Previous Page Next Page 
అర్ధ మానవుడు పేజి 16


    అలా వెళ్ళకముందు తల్లి తర్ఫీదులో ఉన్న చిన్ని ప్రాణులు తల్లి రక్షణలో ఉంటాయి. తను సహవాసం తాలూకు ఉనికిని గమనించిన విరోధి ప్రాణులు దాడి చేస్తాయని శంకించినప్పుడు దాడి చేసినప్పుడో పిల్లల్ని ఎత్తుకుని అవి మకాం మార్చేస్తాయి.
    అలా మార్చేయడంలో రెండు న్యాయాలున్నాయి. పిల్లితన కాపురం మార్చవలసివచ్చినప్పుడల్లా పిల్లల్ని నోటితో పట్టుకుని పరుగులు తీస్తుంది. అలాంటి సమయంలో కళ్ళు మూసుకుని తమ రక్షణ భారమంతా తల్లిమీద ఒదిలేసి ఊరుకుంటాయి పిల్లలు.
    అది మార్జాల కిశోరన్యాయం.
    అలాగే కోతిపిల్లలు తల్లి కొమ్మలమీదినించి గెంతుతూ పోతూ వుంటే తల్లి పొట్టను అంటిపెట్టుకుని వుంటాయి. తల్లి కోతి కొమ్మమీదినించి కొమ్మమీదికి గెంతులువేస్తుంది. అలాంటి సమయంలో పిల్లకోతులు క్రిందికి జారిపడిపోకుండా తల్లిని అంటి పెట్టుకుని ఉండవలసిన బాధ్యతను తామే వహించాలి.
    తల్లి బాధ్యత రవంతయినా ఉండదు.
    పిల్లకోతి క్రిందపడకుండా తనను తానే కాచుకోవాలి. అలాకాయవలసిన బాధ్యత తల్లిదికాదు. ఒకవేళ పడిపోతే తల్లి కోతిని తప్పుపట్టవలసిన పనిలేదు. అది పిల్ల కోతి పొరపాటే అవుతుంది. అలా తల్లిని అంటిపెట్టుకుని ఉండే బాద్యతను తానే వహించటాన్ని మర్కటకిశోర న్యాయమంటారు. తల్లి బాధ్యత అయితే మార్జాలకిశోర న్యాయం. బాధ్యత పిల్లలది అయితే మర్కటకిశోరన్యాయం.
    కెప్టెన్ మాలతికి యిప్పుడే రెండవదశ సంప్రాప్త మయింది. లోయలోంచి నేరుగా పైకిలేచిపోయి కొండ  శిఖరానికి పాకుతున్న విచిత్ర మానవుడు తన రెండు చేతులూ కాళ్ళు తన పనిలో నిమగ్నం చేశాడు.
    అతడిని అంటపెట్టుకుని ఉండవలసిన బాధ్యత కెప్టెన్ మాలతిదే అయిపోయింది. క్రిందికిచూస్తే కళ్ళు తిరుగుతున్నాయి. పట్టుతప్పి క్రిందపడితే మిగిలేది శరీరంలోంచి చీరుకువచ్చిన మాంసఖండాలు మాత్రమే.
    అందునించి గట్టిగా అతన్ని కావలించుకొని అతడు ప్రదర్శించే జిమ్నాస్టిక్ విసురుల్ని తట్టుకొంటోంది మాలతి అతడు ఎక్కేందుకు మామూలు మనిషికి ఏమాత్రం వీలుకాని కొండ మీదికి చేరిపోయినాడు.
    అక్కడినించి క్రిందికి చూస్తే మాలతి కళ్ళు తిరిగాయి తాము  బయలుదేరిన గుహ ముఖం రెండు వందల మీటర్ల లోతున ఎక్కడో బొమ్మరిల్లులా కన్పిస్తోంది. ఆ దారి వెంట అతడు నేరుగా పైకి ప్రాకి వచ్చాడంటే నమ్మబుద్ధి వేయలేదు.
    మధ్యేమార్గంలో తాను కౌగిలింత పట్టు సడలించి ఉంటే ఏమి జరిగి ఉండేదో తలుచుకుంటే ఒళ్ళు జలదరిస్తోంది. ఒక్క నిముషం తరువాత అతడు తన ఆయాసాన్ని మరచిపోయినాడు. ప్రసన్నమయినా ముఖముద్రతో ఆమె వంకకు చూచాడు.
    మాలతి స్నేహభావంతో చిన్నగా నవ్వింది.
    అక్కడ అంతా పెద్ద మైదానంలా కన్పిస్తోంది. అనేక మయిన వృక్షాలు తమ శాఖల్ని  చాలాదూరంగా విస్తరించి ఉన్నాయి ప్రిమిటివ్ మాన్ ఆ వృక్షాల మధ్యకు దూరిపోయినాడు. కెప్టెన్ మాలతి అక్కడకు తననెందుకు తీసుకువచ్చాడో అర్ధం కాకచూస్తూ ఉండిపోయింది. తనకు ఒంటరితనం చిక్కగానే అతని గురించి దీర్ఘంగా ఆలోచించటం ప్రారంభించింది.
    ఆ విచిత్ర మానవుడు తనకు అపకారం చేసేందుకు తీసుకువచ్చాడన్నది అసత్యం. తన ఒంటరితనాన్నించి బయట పడేందుకు మాత్రమే తీసుకువచ్చాడు.
    అలా తీసుకురావడంతో అతడిని తప్పుపట్టవలసింది ఏమీ కన్పించలేదు. కాని అతనితోపాటు ఇలా ఉండిపోవటం ఎన్నాళ్ళు సాధ్యమవుతుంది?
    అతడినుంచి ప్రమాదం లేదనుకొనేందుకు అయినా వీలు చిక్కని పరిస్థితి. ఆ విచిత్ర మానవుడు ప్రకృతి ఎలా అవుతాడు తన మనసులో కలిగిన ఆలోచనల్ని నేరుగా తీర్చుకునేందుకు ప్రయత్నించే స్వభావం అతనిది.
    ఆకలి అనిపించినప్పుడు ఆహారాన్ని సంపాదించుకోవటం నిద్ర కావాలనిపించినప్పుడు నిద్ర పోవటంలాగే అతడు శారీరకమయిన అవసరాలను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు.
    అతడికి స్నేహం తెలుసు. కాని ప్రేమ తెలియదు. జేవేఇతావసరాలను తీర్చుకోవటం తెలుసు కాని నాగరికత తెలియదు. ఈ దృష్టిలో స్త్రీ పురుష ప్రాణులు కలిసి జీవించటం తెలుసు. అవి శరీరాల్ని పంచుకోవటం తెలుసు పిల్లల్ని కనడం తెలుసు.
    కాని అటువంటి అవుసరమూ, శక్తీ తనకూ వున్నాయని మాత్రం తెలియదు. దేనికోసమో తెలియని ఆరాటాన్ని శరీరం గుర్తుచేస్తుంది. తనకు లేనిదేదో కావాలని ఆకాంక్షించడం తెలుస్తోంది. అయితే తనలాంటి మరొక ప్రాణి అయిన మాలతిని తాకినప్పుడూ కౌగలించుకొని శయ్యమీద ఆదమరచి నిద్రపోయినప్పుడూ ఏదో శాంతి లభించింది. అదే తనకు కావాలని. ఆమె వల్లనే తన ఆరాటం తీర్చుకోగలనని మాత్రం ప్రిమెటివ్ మాన్ గ్రహించలేకపోయినాడు ఒకవేళ అతడే అలా గ్రహించటం జరిగితే మాత్రం అతని నుంచి చాలా ప్రమాదం ఎదురు అవుతుంది.
    అందునించి అక్కడనించి తాను త్వరగా బయటపడాలి. తనతోపాటుగా అతడిని నాగరిక ప్రపంచంలో తీసుకుపోవాలి. ఆకలి, నిద్ర అనేక శారీరక అవసరాలుకాక నాగరిక లోకంలో మరొక జీవితం ఉన్నదని అతడికి తెలియచెప్పాలి.
    కాని తనతోపాటుగా అతడిని తీసుకుపోవటం సాధ్యమేనా? ఎందుకో తెలియదుకాని అతడు తాను చెప్పినట్లువింటాడు. కాని భాష తెలియదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS