"అదేంటండీ, అయ్యగారి కారేగా!" వస్తున్న నవ్వు ఆపుకునే ప్రయత్నం చేస్తున్నాడు డ్రైవర్ రఘు.
"అప్పుడు నాకు చెప్పలేదేం..?" అంది జానకి.
"చెప్పద్దన్నారండి - అయినా ఏదో చిన్న దెబ్బ అనుకున్నానండి!" అన్నాడు రఘు.
జానకికి అనిపించింది- ఆ ఆస్పత్రికి వెడితే బాగుంటుందని! కానీ, ఎందుకో తిన్నగా ఇంటికొచ్చేసింది జానకి.
జానకి యింటికొచ్చేసరికి ఆ దృశ్యం కళ్ళనుంచి నిప్పులు కురిపించింది.
మాధవరావు, మరో కొందరు స్నేహితులు పేకాటలో నిమగ్నమైపోయారు. గదంతా సిగరెట్ పొగ! లోపల గదిలో రాజమ్మ చాపమీద పడుకుని నిద్రపోతోంది. మమత కక్కటిల్లి ఏడుస్తోంది.
జానకి గబగబా వెళ్ళి పిల్లని ఎత్తుకుంది.
కానీ, ఇదేమిటీ- తన భర్త క్లబ్బుకి వెళ్ళటం, పేకాట ఆడుకోవటం ఇవన్నీ తనకి తెలుసు. కానీ, ఇంటికే స్నేహితుల్ని తెచ్చి అలా సిగరెట్టు తాగుతూ, గదంతా పేకముక్కలు పారేస్తూ... ఏమిటిది, ఎందుకు చేస్తున్నాడూ!!
"ఏమిటే... దున్నపోతులా ఆ నిద్ర- పిల్ల ఏడుస్తోంటే వినిపించడంలేదూ?" అంది రాజమ్మని లేపి.
గబుక్కున లోపలకొచ్చి "నెమ్మదిగా మాట్లాడు, బయట పెద్దమనుషులున్నారు!" అన్నాడు మాధవరావు.
ఇది ఇలాగే కొనసాగితే తను భరించలేదు. ఈ పసిదాని లంగ్స్ ఈ పొగతో ఇప్పుడే పాడైపోతే తను చూస్తూ ఊరుకోలేదు. అసలు ఎందుకిలా చేస్తున్నాడూ!
జానకికి ఒక్కసారి గతం కళ్ళముందు నిల్చింది. తనుండే ఎదురింట్లో ఇంజనీరు స్నేహితుడు మాధవరావు. అప్పుడతను చదువైపోయి ఏదైనా ఉద్యోగంలో చేరితే బాగుండునిపిస్తున్న రోజులు! ఇంజనీరు చెల్లెలు రమ, తను స్నేహితులు. తన సవతి తల్లి, తండ్రి రిటైరవటం, తనపైన ఒక అన్న హాండీకాప్ద్ కావడం, తన చెల్లెలు పెళ్ళికి ఎదిగివుండడం- ఇవన్నీ ఇంట్లో ఎప్పుడూ ఏదో అశాంతతని చేకూర్చేవి.
ఆరోజు- "జానకీ... మేమంతా అంటే- మా అన్నయ్య, నేను, మా తమ్ముడు ఫామ్ హౌస్ కి వెడుతున్నాం. నువ్వూ రా!" అంది రమ.
"మీ అన్నయ్యకి ఫామ్ హౌస్ వుందా?" అంది జానకి.
రమ నవ్వి, "మా అన్నయ్యకి కాదు. మా అన్నయ్య ఫ్రెండ్ మాధవరావుకి!" అంటే వెళ్ళాలనిపించింది జానకికి. పైగా... మాధవరావు చాలా స్నేహంగా, సరదాగా మాట్లాడుతాడు. చాలా డబ్బున్నవాడైనా- గర్వం అస్సలు లేదు అంటుంది రమ.
"మాధవరావు చాల అందంగా వుంటాడు... చాలా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తాడు... డబ్బుంటే మాత్రం ఆ డబ్బు హాయిగా అనుభవించే వాళ్ళెంతమందీ..?!" అంది రమ. నిజమే ననిపించింది జానకికి.
ఆ ఫామ్ హౌస్ ఎంతో పెద్దది..!
ఓ వైపు ఎన్నో మైళ్ళ చెట్లు, మరోవైపు కూరగాయలు... వెనకనుంచి పైకి యిల్లు... ఎ.సి. బెడ్ రూము - ఆశ్చర్యంగా చూసింది జానకి అదంతా.
"మరీ ఆశ్చర్యపోకు, మాధవరావుకి వున్న ఆస్తి గురించి వింటే తెలుస్తుంది ఏమిటో! జానకీ...మా అన్నకి స్నేహితుడు కనక మా యింటికొస్తున్నాడు. కానీ,అంత ధనవంతుడు అస్సలు పొగరుగా వుండడు!" అంది రమ.
'నిజమే' అనిపించింది జానకికి.
మాధవరావుకి తండ్రి లేడు. ఒక్క చెల్లెలు అమెరికాలో వుంటోంది. తల్లి జమిందారిణి... పెద్ద భవనం, తోట, పని మనుషులు- పెద్ద అంతస్తు- మాధవరావుతో ఆరోజే ఫామ్ హౌస్ కి వెళ్ళాక, వస్తుంటే రమ అంది-
"చాలా అందంగా వుంటాడుకదూ, పొడుగ్గా అమితాబ్ బచన్ లాగా!"
రమ మాటలు ఎంతో నచ్చాయి జానకికి. తన అభిమాన హీరో అమితాబ్ బచన్....మాధవరావు నిజంగా చాలా అందంగా వున్నాడు. జానకికి ఎందుకో అప్రయత్నంగా సిగ్గొచ్చింది..!
"ఎవరో బంగారు పూలతో పూజ చేస్తూ వుంటుంది ఇతనికోసం!" అంది జానకి.
రమ టక్కున జానకి చేయిపట్టుకుని "ఓమాట చెప్పనా..!" అంది.
"ఆ పూజ అతను చేస్తున్నాడు" అంది.
జానకి గలగలా నవ్వింది.
"జానకి ఈ పిక్ నిక్ ఎందుకో తెలుసా... ఆ విషయం నీకు చెప్పటానికే- మా అన్నయ్య ఇది ఏర్పాటు చేసాడు. ఇదే విషయం మా అన్నయ్య, మాధవరావు ఎన్ని రోజులనుంచో మాట్లాడుకుంటున్నారు. కానీ నీకు చెప్పే ధైర్యం లేక, నా చేత చెప్పిస్తున్నారు"
రమ మాటలు వింటుంటే జానకి నిలువెల్లా వణికినట్టనిపించింది.
ఇంత గొప్ప వ్యక్తి తనని పెళ్ళి చేసుకుంటాడా? పైగా... తన గురించి తెలిసి! అంతేకాదు, తన వాళ్ళు ఒప్పుకోరని తెలిసి... ఇదెలా సాధ్యం? తన సవతి తల్లి పడనిస్తుందా?
తన తండ్రి కులాంతర వివాహానికి ఒప్పుకుంటాడా - ఇదంతా జరగని పని!!
మరి, తను ఒప్పుకుంటుందా!! -జానకి ఏమీ చెప్పకుండా ఎటో చూస్తోంది.
ఇంటి దగ్గర జానకిని దింపి కారు వెళ్ళిపోయింది.
తను ఒకప్పుడు రాజీవ్ ని చేసుకుంటే బాగుండుననుకుంది. కానీ అది కుదరలేదు. అప్పట్లో రాజీవ్ చదువుకుంటున్నాడు.
కాలగమనంలో మాధవరావు తనపై ప్రేమ చూపిస్తున్నాడు- ఇది మంచి అవకాశమా, కాదా?! ఈ పెళ్ళి చేసుకుని తను సుఖంగా వుంటుందా? కులాల అంతరాలు తనని కిందికి నెట్టేయవుకదా! జానకి భయం పోయేట్టుగా ఓరోజు మాధవరావు జానకిని రమ ఇంట్లో కలిసాడు.
"ఒకసారి మాట్లాడచ్చా...." అన్నాడు నవ్వుతూ, అబ్బ.... ఏం నవ్వది! -ఎంత కళ ముఖంలో.
జానకి లేస్తూ "సరే..!" అంది.
"నువ్వు రా!" అన్నాడు రమతో మాధవరావు.
"మీరెళ్ళండి" అంది రమ జానకి చెయ్యి నొక్కి.
భయంభయంగా కార్లో కూచుంది జానకి.
"భయపడకండి, ఓ అరగంటలో మీ ఇంట్లో భద్రంగా దింపుతా!" అన్నాడు.
కారు ఫైవ్ స్టార్ హోటల్ ముందు ఆగింది.
మాధవరావు తన గురించి చెప్పి- "నాకు అందమైన అమ్మాయి నా భార్య కావాలనే కోరిక! ఎంతమందినో కాదన్నాను. ఇంకా మనసులు కలిస్తే కులాలు అడ్డుగా నిలవవని నా భావం."
జానకి గట్టిగా ఊపిరి తీసుకుంది.
"ఇందులో దాపరికాలు, మోసాలూ ఏవీ లేవు - మీకన్నా నేను పదిహేనేళ్ళు పెద్దవాడిని!" అన్నాడు మాధవరావు.
జానకి తలవంచుకునే ఒళ్ళో వున్న నాప్ కిన్ కేసి చూస్తోంది.
"ఇందులో బలవంతం కూడా లేదు - మీకు ఇష్టమయితేనే!" మాధవరావు జానకి కళ్ళలోకి చూసాడు.
"నిర్మొహమాటంగా మీ మనసులో మాట చెప్పొచ్చు. ఇప్పుడే చెప్పక్కర్లేదు. మీకు ఏం చెప్పాలనిపిస్తే అది చెప్పవచ్చు. చిన్నపిల్లని మోసంచేసి పెళ్ళి చేసుకున్నానని నన్ను మీ వాళ్ళు కానీ, నా డబ్బు చూసి నా వెంట పడ్డావని మావాళ్ళు కానీ అనుకోవటం నాకిష్టం వుండదు. ఇద్దరం ఇష్టపడే పెళ్ళి చేసుకోవాలీ- ఇద్దరం ఇష్టంగానే జీవితం పంచుకోవాలి" అన్నాడు గంభీరంగా. మాధవరావు ప్రతిమాటా జానకి గుండెల్లోపల చేరి కూచున్నాయి. ఎంత సంస్కారం, ఎంత సహృదయం!
కారు ఇంటి ముందు ఆగింది. జానకి లోపలకెళ్ళింది.
రమ, ఇంజనీరు అన్నయ్య సహకరించారు స్నేహితుడికి ఆర్య సమాజంలో పెళ్ళి! జానకికి గతం సినిమా రీలులా తిరిగిపోయింది!!
జానకి ఢిల్లీ వెళ్ళిపోయింది భర్తతో ఆరాత్రే!!
జీవితం అంతా ఎంతో ఆనందమయంగా, సుఖంగా గడిచింది.
తన కోరికలన్నీ గౌరవిస్తాడు భర్త. అతని మనసు చాలా మంచిది. తను సంతానవతి కాలేకపోయినందుకు దుఃఖిస్తే ఎన్నో రకాల ఓదార్చాడు. కానీ, పిల్లల్ని పెంచుకోటంలో అతని అభిప్రాయాలు వేరు. అయినా చివరికి తన మాట అంగీకరించాడు. మరి, ఇప్పుడెందుకిలా ప్రవర్తిస్తున్నాడు! ఎక్కడో ఏదో అపశ్రుతి..! - జానకి ఆ సోఫాలో అలానే నిద్రపోయింది....టైమెంతయిందో తెలియదు.
* * *
మసక మసక చీకట్లో వీధిలో ఆగింది ఆటో.
తులసమ్మ కంటికి చెయ్యి అడ్డుపెట్టుకుని చూస్తూ- "ఎవరూ..? అంది.
సుధాకర్ లోపలికొచ్చాడు.
"అమ్మమ్మా... బావున్నావా?" అన్నాడు.
తులసమ్మకి సుధాకర్ పైన చాలా కోపంగా వుంది- భార్యని తీసికెళ్ళనందుకు.
"లీలని తీసికెళ్ళడానికొచ్చావా..?" అంది తొందరగా.
సుధాకర్ ఏమీ అనకుండా లోపలకెళ్ళాడు లీల వుందేమోనని! లీల మధ్యాహ్నమె వెళ్ళింది- ఆశ్రమంలో వున్న రాజ్యలక్ష్మికి గుండె నొప్పి వస్తే ఆమెతోపాటు ఆస్పత్రిలో అక్కడే వుంది. బహుశా రాదు ఈ రాత్రికి..! అయితే, తులసమ్మ ఇదేమీ చెప్పకుండా "నీ గురించి ఏమిటీ... చంద్రయ్య ఏదో చెప్పాడూ!" అంది.
సుధాకర్ ఉలిక్కిపడ్డాడు. "అవును, నేనుండే ఇల్లు గలాయన పెద్ద వ్యాపారి. చాలా బిజినెస్ లున్నాయి. నన్నొకదాన్ని చూసుకోమన్నాడు. తనింట్లోనే వుండిపొమ్మంటాడు. - కానీ, నేనెందుకుంటానూ..!" సుధాకర్ గోడలకేసి చూస్తున్నాడు.
