శ్రీచంద్ర చిరునవ్వులు చిందిస్తూ అందరి వైపు చూశాడు.
ఇంటర్ వ్యూ బోర్డు మెంబర్ శ్రీచంద్ర వంక కోపంగా చూశాడు.
"ఆ లుక్కేంట్రా లుకేమియా పేషెంట్ లా...." అంటూ కాళ్ళతో అతన్ని ఓ తన్ను తన్నాడు.
దబ్ మని శబ్దమైంది.
పెద్ద అరుపు.
* * *
"అదేంట్రా....నిన్ను తంతే మా అబ్బ అరిచాడు. నిగ్గాని మిమిక్రి వచ్చా? నెత్తిమీద బొచ్చులేని వెధవా...." అడిగాడు ఇంటర్ వ్యూ బోర్డు మెంబర్ ని శ్రీచంద్ర.
"మిమిక్రి ఏంట్రా మతిలేని వెధవా.....నాకు బొచ్చు లేదంటావా.....బొచ్చేలో ఉద్యోగాలు ముష్టేత్తుకునే నెల తక్కువ వెధవ...." కర్ణకఠోరమైన ఆ తిట్టు విని ఉలిక్కిపడి లేచాడు.
తల మీదుగా ఒళ్ళంతా నీళ్ళు కారుతుండగా తన తండ్రి తన ఎదురుగా నిలుచున్నాడు.
"అదేంటి నాన్నా.....లుంగీ బనిన్ మీద స్నానం చేశావు? అప్పుడే తెల్లవారిందా?" శ్రీచంద్ర అడిగాడు.
"నీ యబ్బా.....నేను లుంగీ, బనిన్ మీద స్నానం చేయడమేమిట్రా.....నిన్ను కాకులు , గద్దలు ఎత్తుకెళ్ళ...."
శ్రీచంద్ర తండ్రి తనవైపు ఎందుకు సీరియస్ గా చూస్తున్నాడో ముందు అర్ధం కాలేదు.
తర్వాత మంచంవైపు చూశాడు. తన కాళ్ళ దగ్గర పెట్టిన స్టూలు మీద వుండాల్సిన ప్లాస్టిక్ బకెట్ లేదు. అది కిందపడి వుంది. దాన్నో వున్న నీళ్ళు స్టూలుకు అటు పక్క మంచమ్మిద పడుకున్న గరుడాచలం మీద పడ్డాయి.
అంటే.....తన ఇంటర్ వ్యూ బోర్డు మెంబర్ ని తన్నలేదన్నమాట.
ఆ దబ్ మన్న శబ్దం నీళ్ళ బకెట్ ది అన్నమాట. ఆ నీళ్ళు తన తండ్రి మీద పడ్డాయన్నమాట.
ఆ అరుపు తన తండ్రిదన్నమాట.
ఇన్ని 'మాట' ల మధ్య, తండ్రి మాటలు తిట్లుగా రావడంతో చెవులు ముసుకోక తప్పలేదు.
అరగంట పాటు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు గరుడాచలం.
యదావిధిగా చుట్టుపక్కల వాళ్ళు ఫ్రీ షో చూసి వెళ్ళిపోయారు.
శ్రీచంద్ర తల్లి మొగుడి వైపు కొరకొరా చూసి "నీళ్ళు పడితే పడ్డాయి గానీ, రేపొద్దున్న స్నానం చేసే పని తప్పింది " అని కిసుక్కున నవ్వి వెళ్ళిపోయింది.
బామ్మ ఎక్కడ ఏ ఉరుము ఉరిమి తన మీద పడుతుందేమోనని, గుడ్లప్పగించి చూస్తూ వుంది.
గరుడాచలం తిట్టి అలసిపోయి బనిన్ , లుంగీ విప్పి చెడ్డి మీద నిలబడి శ్రీచంద్ర ను ఇంకా తిడుతూనే వున్నాడు చలికి వణుకుతూనే!
ఆ అవతారం చూడలేక శ్రీచంద్ర కళ్ళు మూసుకున్నాడు. వాటితో పాటు చెవులు కూడా!
* * *
నోటికి చేతిని అడ్డం పెట్టుకుని నవ్వుతున్నాడు సత్తిపండు.
"ఎందుకురా ....తెలుగు ట్రాజేడి సినిమా చూసినట్టు అలా నవ్వుతున్నావు" కోపంగా అడిగాడు శ్రీచంద్ర.
"మరేం లేదు గురూ....రాత్రి జరిగిన సంఘటన నువ్వు చెబుతుంటే ఆ సీన్ ఉహించుకుని విజువలైజ్ చేసుకుని నవ్వుతున్నా....." అన్నాడు భయంగా శ్రీచంద్ర వైపు చూస్తూ సత్తిపండు!
"నీకు నవ్వులాటగా వుందా?" గుర్రుగా అన్నాడు శ్రీచంద్ర.
"అది కాదు గురూ.....నికిలాంటి విచిత్రమైన కలలు ఎలా వస్తాయి? వస్తే వచ్చాయి.....కాళ్ళ దగ్గర బకెట్ భలే తన్నావు.....బాబాయ్ చెడ్డితో ఎలా వున్నాడంటావ్?" అడిగాడు కుతూహలంగా సత్తిపండు.
"వెళ్ళు....కాసేపట్లో బాత్రూం లో స్నానం చేయడానికి వస్తాడు. అప్పుడు ఆ చెడ్డి కూడా ఉండదు. చూసి నాక్కూడా చెప్పు..." కసిగా అన్నాడు శ్రీచంద్ర.
"హమ్మో! పుసిక్కున అంత మాటనేశావేంటి గురూ......అయినా నువ్వు కలలు కనడం మానేయ్ గురూ....." అన్నాడు సత్తిపండు.
"నువ్వింకా చెప్పలేదని చూస్తున్నా...." అన్నాడు శ్రీచంద్ర.
"అబ్బ....అన్నీ జోకులే.....అవును గానీ......ఆకలేస్తుంది గురూ....మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు. ఆ అయ్యర్ హోటల్ కు వెళ్ళే పాత డబ్బులు ఇచ్చి కొత్త ఖాతా ఓపెన్ చేయమన్నాడు. పిచ్చోడు...అసలు డబ్బులంటూ వుంటేగా....." అన్నాడు సత్తిపండు.
"ఏదో ఒకటి ఆలోచిద్దాం లేరా...." ట్రాఫిక్ వంకా చూస్తూ అన్నాడు శ్రీచంద్ర.
వాళ్ళిద్దరూ ప్యాట్ని సెంటర్ కు వచ్చారు. ట్రాఫిక్ రద్దీగా వుంది.
"పోనీ....వదిన్ని అప్పుడుగుదామా?"
"చంపేస్తా....అలా అప్పడిగి తినే బదులు ముష్టడిగి తిందాం."
"అబ్బో....దీనికేం తక్కువలేదు...." అంటూ ప్యాట్ని సెంటర్ లో కనిపించిన ఆ దృశ్యం చూసి.....
"గురూ....." అని కేకేశాడు.
"ఏంట్రా అంత గట్టిగా అరిచావ్?"
"అటు చూడు...." ట్రాఫిక్ సిగ్నల్ వైపు చూపిస్తూ అన్నాడు.
"చూశాను, ఏంటి?"
"నీకేమి కనిపించడం లేదా గురూ."
"ఏం కనిపిస్తుంది? ట్రాఫిక్ కనిపిస్తుంది"
"ఇంకా...."
"రెడ్ లైట్.....గ్రీన్ లైట్.....అరేంజ్ లైట్....."
నెత్తి నుదురు కొట్టుకుని "అది కాదు గురూ.....ట్రాఫిక్ ఆగగానే ఆక్కడో కుర్రాడు ఏం చేస్తున్నాడో చూడు."
అటు చూశాడు శ్రీచంద్ర.
రెడ్ లైట్ పడగానే స్కూటర్లు, కార్లు ఆగాయి. ఓ పదేళ్ళ కుర్రాడు నిక్కరు మీదున్నాడు.
షర్టు విప్పి, స్కూటర్లు కొద్ది కొద్దిగా తుడుస్తూ చేతులు చాపుతున్నాడు. డబ్బులకోసం.
ఎవరికి తోచింది వాళ్ళిస్తున్నారు.
గ్రీన్ లైట్ పడగానే వెహికల్స్ వెళ్తున్నాయి.
మళ్ళీ రెడ్ లైట్ పడేవరకు ఆ కుర్రాడు నిరీక్షించి, రెడ్ లైట్ పడగానే మళ్ళీ వెహికల్స్ తుడుస్తూ , డబ్బులు అడుక్కుంటూ.....బిజీ ట్రాఫిక్ సెంటర్లో ఇలాంటి దృశ్యాలు మాములే.
"అయితే ఏమిట్రా...." అడిగాడు శ్రీచంద్ర.
"మనమూ ఆ పన్జేస్తే" అంటూ శ్రీచంద్ర రియాక్షన్ కోసం చూశాడు.
ఒక్క క్షణం సత్తిపండు వైపు చూసి , ఆ గెటప్ లో తామెలా వుంటామో వుహించుకున్నాడు.
ప్యాంట్ మోకాలిపైకి మడిచి, చొక్కాలు విప్పి, తాము స్కూటర్లు తుడుస్తూ దృశ్యం వుహించుకునేసరికి సత్తిపండు మీద కోపం పీకల్దాకా వచ్చింది శ్రీచంద్రకు.
