"అదేమిటి?" అన్నదామె నివ్వెరపోయి. వెంటనే తేరుకుని విచారంగా నవ్వేసి, నాకు రెండోపేరు కూడా పెట్టేశారే అప్పుడే?
అప్పటి ఆ రూపం మరచిపోలేడు. ఏదో చిత్రమైన యోచన మెరిసింది మనసులో హృదయసీమ కొంచెం పగులుచూపింది. లిప్తలో తేరుకున్నాడు. సంతోషానికి పగ్గాలు లేకుండా పోయినై. "నువ్వు సరోజినివే. అది రెండో పేరు ఎలా అవుతుంది?" అనుకున్నాడు.
"ఎందుకు ఆపారో చెప్పండి?" అంటోంది ఆమె.
అతనింకా కలలోనే వున్నాడు. బదులు పలకలా.
ఆమె "సరేలెండి మిమ్మల్ని యిక కలుసుకోలేమోనన్న మాట ఏనాటికైనా అబద్దమైతే అప్పుడు చెబుదురుగాని లెండి" అంటూ చరచర వెళ్ళిపోయింది.
విభ్రాంతితో మ్రాన్పడి వెనక్కి నీరసంగా వాలిపోయాడు. శరీరమంతా విద్యుత్ తగిలినట్లు చురుక్ చురుక్ మంటోంది. పసితనాన పాలుగారే చేతిమీద వృశ్చికం ఒకటి ప్రేమతో ముమ్మారు ముద్దు పెట్టుకున్నప్పుడూ యింత బాధ అనుభవించి వుండలేదు.
"బావా" అంది సరోజిని కంఠం కొంచెం వెనగ్గా, తటపటాయిస్తూ.
తలత్రిప్పి జాలిగా చూశాడు.
"అలా వున్నావేం?"
అతను దీనంగా "ఏం చెప్పను సరోజినీ! ఏ వ్యవహారంలోనూ లోతుల్లోకి పోకూడదని ఎప్పుడూ అనుకుంటూ వుంటాను. మళ్ళీ అదే చేయవలసివస్తోంది.
ఆమె నిట్టూర్చి "నీకూ వున్నాయన్నమాట వ్యవహారాలు?" అంది.
"సరోజినీ!"
"ఎవరామె?"
"నీలాంటి ఆమె."
"చాలా అన్యోన్యంగా మాట్లాడావేమో నేను అలాంటిదాన్ని కానే?" పడగ విప్పిన నాగులా తల ఎత్తి ఓ తీక్షణ కటాక్షం విసిరింది.
"ఛీ! ఏమిటా మాటలు?"
"అంతకన్నా ఎలా బాగా మాట్లాడను నీతో?"
"నోర్ముయ్" అని అరిచి కోపంలో ఆమెవంకయినా చూడకుండా గబగబా మెట్లుఎక్కి మంచంమీద వాలిపోయాడు. దారుణం జరుగుతోందే ఎంత తేలిగ్గా మాట్లాడింది? అంతే వీళ్ళు అంతలో మమకారం, అంతలో వికారం.
అలా ఎక్కువ నిముషాలు దొర్లిపోకముందే గదిబయట అడుగుల చప్పుడు వినిపించింది. తల ఎత్తలేదు. కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
"బావా" అంది సరోజిని జాలిగా.
అతను పలకలేదు.
"నిన్నే!"
అతనికి తెలుసు - ఆ విషయం.
మరింత దగ్గరకు వచ్చినట్లు అలికిడి "పలకవా?"
ఎలా పలుకుతాడు?
"కోపం వచ్చిందా?"
అబ్బే! కోపం రాలేదు.
కొంచెం ఆగి నిష్టూరంగా యిలా అంది "అయితే ఏమన్నాననికోపం?"
అబ్బ! నంగనాచి.
"పోనీ తప్పే అయిందనుకో అంతలో యింతకోపం రావాలేం?"
ఆ విషయం కోపానికి తెలుసా?
"నాతో మాట్లాడకూడదా?"
అతను ఉలకలేదు, పలకలేదు.
"అంత కష్టంగా వుంటే వెళ్ళిపోతాను. నీకు యిష్టంలేనప్పుడు నేనెందుకు యిక్కడ? పోతానులే."
మనస్సును అరికట్టుకుంటూ ఊపిరి బిగబట్టి నిలద్రొక్కుకున్నాడు.
"సరే! ఇదే ఆఖరిచూపు."
అమూల్య వస్తువేదో పోగొట్టుకుంటున్నాననిపించింది. కొన్ని సంవత్సరాల ఘోరతపస్సు ఎందుకూ పనికిరాకుండా పోతున్నట్లు ఆరాటం. చప్పున కళ్ళు తెరచి, చెయ్యి చాచాడు. అది చాలా సున్నితంగా వెళ్ళి ఓ మృదుహస్తాన్ని తాకింది. ఆశగా పట్టుకున్నాడు "వదల్లేను" అన్నాడు గాద్గదికంగా.
సరోజిని నిరుత్తరురాలై అతనివంక చూస్తూ, నెమ్మదిగా తేరుకుని చిన్నారి స్వరంతో "అదేమిటీ? అంతలో ఏడవాలా? నేను వెళ్ళిపోతున్నానని" అని తన పమిటచెంగుతో వాటిని తుడిచింది.
"వెళ్ళనులే" అంది.
అతనేం మాట్లాడలేదు. ఆమె హస్తాన్ని వదల్లేక అలాగే గుండెమీద పెట్టుకుని ఊపిరి బరువుగా విడుస్తూ ఊరుకున్నాడు. ఇద్దరి హృదయాలూ ఆర్ద్రమైనట్లు వున్నాయి. ఎందుకో గట్టిగా ఏడిచేద్దామని వుంది.
"నీ కోపం ఇప్పటినుంచే చూపిస్తే ఎట్లా?" అంది సరోజిని కొంచెం ఆర్తితో.
"దీన్ని కోపం అనరు. అలుక అంటారు. ఇప్పుడదేమీ లేదుగా చూశావా? నీముందు నేను ఈ చిన్న రహస్యంకూడా దాచలేకుండా వున్నాను. నువ్వు నవ్వుతావని సిగ్గయినా లేకపోయింది. మరి నీ విషయం చెప్పు?"
"ఏముంది చెప్పడానికి? మరి నన్ను ఆమెతో ఎందుకు పోల్చావూ?"
అతను మరింత కరిగిపోయి విస్మయంగా "అదేమిటీ, నువ్వట్లా అనుకున్నావా? ఒకసారి నీకో విషయం చెప్పాను, గుర్తుందా? నీలాంటి అమ్మాయినే చూశానని. ఆమే ఈమె" అని ఆమె ముఖంలో ఎటువంటి భావతరంగాలు కదులుతాయో అని చూస్తున్నాడు.
ఆమె నేత్రాలు చకచక తరళితమైనాయి. అతనికి ఏదో స్ఫురించింది. ఆమె ఏదో అనబోయింది. కానీ గులాబీ పెదాలుదాటి ఎటువంటి పదజాలమూ బయటకు వెలువడలా ఏదో కంపన, వణుకు తీవ్రత ప్రస్ఫుటంగా గోచరించింది.
దీనంగా ఇలా అన్నాడు "నీ సందేహమూ అర్ధమయింది. ఆమె ఎవరైందీ నీకంటే ఎక్కువ నాకూ తెలీదు. మా పరిచయం చాలా విచిత్రమైనది. నమ్మవా?"
కొంచెం తల అటుత్రిప్పి "నమ్మానులే" అంది.
ఈమాట చాలా కష్టంమీద ఉచ్చరించినట్లు అతనికి తోచి, "నీకు ఆ విషయంలో ఇంతకంటే వివరంగా చెప్పగలిగే శక్తి నాకులేదు. కానీ యీ సమయంలో ఎందుచేతనో యిది మహాత్క్రుష్టమైన సమయమని నాకుతోస్తోంది. నీతో అబద్దం చెప్పలేను. నాలో-దాన్ని హృదయ క్షేత్రమని పిలుస్తాను. ఒకే ఒక వ్యక్తి సమ్మోహితరూపం స్థిరనివాసం ఏర్పరచుకుంది. దాన్ని అక్కడినుంచి కదల్చగలిగే శక్తి పృధ్విలో ఎవరికీ లేదు. ఈ మాట గుర్తుంచుకో" అని కారు చీకటిలో కాంతికిరణం రెప్పపాటున ఆవిర్భవించి, ధనుర్విముక్త విశఖంవలె సాటిలేని వేగంతో, విశ్వమంతా మహా వెలుగుతో నింపివేస్తున్నట్లు అనుభూతి పొంది తన్మయుడై అలా కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
"బావా..." అన్న సరోజిని కంపితస్వరం అత్యంత మనోహరంగా వినవచ్చింది. ఏదో మగత.
"బావా.." ఈసారి ఓ నూతన గొంతు అదిరిపడి చిన్నగా కళ్ళు విప్పాడు. అది సరోజినిదే. తన ముఖంమీదకు పూర్తిగా వొంగి విశాల కుంతలంలో అతని మస్తిష్కాన్ని పూర్తిగా ప్రచ్చాదితం చేస్తూ, వేడి నిట్టూర్పులతో అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ, మరులు కలిగించి, వికసించిన విరిలావున్న ఆమె ఎర్రని విశృంఖల స్వేచ్చాజీవికలైన పెదవులు అతన్ని చుంబించివేశాయి. చైతన్యానికి అది అంత్యదశ.
5
ఇద్దరిలో ఎవరూ పలకలేదు స్మారకం లేనివాడిమాదిరిగా అతను స్తబ్దుగా పడివున్నాడు.
ఇంతలో బయట అడుగులచప్పుడు విన్పించసాగింది...ఓ కొరడాదెబ్బ వీపుమీద భళ్లుమంది. వెనువెంటనే మతిపోయినవాడిలా చేష్టలుడిగి ప్రక్కకు వాలిపోయాడు. కానీ అది కొద్దిసెకన్లే లేచి చుట్టూ చూసేసరికి సరోజిని అదోముఖియై నిలబడి వుంది. సిగ్గుతో చచ్చిపోయాడు. ఒక్క ఉదుటున యివతలికి వచ్చిపడ్డాడు.
ఎదురుగా పిన్ని-ఆమె పాతికేళ్ళ సుందరాంగి.
"శివుడు యింట్లో వున్నాడా?" అంటూ తండ్రి మెట్లు ఎక్కిపైకి వస్తున్నాడు.
అతను తలవంచుకుని అక్కడినుంచి తప్పుకోచూశాడు. కానీ సావిత్రి అతని వంక నిశితంగా చూసి, "అలా వున్నావేం? జ్వరమేమైనా వస్తోందా?" అని ప్రశ్నించింది.
"ఇవాళ కొంచెం వచ్చింది."
మాధవరావుగారు ఆమూలాగ్రం కొడుకుని పరిశీలించి "వీడు చాలా చిక్కినట్లున్నాడు సావిత్రీ" అన్నాడు.
