Previous Page Next Page 
జీవన వలయం పేజి 16


    రాత్రి ఒంటిగంట అవుతూంది. వీథులు నిర్మానుష్యంగా ఉన్నా అక్కడొకటీ అక్కడొకటీ కుక్కలు మొరుగుతున్న శబ్దం మాత్రం వినిపిస్తూంది. అప్పుడే భయంకరమైన కలకు భయపడి కెవ్వున అరిచింది లత. వెంటనే మధు, రాజా, గీత లైట్లు వేసి పరుగెత్తారు లత దగ్గరకు. లత భయపడుతూ కూర్చుని ఉంది.
    "అదేమిటమ్మా, అంత కేకపెట్టావు?" పక్కన కూర్చుంటూ అన్నాడు రాజా.    
    "కల ... వచ్చిం దన్నయ్యా!" భయపడుతూ చెప్పింది లత.
    "కలే గద! ఫర్వాలేదులే. నేను దడిసిపోయాను" అంటూ తాను మరొక ప్రక్క కూర్చొంది గీత.
    ఇంతలో కాలింగ్ బెల్ మోగటంతో మధు వెళ్ళి బిక్కమొహంతో తిరిగి వచ్చాడు.
    "ఎవరు, మధూ?" రాజా అడిగాడు.
    "నజ్ మా చనిపోయిందట." చెప్పలేక చెప్పాడు.
    అందరూ ఒక్కసారి ఉలిక్కిపడ్డారు.
    తర్వాత గీత నెమ్మదిగా "సాయంత్రం వరకు బాగానే ఉందిగా" అంది.
    "ఇప్పుడే అకస్మాత్తుగా పోయిందట."
    చిత్రమైన సృష్టిలో మరణం అనేది మరొక విచిత్రం. మరణించినవారికోసం మరణించబోయే వారు ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉంటారు. యుగాల నుండి ఇది ఇలాగే సాగుతూంది. ఏదో ఒక నాడు మరణించే మానవుడు మమతలు పెంచుకోవడం, మనిషి మరణించిన తర్వాత కాలం దాన్ని మరుగునపరచడం జరుగుతూనే ఉంది. రాజా వాళ్ళూ వచ్చేటప్పటికి నజ్ మా శవం మంచంపై ఉంది. నజ్ మా నిద్రిస్తున్నట్లే ఉంది కాని మరణించినట్లు లేదు. అంతవరకు ఇద్దరు స్నేహితులతో అక్కడ పిచ్చివానిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్న భాషా రెండు భుజాలపై రెండు చల్లని చేతులు పడేసరికి అతనికి తెలియకుండానే దుఃఖం కట్టలు తెంచుకుంది. గీత చేతుల్లో ముఖం దాచుకుంది. లత నజ్ మా దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా కెంపులను ధిక్కరిస్తున్న ఆమె మనసుపైన చెక్కిళ్ళను సవరిస్తూ "నీ కోరికే నెరవేర్చుకున్నావా? ఇలా ఎందుకు జరిగింది, నజ్ మా? ఎందుకు జరిగింది?" అంటూ ఆమె మంచానికి ముఖం చేర్చి నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తూంది.
    మధు, రాజా కలిసి బాషాను మామూలు స్థితిలోకి తీసుకురావడానికి చాలా కాలం పట్టింది.
    "ఇప్పుడు చెప్పు, భాషా, సాయంత్రం వరకు బాగానే ఉంది కదా? తర్వాత ఏమైంది?" అనునయంగా అడిగాడు రాజా.
    "భోజనాలైన తర్వాత నజ్ మా ఏదో ఆలోచిస్తూ కిటికీలోనుండి బయటకు చూస్తూంది. రెండుసార్లు పిలిచినా పలకలేదు. రెండు రోజుల నుండి చాలా పరధ్యన్మ్గా ఉంటోంది. ఆమెకు కాస్త హుషారుగా ఉంటుందని, ఉల్లాసంగా ఉంటుందని డ్రామాకు రమ్మని అడిగాను. ప్రొద్దుట ఒక స్నేహితుడు రెండు టిక్కెట్లు కొన్నానని, తనకు వెళ్ళటం పడదనీ నా కిచ్చాడు. ఆ సంగతి చెప్పి నజ్ మాను తీసుకెళ్ళాలని ప్రయత్నించాను. ఆమె రాకుండా ఎన్నో అడ్డంకులు చెప్పింది. అయినా నేను వినలేదు. ఇంచుమించు బలవంతంగానే ఆమెను నేను టాక్సీ ఎక్కించాను. నా ఆలోచన, ఆశ ఒక్కటే, రాజా నజ్ మాకు కొంచెం మనశ్శాంతి కలిగి నాటకం నుండి నవ్వుతూ తిరిగి వస్తుందని ఆశించాను. కాని జరిగింది మరొకటి." బాషాకు దుఃఖం ఆగలేదు.
    "ఏ నాటకం?" మధు అడిగాడు.
    'పగిలిన హృదయాలు' ఉలిక్కిపడ్డారు తక్కిన వారు. "ఎంతపని చేశావ్, భాషా!" రాజా అన్నాడు. ఇంతకీ చిత్రమేమిటంటే ఏ 'పగిలిన హృదయాలు' ఆమెను దహించివేస్తూందో ఆ 'పగిలిన హృదయాలు' గురించి బాషాకు కొంచెం కూడా తెలియదు. పత్రికలు చదవటం గాని, వాటి విషయాలు చర్చించటం గాని బాషాకు అలవాటు లేని వాటిలో ఒకటి. అందువల్ల అన్నా చెల్లెళ్ళ మధ్య దాని ప్రస్తావన ఎన్నడూ రాలేదు. ఆ రోజు, ఆ సీరియల్ ముగిసిపోయిన రోజు నజ్ మా తెలివి తప్పిపోయింది. కాని ఈనాడు ఆ 'పగిలిన హృదయాలు నాటకం చూసిన న మా హృదయం నాటకం హాలులోనే పగిలిపోయింది. వివరంగా విషయం తెలుసుకున్న బాషా "నా చెల్లిని నా చేతులారా నేనే చంపాను" అని విపరీతమైన హృదయావేదన ననుభవించాడు.
    మరునాటికి రావలసిన బంధువులంతా వచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. మధు ముందు వరండాలో గోడ పక్కగా నిలబడి జరిగే తతంగం చూస్తున్నాడు. అతని పక్కగా వచ్చి నిలబడిన గీత "అక్కడ గుంట తీస్తున్నా రెందుకూ?" అని అడిగింది. "స్నానం చేయిస్తారు!"
    "అయితే గుంట ఎందుకు?" ఆశ్చర్యం ప్రకటించింది.
    "శవానికి స్నానం చేయించిన నీరు అందులోకే వెళ్ళాలి. ఇది వారి పద్ధతి. పైగా, మనలాగ చన్నీటి స్నానం కాదు. వేడినీటితో స్నానం చేయిస్తారు. మీరు చూస్తారుగా." విచారంతో ముఖాలు వాడిపోయి, దుఃఖభారంతో కళ్ళు వాలిపోతున్నా వారిద్దరూ ఒక విధమైన ఆసక్తితో పూర్తిగా భిన్నమతమైన మహమ్మదీయ సంప్రదాయాన్ని, వారి ఆచారాన్ని చూస్తూ నిలుచున్నారు అందరికీ కొంచెం దూరంలో.
    పాల నురుగులాంటి తెల్లని కొత్త వస్త్రం కప్పి, నజ్ మాకు స్నానం చేయిస్తున్నారు. కుంకుడు రసంతో శరీరమంతా ఇద్దరు స్త్రీలు తోముతుంటే ఇద్దరు వృద్ధులు మంత్రాలు చదువుతున్నారు. పరిశుభ్రంగా, అతిశుభ్రంగా చెవులలోను, ముక్కులోను తోమి, చివరకు గోరులో ఉన్న మట్టిని కూడా తీసి శుభ్రపరుస్తున్న ఆ శుచికి ఎంతో ముచ్చటపడ్డాడు మధు. స్నానం పూర్తి అయిన తర్వాత తలమీద ఒక చేయి, పొట్టపై ఒక చేయి వేసి వత్తి బాహ్య శరీర శుభ్రతనే కాక అంతర్గతంగా శరీరంలోని మలినాన్ని బయటకు పంపు తున్నప్పుడు గీత చాలా ఆశ్చర్య పడింది. ప్రతి అవయవం, నవ ద్వారాలు పరిశుభ్రంచేసిన వస్త్రాలను స్నానం చేయించి నీరు నింపిన గుంటలో వేసి పూడ్చివేశారు. అటు తర్వాత పాలమీగడలాంటి తెల్లని కొత్త వస్త్రాన్ని కొత్త చాపపై పరిచారు. పదునెనిమిది గజాల కొలత గల ఆ గుడ్డను ఒక పొర పరిచి దానిపై సుగంధ సౌరభాలు వెదజల్లే చందనం, ఇతర సుగంధ ద్రవ్యాల పొడిని చల్లి, నజ్ మాకు సెంటు, పన్నీరు జల్లుతుంటే వరండా అంతా సువాసనలతో గుబాళించింది. మరొక పక్క ఉప్పు, గోధుమ పిండి, బెల్లం, నెయ్యి, డబ్బులు మొదలైనవి ఫకీర్లకు పంచుతున్నారు. ధవళకాంతు లీనుతున్న ఆ తెల్లవస్త్రాన్ని నజ్ మా పాదాల వద్దనుండి శిరస్సు వరకూ కప్పుతూంటే అందమైన ఆ చేతులు, గులాబి రేకుల్లాంటి ఆ పెదవులు చిరునవ్వుతో చిందులాడుతూ మరింత అందంగా కనిపిన్న ఆ సుప్తముఖం మరింక కనిపించవు గదా అని ఖేదపడ్డా రందరూ. భాషాను పట్టలేక పోయారు. అయినా జరగవలసింది జరిగిపోయింది. లత అంతర్గతంగా ఎంత దుఃఖిస్తున్నదో ఆమె ముఖమే చెబుతూంది.
    "ఇంతకీ ఆ కథే మా నజ్ మా ప్రాణం తీసింది. లేకపోతే ఇంకా కొన్ని రోజులు బ్రతికేది." నజ్ మా పిన్ని కళ్ళు తుడుచుకుంటూ అంది.
    "ఇదివరకు నవలలు, సినిమాలు మనుష్యులను పాడుచేస్తాయి అనుకొనే వాళ్ళం. కాని ఇప్పటి కథలు ప్రాణాలే తీస్తున్నాయి."
    "ఒక వ్యక్తి జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్లు వ్రాసే స్వాతంత్ర్యం ఆమె కెక్కడిది?"
    ఇలా తలా ఒక రీతిగా ఇంటికి వచ్చిన బంధువు అంతా అనుకొంటూండగా ఇంటికి బయలుదేరారు లతా, మధు.

                                *    *    *

    లత ద్వారా సంగతి విన్న రమాకాంత్ కొంచెంసేపు ఏమీ మాట్లాడలేక పోయాడు. ఆ తర్వాత "సునీతకు ఈ నవలతో మంచి పేరైతే వచ్చింది కాని చాలా ఇండ్లలో ఆ నవల గురించి వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి" అన్నాడు.
    అర్ధం కానట్లు చూసింది లత.
    "మా ఆఫీసు హెడ్ క్లర్క్ భార్య కొంచెం గడుసు. 'పగిలిన హృదయాలు' లో రమ లాగ భర్తను సాధిస్తూనే ఉంటుందట. మా హెడ్ క్లర్కు కుటుంబానికి సునీత వాళ్ళతో కొంచెం పరిచయముంది. ఇక ఈ నవల మొదలు పెట్టినప్పటినుండి భార్య తన భర్తే ఆమెకు చెప్పి వ్రాయించాడని మరికొంచెం ఎక్కువ మోతాదులో సాధిస్తూందట. అతని కేమీ తెలియదన్నా ఆమె నమ్మదు. చూశావా, ఒక్కొక్క రచన ఒక్కొక్క సంసారంలో ఏ విధంగా కలత పుట్టిస్తుందో?"
    లత జవాబెమీ చెప్పలేదు. ఆమె ఏదో ఆలోచిస్తూంది.
    ఆ సమయానికి మేడపైన మధు కూడా ఏదో ఆలోచనలో ఉన్నాడు. హాలులో చేతులు వెనక్కు కట్టుకొని పచార్లు చేస్తున్నాడు మధు అరగంటనుండి. అతని బల్లపై నజ్ మా పెళ్ళి ఫోటో ఉంది. దగ్గరగా వచ్చి ఆ ఫోటో చేతిలోకి తీసుకోని చూశాడు. సందేహం లేదు. తను చూసిన ప్రభాకర్, ఇతడూ ఒకడే. మరి కొంచెం సేపు అలాగే చూసి ఆ ఫోటో డ్రాయర్లో పెట్టి కాగితాల కట్ట చేతిలోకి తీసుకొని బాణంలా బయటకు దూసుకుపోయాడు.
    మధు వెళ్ళేటప్పటికి సునీత ఖాళీగా కూర్చుని రేడియో వింటూంది. ఎండలో అంత హఠాత్తుగా వచ్చిన మధును చూసి మొదట ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందంగా నవ్వింది.
    "ఓ. మీరు ఖాళీగానే ఉన్నారు గదా? ఇదుగో, నా కథ తెచ్చాను. ఇప్పుడు చదువుతారా? మళ్ళీ రెండు రోజుల్లో పత్రికకు పంపుతాను" అంటూ అందించాడు.
    అందుకొంటూనే చదవటం మొదలుపెట్టింది సునీత. మధు కుర్చీలో వెనక్కు వాలి పక్కనున్న పుస్తకం తిరగవేస్తూ మద్య మధ్య కండ్ల కొసలనుండి సునీతను గమనిస్తున్నాడు....
    "డాబా మీద పిట్టగోడ కాసుకొని కాళ్ళు జాపుకొని కూర్చొని దీక్షగా చదువుకొంటున్న సీత ఒక్కసారిగా దోసెడు పొగడపూలు తన పాదాల మీద పడటంతో ఉలిక్కిపడి తల ఎత్తింది. ఎదురుగా ఫుల్ సూట్ లో ఠీవిగా నిలబడిన కృష్ణ కొంటెగా చూస్తున్నాడు. సీత కొంచెం తత్తరపాటుతో "ఇదేం పని!" అంది పొగడపూలు ఏరుతూ.
    "నా ప్రణయ దేవతకు పాదపూజ" అంటూ ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె కళ్ళతోనే నవ్వింది.
    "సీతా నీకు పొగడపూలు చిన్నప్పుడు ఎంతో ఇష్టం కదూ," పూలను ధారగా ఆమె ఒడిలో పోస్తూ అడిగాడు.
    "ఇప్పటికీ ఇష్టమే."
    "అందుకే తెచ్చాను. మనిషిని మారినా నీ ఇష్టం మారలేదని తెలుసు."
    ".........."
    "ఏమీ మాట్లాడవే?" మరింత దగ్గరగా జరుగుతూ అడిగాడు. ఆమె ఇంకొంచెం దూరం జరిగింది.
    "ఏం మాట్లాడను!"
    "పోనీ, నీకేం తెచ్చావో చెప్పుకో."
    "మీరే చెప్పండి." నవ్వుతూ అంది.
    "ఓ.... ఇదెప్పటి నుండి! మీరు అంటున్నావే."
    "మరి పెద్దవారయ్యారుగా? పైగా, కాబోయే డాక్టర్ కదా!"
    "ఓహో! డాక్టరై నా, కలెక్టరైనా వీడు నీ కృష్ణే సుమా!" ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని తాను తెచ్చిన పాకెట్ లోని గాజులు వేశాడు.
    "ఓహ్! ముత్యాల గాజులు!" ఆనందంగా ఆశ్చర్యంతో చూస్తూ అంది సీత.
    "అవును. ఈ రోజు ఈ ముత్యాల గాజులే ఇవ్వగలిగాను. కాని తర్వాత ..."
    "ఊఁ .... తర్వాత?"
    "తర్వాత రవ్వల గాజులు, కెంపుల గాజులు .... ఒకటేమిటి? నీకు సర్వాలంకారాలు చేసి నిన్ను పూజిస్తూ నేను కూర్చుంటాను. సరా?"
    కొంచెం ఆగి "సీతా!" అన్నాడు మృదువుగా.
    ఆమె కనురెప్ప లెత్తి అతనిని చూసింది [ప్రేమగా.
    "అబ్బ! నీ వలా చూస్తే నేనేమై పోతానో నాకే తెలియదు. నీ కళ్ళలో కనిపించే ఆ శక్తే నన్ను నీ బందీగా చేసింది." అంతవరకు చదివిన సునీత ఒక్క క్షణం ఏదో జ్ఞాపకం వచ్చినట్లు ఆగింది. తర్వాత ఒక నిట్టూర్పు విడిచి మొదలుపెట్టింది.
    "పోయినసారి నేను వచ్చినప్పుడు నీ వేమన్నావో గుర్తుందా? కృష్ణా, నా శరీరాన్నంతా ముత్యాలతో అలకరించుకొని చూసుకోవాలని ఉంది అన్నావు. నీకు ముత్యాలంటే అంత ఇష్టమని నాకు అప్పటి వరకూ తెలియదు. అందుకే ఇవి తెచ్చాను. కాని, సీతా, మన పెండ్లి అయిన తర్వాత నీ కోరిక తీరుస్తాలే." అతడు చిలిపిగా 'నవ్వుతూమ్తే సీత సిగ్గుపడి పారిపోయింది.
    మరి నాలుగు వసంతాలు ఇట్టే గడిచిపోయాయి. ఈ నాలుగేండ్లలో వయస్సు తెచ్చిన అందంతోపాటు సీతలో హుందాతనం కూడా పెరిగింది. కృష్ణ డాక్టర్ కృష్ణ అయి తిరిగి వచ్చాడు. వచ్చి నాలుగు రోజులైనా సీతను చూడటానికి రాలేదు. ఇది సీతకు చాలా ఆశ్చర్యం, ఆందోళన కలిగించింది. పట్నం చదువుకు వెళ్ళింది మొదలు కృష్ణ వచ్చిన గంటలోనే సీతకోసం వచ్చి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళేవాడు. అలాంటిది ఇప్పుడు ఎందుకు రాలేదు? రాకపోతే ఏం? తనే వెళదామనుకొంది. నాలుగిళ్ళ అవతలగా ఉన్న కృష్ణ ఇల్లు తనకు కొత్త ఏమీ కాదుగదా! అనుకొంది. ఆ సాయంత్రమే కృష్ణ కిష్ణమైన ఎర్ర జార్జెట్ చీరె కట్టుకొని, ఒకే ఒక ఎర్ర గులాబీ తలలో పెట్టుకొని బయలుదేరింది. కృష్ణ గదిలో అడుగు పెట్టేటప్పటికి కృష్ణ ఎక్కడికో వెళ్ళటానికి తయారవుతున్నాడు.
    "పరాయి వాళ్ళు అలా అడగకుండా గదిలోకి రావచ్చా?" చిరునవ్వుతో అన్నా సీత మనస్సు చివుక్కుమంది. తాను పరాయి దెలా అవుతుంది?
    అంతవరకు సీత కళ్ళలో నిలిచిన నీరు క్రింద పడింది, ఆమె మౌనంగా కళ్ళు తుడుచుకొని మవునంగా మధువంక చూసింది. అతడు సీరియస్ గా చదువుకొంటున్నాడు. మళ్ళీ ఆమె కథలో తల దూర్చింది.

                                *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS