7
బామ్మగారు పెరట్లో కూర్చుని దీపారాధన వత్తులు చేసుకుంటూ సౌభాగ్యమ్మ శారదాంబలతో మాట్లాడుతున్నది.
మదన్ గోపాల్ కాసేపు వారపత్రిక తిరగేసి విసుగుపుట్టి పత్రికని పక్కకి విసిరేసి బద్దకంగా వళ్లిరుచుకుంటుంటే రయ్యిన సుడిగాలిలా గదిలోకి వచ్చింది వైజయంతి. వస్తూనే "మీరా చక్రంతో స్నేహం చేయటం మానేయాలి" అంది.
"చక్రమా? నేనేమీ చక్రాలతోను చైన్లతోను స్నేహం చేయనే" అంటూ ఆశ్చర్యపోయాడు.
"మీ ఇంటికి రాడూ, మీ స్నేహితుడు చక్రమో చక్కిలమో అతను."
"ఓహో! మా చక్కినాధం సంగతా?" అని మరోసారి ఆశ్చర్యపోయి వాడేం చేశాడు, "నేనేం చేశాను" అన్నాడు మదన్ గోపాల్.
"అతను మంచివాడు కాదు."
"నాకలా ఎప్పుడూ అనిపించలేదే?"
"మీకు కనిపించకపోతే సరా! నాక్కనిపించింది."
"మీకనిపించింది కదా అని మేం స్నేహం మానేయాలా? భలే బాగుందండోయ్, మీరు చెప్పేది ఎలా వుందంటే మీ యింట్లో అద్దెకున్నందుకు మీరు చెప్పింది తూ.చ. తప్పకుండా చేయాలన్నట్లువుంది. సఫోజ్ రేపు నా అందమైన క్రాపు మీకు నచ్చదనుకోండి. వెంటనే క్రాపు తొలగించి గుండు పిలక ఉంచుకోండి. పంగనామాలు బాగుంటాయి పెట్టుకోండి అనేటట్లున్నారు."
"నేనేం అంత పిచ్చిగ ప్రవర్తించను."
"ఇప్పటిదాకా నేనూ అలాగే అనుకున్నాలేండి."
"ఆ....!" అప్పుడే ఈనిన పులిలా గుర్రుమంది వైజయంతి.
వైజయంతి ముఖంలోకి చూసే ధైర్యంలేక మళ్ళీ నాకు పత్రిక అందుకుని దాంట్లో ముఖం దాచేసుకున్నాడు మదన్ గోపాల్. "శ్రీ ఆంజనేయా! ప్రసన్నాంజనేయా! ఈ శంకిణి ఈ లంకిణి నాతో యుద్దానికొచ్చింది. ఈమె దాటినుండి నన్నెలా రక్షిస్తావో ఏమో" అంటూ లోలోపల గొణుక్కున్నాడు.
"ఇంతవరకు ఏమూలో మీరు మంచివారనే అభిప్రాయంవుంది."
"నిజంగానా అండీ?" కుర్చీలో ఓసారి ఎగిరిపడి ముఖమంతా సంతోషం ఆవరించగా అడిగాడు మదన్ గోపాల్. ఎదురుగా అభయహస్తంతో ఆంజనేయస్వామి! కనపడి మాయమయ్యాడు. "మీకు టెంకాయలు కొడతారు స్వామీ!" అనేశాడు గబుక్కున.
"నాకు టెంకాయలు కొడతారా? ఏమిటి మీ ఉద్దేశ్యం!"
"మీకు కాదండి."
"మరెవరికీ? ఎందుకు నాతో చెప్పారు. ఎందుకు నాతో అన్నారు?"
"మీతో కాదండి. దేముడితో దేముడితో..."
"ఎదురుగానే వుంటే దేముడితో మాట్లాడుతున్నారా? మీరు మీరూ తర్వాత మాట్లాడుకోండి. ముందు నా విషయం చూడండి. ఆ... ఏమిటన్నారు. దేముడితో మాట్లాడారా? బాగుంది. దేముడొచ్చి మీతో మాట్లాడాడా? ఏం విచిత్రం? ఎంత వింత. నన్ను పిచ్చిదాన్నిచేసి యిష్టమొచ్చినట్లు వాగుతున్నారా?"
"కాదండి. మీరు అపార్ధం చేసుకుంటున్నారు."
"అపార్ధమేంలేదు బాగానే అర్ధం చేసుకున్నాను. ఇందాకేమో పిచ్చిదాన్నన్నట్లు మాట్లాడారు. ఇప్పుడేమో దేముడితో మాట్లాడానంటున్నారు. కృష్ణుడికి ద్రౌపది ఏమవుతుందో తెలియని మీరు దేముడుతో మాట్లాడటంకూడానా? మీ పైత్యం యిలా వుంది. మీ చక్రం సంగతి చూద్దామా అంటే నన్ను చూడంగానే ఈలవేయటం, ఇకిలించటం, కన్ను...ఛీ....ఛీ....అన్ని రౌడీ చేష్టలే. అసలా రౌడీ మీ కెలా స్నేహం అయ్యాడు! అయ్యాడే అనుకోండి బుద్దిలేకుండా నా జోలికి రావటమా? ఎంత ధైర్యం. ఎంత కండకావరం. ఎంత..."
"ఉండండుండండి. మా చక్రవర్తి మిమ్మల్ని చూసి!"
"ఊ.... నన్ను చూసే."
"నే నమ్మను రుజూ ఏమిటంట?"
