు కాకుండా వెనక్కి తిరిగి వచ్చి నడవలో పడుకున్నాడు. "ఈ వేళ కాదు మరెప్పుడయినా కృతజ్ఞత చెపుతాను" అనుకుని కళ్ళు మూసుకున్నాడు.    

                                                                  1967

                                     *********


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS