ముందుగా తన మనోగతాలను అతడికి తెలియచెప్పే విధానం తెలుసుకోవాలి. ఆ పద్ధతుల గురించి పలుపలు విధాలుగా ఆలోచిస్తోంది మాలతి.
తాను లోయలోంచి గిరి శిఖరం మీదికి చేరలేక నిస్సహాయంగా నిలిచిపోతే అతడు తిరిగి వచ్చాడు. తనను బాహులతో బంధించి పైకి తీసుకువచ్చాడు.
అంటే తన నిస్సహాయతను గుర్తించినాడనికదా అర్ధం. చమరీ మృగాల చర్మాన్ని వస్త్రాలుగా చుట్టుకున్నాడంటే నిగా అనేది తెలిసింది అనుకోవాలి. ఆహార సంపాదనకై మృగాల్ని వధించేందుకు పదును అయిన రాతి ఆయుధాల్ని తయారుచేశాడు.
అంటే కాళ్ళు, చేతులు కాక తన అవసరాలను తీర్చుకునేందుకు ప్రకృతిలోంచి మరికొన్ని పరికరాలను తయారుచేసుకోవాలనే గ్రహించాడు.
మృగాలు ఆయుధాలను ఉపయోగించలేవు.
కాళ్ళు, చేతులకన్నా ప్రకృతిలోని వస్తువులకు తన మేధస్సుతో పదును పెట్టాడు అతడు. అలా పదును పెట్టబడిన ఆయుధాలు తనకన్నా బలమయిన మృగాల్ని ఎదుర్కొనేందుకు పనికి వస్తాయని గ్రహించాడు.
అంటే యంత్ర సాధనశక్తీ అతనిలో చాలా ప్రాధమికమయిన దశలో ప్రారంభమయిందన్నమాట.
మనిషిలో ఈనాడు సాధించబడిన వికాసం యావత్తూ అతనిలో అత్యంతమయిన ప్రాధమికదశలో ఉంది.
అతడు నాగరికులమధ్యకు తీసుకుపోబడితే అతని పూర్తి మానసిక వికాసం వొస్తుందనే దానికి ఇది నిదర్శనం అతని గురించి యిటువంటి ఆలోచనలు రాగానే మనసులో ఆనందం కెరటంలా లేచింది.
కాని అతనిని ఒప్పించటం ఎలా?
అందుకు ఒకే ఒక్క మార్గముంది.
ఆ విచిత్రమానవుడు తనకోసం తనలాంటి మరొక ప్రాణి తోడుని ఆకాంక్షిస్తున్నాడు తనలాంటి మరోమనిషి తనతోపాటుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా ఉన్నపుడు ఏదో తృప్తిని అనుభవిస్తున్నాడు. బహుశా నేను ఒంటరివాడను కాను అన్న ఆలోచన కలిగించిన తృప్తి అయి ఉంటుంది.
అంటే అతడు సంఘజీవి.
సాంఘిక జీవితమంటే మనిషికి అనివార్యమయిన ఒక ఎలిమెంట్ అది మనిషిని మిగిలిన ప్రాణులకన్నా ఉన్నతుడిని చేసిన ఒక సంస్కార లక్షణం.
అదే అతని బలహీనతకూడా:
మనుషులందరిలోనూ ఉన్నవిధంగానే అతనిలోనూ ఉన్న ఆ బలహీనతని సాధనంగా వాడుకుంటే అతని మనసుని వశీకరించుకుని తానుచెప్పినట్లు వినేలా చేయగలనని భావించింది మాలతి.
అలా సాధించేంతవరకూ తాను చాల సంయమనంతో నేర్పుగా ప్రవర్తించాలి. అతడు అత్యంత బలశాలి. తాను ఎదిరించలేదు అంతేకాదు తన మనోగతాన్ని నేరుగా తీర్చుకోవటం అతడికి ప్రకృతి నేర్పినవిద్య. అందునించి అతనిలో అవాంఛనీయమయిన ప్రకోపాలేవీ రగలకుండా తాను జాగ్రత్తపడాలి. బలశాలి అయిన ఈ మగధీరుడు తనను స్నేహాన్ని అందించగల అమృతమయినా చూడగలిగినంత కాలం తనకు ఎటువంటి ప్రమాదమూలేదు.
అలాకాక తన శారీరకమయిన అవుసరాన్ని తీర్చుకునే సాధనంగా అతనికి అన్పిస్తేమాత్రం చాలా ప్రమాదం. ఈనాడు నాగరిక ప్రపంచంలో డబ్బు హోదా అధికారం ఇవన్నీ కాక శారీరక బలం కూడా ఉన్న మగవాడి పురుషాహంకారానికి ఎందరో ఆడవాళ్ళు బలి అవుతున్నారు. అలాగే తానుకూడా అత్యంత బలశాలి అయిన ఈ పురుషునిదగ్గర ఓటమిని అంగీకరించాల్సి వస్తుంది.
కేవలం అలసట తరువాత నిద్రనించి లేచినట్టు కడుపునింపుకున్న తరువాత ఆకలి తీరినట్టు ఒక తృప్తికరమైన, తాత్కాలికమయిన అతని అవసరాన్ని తనతో తీర్చుకుంటాడు.
కాని తాను??
ఇచ్చాపూర్వకంగా అతన్కు తానుగా లొంగిపోయి, ఏ మగవాడినించి మాతృత్వాన్ని పొందాలని కోరుకుంటుందో ఆడది అతడికే అంకితమవుతుంది. తన బ్రతుకు అంకితమయింది మధుర జ్ఞాపకాలకు.
తన ఆశయాలన్నీ సాధించుకున్న తరువాత అతని అర్ధాంగిగా బ్రతకాలనుకున్న తన ఆకాంక్షలన్నీ దిక్కుమాలిన అడవి కాలి బూడిద అయినట్లు బూడిద అవుతాయి. అందునించి ఎంతో మెళుకువతో అతనితో మైత్రి భావాన్ని మాత్రమే మేలుకొల్పుతూ బ్రవర్తించాలి తాను.
ఆలోచిస్తూ కూర్చుండిపోయిన మాలతి అడుగుల చప్పుడు విని తలఎత్తింది. ప్రిమిటివ్ మాన్ చాల ఆనందంగా వస్తూ కన్పించాడు.
అతడు అనాగరికుడు అసలు ఎన్ని కోట్లు గడించినా ఈనాటి నాగరికుడికి కలగని తృప్తి అతడికి ఆ పూట ఆహారం సంపాదించుకోగలిగితేనే లభిస్తుంది.
అణుశక్తులతో ప్రపంచాన్ని జయించి జగద్వి జేత అయినప్పుడు మనిషికి కలిగే తృప్తి అతనికి కేవలం ఒకపూట కపుడు నింపుకో గలిగితేనే దొరుకుతుంది. అలా జగద్విజేత అంత తృప్తిగా కొన్ని రాయం చల్లాంటి కొంగల్ని పట్టుకుని వచ్చాడు ప్రిమిటివ్ మాన్ తాను సాధించిన విజయాన్ని కన్నులముందుంచాడు. భుజాలుపట్టుకుని కుదిపేసి, చేతులతో ఆమె శిరస్సును గుండెలకు హత్తుకున్నాడు.
7
మాలతి మనసులో అప్పటికి రెండు ఆలోచనలు సిద్దంగా ఉన్నాయి. రాజహంసల్లాంటి కొంగలు ఆకలి తీర్చేందుకు ఎదురుగా ఉన్నాయి.
కాని ఆమె ఆకలిని మర్చిపోయి తన మనసులో చెలరేగిన రెండు ఆలోచనలకు రూపాలను దిద్దుతోంది.
అతడు మైత్రిభావానికి ప్రకృతి సహజంగానే లొంగిపోయి తనలాంటి మరొక ప్రాణికోసం ఆరాటపడతాడు. దాన్ని బలహీనతగా ఉపయోగించుకోవచ్చు. అతడు తన వెంటపడి వచ్చేలా చేయవచ్చు.
రెండవది-అతడు ప్రకృతి సహజమయిన కోరికలతో అత్యంత బలీయమయిన శరీరం కలిగినవాడు కావటంనించి ఎప్పుడయినా తనమీద దాడిచేయవచ్చు.
అలాంటిది జరిగితే తనను కాపాడుకోవటం ఎలా అనే అలాంటి ప్రకోపం అతనిలో రాకుండా చూచుకోవడం. ఎలా? ఈ రెండు ఆలోచనలు ఆమెను సతమతంచేస్తున్నాయి.
