రాఘవరావు కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.
"ఎవరు నువ్వు వెళ్ళు ముందు." అంటూ కసురుకున్నాడు. యెవరో అమ్మాయితో తన తమ్ముడు తిరుగుతున్నట్లు తెలుసుగాని ఆ అమ్మాయి ఎలా వుంటుందో రాఘవరావు కి తెలియనే తెలియదు. తమ్ముడు వయస్సులో వుండి పెడదారులు నడుతున్నాడనే అనుమానం వేధిస్తూ న్నందువల్లే ఈ సంబంధం ఖాయం చేసుకున్నాడు. ఇంకాస్త ఆగితే వాసుకి సెలక్షన్ వచ్చిం తరువాత అయితే సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వున్నా ఈ కారణాలవల్ల తలవంచక తప్పలేదు.
ఈ సమయంలో ఆ అమ్మాయి ఇలా సుడిగాలిలా వస్తుందని కలలోకూడా వూహించలేదు.
మాల పిలుపు వాసుకి విన్పించింది. శ్రీలక్ష్మి భయంగా వాసుని వెళ్ళ వద్దని షర్టుపట్టుకు లాగుతున్నా వాసు ఆగలేదు. బైటికి వచ్చేశాడు.
"మాలా యేమయింది నాన్నకి" అంటూ.
"వాసుబాబూ.....నాన్న పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు" అంటూ బావురుమంది. మాలకి అక్కడ యేం జరుగుతున్నదో అసలు ఆ పిల్ల చూడనేలేదు తనకి ఒకే ఒక దిక్కు తండ్రి. ఆ తండ్రి యేదోగా అయిపోతుంటే ఆమెకీ ప్రపంచం తలక్రిందు లవుతున్నట్లై పోతోంటే ఆసరాగా ఆదుకుంటాడనే ధైర్యంతో వాసుని వెతుక్కుంటూ పరిగెత్తుకొచ్చింది.
వాసు మరేం ఆలోచించలేదు
వెక్కివెక్కి యేడుస్తున్న మాలని దగ్గరగా తీసుకుని యేడ్వవద్దని ధైర్యం చెప్తూ "ఎద" అంటూ స్కూటరీ వెనక కూర్చోపెట్టుకుని "రివ్వు"న వెళ్ళిపోయాడు.
పెళ్ళి వారితో పాటు వరండా వరకూ వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తున్న రాఘవరావు అవమానాన్ని భరించలేక పిచ్చివాడిలాగా చిందులు తొక్కాడు.
పెళ్ళివారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మధ్యవర్తికి చెమటతో షర్టు తడిసి పోయింది. "పద చెప్తాం నీ సంగతి" అంటూ ఆయన్ని లాక్కువెళ్ళి కారులో కూలేశారు.
కల్లుతాగిన కోతిలాగా చిందులు తొక్కుతున్నాడు రాఘవరావు అందిన వస్తువుల్లా శ్రీలక్ష్మి ముఖాన గిరాటు కొడుతూంటే వీణా, బాబ్జీ మంచం కింద దూరి కూర్చున్నారు. హడిలిపోతూ.
శ్రీలక్ష్మి యేం చేస్తుంది! స్థాణువులాగా నిల్చి పోయివుంది.
* * *
తన యేకైక పుత్రికను వాసుకి అప్పగించి ఆ వృద్దుడు "వాసుబాబూ, మిమ్మల్ని అపార్ధం చేసుకున్నాను. క్షమించు బాబూ......దిక్కులేని ఈ ఆడపిల్ల తల్లి చేసిన తప్పుకి తమశిక్ష అనుభవిస్తోంది. ఇంక... ఏం చేసినా......నీదే భారం బాబూ..." కళ్ళు మూశాడు.
డాక్టర్ "నా అవుసరం ఇంకలేదు" అంటూ బ్యాగ్ సర్ధుకుని వెళ్ళిపోయాడు.
మాల తండ్రి మీదపడి హృదయవిదారకంగా విలపిస్తోంది.
ఆ అమ్మాయిని ఎలా ఓదార్చటం.
ఈ ప్రపంచంలో నా అనే వారులేని యేకాకిగా మిగిలిపోయిన ఆమెకు ఏం చెప్పి వోదార్చాలి...
"ఏడవకమ్మా.....నువ్వు ఒంటరిదానివి కాదు. నేను లేనూ మాలా నీకు నేను వున్నాను. రోగంతో యమయాతనపడి ఆయన ఈ బాధల నుంచి విముక్తి చెందారు. అందుకు నువ్వు ఆనందించాలి బాధపడకు. ఒళ్ళుతుడుచుకో ....
వాసు వోదారుస్తున్న కొద్దీ మాలకి దుఃఖం యెక్కువ అవుతోంది.

"వాసు బాబూ....నేనూ చచ్చిపోతాను.అంటూ వాసు రెండు చేతుల తోనూ ముఖం కప్పుకుంది. దుఃఖం మరీ యెక్కువైంది.
విషయం వింటూనే వెంకటేశ్వర్లూ, వీరభద్రం రెక్కలు కట్టుకుని వాలారు. వీరభద్రం తల్లి మాలని వోదారుస్తోంది.
ముందు జరగవలసిన విషయం ఆలోచనలు చేశారు.
వాసు జేబులో పది రూపాయలకి మించిలేదు.
చేతి వాచ్ తీసి వెంకటేశ్వర్లు చేతిలో పెట్టి జరగవలసిన కర్మ కాండలు పూర్తి చెయ్యి. అది చాలదనుకో నువ్వు సహాయపడు ఆ తర్వాత తీర్చుకుంటాను అంటూంటే వీరభద్రం కళ్ళనీళ్ళు జల జలా రాలాయి. తనలాంటివాడు రెక్కల కష్టంతప్ప ధనరూపంలో సహాయపడి నందుకు కుమిలిపోతూ.
మాల పనిచేసే ఇంటి యజమానురాలి చంద్రహారం మాయమయిందని పోలీస్ రిపోర్టు వెళ్ళింది. వారి అనుమానం మాల మీద అంటూ చెప్పటంతో.

పోలీసులు రంగంలో ప్రవేశించారు.
పోలీసు వ్యాను ఆగింది. వాసుకి అయోమయం అయింది.
వాళ్ళని చూస్తూనే మాల అమాంతంవచ్చి వాసును కౌగలించుకుని "వాసు బాబూ ఏమిటి దింతా నాకు భయమేస్తోంది" అంది పిచ్చి దానిలా.
"మరేం భయపడకు" అంటూ పొదివి పట్టుకుని.
"సోదా చేసుకోండి.....ఇన్ స్పెక్టర్." అన్నాడు.
"ఉప్పుకుండలో వున్నదంటూ "బైటికి తీసుకు వచ్చాడు. ఒక పోలీస్ ధగధగా మెరసిపోతున్న పదహారు కాసుల చంద్రహారాన్ని.
"వాసుబాబూ. నాకేం తెలియదు. నాకేం తెలియదు." అంటూ భోరుమంది.
వాసు స్థాణువులాగా నిల్చిపోయాడు.
మాలని బలవంతంగా పోలీసులు వ్యాను యెక్కించుకుని వెళ్ళిపోయారు.
"యేది జరుగకూడదు" అని మొదటినుంచీ అనుకున్నాడో అది జరగనే జరిగిపోయింది. తన లోని శక్తి అంతా యెవరో చేత్తో తీసేసినట్లు డీలా పడిపోయాడు వాసు.
వెంకటేశ్వర్లు వీరభద్రం జరగవలసిన పని పూర్తి చేశారు.
వాసు యెంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మాలకి మూడునెలలు జైలుశిక్ష విధించింది న్యాయస్థానం. రాఘవరావుకి తల యెత్తలేని స్థితిని తెచ్చిపెట్టాడు తమ్ముడు అని "ఇంట్లో కాలు పెట్టేందుకు వీలులేదు" అంటూ తలుపు ఢాంమని మూసేశాడు.
చేతిలో చిల్లి గవ్వలేదు. వుద్యోగం అసలే లేదు.
ఇప్పుడు తలదాచుకోను నీడకూడా లేదు.
ఏం చెయ్యాలి.
వీరభద్రం "మా ఇంటికి రండి మాష్టారూ" అంటూ ప్రాధేయపడ్డాడు. అతని ఒక్కడి సంపాదనతో తల్లీదండ్రీ తనూ పొట్టనింపు కుంటూ మరొకర్ని ఆహ్వానిస్తున్నాడా నిస్వార్ధపరుడు. వీరభద్రం ఆహ్వానంలో ఆత్మీయత వుంది. ఆ పిలుపు వాసుకి యేదో తియ్యని సంతృప్తి నిచ్చింది. అది చాలు తనకి. పిల్చాడేకదా అని వాళ్ళకి భారం అవటం జరగని పని.
పోస్టుమాన్ ఓ వుత్తరం వాసు చేతిలోపెట్టి వెళ్ళిపోయాడు. విశ్వం దగ్గరినుంచే అని తెలుస్తూనే వుంది.
"వాసూ.....నువ్వూ నీ .... "ముక్తా" క్షేమమే కదూ. "ముక్త" అంటే? అని ఆశ్చర్యపోతున్నావా! "ముక్త అనగా అర్ధం వదిలి పెట్టబడిన అని. ఈ అర్ధం నేను చెప్పింది కాడు సుమా. విశ్వనాధ సత్యనారాయణ గారు ఆముక్త మాల్యదకి పీఠిక రాస్తూ రాశారు. ఇంకా క్షమిస్తా వుగా ఇలా అన్నందుకు.
ఇక నుంచి నీ కన్యారత్నాన్ని "ముక్త" అనే పిలుస్తాను. నీ కన్యని పరిగ్రహించేవారు పరాయి వారెవ్వరో యెందుకు ! ఆ దానం నాకు చేసి నన్నో ఇంటివాడిని చెయ్యాలనే సదుద్దేశ్యం నీ కెందుకు కల్గలేదు! వాసూ ఆ ముక్తని హారంలో గుచ్చి మెడలో ధరించాలని మహా కోరికగా వుంది నీ ఆమోదం తెలుపు.....వెంటనే రెక్కలు కట్టుకు వాలుతాను.
వాసు నిట్టూర్చాడు. ఈ వుత్తరం నాలుగు రోజులు ముందు వచ్చివుంటే యెంత బాగుండేదీ! ఇప్పుడు దొంగతనం మోపబడి శిక్ష అనుభవిస్తున్న మాలని పరిగ్రహించే త్యాగం నీలో వున్నదా విశ్వం.....అంటూ జవాబు రాసి పోస్టులో వేశాడు.
మూడు రోజులుగా తిండీ నిద్రా లేని వాసు కళ్ళు తిరుగుతూంటే తూలుతూ రోడ్డుమీద నడుస్తున్నాడు.
వెనగ్గా వచ్చిన ఇద్దరు తల పగిలేలా కొట్టబోతూంటే అంత నీరసంలోనూ వెనక్కి తిరిగాడు వాసు. నీరసంగా నిలబడలేని వాసు ఆ ఇద్దరినీ ప్రతిఘటించలేక కూలబడిపోయాడు.
బలంగా తగిలిన దెబ్బకి స్పృహ తప్పి పోయింది.
* * *
నాలుగు రోజుల తర్వాత స్పృహ తెలిసింది వాసుకి. తమ వైదేహి ఇంట్లో వున్నట్లు. బలహీనంగానే వున్నా మెల్లగా లేచి కూర్చుని ఆలోచిస్తున్నాడు. గాయం చిన్నదే అయినా ఇంకా సలుపుతూనే వుంది ఖాన్ యెదురు దెబ్బ తీయకుండా విడవడని తనకి తెలుసు కాని, జరిగి పోతున్న పరిస్థితుల్లో ఈ మాటని కాస్త విస్మరించి అజాగ్రత్తగా వున్నాడు.
జోరున వర్షం కురుస్తోంది.
ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. క్రిందనుంచి యేవేవో శబ్దాలు విన్పిస్తున్నాయి! రోడ్డుమీద నించే వెళ్ళే కార్లు" చిందగొట్టే నీళ్ళు వింత శబ్దం చేస్తున్నాయి. వర్షపు నీళ్ళు పడి కుండల్లోని చామంతి మొక్కలు పరిశుభ్రంగా, పచ్చగా తలలు వూపుతున్నాయి.
దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వాసు.
"ఏమిటి? అంత దీర్ఘాలోచన!" నవ్వుతూ మందు గ్లాసు అందించింది వైదేహి.
వాసు ఆమె చేతిలోని గ్లాసు అందుకోలేదు.
మొట్టమొదటి రోజు తను ఈ ఇంటికి ఈ వైదేహిని చూడటానికి వచ్చాడు. అయిష్టాన్ని వ్యక్తం చేసేప్పుడు. మళ్ళీ ఈ ఇంటి గడప దాటి లోపలికి రావలసిన అవుసరం వస్తుందని వూహించలేదు. అనుకునే వుంటే ఆ రోజు అలా జవాబు ఇచ్చి వుండేవాడా? కాదు....యేమో?"
ఈ వైదేహికి నేనంటే యెందుకింత శ్రద్ధ? చూపుతోంది! అర్ధం కావటంలేదు. అసలు ఎలా వచ్చాను ఇక్కడికి? ఎవరు తీసుకువచ్చారు?
"వైదేహిని మందు ఇస్తున్నాను. యేయే ఆలోచనల్లో నన్నూ నా మందునూ చూడటం లేదు."
"ఇంక నాకు మందు అక్కర్లేదు కాని అసలు నేను ఇక్కడికి యెలా వచ్చాను" వైదేహినే చూస్తూ అడిగాడు.
"యెత్తు కొచ్చాను" అంటూ కిలకిలా నవ్వింది.
వెంటనే కాస్త నవ్వు వచ్చినా వెధవ 'జోక్' ఇప్పుడేనా? చికాకు వచ్చింది వాసుకి.
"మందు తాగండి"
"వద్దు...."
"అన్నింటికీ మీ ఇష్టమేనా" అంటూ బలవంతంగా నోట్లో పోసేసింది. దుప్పటీ సర్ది "ఇప్పుడే నాన్నగారు వచ్చి మిమ్మల్ని చూస్తాడుట. నాన్నగారంటే అర్ధం చిన్నాన్న గారు. నే వెడుతున్నాను."
"వైదేహీ. మీ నాన్నగారి ప్రశ్నలకి నేనేం జవాబులు ఇవ్వలేను. అయినా ఆయనకి కృతజ్ఞతలు చెప్పండి. మీరిక్కడే వుండండి. నాకు కళ్ళు మూసుకుపోతున్నాయి." అంటూ దుప్పటీ ముసుగు పెట్టుకున్నాడు.
