Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 18

 

    "ఒరే....పొట్టిలాగు పండు....." అంటూ కొట్టడానికి చేయెత్తాడు.


    "గురూ....." గంభీరంగా పిలిచాడు సత్తిపండు.


    "అదేంట్రా....ఆ ఎక్స్ ప్రేషనేంటి? నువ్వేమో జస్టిస్ చౌదిరిలో ఎన్టిఆర్ అనుకుంటున్నావా? ఖైదిలో చిరంజీవి అనుకుంటున్నావా?"


    "కాస్తా బుర్రతో ఆలోచించు గురూ....అవసరమైతే మన ఫేసులు కనిపించకుండా బానిన్లు విప్పి తలకు చుట్టుకుంటే సరి.....ఎందుకు చెబుతున్నానో ఆలోచించు గురు.....ఒక గంట ఆ పన్జేస్తే హాయిగా లంచ్ లాగించేయొచ్చు....." అని శ్రీచంద్ర రియాక్షన్ కోసం అతని మొహంలోకి చూశాడు.


    శ్రీచంద్ర ఒక్క క్షణం అలోచించి......"అలాగే.....కాని ఆ కుర్రాడు?"


    "నేను మేనేజ్ చేస్తాగా ఓ పైవుంటే అప్పివ్వు" అడిగాడు సత్తిపండు.


    శ్రీచంద్ర రెండు రూపాయల కాయిన్స్ రెండు తీసిచ్చాడు. నా దగ్గరున్న బ్యాలెన్స్ కరెన్సీ ఇంతేనంటూ.


    "థాంక్స్ గురూ....." అంటూ ఓ రెండు రూపాయల కాయిన్ శ్రీచంద్ర చూడకుండా తన జేబులో వేసుకుని మరో రెండు రూపాయల కాయిన్ తో ఆ కుర్రాడి దగ్గరకు వెళ్లి "బాబూ.....షహెన్షా.....ఒక్క పదినిం,నిమిషాలు బుద్దిగా ఇక్కడే నిలుచో....ఇదిగో రెండ్రుపాయలు.....రెడ్ లైట్ పడగానే స్కూటర్ల దగ్గరికి వచ్చావంటే చంపేస్తా......నా పొట్టి లాగులో కత్తి వుంది" అన్జెప్పి అతడ్ని బెదిరించి, శ్రీచంద్రను తీసుకొచ్చి, రెడ్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని చూడసాగాడు.


    ఈలోగా ప్యాంట్ ని మోకాలిపై వరకూ మడిచాడు. శ్రీచంద్రను కూడా అలా చేయమన్నాడు.


    ఇద్దరూ చొక్కాలు విప్పి రెడీగా వున్నారు. రెడ్ సిగ్నల్ పడింది.


    "గురూ! మనమీ డ్రెస్సుల్లో వెరైటిగా వున్నాం కదూ. అచ్చు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్కూటర్లు తుడిచేవాళ్ళలా...." అన్నాడు సత్తిపండు శ్రీచంద్రతో.


    "మనమేమైనా సినిమాలో కమల్ హసన్ టైప్ లో కొత్త రకం గెటప్స్ వేస్తున్నామా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ పోట్టిలాగు విప్పించి స్కూటర్లు తుడుస్తాను" కోపంగా అన్నాడు శ్రీచంద్ర.


    "వద్దులే గురూ.....జనం ఝడుసుకు చస్తారు" అంటూ సిగ్నల్ వైపు చూశాడు.

 

    రెడ్ సిగ్నల్ పడింది.


    "గురూ....ఉస్కో" అంటూ స్కూటర్లు ఆగగానే ఓ స్కూటర్ దగ్గరకు వెళ్లి తల కిందకి వాల్చి తన చొక్కాతో స్కూటర్ ముందు భాగం తుడవడం మొదలెట్టాడు.


    ఆ స్కూటరిస్టు జేబులో నుంచి పావలా తీసి సత్తిపండుకు ఇచ్చాడు. ఆత్రంగా అతడెంతిచ్చాడో చూసిన సత్తిపండు , అది పావలా అని తెలియగానే తలెత్తి స్కుటరిస్ట్ వైపు చూసి "నీ మొహానికి నేనెలా కనిపిస్తున్నాను బ్రదర్. అసలు నేనెవరో తెలుసా?"  లోగొంతుతో అని చుట్టూ చూశాడు.


    స్కూటరిస్టు అనుమానంగా, ఆసక్తిగా "ఎవరు?" అని అడిగాడు.


    "దావూద్ ఇబ్రహీం లెప్ట్ భుజాన్ని పోలిసుల నుంచి తప్పించుకోవడానికి ఈ వేషం వేశాను. నా పొట్టి లాగులో ఎ.కే. ౯౯ వుంది" అన్నాడు సీరియస్ గా మొహం పెట్టి.


    ఆ స్కుటరిస్ట్ బెదిరిపోయాడు.


    "మినిమమ్ హండ్రెడ్ అయినా ఇవ్వు" ఇంకాస్త గంభీరంగా అన్నాడు.


    అతను కాస్త బెదిరిపోయి జేబులోంచి యాభై నోటిచ్చి "ఇంతకన్నా ఎక్కువ లేద్సార్" అంటూ లెప్ట్ సైడ్ వెళ్లిపోయాడు భయంతో.


    యాహూ....అని అరిచి ఎగిరి గంతెయాలనిపించింది సత్తిపండుకు.


    వెంటనే కర్తవ్యం గుర్తుకు వచ్చి మరో స్కూటర్ దగ్గరకు వెళ్లాడు.


    
                                                          * * *


    గరుడాచలం రోడ్డు పక్కగా నిలుచున్నాడు. పది నిమిషాల నుంచి ఒక్క బస్సు రావడం లేదు. చిరాగ్గా వుంది. ఏం చేయాలో తోచలేదు. సరిగ్గా అతని దృష్టి రోడ్డు పక్కనే వున్న పిల్లల మీద పడింది.


    వాళ్లు చేతిని కొద్దిగా వంచి "లిప్ట్ ప్లీజ్' అని అడుగుతున్నారు. కొందరు చక్కాపోతుంటే మరికొందరు వెహికల్స్ ఆపి వాళ్ళుకు లిప్ట్ ఇస్తున్నారు.


    ఈ ఆలోచన గరుడాచలానికి నచ్చింది. వెంటనే తనూ అలాగే చేశాడు.


    ఓ యాభయ్యేళ్ళ ఆంగ్లో ఇండియన్ కేనటిక్ హొండా మీద వచ్చి "లిప్ట్ ప్లీజ్" అంటూ రోడ్డు పక్కనే వున్న గరుడాచలాన్ని చూసి వెహికల్ ఆపింది.


    ప్యాంట్ , షర్టుతో, బాబ్డ్ హెయిర్ తో ఆమెను 'అతను' అనుకుని పొరపాటు పడ్డాడు గరుడాచలం.


    స్కూటర్ ఎక్కాక అతనికి అనుమానం వచ్చింది. బండి కుదుపులకు "ఆసరా' కోసం ఆ ఆంగ్లోఇండియన్ నడుం పట్టుకున్నాడు.


    "యూ ....నాటి" అని ఆంగ్లో ఇండియన్ అన్నప్పుడు......


    ఒక్కసారి స్కూటర్ దిగి ఆమె ఆడో, మగో కన్ ఫర్మ్ చేసుకోవాలన్న కోరిక కూడా పుట్టింది.


    "ఏంటి....అడా మగా తేడా లేని బట్టలు....వేషాలు" ముందుగా గొణుక్కున్నా ఆవిడ వెనుక కూచుని వెళ్ళడం సుఖంగానే అనిపించింది గరుడాచలానికి.


    సడెన్ బ్రేక్ పడినప్పుడల్లా అరవై దగ్గర్లో వున్న గరుడాచలం "అబ్బ.....నీ తీయని దెబ్బ' అని అనుకోకుండా ఉండలేకపోతున్నాడు.

    కేనేటిక్ హొండా ప్యాట్ని సెంటర్ దగ్గరికి వచ్చింది.


    రెడ్ సిగ్నల్ పడడంతో స్కూటర్ ని ఆపింది.

 


                                                           * * *


    "గురూ.....కేనటిక్ హొండా ...ఆంగ్లో ఇండియన్.....ఉస్కో నువ్వా నేనా' పోటా పోటి" అన్నాడు హుషారుగా మరో స్కూటర్ దగ్గరకు వెళ్లి సత్తిపండు.


    గరుడాచలం ఆగివున్న ట్రాఫిక్ వంక చూస్తున్నాడు. పక్కనే వున్న ఓ స్కూటర్ ని తుడుస్తున్న సత్తిపండును వెనుక నుంచి చూశాడు గరుడాచలం.


    "ఇదిగో....ముదనష్టపు అబ్బీ....దుక్కలా వున్నావు. ఏదైనా పన్జేసుకో కూడదు" అన్నాడు ఉరుకే అలా వెహికల్ మీద కూచుని వున్నందున ఏమి తోచక.


    "ఈ ఐరన్ టోన ఎక్కడో విన్నట్టుందే' అనుకుంటూ మెల్లగా తల తిప్పి ఓరకంట చూసాడు.


    గరుడాచలం కనిపించాడు.


    "అమ్మో....దొరికితే చంపేస్తాడు అడ్డమైన తిట్లతో" అనుకున్నాడు.... ఏమి చేయాలో ఒక్క క్షణం ఆలోచించాడు.


     ఇటు పక్కగా హీరో హొండా వుంది. దాని ఇంజన్ కు వున్న మాసిని చేతిలోకి తీసుకుని మొహానికి పూసుకున్నాడు.


    "ఏయ్....ఏం చేస్తున్నావ్?" అడిగాడు గరుడాచలం.


    "నీ పిండాకూడు.....నీ తద్దినం బిర్యాని" అన్నాడు పళ్ళు ఇకిలించి......తననేలాగు గరుడాచలం గమనించడన్న నమ్మకంతో సత్తిపండు.


    మొహమంతా ఆయిల్ జిడ్డుతో వున్న సత్తిపండు ను ఆయనే గుర్తించనేలేదు.


    "చీ....చీ పని లేని వెధవలు" అంటూ తన కాలికి ఎవరిదో చేయి తగిలేసరికి ఉలిక్కిపడ్డాడు.


    అప్పుడే శ్రీచంద్ర ఆ కేనటిక్ హొండా దగ్గరికి వచ్చి చొక్కాతో తుడుస్తున్నాడు. ఆంగ్లో....ఇండియన్ "ఏయ్.....యంగ్ మేన్ మొత్తం తుడవాలి లేకపోతే ఒప్పుకోను" అనేసరికి స్కూటర్ తుడిచి డబ్బు అడుక్కోవాలన్న దిక్కుమాలిన ఐడియా ఇచ్చిన సత్తిపండు మీద పికల్దాక కోపం వచ్చినా దిగమింగుకుని వెనుకవైపు తుడుస్తుండగా గరుడాచలం కాలు తగిలింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS