Previous Page Next Page 
జీవన వలయం పేజి 15


    "నాకేమీ తెలియ నక్కర్లేదు లెండి. మావాళ్ళేమీ నన్ను అలాటి వాడి కియ్యలేదు. మీరే ఇచ్చుకొన్నారు మీ చెల్లిని." విసురుగా అంటూ లేచి కాఫీ కప్పుల లోకి వంచుతూంది. లత కెక్కడ కష్టం కలిగిందోనని రాజా ఆమె ముఖంలోకి చూశాడు. లత నవ్వుతూ, "అందుకు నే నెప్పుడూ బాధపడలేదు, వదినా! ఇంత మంచి కుటుంబంలో నన్నూ ఇచ్చినందుకు అన్నయ్యా వాళ్ళ కెప్పుడూ నేను కృతజ్ఞురాలినే నా అదృష్టానికి నేను గర్వపడిన సమయాలు కూడా ఉన్నాయి" అంది. రాజా తృప్తిగా నిట్టూరుస్తూ "రమాకాంత్ కు ముఫ్ఫై ఎకరాలు బంగారం లాంటి భూమి ఉందిగా? ఇంకేం లోటు?" అన్నాడు.
    "మీకు అంత పొలం ఉందా, లతా! అందుకే అంత దర్జాగా ఉంటారు మీరు" అంది ఆశ్చర్యపోయిన గీత.
    "ఏం, దర్జాలనేవి ఆఫీసర్లకు మాత్రమే సొంతమా?" నవ్వింది లత. కాని గీత ఆ మాటలు వినలేదు.
    "కాని, వదినా ఒక్క సంగతి గుర్తుంచుకో. నాకు దర్జాగా గడవకపోయినా, నా భర్త నిరుపేద అయినా నేను నా పుట్టినింటి నుండి ఎన్నడూ ఏమీ ఆశించను!" ఈ సారి గీత కళ్ళు పెద్దవి చేస్తూ "ఎందుకని" అని అడిగింది.
    "అభిమానం కలది కనక. ఆత్మాభిమానం అనేది నీ వెన్నటికీ అర్ధం చేసుకోలేవు, గీతా." గదిలో నుండి బయటకు వెళుతూ అన్నాడు రాజా. లత కూడా లేచి వెళ్ళింది. కాని గీత అలాగే కూర్చుంది. అంతవరకు రాజాయే లతకు ఎంతో డబ్బు పంపుతున్నాడని, ఆమె కొరకే తమ జీతంలో చాలా వరకు ఖర్చు పెడుతున్నా డనే అనుమానం గీతకు ఉండేది. కాని ఎన్నడూ రాజాను తాను ఈ విషయం గురించి అడగలేదు. మొదటిసారిగా లత మీద ఆమెకు ఎనలేని గౌరవం కలిగింది. లత గురించి నజ్ మా ఎంత గొప్పగా చెప్పినా ఇదివరకు నమ్మలేదు.
    "గీతా! రాజాలాంటి భర్త, లత లాంటి ఆడపడుచు కలిగిన నీవు నిజంగా అదృష్టవంతురాలివి. వారిద్దరూ రెండు అమూల్యమైన వజ్రాలు. వాటిని, అపురూపంగా చూసుకో." గీతకు ఆ మాటలు మళ్ళీ గుర్తు వచ్చినాయి.
    "రాగ ద్వేషాలకు, సుఖదుఃఖాలకు ఆమె అతీతురాలు. దురదృష్టం, దుఃఖం అనేవి లత లాంటి వ్యక్తుల దగ్గరకు వెళ్ళటానికే భయపడతాయి.
    "ఒక లక్షాధికారిణిని ఎలా గౌరవించగలదో అలాగే ఒక నిర్భాగ్యురాలిని కూడా ఆమె గౌరవించ గలదు. లత మనుష్యులను ఎన్నడూ డబ్బును చూచి ప్రేమించదు. గౌరవించదు. ఆమెకు కావలసింది మనిషిలోని వ్యక్తిత్వం. ఆత్మాభిమానం లేనివారు, స్వార్ధపరులు ఆమె దృష్టిలో గడ్డిపోచల కంటే హీనం." నజ్ మా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా లతను గురించి చెపుతుంటే గీతకు కోపం కూడా వచ్చేది. కాని ఆ నాడు ఆమె మాటల్లోని నిజాన్ని గ్రహించలేకపోయింది.
    "బాగుంది. నువ్విక్కడ కూర్చుని కలలు గంటున్నావా? అన్నయ్య అరగంటనుండి నిన్ను ఒక్కటే కేకలు పెడుతున్నాడు" అంటూ వచ్చింది లత.
    గీత కొంచెం తేరుకొని, "ఎందుకు, లతా?" అంది.
    "డబ్బు కావాలట."
    "ఇవిగో తాళాలు, బీరువాలో కాష్ బాక్స్ లో ఉంది. ఎంత కావాలో ఇవ్వు" అని తాళాలు అందించింది గీత.
    "ఇది మరీ బాగుంది. నేను నీకు చెప్పటానికి వస్తే ఆ పని నాకే అప్పగిస్తున్నావా? లే కొంచెం వెళ్ళి ఆయనకేం కావాలో చూడు" అని వెళ్ళబోతున్న లతను ఆపి తాళాలు చేతిలో పెట్టింది గీత. తాళాలు చేతిలో పెడుతూ గీత కళ్ళలో చూపిన అభిమానంతో లత మాట్లాడలేకపోయింది. అసలు నిజానికి లతకు తనంతట తాను బీరువా తీయటం ఇష్టంలేదు. ఇంతవరకు వదిన దగ్గిర అలాటి చనువు తాను తీసుకోనూ లేదు. గీత ఇవ్వనూ లేదు. కాకపోతే క్రితంసారి కంటే ఈ సారి వచ్చినప్పటినుండి గీత లతతో బాగానే మాట్లాడు తూంది. దీనికి కారణం లతను లక్షాధికారి అయిన మధుయే అక్కగా అభిమానించటం కావచ్చు. లేక నజ్ మా ఆమెను ఆరాధించటం కావచ్చు. రాజా ప్రాణంగా చూసుకోవటం కావచ్చు. ఏది ఏమైనా ఒక స్త్రీని ఇందరు వ్యక్తులు అభిమానిస్తుండగా సూటీ పోటీ మాటలతో ఆమెను బాధించటం భావ్యం కాదనుకొని ఉండవచ్చు గీత, అసలు ఈసారి వచ్చినప్పటినుండి లత ఎక్కువ కాలం నజ్ మా ఇంట్లోనే గడుపుతూంది. తాళాలు అందిస్తున్న లతతో "ఏమిటి కథ? ఫెయిరీ లాగ తయారయ్యావ్?" అంది మంచి బట్టలతో వచ్చిన లతను చూసి.
    "నే నెంత ఫెయిరీ నయినా నీ పక్కన దిష్టి బొమ్మనే గదా. నజ్ మా దగ్గరకు వెళుతున్నాను" అంది చిరునవ్వుతో లత.
    "నేనూ వస్తాను. నాకు చెప్పకుండా వెళ్ళదామనే!" అంది కళ్ళు తిప్పుతూ గీత.
    "నేను చెపితేమాత్రం నువ్వు వస్తావా?"
    "చెపితే ఏమోగాని ఆజ్ఞాపిస్తేమాత్రం వచ్చి తీరతాను." గీత కంఠంలోని ఆప్యాయతకు లత కరిగి పోయింది.
    లత, గీత వెళ్ళేటప్పటికి నజ్ మా ఆరోజే వచ్చిన పత్రికలోని 'పగిలిన హృదయాలు' చదువుతూంది. భాషా బయటి కెందుకో వెళ్ళాడని పనిపిల్ల చెప్పింది. ఆ రోజు పేపరు చేతిలోకి తీసుకొని గీత చదువు కొంటూంది. లత మాత్రం నిశ్శబ్దంగా నజ్ మా పక్కలో కూర్చుంది. కొంచెంసేపటికే కథ పూర్తి చేసిన నజ్ మా పుస్తకం క్రింద పడవేసింది. ఆ రోజుతో 'పగిలిన హృదయాలు' పూర్తి అయింది. నజ్ మా ఒక్క మాటకూడా మాట్లాడక పోవటంతో లత ఆమె వంక చూసింది. చూడటంతోనే కెవ్వున అరిచింది. నజ్ మా కళ్ళు తెరిచి చూస్తూనే ఉంది. కాని ఆ కళ్ళలో చలనం లేదు. కాళ్ళు, చేతులు అలాగే బిగిసి నట్లు ఉన్నాయి. పరిస్థితి అర్ధంచేసుకున్న గీత బయటకు పరుగెత్తింది. మరి పది నిమిషాల్లో భాషా, ఆ వెనక గీత, డాక్టర్ వచ్చారు. డాక్టర్ నజ్ మాను చూసి, మరేమీ భయంలేదు, కొంచెం తెలివి తప్పిందని చెప్పాడు. తెలివిలో ఉన్న ముగ్గురి గుండెలు కుదుటపడ్డాయి. అరగంట తర్వాత తెలివిలోకి వచ్చిన నజ్ మాకు ఆహారం ఏమి ఇవ్వాలో చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. భాషా ఆఫీసుకు వెళ్ళిపోయిన కొంచెం సేపటికి మధు కూడా అక్కడికి వచ్చాడు.
    "అక్కా, నేను సాయంత్రం వెళ్ళిపోదా మనుకుంటున్నాను" అన్నాడు మధు.
    "అదేమిటి, మధుబాబూ! అప్పుడే వెళ్ళిపోతారా?" అడిగింది గీత.
    "వెళ్ళకపోతే ఎలా చెప్పండి? అన్ని వ్యవహారాలూ నేనే చూచుకోవాలి. ఇతరుల మీద ఎన్నాళ్లని వదులుతాం?"
    "ఇతరుల మీద వదిలితే ఒక లక్ష నష్టపోతామని భయం. అంతేనా?" నవ్వుతూ అడిగింది గీత.
    "లక్ష అంటే నీకు నవ్వులాటగా ఉందా?" అప్పటివరకు నీరసంగా పడుకొన్న నజ్ మా అడిగింది.
    "మా తమ్ముడేమీ డబ్బుకు భయపడడు. ఒక లక్ష పోయినా, నాలుగు లక్షలు సంపాదించగలడు" అని మధువైపు తిరిగి, "చూడు, తమ్ముడూ, మరి రెండు రోజు లాగకూడదూ? నేనూ వచ్చేస్తాను" అంది లత.
    "సరే .... అలాగే." అంగీకరించాడు మధు,
    నజ్ మా లత చేయి నిమురుతూ, "మీరంతా ఉంటే నా కెంతో బాగుంది. మీరు వెళ్ళిపోతే నేనేమై పోతానో నాకే తెలియదు" అంది.
    "నీ వలా ఎప్పుడూ బెంగపెట్టుకోవద్దు, నజ్ మా నీకు తగ్గిపోతుంది. ఏం ఫర్వాలేదు" అంది అనునయిస్తూ లత.
    "పోనీ, నజ్ మాను మనతో తీసుకెళదాం, అక్కా, అన్ని సదుపాయాలు నేను చూస్తాగా?" ఆప్యాయంగా నజ్ మా ను చూస్తూ అన్నాడు మధు.
    అతని అనురాగానికి ఆశ్చర్య పోయింది గీత. "అంత కంటేనా?" అంది లత.
    "ఎందుకు, మధుబాబూ, ఈ దీనురాలి మీద మీ కింత అభిమానం?"
    "ఎలా చెప్పను, నజ్ మా? అసలు జీవితంలో ఎదురయ్యే కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉండవు. మీరు నన్ను ఆత్మీయుడైన స్నేహితునిగా భావించమని కోరుతున్నాను. మీ ఆరోగ్యం కోసం, మీ ఆనందంకోసం నేను చేయగలిగినంత సహాయం చేస్తాను. ఈ విషయంలో నన్ను అనుమానించకండి."
    "మధుబాబూ!"
    ఆత్రతగా నజ్ మాను చూశాడు మధు.    
    "భారతదేశంలో మీలాటి పవిత్ర హృదయులు కొందరైనా మిగిలి ఉండటం భారత మాత సుకృతం. ఇప్పటికే మీ అందరికీ నే నెంతో మనస్తాపం కలిగించాను. మన అందరి మధ్యా ఎలాంటి రక్త సంబంధం లేదు. అయినా ప్రేమపాశం మనల నందర్నీ ఒకటిగా బంధించింది. పవిత్రమైన ఈ అనురాగాన్ని, మన స్నేహాన్ని చివరివరకూ తలుచుకొంటూ ఉంటాను. నన్ను క్షమించి ఇక్కడే ఉండనివ్వండి. నాపైనే పంచ ప్రాణాలూ పెట్టుకొన్న అన్న ఉన్నాడు కదా!"
    "భాషాకూడా మనతోనే ఉంటాడు. మీ రంగీకరించండి, నజ్ మా, మీ రిలా ఒంటరిగా ఉండి ఆలోచనలతోనే ఆరోగ్యం పాడుచేసుకొన్నారు. ఆ విషయం తెలిసి కూడా ఎలా వెళ్ళం, చెప్పండి." అర్ధిస్తూ అడుగుతున్న మధును అనురాగంతో ఆప్యాయంగా చూసింది నజ్ మా. తర్వాత అతడి తలను నిమురుతూ, "బాబూ, మధూ! నేను నీకు ప్రతిఫలంగా ఏమీ ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. కాని ప్రేమగల వారి ఆశీస్సు వృధా కాదు. నీ బ్రతుకుబాట పుష్పభరితం కావాలని, ఆ బాటలో పయనించే నీ మృదు పాదాలకు పూల సౌరభాలే తప్ప చాటుగా దాగి ఉన్న ఒక్క ముల్లుకూడా తగలకూడదని ఆశీర్వదిస్తున్నాను" అంది. అప్రయత్నంగా నజ్ మా కళ్ళు నీటితో నిండినాయి. మధు కళ్ళు చెమ్మగిల్లినాయి. ఆ ఇరువురు చూడకుండా లత, గీత కన్నీరు తుడుచుకున్నారు. ఆ రోజు భారమైన హృదయంతోనే వారంతా నజ్ మా ఇల్లు వదిలారు. ఆ తర్వాత రెండు రోజులూ నజ్ మా కొంచెం కోలు కొన్నట్లుగా ఉన్నా ఇంకా నీరసంగా మాత్రం ఉంది. తెల్లవారుఝామున లత, మధు ప్రయాణం పెట్టుకొన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS