Previous Page Next Page 
జీవనకలశం పేజి 14


    అతిథులందరూ వెళ్ళిపోయినా వైదేహి స్నేహితులు కాబోలు నలుగురు అమ్మాయిలు అక్కడే కూర్చున్నారు.
    వైదేహి చాలా ఆడంబరంగా అలంకరించుకుంది.
    అసలే లావుగా వుండే ఆమె నెమిలి పింఛం పట్టు చీరెలో మరి లావుగా కన్పిస్తోంది. చేతికి పదింతల గాజులు వాటిల్లో మధ్యమధ్యన రాళ్ళ గాజులు లైటు వెలుతురుపడి ధగధగా మెరుస్తున్నాయి. మెడలో నెక్లెసూ అంతే. ఇవన్నీ చాల వన్నట్టు నడుముకి మువ్వల వడ్డాణం. అలంకారం చేసి కూర్చోపెట్టిన అమ్మవారిలా వున్న వైదేహిని విచిత్రంగా చూస్తూ.
    "నమస్కారం" అన్నాడు. పుట్టిన దినం అభివందనలు తెల్సుతూనే. ప్రతి నమస్కారం చేస్తూన్న వైదేహి కళ్ళు సంతృప్తిగా నవ్వడం కనిపెట్టాడు వాసు.
    నా రాక ఇంత సంతోషాన్ని కల్గిస్తోందా ఈమెకి అనుకున్నాడు. తనని యెంత బలవంతంగా డ్రైవర్ తీసుకువచ్చినదీ గుర్తుచేసుకుంటూ.        
    వైదేహి తన చెలులకి వాసుని పరిచయం చేసింది.
    "వీరు" అంటూ సగంమాటని మింగేసి వాసు దేవరావు M. A.  అంటూ - ఆ నలుగురూ వాసుకి నమస్కరించారు.
    ముక్కూ ముఖం తెలియని ఆ అమ్మాయిల యెదురుగా దిష్టిబొమ్మలాగా కూర్చోవాలంటే చికాకు గాదు తిక్క రేగుతోంది వాసుకి.
    M.A చదివిన ముఖమేనా ఇంతలక్షణంగా వచ్చాడు పార్టీకి. వారాలు చేసుకుని చదువుకున్న బాపతేమో. ఆ షర్టూ అదీ." అంటూ వాసుని గురించి అప్పుడే అభిప్రాయాలు యేర్పరుచుకున్నారు ఆ అమ్మాయిలు. ఈ ముఖాన్ని చూసేందుకేనా వైదేహి ఇంతసేపు ఆపిందీ అనుకుంటూ పర్సనాలిటీ వుంది లాభం యేమిటీ. దాన్ని కాపాడుకోవటం చేతకాక పోయింతర్వాత కనీసం ఆ దగ్గరలో యే పేపర్ గాని పుస్తకం గాని లేవు. ఆ అమ్మాయిల శల్య పరీక్షనించి తప్పించుకోటానికి. "మగవాళ్ళు ఆడపిల్ల కన్పిస్తే చాలు వెర్రివేషాలు వేసి నఖ శిఖ పర్యంతం పరీక్షిస్తారు" అని నెత్తీ నోరు కొట్టుకునే ఈ ఆడపిల్లలు చేస్తున్న దేమిటి? కోపం వచ్చేస్తోంది వాసుకి.
    ఆ అమ్మాయిల దృష్టి వాసుని పరీక్షించటం అయిం తర్వాత టైటుపాంటులో బిగుసుకుని పైకి యెప్పుడు వద్దామా అన్నట్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్న స్వీట్ పాకెట్టు మీద నిల్చింది.
    ఒకళ్ళ సౌంజ్ఞలు అందుకొని మరొకరు నలుగురు కళ్ళూ వాసు జేబుమీదే నిల్చినాయి.
    "మీబొంద దీనిలో యేం లేదు. కావాలంటే తలా ఒకటి తిని అవతలికి పొండి" అని వాళ్ళ మీద ఆ పాకెట్టు గిరాటు కొట్టాలనే ఆలోచన్ని సభ్యత నోరు నొక్కింది. సభ్యత కాదుగనుకనే ఇంత అవస్థని భరిస్తున్నాడు.    
    ఈ స్థితిలోనే యే పల్లెటూరు వాడో అయితే దర్జాగా వాళ్ళ యెదురుగా విప్పేసును. అసలు ఈ సభ్యత ఎందరిని ఎన్ని విధాల ఇరుకుల్లో పెడుతోందో వాసు అనుభవపూర్వకంగా తెలుసు కున్నాడు.
    వైదేహి కదిలింది.
    అమ్మయ్య అనుకున్నాడు వాసు.
    "మీరిందా కే వెళ్ళిపోతాం అన్నారు కదుటోయ్. డ్రైవర్ వచ్చాడు. మీ నలుగుర్నీ దింపేసి వస్తాడు అంటూ సాగనంపింది.
    ఆ అమ్మాయిలకి యేడుపొచ్చేసింది. ఈ అతిధి తెచ్చిన ప్రజంటేషన్ చూడకుండా వెళ్ళి పోవలసి వచ్చినందుకు, ఏం చేస్తారు. పాపం వెనక్కి తిరిగి మరోసారి  వాసుని చూస్తూ "నమస్తే" చెప్పి వెళ్ళిపోయారు.
    ఇంక ఆగదిలో వాసు. వైదేహి ఇద్దరే మిగిలారు.
    క్రింద యెవరెవరి గొంతులో విన్పిస్తున్నాయి.
    తప్పనిసరిగా వచ్చాడేగాని యేం మాట్లాడాలో తెలియటం లేదు. అలా అని మూగగా కూర్చోవటమూ సభ్యత అన్పించటంలేదు.
    రెండు నిమిషాలు అలా గడిచి పోయింది.
    మీకోసం అయిదునించీ ఎదురుచూస్తున్నాను" అంది వైదేహి.
    "సారీ.... అర్జెంట్ వర్కువుండి రాలేక పోయాను"
    "జాబ్"లో చేరారా."
    "అహ లేదు"    
    "మరి?"
    యేమని చెప్పడం. నవ్వేసి వూరుకున్నాడు. ఈమధ్య ఇది ఒకటి బాగా అలవాటు అయింది. జవాబు ఇవ్వలేని ప్రశ్నలకన్నింటికీ ఓ వెధవ నవ్వు పారేయటం. సంభాషణ మరో మలుపు తిప్పాలనే వుద్దేశ్యంతో.
    "మీకు ప్రజంటేషనుకూడా..."
    వైదేహి మృదువుగా నవ్వింది. మల్లెలు విచ్చినట్లు.
    వాసు నిర్నిమేష దృష్టితో చూస్తున్నాడు వైదేహిని.
    ఈ అమ్మాయినవ్వు ఎంత బాగుంటుందీ... విచిత్రం అనుకున్నాడు.
    "ప్రజంటేషన్లు ఎన్ని కుప్పపడి వున్నాయో"
    నిజంగానే కుప్పపడి వున్నాయి.
    "నాకు కావలసింది అదికాదు!" వైదేహి కళ్ళలో నీటిపొర కదిలి అక్కడే ఆగిపోయింది.
    "ఒక్క విషయం చెప్తాను. నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తారు కదూ! ఇదివరకు మనమధ్య జరిగినదాన్ని మర్చిపోలేక మీరు చాలా దూరంగా ఇబ్బందిగా వుండిపోతున్నారు. నాకు తెల్సు. మనం ఆ విషయం మర్చిపోదాం. కేవలం స్నేహితుల్లా వుందాం. ఏమంటారు?"
    ఇంకా యేమి అడుగుతుందో ఎలా జవాబివ్వాలో అని అప్పటికే యెన్నెన్నో ఆలోచిస్తూన్న వాసు "అమ్మయ్య" అని తేలిగ్గా గాలి వదిలి-
    "ఆ విషయంలో మీకు "సారీ" చెప్పటం మినహా మరేం జవాబివ్వలేను. ఇంక స్నేహితుల్లా వుందామన్న మీ అభ్యర్ధన సంతోషంగా స్వీకరిస్తాను.
    'ఎంత మంచివారు వాసుదేవరావుగారూ" సంతోషంగా అంది వైదేహి.
    "అలా పూర్తిపేరు అనవసరం. వాసూ అనండి. లేకుంటే వాసుబాబూ అనండి. మనం స్నేహితుల్లా వుండాలనుకుంటున్నప్పుడు ఈ ఆచారాలు అనవసరం.
    "అలాగే వాసు బాబూ....ఇప్పుడు నాకెంత సంతోషంగా వుందనుకున్నారూ.... మీరు వస్తారో రారో అని యెంత యెదురు చూశానని కేక్ "కోస్తున్నా స్నేహితులు పాటలు పాడుతున్నా నా మనస్సూ దృష్టీ అంతా వాకిలివైపే" చూసి చూసి చాలా అలసిపోయాను. పోనివ్వండి నా నిరీక్షణ వ్యర్ధం కాలేదు.
    ఒక విధంగా మీరు ఇప్పుడు రావటమే బాగుంది.
    ఏమని జవాబివ్వాలి. ఇంత చనువు తీసుకుని ఒక్కసారి ఇంత దగ్గరగా మాట్లాడుతూంటే ఎవరైతే మాత్రం ఏమని జవాబిస్తారు.
    బెరుకుగా వున్నా జవాబివ్వక తప్పటం లేదు వాసుకి.
    "మీరీ రోజు కాఫీ కాదు. భోజనం చేసి వెళ్ళాలి" అంది నవ్వుతూ.    
    వాసుకి అసలే ముళ్ళమీద కూర్చున్నట్లు వున్నది.
    "మరోసారి వస్తాను. ఈ రోజు..." అంటూ అభ్యంతరం చెప్తున్నా వినక వైదేహి బలవంతం చేసింది.
    "క్షమించండి. నాకు యెక్కడా భోజనం చేసే అలవాటు లేదు. మరేం అనుకోకండి" అంటూ లేచాడు. "శలవు" అంటూ.
    వైదేహి ఒప్పుకోలేదు.
    "నాకేం తీసుకురాలేదని బాధపడ్డారుగా పోనీ నాకు కావల్సింది అడిగితే కాదంటారేం ప్లీజ్ ఈ రోజు మీతో కలసి భోజనం చెయాలని వుంది. కాదనకండి."
    ఇంక యేం మాట్లాడగలడు?    
    ఈ శిక్ష అనుభవించే మరీ వెళ్ళాలి ఇంటికి తప్పదు అనుకుని "వాష్" బేసిన్ దగ్గిర చేతులు కడుక్కుంటూ అద్దంలో ముఖం చూసుకున్నాడు.
    నల్లగా, పెంకులా వున్న ముఖం నలిగి పోయిన బట్టలు.
    నౌకరు తువ్వాలు అందించాడు.
    ఆ హాలు ప్రక్కన వున్న రూములోనే ఇద్దరికీ టేబుల్ మీద వడ్డించారు. మరెవ్వరూ లేనం దుకు సంతోషించినా వైదేహి మాత్రం కొత్త కాదూ.
    పట్టుచీర మార్చుకుని, నగలన్నీ తీసేసి చాలా సింపుల్ గా లైట్ ఊదా కలర్ ఫుల్ వాయిల్ చీరె, అదేకలర్ జాకెట్టుతో వచ్చి కూర్చుంది వైదేహి.    
    చూడటానికి ఇప్పుడు కాస్త తెరిపిగా వుంది. వాసుకి.
    భోజనానికి వుపక్రమించబోతుండగా వాసు "పుట్టినరోజు కాన్కలు సరే అసలు స్వీటు తినిపించాలంటావుగదూ ఇదిగో తినండి" ప్లేటులో వైదేహి చూడకుండా పెట్టి అందించాడు. తను వంటవాడు వడ్డించినదే యేదో ఇస్తున్నాడను కున్న వైదేహి వాసు చెయ్యి చూస్తూ...."అరే, జహంగీరు నాకిష్టమని యెలా తెలుసు. మరి ఇది తెచ్చికూడా ఏం లేదని అంటారేం" అంటూ నోరు తెరిచింది. అందివ్వమని.
    ఎలా మిన్నకుండటం? ఈ అతి స్వతంత్రం కాస్త వెగటుగా అన్పిస్తోంటే మాటి మాటికీ వాచ్ చూసుకుంటూ భోజనం చేస్తున్నాడు వాసు.
    "ఆడపిల్ల కాదుగా! ఆలస్యానికి సంజాయిషీ ఇచ్చుకోవటాని." సోమాసాలు కొసరి కొసరి వడ్డిస్తూ అంది.
    యెంత వద్దు వద్దంటున్నా భోజనం ఎక్కువే అయింది వాసుకి.
    రాత్రి సమయంలో ఇలా భోజనం చేస్తే యేమన్నా వున్నదా!
    ఇదే వదిన అయితేనా అన్నీ విసిరికొట్టేసే వాడు?
    శ్రీమంతులు సామాన్యంగా అందరూ లావుగా వుండటానికి ఈ అతిగా తినటమే నేమో కారణం.
    ఇలాంటి పరిస్థితులని కల్పించే ఈ డబ్బు నాకు వద్దు బాబూ అన్పించింది ఆ క్షణాన.
    "అప్పుడప్పుడూ తప్పక వస్తూవుంటాను" అన్నమాట వాసుదగ్గర తీసుకొని కదిలింది వైదేహి.
    ఇంటికి కాస్త దూరంలోనే కారు దిగేసి అమ్మయ్య" అనుకుంటూ ఇల్లు చేరాడు వాసు.
    పిల్లలిద్దరూ నిద్రపోతూంటే శ్రీలక్ష్మి దిగులుగా కూర్చుంది. రాఘవరావు అప్పటివరకూ ఆగ్రహంతో తమ్ముడు ఇంకా ఇంటికి రాలేదని చిందులుతొక్కి ఆయాసం తీర్చుకుంటూ సీరియస్ గా పేపరు చూస్తూ కూర్చున్నాడు.

                              *    *    *

    విశ్వం దగ్గర నించి వుత్తరం వచ్చింది.
    "ఈమధ్య నా బిజినెస్ లాగానే వుంది.
    మీ మాల యెలా వుంది! పరీక్ష పాసవుతుందా డింకీ కొడుతుందా! కొట్టదులే యెందుకంటే చదువు చెప్పేది నువ్వుగనుక. ఆ అమ్మాయిని అన్నం తిననిస్తున్నావో లేదో యెప్పుడూ చదువు చదువుఅంటూ బోరెత్తిస్తావు. నాకు తెలుసు మా నాయనమ్మ చిన్నప్పుడు నిన్ను చూసి అంటూ వుండేది. అది అక్కరకి వచ్చేకొమ్మ చదువు మినహా మరోవిషయం అక్కరలేదు, నీవూ వున్నావు వూళ్ళోవున్న చింతతోపులూ, మామిడి పిందెలూ? అన్నీ నీవే.... నీకేం చదువు అంటుకుంది అని నిజంగా ఆవిడది వేదవాక్కులని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను B. A మధ్యలోనే వదిలేస్తే నువ్వు M. A పూర్తి చేశావు పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళబోతున్నావు.
    అయినా వాసూ ఆ మొద్దమ్మాయిని ఇంత కష్టపెట్టకప్తె ఓ అయ్య చేతిలో పెట్టేసి కన్య వార పొయ్యరాదూ" అంటూ రాశాడు.
    నిజమే విశ్వం రాసింది. పెళ్ళిచేస్తే సమస్యే వుండదు కాని ఈ అమ్మాయిని చేసుకుంటానని  ముందుకు వచ్చేమగాడు కావాలిగా అని జవాబిచ్చాడు వాసు.
    విశ్వం మాల విషయంలో చాలా కుతూహలం కనబరుస్తున్నాడు ఎందుకు. అతని వుద్దేశ్యం యేమయి వుంటుంది. ఆలోచించాడు వాసు. ఏమో బహుశా అంత ప్రత్యేక విషయం కాకుండా ఆలోచిస్తూ వుండి వుంటాడు. యేది యేమయినా మాల పరీక్ష పాస్ చేయించి యెంత చిన్న ఉద్యోగం మైనా సరే వచ్చేటట్లు చూస్తే ఆపైన విషయం అప్పుడు ఆలోచించవచ్చు.
    ఆలోచనలతో సతమత మవుతున్నాడు వాసు.
    ఈ రోజే వాసూ, ప్రసన్నలక్ష్మి పెళ్ళి లగ్న నిశ్చయం.
    "పెళ్ళి పెద్దలు వస్తే నీవు లేకుండా యెలా" అన్నది శ్రీలక్ష్మి.  
    ఈ తతంగంలో నేనెందుకు అని సణుక్కున్నా ప్రయోజనం లేకపోయింది. పెళ్ళి కూతురు తాతగారు వూరినించి వచ్చారుట ఇప్పుడువచ్చి నిన్ను చూస్తారుట అంటూ శ్రీలక్ష్మి వివరించింది.
    "ఇదిగో పెళ్ళికూతురికి ప్రధానపు వుంగరం చూడు." అంటూ ఓ యెర్రరాళ్ళ వుంగరం వాసు చేతిలో పెట్టింది. అటూ ఇటూ తిప్పి చూశాడు. "బాగానే వుంది. ఇది ఎందుకూ!"
    శ్రీలక్ష్మి నవ్వుతూ అంది. "ఇది పెళ్ళికూతురికి ఈ సమయంలో మనం పెట్టాలి. అంటే ఆ అమ్మాయి ఇంక నీకు నిశ్చయం అయిపోయి నట్లే తెలిసిందా."
    ముందుగదిలో మధ్యవర్తి సమక్షంలో నిశ్చయ తంబూలాల కార్యక్రమం జరిగిపోయింది. పెళ్ళి పెద్దల సంభాషణ అటు తిరిగి, ఇటు తిరిగి నేటి రాజకీయాల్లోకి మళ్ళింది. కబుర్లు మహాజోరుగా సాగిపోతుండగా.
    "వాసు బాబూ......ఒక్కసారి రండి.....నాన్న......నాన్న......" మరేం చెప్పిందో యెవరికీ విన్పించలేదు. అందరూ వాకిలివైపు ఆశ్చర్యంగా మెడలు తిప్పారు.
    ఎవరీ పిల్ల! బాసుతో ఏంపని? అసలెందుకు వచ్చినట్టు?
    క్షణంలో ఆ ప్రదేశం నిశ్శబ్దంగా మారిపోయింది. అందరి దృష్టీ వాసుబాబూ అంటూ ఆ గది అవతల మెట్ల మీదనిచ్చి దాదాపు ఏడుస్తున్నట్లు పిలుస్తున్న ఆ పిల్లమీద నిల్చిపోయినాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS