Previous Page Next Page 
ప్రేమించు ప్రేమకై పేజి 17


    జ్ఞాపకం వచ్చి వంటింటి గుమ్మం కేసి నడిచింది. 'ఓ గ్లాసుతో మంచి నీళ్ళివ్వండి.' అంటూ.
    ఆప్యాయంగా గ్లాసు అందిస్తూ లలితని ఆపాదమస్తకం తిలకించి మెటికలు విరుచుకుని తృప్తిని ప్రకటించింది వంటావిడ.
    బలరాం మాట్లాడకుండా కారులో వెళ్లి కూర్చున్నాడు.
    'నీకారు తెస్తావా?' సరళ లలితని అడిగింది.
    లలిత బలరాం కేసి చూచింది.
    'ఒక్క కారు చాల్లే. ఇంకోటుంటే నీ స్నేహితులందర్నీ ఎక్కించి దింపమంటావు. రా లలితా!' అంటూ తన పక్క సీటు చూపెట్టాడు బలరాం.
    కారు కటువెళ్లి తలుపు తెరిచి కూర్చుంది లలిత.
    సరళకి-- కోపం ముంచు కొచ్చింది. ఎలాగో దిగమింగుకుని వెనక సీటులో అమ్మ పక్కన కూర్చుంది.
    పరుగెట్టు కెళ్లి గేటు తెరపించింది రత్తి.
    కారు 'కీర్తి పతాక' గేటు లోంచి ముందుకు దూసుకుపోయింది.....
    గేటుమూస్తూనే అమ్మాయిగార్ని గురించి చెప్పడం ప్రారంభించింది రత్తి-- రంగయ్య తో.
    తనపక్క శిల్పి చెక్కిన విగ్రహం లాగా కూర్చున్న లలితని చూడకుండా ఉండలేక పోయాడు బలరాం. ఏదో వంకని పక్కకి చూస్తున్న బలరాం ని రెప్ప వాల్చక చూస్తూ కూర్చుంది సరళ. ఏమైంది తనకి? లలిత కేసి కాంతి తో వెల్గిపోతుంది . కొంపతీసి ప్రేమించేస్తున్నాడేమిటి? అన్న ఆలోచన రావడంతో సరళ లో అలజడి ప్రారంభం అయింది. నంగనాచి లాంటి యీ గబ్బిలాయి చాప కింద నీరు లాంటిది సుమా! అని  తనను తనే హెచ్చరించుకుంది- సరళ.
    కారు కంపౌండులోకి మళ్లేసరికి లోపల ఎంత హడావిడిగా  ఉందొ చూచాయిగా తెలిసింది లలితకి. ఏడెనిమిది కార్లు అడ్డదిడ్డాలుగా ఆపేసి ఉన్నాయి. జాగ్రత్తగా చోటు వెతికి పట్టుకుని కారు ఆపాడు బలరాం. తలుపులు తెరచుకొని సరళ ఒక్క పక్క నుంచీ సరస్వతమ్మ గారు ఒక పక్క నుంచి దిగి లోపలికి నడిచారు. లలిత కూడా తలుపు తెరపోయింది. 'అది నా పని లలితా మగవాడున్నప్పుడు అతగాడు  దిగి కారు తలుపులు తెరిచేదాకా ఉరికేయకూడదు ఆడపిల్లలు' అంటూ నవ్వాడు.
    'అలాగా? ఈ రూల్సు నాకు తెలియవు.' అంటూ తలుపు మీద చేయి తీసేసింది లలిత.
    కారుకి చుట్టూ తిరిగి వచ్చి తలుపు తెరచి పట్టుకున్నాడు బలారాం.
    'ఇలాంటి చిన్న చిన్న గౌరవాలు చూపించనివ్వరు. మళ్ళీ మీ ఆడవాళ్ళంటే లెక్క లేదు అని బాధపడతారు' అన్నాడు.
    'బస్సులో పడి ఉద్యోగానికిపోయే అమ్మాయిలకి కూచుందుకు స్థలం దొరికితేనే చాలు అనిపిస్తుంది . ఎవరేనా లేచి చోటిస్తే చాలు ఎంతో హాయి అనిపిస్తుంది. కాని ఇప్పుడలాంటి చిన్న సభ్యతకే కరువై పోయినాప్పుడు ఆడవాళ్ళం అలాంటి షివర్లి కోసం చూడ్డం మానేయడం లో తప్పేం లేదుకా !"
    కారు అద్దాలెత్తిసి తలుపులు లాక్ చేసి వచ్చాడు బలరాం.
    "మీరేడురు చూడ్డం మానేయిబట్టే ఎవరూ అలా కనబర్చడం లేదనుకో కూడదు?" బలరాం రెట్టించాడు.
    "అలా ఎలా అనుకోవడం బలరాం కొన్ని కొన్ని ఎదురు చూడకుండానే లభ్యం అవాలని ఆశిస్తారు ఆడవాళ్ళు.' అంది నవ్వుతూ.
    'అలాగా! నాకనుభవం లేదు లలితా! సరళ అన్నీ డిమాండ్ చేస్తుంది....'
    'అంతా సరళల్లాగే ఉండరు' అంది. సన్నగా మూతి తిప్పుకోవడం బలరాం కళ్ళ పడక పోలేదు.
    'జలస్?' అంటూ నవ్వేశాడు.
    తల పైకెత్తి లలిత కూడా నవ్వేసింది. కాని దీపం పురుగో ఏమో తెరచిన ఆమె కంట్లో పడింది.
    'అబ్బ!' అని కన్ను మూసేసింది లలిత    'సారీ లలితా, ఏమైంది!" అంటూ దగ్గిరగా వచ్చాడు బలరాం.
    "పైకి చూశాను కదూ? కంట్లో ఏదో పడింది.' అంది చేతి రుమాలుతో కన్ను నొక్కుకుంటూ.
    'నోనో అలా చేస్తే ఇంకా మండుతుంది -- ఏదీ నన్ను చూడనీ.' అంటూ బలవంతాన చేయి తీసేసి కన్ని వొప్పి చూశాడు బలరాం.
    'కొంచెం వెనక్కి వంగు కంట్లోకి గట్టిగా ఊడుతాను.' అన్నాడు ఆమె ముఖం కదలకుండా తన రెండు అరిచేతులూ ఆమె చెవుల మీద వేశాడు. కంటి దగ్గరగా తన ముఖం పెట్టి గట్టిగా ఊదాడు. కంటి నీరుతో పాటు ఊదిన స్పీడు కి చిన్న నలుసు పైకి ఒచ్చేసింది. లలిత కన్ను మటుకు ఎర్రగా అయిపొయింది. జేబుల్లోంచి తెల్లని జేబురు మాలు తీసిస్తూ 'ఒత్తుకో' అన్నాడు. అమాయకంగా బలరాం ముఖంలోకి చూస్తుంటే ఓ కన్ను నవ్వింది. ఓ కన్ను కన్నీరు కార్చింది లలితకి.
    'అసహ్యంగా అయిందా ముఖం?' స్త్రీ సహజమైన ధోరణి లో అడిగింది లలిత.
    'నా కళ్ళకి బాగానే ఉంది. వద్దంటే ఏడ్చి వచ్చిన అమ్మాయిలా ఉన్నావులే!' వేళాకోళం చేశాడు.
    'పో బలరాం , నువ్వు రావద్దని ఉంటె హాయిగా ఇంట్లో ఉండి పోదును. నా కసలిలాంటి హడావిళ్ళు నచ్చవు....ప్లీజ్ త్వరగా వెళ్ళిపోదామా?'
    'పది తరవాత కాని పిలిస్తే ఊరుకోనంది సరళ' అంటూ 'లోపలికి వెళ్లి అమ్మమ్మ గారి నడుగు కంటికి వైద్యం చేస్తారు!' అన్నాడు.
    'నువ్వు చేసిన వైద్యం బాగానే పని చేసిందికా.' అంటూ అక్కడికే తిన్నగా వచ్చింది సరళ.
    ఓ క్షణం తత్తర పడ్డా నవ్వేశాడు బలరాం. ' ఓ అప్పుడే ఓ రౌండ్ కొట్టి వచ్చావా?' అంటూ.
    'కారు దిగిన వాళ్ళు ఎంతకీ రాకపోతే చూసి వద్దామని తోచింది.' అంది కొరకొర లలిత కేసి చూస్తూ.
    తమలా సన్నిహితంగా నిలబడి ఉండడం చూసి ఉంటుంది సరళ.
    అసలేం జరిగిందో వదిలేసి ఊహలకి కళ్ళేలు వదిలేసి ఉంటుంది.
    ఆ క్షణం లో సరళ రాకుండా ఉంటె బలరాం ఏమని ఉండేవాడో అనుకుంటూ ముందుకి సాగింది లలిత.
    లోపల అమ్మమ్మ గారు చాలా బిజీగా ఉన్నా అందరితోనూ కబుర్లు చెప్పుతూనే పని చేస్తున్నట్టుంది.
    'మిమ్మల్ని చూస్తె పూర్వం అష్టావధాన శతావధానాలు ఎలా చేసేవారో తెలుస్తుంది.' అంది నవ్వుతూ లలిత.
    'వచ్చావమ్మా! బలరాం నిన్ను మళ్ళీ దాచేశాడనుకుంటున్నాం' అని ఆహ్వానించారు. ' అదేం కన్ను ఎర్రగా ఉంది' అన్నారు.
    'కన్నెర్ర కాదు!' అంటూ తనూ లోపలికి వచ్చాడు బలరాం.
    'తనకెందుకోయి కన్నెర్ర. నీకుండాలి గాని.' అనేసి బలరాం ముఖం కేసి పరిశీలనగా చూశారు అమ్మమ్మగారు.
    'మొన్న చూసిన కంటే చిక్కావెం బలరాం. సరిగా భోజనం చెయ్యడం లేదా? లేక ఏదైనా బెంగా!' లేమనేడ్ గ్లాసు అందిస్తూ సూటిగా అడిగారు.
    నవ్వేసి అక్కడ్నించి వెళ్ళిపోయాడు బలరాం.
    'బలరాం చాలా అశ్రద్ధ మనిషి లలితా. నువ్వీపాటికి గ్రహించే ఉంటావు....అందుకే ఎప్పుడూ ఐ వయస్సు లో ఆడదిక్కు అవసరం వచ్చి తీరుతుందంటాను నేను....అరె పగడాలు వేసుకున్నావే -- బాగున్నాయి కదూ!' అంటూ లలితని వెంట పెట్టుకుని గోడకి అనుకుంటూ ఉన్న సోఫాలో కూర్చున్నారు. ఆమె పక్కగా లలిత కూడా కూర్చుంది.
    'సరస్వతమ్మేది ఇప్పుడే వస్తానని వెళ్ళింది.... లలితా , ఈవాళ ఉదయం వచ్చి అమ్మ నగలలో ఏదైనా తీసిమ్మని అడిగాడు బలరాం. అప్పుడే అనుకున్నాను నీకే అయి ఉంటుందని , నీకెంత కళ నిచ్చాయో తెలుసా యీ పగడాలు!' అన్నారు.
    'చాలా విలువైనవి-- నాకు భయం పోతాయని. అయినా అభిమానంతో పెట్టుకోమంటే కాదనలేక...' అంది ప్రేమతో పగడాలని తాకి చూసుకుంటూ.
    ఆ క్షణం లో లలిత ముఖంలో కన్పించిన ఆర్ధత్రని గమనించక పోలేదావిడ.
    'అంతా ముందు గదిలో ఉన్నారు. నువ్వూ వెళ్లి చూడు' అన్నారు.
    'బలరాం రానీయండి. నాకు వారిలో చాలా మందితో పరిచయం లేదు....'
    'రా నే తీసుకు వెడతాను...' అంటూ లేచారావిడ. అడ్డు చెప్పడానికి కారణం కన్పించక వెనకనే నడిచింది లలిత    తలుపులు వేసి ఉండడం మూలాన్న గోల వినబడలేదు గాని, ఇలా తలుపు తెరవగానే విరుచుకు పడే తరంగాల లాగ వచ్చి పడుతున్నాయి-- కబుర్ల గోల; నవ్వులు -- వాటిని తలదన్నుతూ రికార్డు ప్లేయిరు!
    గుమ్మంలో క్షణం నిలబడి అంతా చూసింది లలిత.
    ఇంద్ర ధనువు లోని రంగులని తలదన్నే ఎన్నో రంగులు కళ్ళు మిరుమిట్లు కోల్పుతున్నాయి. చీర అందరూ ధరించేదయినా ఎన్ని రకాలుగా కట్టారు! అని ఆశ్చర్యపడింది లలిత.
    గుమ్మం లో నిలబడ్డ లలితని చూసి ముందుకొచ్చాడు బలరాం.
    'అమ్మాయిని అందరికీ పరిచయం చేయి బలరాం , నాకక్కడ పని ఉంది' అని లలిత బాధ్యత బలరాం కి అప్పగించారు చుట్టూ కలయ చూశాడు. సరస్వతమ్మ గాని సరళ కాని కన్పిస్తారేమోనని . కన్పించలేదు. 'రా లలితా,' అంటూ ఆహ్వానించాడు బలరాం. అప్పటికే కబుర్లు చెప్పేవాళ్ళు ఆపి లలిత కేసి ఎవరీ కొత్త మనిషి అంటూ చూస్తున్నారు. ఎవరికి తగ్గట్టు వారికి పరిచయాలు చేస్తూ నవ్విస్తూ కలయ తిరిగాడు బలరాం. ఇందరి మధ్య బలరాం ఉన్నంత హుందాగా యింకెవరు లేరనిపించింది లలితకి. ఆమె కళ్ళు అతని వెంటే తిరుగుతున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS