Previous Page Next Page 
ఒప్పందం పేజి 18


                           మిసెస్ రాజారావు

    టివి లో వార్తలు చూస్తోంది హిమబిందు. పిల్లలిద్దరూ రీడింగ్ టేబిల్ దగ్గర కూర్చుని హోం వర్క్ చేసుకుంటున్నారు. హిమబిందు తన మంచం మీద కొద్దిగా దిండు మీదికి వాలి పడుకుని విశ్రాంతి గా టివి చూస్తోంది. చాలారోజుల తరువాత ఇంట్లో టివి మోగుతోంది. తెలుగు న్యూస్ రీడర్ వార్తలు చదువుతోంది. ఎలక్షన్స్ దగ్గర పడ్డాయి. నామినేషన్ల పర్వం మొదలైంది. ఎవరికో టికెట్లు దొరకలేదట . కొట్లాటలు జరుగుతున్నాయి. వీధిన పడి దారుణంగా కొట్టుకుట్టున్నారు. చొక్కాలు చింపుకుంటున్నారు... గోల , అరుపులు, కేకలు.
    "మమ్మీ! భయం వేస్తోంది" ఆ గోలకి వెనక్కి తిరిగిన చిన్న కూతురు నవ్య టివి వైపు చూస్తూ భయంగా అరిచింది.
    హిమబిందు టక్కున రిమోట్ తో టివి ఆఫ్ చేసింది.
    కూతురు కళ్ళల్లో భయం చూసి మృదువుగా అంది...." హోం వర్క్ పూర్తీ అయిందా?"    
    "లేదు....ఇంకా కొంచెం వుంది."
    "ఆ కాస్తా పూర్తీ చేయి....అన్నాలు తిందురు గాని"
    పెద్దకూతురు రమ్య కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి , "నాది అయిపొయింది మమ్మీ!" అంది.
    "గుడ్...ఇద్దరూ కంప్లీట్ చేసాకా ఇద్దరికీ ఒకేసారి అన్నం పెడతా సరేనా?" మంచం మీంచి లేచి పిల్లలిద్దరికీ తలల మీద చేతులేసి, ప్రేమగా జుట్టు సవరించి అంది హిమబిందు.

                                   ***

    "ఒకే. తిరిగి నవ్య హోం వర్క్ చేయడం లో మునిగిపోయింది.
    హిమబిందు కొంచెం రిలీఫ్ గా నిట్టూర్చి అక్కడే ఉన్న మరో కుర్చీ లాక్కుని నవ్య పక్కనే కూర్చుంది.
    పిల్లలకి అసెంబ్లీ అంటే భయం... గొడవలంటే భయం... ఖద్దరు బట్టలంటే భయం... మనుషులంటే ముఖ్యంగా మగవాళ్ళం టే భయం.... తాతలు,తండ్రి, పిన్నాన లు, మామలు అందరూ వాళ్ళలో భయం కలిగించడానికి కర్తలే.... ఈ భయం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలి.ప్రస్తుతం తన ముందున్న కర్తవ్యం... వాళ్ళలో భయంపోగొట్టి ధైర్యాన్ని , మానసిక బలాన్ని కలిగించాలి... అలా చేయాలంటే ఏం చేయాలి? ఈ ఇంట్లో రాజాకీయం కనిపించకుండా ,వినిపించకుండా చేయాలి. అతని తోటే అన్నీ అంతం.... అతని భార్యగా ,అ ఇంటి కోడలిగా తన పాత్ర ముగించేయాలి. తనది అనే ఒక కొత్త,స్వతంత్ర జీవితం ప్రారంభించాలి. ఆ జీవితంలో ఏ రాజకీయాలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలి. ఎవరి ఒత్తిడులకి లొంగకూడదు. ఏ ప్రలోభాలకు ఖాతరు చేయకూడదు.
    ఫోన్ మోగింది... ఆమె ఫోన్ వైపు చూసింది.... ఫోన్ కూడా భయంతో వణుకుతూన్నట్లే అనిపించింది. ఆ రింగ్ ఇక్కడిదే.... వాళ్ళే చేసి వుంటారు. నెమ్మదిగా ఒంగి ఫోన్ చేతిలోకి తీసుకుంది.
    గొంతు సవరించుకుని "హలో!' అంది.
    'అమ్మా.... మిసేశ్రాజారావు గారా ....నేనమ్మా హోంమంత్రిని నమస్కారం తల్లీ! సీఎం గారు డిల్లీ నుంచి రేపు వస్తారు. నామినేషన్ వేసేందుకు రేపోక్కరోజే టైం వుంది. మీ ఫోటో తో సహా మీ బయోడేటా రేపు ఉదయం పంపించండి. మా మనిషి మీ దగ్గరకు వస్తాడు. ఆ చూడమ్మా! ఫోటో వేరేది తీయించుకో... బొట్టు లేకుండా, తెల్ల చీరతో.... అ తరవాత అంటే పదవి వచ్చాక నీ ఇష్టం...ఏ చీరలైనా కట్టుకోవచ్చు. ఇలా అంటున్నానని ఏం అనుకోకు."
    హిమబిందు హృదయం రగిలిపోయింది.
    రాజారావు భార్యగా ఆయన స్థానంలోకి వెళ్ళాలి. వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం, వాళ్ళ అధికారాలు పటిష్టం కావడం కోసం ఇవాళ అకస్మాత్తుగా రాజకీయాల్లో స్త్రీల హక్కుపైన వాళ్ళలో చైతన్యం కలిగింది. కేవలం మెజారిటీ కోసం తనపై ప్రజలు సానుభూతి వర్షం కురిపించి ఓట్లు వేస్తారట ప్రజలంత పిచ్చి వాళ్ళా.... ఇంతకాలం రాజకీయాల్లో కనిపించని ఈ స్త్రీకి ఏం తెలుసు? మమ్మల్ని ఈమె ఎలా పాలించగలదు? అని ఏ ఒక్కరూ ఆలోచించకుండా ఓట్లు వేసేస్తారా? వాళ్ళ సానుభూతి కోసం తను బొట్టు పెట్టుకొకూడదా? భర్త పోయిన తను విధవ రాలి గెటప్ లో ఫోటో తీసుకుని, కళ్ళల్లో దైన్యం నింపుకుని ఉంటేనే అందరూ తనపైన సానుభూతి చూపిస్తారు. ఏం? ఎప్పటిలా మంచి చీర కట్టుకుని, అందంగా  తయారవకూడదా?ఏం మనుషులు? అయినా తనకిష్టం లేని డ్రైనేజీ లాంటి రాజకీయాల్లోకి తానెందుకు వెళ్ళాలి. ఎవరి కోసం వెళ్ళాలి?
    నిన్న సి.ఏం గారి నుంచి కబురు వచ్చింది. కారు పంపించారు. ఆయనింటికి తీసుకెళ్ళారు.
    రాజారావు స్థానంలో ఆమెని ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ వుందిట. స్త్రీలు కూడా రాజకీయాలలోకి రావాల్సిన అవసరం వుందిట. స్త్రీలకే పురుషుల కన్నా ఎక్కువ తెలివితేటలూ, ధైర్యం వుంటాయట. స్త్రీలైతే నిజాయితీతో, నిబద్దతతో వ్యవహరించి ధర్మబద్దంగా వ్యవహరిస్తారుట. తనకి తప్పకుండా సానుభూతి ఓట్లు పడతాయట. అందుకే తనని ఎన్నికల్లో పోటీ చేయామంటున్నారట. తనేం చేయక్కర్లేదట. తన తరపున వాళ్ళే నామినేషన్ వేస్తారుట. ప్రచారం చేస్తారుట. అన్నీ వాళ్ళే చేస్తారట. కేవలం తన ఫోటోలు తన బయోడేటా కావాలిట. బయోడేటా అంటే రాజారావు తో ఎప్పుడు పెళ్ళైంది. తమ సంసారం ఎంత అన్యోన్యంగా సాగింది.... అతను తనని ఎంత గౌరవించాడు.....భార్యగా తనకి ఎన్ని సమాన హక్కులిచ్చారు.... వగైరా....ఏవీ! అవన్నీ తన దగ్గర లేవే. తన పేరు హిమబిందు... తండ్రి పేరు మాణిక్యాలరావు.... తను ఇంగ్లీషు లిటరేచర్ లో ఎం.ఏ చేసింది. కొంతకాలం నాట్యం నేర్చుకుంది. కాలేజీలో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంది. ఎన్నో బహుమతులు పొందింది. అవన్నీ అవసరం లేదట. చాలాసేపు దాదాపు మూడు గంటల పాటు ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు ఏవేవో చెప్పారు. "రాజారావు మంచివాడు. సహృదయుడు కష్టపడి నిజాయితీగా పనిచేసేవాడు. ప్రజాల కష్టాలే తన కష్టాలుగా భావించేవాడు. (కాని తన సుఖం ప్రజల సుఖంగా మాత్రం భావించ లేకపోయాడు.) అతని స్థానాన్ని తను భర్తీ చేయాలి. రాజారావు భార్యగా, శాసనసభ్యురాలిగా ఇంకా గౌరవం వస్తుంది. తనకి, తన పిల్లలకి చదువు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు ఏ లోటు లేకుండా, ఏ కష్టం లేకుండా హాయిగా సాగిపోతాయి. ఆలోచించుకుని చెప్పమ్మా ఫరవాలేదు....ఒకరోజు టైం తీసుకో....ముఖ్యమంత్రి గారు ఎంతో సానుభూతి తో గడువిచ్చారు.
    "హు" ఆమె కళ్ళముందు అసెంబ్లీ సమావేశాలప్పుడు జరిగే యుద్ద కాండ మెదిలింది.
    ఎప్పుడుసమావేశాలు జరిగినా ఉద్రేకాలతో, ఆవేశాలతో ,కక్షలతోక్రమశిక్షణ ,మర్యాద, సంస్కారం అనేవి లేకుండా కుక్కల్లాగా కొట్లాడు కుంటారు. రాజకీయం అంటే ఇదేనా? అందరూ వయసు మళ్ళిన వాళ్ళే.... ఎందుకు వీళ్ళందరికీ ఈ ఆవేశాలు? ఈ పదవులు, ఈ తాపత్రయాలు....జీవితంలో అన్నీ అయిపోయిన వాళ్ళు హాయిగా యువత చేతుల్లో దేశ భవిష్యత్తు పెట్టి విశ్రాంతి తీసుకోవచ్చుగా... ఊహు.... అలా చేస్తే వీళ్ళంతా రాజకీయ వాదులేలా అవుతారు? వయసు ఉడిగినా, కాటికి కాళ్ళు చాచుకున్నా, డబ్బు మీద , కీర్తి కిరిటాల మీదా కాంక్ష చావదు.. అన్నీ రంగాల్లో వ్రుద్దులే.... అరవైలు ,డెబ్బై లు దాటినా డబ్బు యావ, కీర్తి కాంక్ష....యువతని పైకి రానివ్వని కర్కశత్వం... ఛీ....ఏం మనుషులు? పదవుల కోసం దెబ్బలాటలు, ఒకరినొకరు చంపుకోడాలు, పోటీకి వచ్చినవాళ్ళ ని అడ్డంగా నరికేయడాలు ....పదవులు కొనుక్కోడానికి అడ్డదారుల్లో డబ్బు సంపాదించడాలు, అమాయకుల , పసిపిల్లల వెచ్చని రక్తంతో చలి కాచుకునే నీచులు, ఆడపిల్లల శీలాన్ని తమ కామాగ్ని లో సమిదులుగా చేసుకునే పందులు.... వీళ్ళంతా దేశాన్ని పాలించే వాళ్ళు. కాపాడేవాళ్ళు. ఈ అశుద్ధం లో ఒక పురుగు ఈ పిల్లల తండ్రి.
    హిమబిందు కి రాజారావు జ్ఞాపకాలు మదిలో మెదిలాయి.
    ఒద్దన్న కొద్దీ కట్టబెట్టాడు తన తండ్రి. రాజకీయాల్లో పుట్టి, రాజకీయాల్లో పెరిగిన పదవి పోయిన ఎం.పీ... రాజకీయాల్లోంచి ఏరి కోరి కూతురికి కట్టబెట్టాడు. ఆమె కన్నా వయసులో పదేళ్ళు పెద్దవాడైనవాడిని ఈడూ జోడూ చూడకుండా కేవలం స్వలాభం కోసం అతనిద్వారా తన స్థానం పటిష్టం చేసుకోడానికి... అతని ద్వారా తన పార్టీని బలోపేతం చేసుకోడానికి.... అడ్డు వచ్చిన భార్యను కళ్ళ తోటే కాల్చేస్తూ , ఏడుస్తున్న కూతుర్ని నిర్దయగా మెడ వంచి ఉరితాడు వేయించాడు. హిమబిందు మిసెస్ రాజారావు అయింది. బోలెడంత డబ్బు...గౌరవం అడుగులకి మడుగు లోత్తే సేవకులు, ఆడుగు తీసి అడుగు వేయాలంటే కారు.... సెక్యూరిటీ ...ఎసి రూమ్లు...ఓహ్....ఎన్ని భోగాలు.
    "మిసెస్ రాజారావు ' హిమబిందు గా పొందలేని గౌరవాలెన్నో మర్యాదలెన్నో మాణిక్యాలరావు కూతురిగా పొందలేని భోగాలెన్నో, మిసెస్ రాజారావు గా మారాక లభించాయి. దాని క్కారణం అతను తన భర్త మిస్టర్ రాజారావు మామను మించిన అల్లుడు . మామ నెత్తినే చేతులు పెట్టి , పార్టీలు మార్చి అధికార పక్షంలో చేరిన వాడు. పార్టీలే కాదు.... పెళ్ళాల్ని కూడా అవలీలగా మార్చగల ఘనుడు. డబ్బు వెదజల్లి పదవులు, అధికారాలు కొనుక్కుని ఎమ్ ఎల్ ఏ అయ్యాడు. ఆ డబ్బు కోసం చేయని దగా లేదు. చేయని వ్యాపారం లేదు. కిళ్ళీ వ్యాపారం నుండి కిడ్నీ వ్యాపారం దాకా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS