Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 19


    అక్కడ నైపుణ్యం కావాలి. సాహసం కావాలి. అంతే కాని యితర ప్రాణులనించి అవరోధాలు ఉండవు.
    కాని యీ దారి అగమ్యం. పొదలలో కన్పించే కదలికల ఆధారంగా ఇతర ప్రాణులనించి దాడులుకూడా ఉండవచ్చునని అర్ధమవుతోంది.
    అతడు వెళ్ళదలచిన నిలువుదారిని కాదని మరొక మార్గంలో తీసుకు రావటం తన అజ్ఞానమే అన్పించింది మాలతికి. పరిసరాల గురించిన పరిజ్ఞానం  లేకుండా అలా అతనిని కూడ పెట్టుకు రావటం పొరపాటు.
    అయితే సగందారి గడిచాక వెనుకకు పోయినా, ముందుకు పోయినా ఒకటే. ముందుకే సాగాలని మనసులో నిర్ణయించుకుని అడుగు ముందుకు చాచిందామె.
    కాని ఎత్తిన అడుగు నేలను తాకనేలేదు. ఎదురుగా కన్పించిన దృశ్యాన్ని చూచి భయ విహ్వలతో అలా నిలిచి పోయింది కెప్టెన్ మాలతి.
    మొదలే అడివంత క్లిష్టంగా, చొరరానిదిగా ఉన్నది దారి. వడివడిగా పరుగెత్తేందుకయినా వీలుకానిదిగా ఉంది. అలాటిచోట వీరి మార్గాన్ని నిరోధిస్తూ ఒక ఎలుగుబంటు నిలిచింది.
    దాని శరీరం కపిలవర్ణంలో చీకటి రాసిపోసినట్లుగా ఉంది. శరీరాన్ని కప్పిన నల్లని వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకుని కన్పిస్తున్నాయి.
    కన్నులు చిదిమిన మందారాలవలె అరుణాంచితంగా తరలిస్తున్నాయి. గోళ్ళు చాల వాడిగా ఉన్నాయి.
    "మా సామ్రాజ్యంలోకి మా అనుమతి లేకుండా వచ్చిన మీరు ఎవరు?" అని ప్రశ్నిస్తున్నట్లుగా ప్రశ్నార్దకంలా నిర్భయంగా తెగించి నిలబడింది అది.
    మాలతికి ముచ్చెమటలు పోసాయి.
    అతని అభీష్టానికి వ్యతిరేకంగా చుట్టు దారిన తీసుకురావాలని ప్రయత్నించడం ఎంత పొరపాటో అర్ధమయిందామెకు. కాని ఇప్పుడు చేయగలిగిందేమిటి!
    నిస్సహాయంగా తలతిప్పి వెనుక వస్తున్న అతనివంక చూచిందామె.
    అతడు అంత లక్ష్యపెట్టలేదు. ఒక్క ఎలుగుబంటి ఏమి చేయగలదన్న ధీమాతో కన్పించాడు. వారి ప్రయాణం ఆగిపోయిన వెంటనే పొదలలో కదల్కలు అధికమయినాయి.
    అన్ని పొదలలోంచి పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు వారిని ముట్టడించినాయి. కావాలని సైనికులు చక్రబంధం వేసి విరోధుల్ని ముట్టడించినట్టుగా అవి వచ్చేస్తున్నాయి.
    కెప్టెన్ మాలతి అనుకోని ఈ సంఘటనతో పూర్తిగా బెంబేలు పడిపోయిందామె. తనకు చివరి ఘడియలు సమీపించినాయనుకుందామె ఎలుగు ఒకటి అయితే ఎదిరించవచ్చు. కొంతమేరకు పోరాడవచ్చు.
    కాని యిన్ని పదులు___? ఎదిరించటం ఎలా?
    ఆలోచించటం మానివేసి నిలిచేందుకయినా శక్తీ చాలక నిలిచిన పాటున అనుసరించివచ్చే అర్ధ మానవుని మీదికి వాలిపోయింది మాలతి.
    ప్రధమంలో ఒక్క ఎలుగు కన్పించినపుడు అర్ధ మానవుడు అతిగా చలించలేదు. కాని విరోధులు బలమయిన సంఖ్య లో ఉన్నారని అర్ధం కాగానే అతని ముఖ కవళికలు, నిలిచినా తీరు పూర్తిగా మారిపోయినాయి.
    అతనిలో అరణ్యపరమయిన న్యాయం, ఆటవికమయిన లక్షణాలు, ఆత్మరక్షణకోసం అనుసరించి తీరవలసిన పాశవికత మేల్కొన్నాయి.
    ముఖ కవళికలలో మనిషి లక్షణాలు వెనుకపడి మృగాల తాలూకు ఛాయలు కూడుకున్నాయి. కన్నులు ఉదయ సంధ్యలో రెండు రవి బింబాలు పొడిచినట్లు ఎర్రగా అయినాయి.
    గొంతుపెంచి అడవి అంతా దద్దరిల్లిపోయేలా ఒక విచిత్రమయిన స్వరంతో బిగ్గరగా అరవసాగాడు. మాలతికి యించుమించు శరీరంమీద తెలివి తప్పిందనే అనాలి.
    అతడు - తనకు మైత్రి అనే మాధుర్యాన్ని అందించిన ఆమెను భద్రంగా ఒడ చేతిలో పొదివి పట్టుకున్నాడు, మరొక చేతిలో ప్రక్కనున్న రాయితీసి సిద్దంగా ఉంచుకున్నాడు. ఆ దాడిని ఎదుర్కొనేందుకు అన్ని విధాల సంసిద్దుడు అయినట్లుగా అడుగు ముందుకు వేశాడు.
    అతడు పురోగమిస్తూ ఉంటే చుట్టుముట్టడించిన జాంబవంతుల్లాంటి ఎలుగులన్నీ మరింత దగ్గరగా చేరుతున్నాయి. అవికూడా ఒక వ్యూహం ప్రకారం ప్రత్యరదిని ఎదుర్కొనేందుకు సన్నద్దమవుతున్నాయి. వారు తమ సామ్రాజ్యంలోకి ప్రవేశించారు. అంతేకాదు, తమ ప్రశాంతతకి భంగంకలిగించారు. విలక్షణంగా ఉంటాయి. జనావాసాలకు దగ్గరగా ఉండే అడవులలో కొన్ని జంతువులు మనుషుల కదలికలకు కొంతలో కొంత అలవాటుపడి ఉంటాయి.
    జనావాసాలకు ఏమాత్రం సంబంధంలో ఉండని యిలాంటి అడవులలో వాటి అలవాట్లు వాటివి! ముఖ్యంగా వాటి విరోధ జంతువుల్ని గుర్తించే శక్తి వాటికి జన్మతః వస్తుంది. స్వజాతి జంతువులు అయినా, మిత్రజాతులయినా సులభంగా గుర్తిస్తాయి.
    ప్రకృతిలోని పశు సంతతిలో అన్నింటిలోకి మనిషి అనబడే జంతువు మరింత విచిత్ర మయినది అడవి జంతువుల దృష్టిలో!
    మానవుడనబడే ప్రాణి  కన్పించగానే అది మిత్రజాతి అయింది శత్రుజాతి అయిందీ అని వెంటనే పోల్చుకోలేవు. మనిషి వాటి సంశయం తీరకుండానే తగిన సమయంలో తల వొంచుకుని దాటిపోగలిగితే అవి ఏమీ చేయాలని ప్రయత్నించావు.
    కాని ఇప్పటికే వీరు వాటి ఏకాంతానికి భంగం కలిగిస్తూ వెళ్ళరాని చోటికి వెళ్ళారు. అందునించి సంయుక్తంగా పోరాటానికి సంసిద్దమయినాయి.
    అన్ని ప్రక్కలనించి వలయాకృతిలో ఆ విచిత్ర మానవుని ముట్టడించి మరింత చేరువ అయినాయి ఎలుగులు. అతడు అత్యంత బలశాలి అయినప్పటికీ అన్ని ఎలుగుల్ని నేరుగా ఎదిరించలేడు.
    ప్రాధమిక వికాశదశలో ఉన్నవాడే అయినా అతడు బయటపడేందుకు ప్రిమిటన్ మాన్ అయినా అతడు బలాపోరాటాన్ని ఆశ్రయించలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS