Previous Page Next Page 
ఆత్మజ్యోతి పేజి 15

   

      "తప్పకుండా అంటాను. ఇంతకంటే పెద్దనేరం నేను ఎక్కడా చూడలేదు. దీనికి విధించదగిన శిక్షకు పరిమితే లేదు. ఆలోచిస్తే విదేశాల్లో చూడండి. పెళ్ళికిముందు ఒకర్నొకరు అర్ధం చేసుకోవటానికి కావలసినంత వ్యవధి వుంటుంది. అదే వారు ఒకరినొకరు అర్పించుకొనే కానుక. కొన్ని కొన్ని దేశాల్లో డౌరి అనే మాట వినం. ఇలా వేలకువేలు ఎక్కడా గ్రుమ్మరించరు."
   
    "ఓహో! అసలు వధువు తల్లితండ్రులు పెళ్ళికొడుకుకోసం వేట ప్రారంభించినప్పుడే మేము యింత యిస్తాం అని డప్పు కొట్టుకుంటారే! ఇలా ఆశలు రేపేది వాళ్ళు కాదా."
   
    "ఏం చేస్తారు మరి? ఆడపిల్లల సంఖ్య మితిమీరిపోతోంది. వధువుకు యుక్త వయస్సు వస్తూవుందనగానే పెద్దవాళ్ళ గుండెల్లో అదటు బయల్దేరుతుంది. కనిపించిన ప్రతివారితోనూ ఈ విషయం కదపటం మొదలుపెడతారు. బ్రతిమిలాడుతారు. భంగపడతారు. ఆఖరుకి అది వారికో సమస్య అయి పోతుంది. పెళ్ళికొడుకుల కరువు ఏర్పడింది. కట్నం తప్పనిసరి అని తెలుసు. అందుకని తమ శక్తిని ముందుగానే ఎడ్వర్ టైజ్ చేసుకుంటే - ఆశపడిన వాళ్ళు తలలూపవచ్చు."
   
    "కట్నం అనేది లంచంకాదు ఓ బహుమతి."
   
    "అలాగా? అందమైన పేరుపెట్టావు. లంచంకాదు అన్నావు. దోపిడీ ఎందుకు సిగ్గులేదో ప్రజలకు-యింత కావాలి, అంతకావాలి అని అడుగుతారు. అన్నీ కుదిరి, అంతానచ్చి-చివరకు కట్నాలదగ్గర పేచీలువచ్చి సంబంధాలు కూడా మానుకోవటంలో మానవత్వం లేదు."
   
    ఓక్షణం ఆగి చంద్రం "నాకు మట్టుకు యిందులో చెడు ఏమీ కనబడటం లేదు. మొగవాడున్నాడనుకో-వాడి చదువునిమిత్తం వేలకు వేలు గుమ్మరించడం లేదా? ఆడదానికి ఆమాత్రం ముట్టచెప్పకూడదా ఏం?"
   
    "ముట్టచెప్పవచ్చు. కానీ అది ఆడదాని పేరుతోనే ఉంచుతామంటే ఒప్పుకోరు గదా యీ అల్లుళ్ళు ఇప్పుడు పురుషుడితో పాటు స్త్రీకి కూడా సమానంగా ఆస్తి యివ్వాలంటున్నారు. అప్పటికైనా కట్నాలు అడగడం మానేస్తే గొప్పవిషయమే. ఇదివరకే పెళ్ళిళ్ళు అయిపోయిన స్త్రీలకికూడా రావల్సిన లెక్క చూసి ఆస్తి పంపకం చేయాలంటున్నారు. మరి యీ అల్లుళ్ళు కట్నాలు రిఫండ్ ఇచ్చేస్తారా అప్పుడు? రైటే, రేపు పోషించేది కొడుకు. వృద్దాప్యంలో అల్లుడెవడూ ఆదుకోడుగదా అదీగాక అందులో వాడు చేసిన త్యాగమేమీ లేదు చదువునిమిత్తం అయిన ఖర్చు పుస్తకాల్లోనో, మనస్సుల్లోనో లెక్కలు రాస్తూనే వున్నాడు-రేపు యిబ్బండికిబ్బండి గుంజివేయడానికి."
   
    ఎవరూ మాట్లాడకుండా ఊరుకునేసరికి కృష్ణ యిలా అన్నాడు. 'చట్టాలు పాస్ చేయకూడదా అంటారు. రేపోమాపో చేస్తారు. శారదాయాక్టు పెట్టిన రోజుల్లో ఎన్నివేల బాల్యవివాహాలు జరిగిపోలేదు? ఇప్పుడు పద్దెనిమిదేళ్ళు దాటితేకానీ ఆడదానికి పెళ్ళి చేయరాదని అన్నారు. దాటితే పెళ్ళికావటం కొందరికి కష్టంగానేవుంది. మా యింటిప్రక్కన వున్న అమ్మాయినిచూసి అనుకుంటాను-ఈ పిల్లను పెళ్ళాట్టానికి వచ్చే బుద్దిమంతుడెవరా అని? కొంత మంది రెండో పెళ్ళిరాయుళ్ళు తయారుగా వున్నారనుకోండి- ఇలాంటి తల్లుల కోసం."
   
    నీ ప్రశ్నకు సమాధానం తరువాత చెబుతాను. అబ్బాయిలూ! అసలు మనం యిలా కూర్చుని తర్కించుకుంటే ఒకదారికి వచ్చే సమస్యలు కావుయివి. చట్టం అనేది రిఫారమ్ అంటారే అదీ మన అంతరంగిక ప్రవర్తన, పరివర్తన మీద ఆధారపడి వుంటాయిగాని కరుకుతనం, చూపులేని అధికారం ఏమీ చేయలేదు.
   
    మనిషికి యింకా ధనం, ఆస్తికంటే ఎక్కువ వుండరాదని ప్రభుత్వం శాసనాలు చేస్తోంది. ఊరికిముందే కొడుకులపేరా, కూతుళ్ళపేరా పంపకాలు చేసి సంపదని విభజింపచేస్తున్నాడు ఆస్తిపరుడు. పొలాలు మార్చి యిళ్ళు కొనేస్తున్నాడు. కొంతమంది లక్షలకు లక్షలు దానధర్మాలు చేస్తున్నారు యూనివర్శిటీలకూ, ఇతరత్రానూ అదంతా బ్లాక్ మనీ, అది ఇన్ కమ్ టాక్స్ లెక్కల్లో వుండదు. ఇవన్నీ నగ్నసత్యాలు. ఇన్ని కబుర్లెందుకు? చంద్రం మీ నాన్న ఇన్ కమ్ టాక్స్ ఎంత కడుతున్నాడు చెప్పరా?"
   
    చంద్రం గయ్ మనేవాడు.
   
    అలా ముగిసిపోయేది. అంతా మొత్తానికి విసుగెత్తిపోయేవాళ్ళు. కాఫీలు త్రాగేసేవాళ్ళు అలసిపోయినందుకు 'ఏం మనుషుల్రా మీరు? ఇంత సింపుల్ కన్ వర్సేషన్ కే బోర్ అయితే లైఫ్ లో యింకేం ప్రొసీడ్ అవుతారు? ఇహముందు ఇంతకంటే పెద్ద పెద్ద వాగ్వివాదాలు రేపి మీ దుంప తెంపేస్తాను' అనేవాడు కృష్ణ.

    మాకు నిజానిజాలు వద్దు. దేశోద్దారణకు కంకణం కట్టుకోలేదు. నువ్వు ఓ స్త్రీని ఆ కోణంలో ఎందుకు ఎక్స్ పోజ్ చేయాలి? సెక్స్....సెక్స్ విషయాలు కావాలి మాకు.
   
    "సరే అది యింకోరోజు."
   
    బ్రతికిపోయానని అంతా సంతోషించేవాళ్ళు.
   
                              *    *    *
   
    శివనాథరావు తండ్రి టెలిగ్రాం యిచ్చాడు. సాయంత్రానికల్లా ఊరు చేరుకుంటున్నామని మధ్యాహ్నమల్లా స్నేహితుడు రాధాకృష్ణ మాటల్ని నెమరువేసుకుంటూ కూర్చున్నాడు శివనాథరావు. తను అతనైతే బాగుండేదా అనిపించింది ఓ క్షణంలో ఈలోగా సరోజిని అతని దగ్గరకు వచ్చి రెండుమూడుసార్లు సంభాషణ చెయ్యాలని ప్రయత్నించింది. పెంచక, త్రెంచటం కనిపెట్టి వదిలివెళ్ళిపోయింది.
   
    వాసు మ్యాట్నీకి వెళ్ళాడు.....సరోజిని చిత్తరువు పూర్తికాలేదు. ఈలోగా వాళ్ళు వచ్చేస్తున్నారు. దాన్ని తీసి పెట్టెలో భద్రంగా దాచాడు. మూడున్నర దాటింది. సరోజిని కాఫీ తీసుకువచ్చింది.
   
    ఓ నిముషం గడిచాక వీరయ్య పైకివచ్చి 'మీకోసం ఎవరో ఆడామె వచ్చిందండీ.' అన్నాడు.
   
    క్షణం బిత్తరపోయి సరోజిని ముఖంలోకి చూశాడు. 'ఎవరా ఆడవారు' అందామె.
   
    "నాకు నిజంగా తెలియదు" అని అతను నిజం చెప్పాడు.       
   
    "ఏం కావాలిట?" అన్నాడు వీరయ్యతో.
   
    "మీతో మాట్లాడాలట."
   
    "ఎన్నేళ్ళుంటాయి?" అని అడిగేసి నాలిక కరుచుకున్నాడు.
   
    "ఇరవయ్యుంటాయి బాబూ."
   
    చచ్చాంరా బాబూ అనుకున్నాడు. ఎవరో పొరబడి తమ యింటికి రాలేదు కదా? లేకపోతే ఏదయినా చందాల బాపతుసరుకా?
   
    "నువ్వూ రా" అన్నాడు సరోజినితో.
   
    "రానులే, నువ్వెళ్ళు."
   
    "రానులే అంటే?"
   
    "రానులే అని."
   
    అతను కోపంగా ఓ చూపు విసిరి, చొక్కా బొత్తాములు సరిగ్గా పెట్టుకుని క్రిందికి దిగాడు. హాలు గుమ్మందగ్గర కనిపించీ కనిపించకుండా ఓ యువతి నిలబడి వుంది. అతను రావటం చూసి తలదించుకుంది. ఆమె గాలివాన యువతి.
   
    నివ్వెరపాటును అణచుకుని "ఏం దొంగా యిలా వచ్చావు?" అన్నాడు కుర్చీలో కూర్చుంటూ ఆమె కొంచెం లోపలకు వచ్చింది. ముఖంకేసి చూసి అదిరిపడ్డాడు. కన్నీటిచారలలా వుంటాయని అతనికంతవరకూ తెలియదు. కుంకుమ చల్లితేగాని చెంపలలా ఎర్రబారవు.
   
    "ఏమిటిది?" అన్నాడు.
   
    ఆమె జవాబు చెప్పలేదు. అతనివంక విశాల నయనాల్తో రెండు చూపులుచూసి రెప్పలు వాల్చింది. నీటిభిందువులు యింకా రెప్పలచాటున నలుగుతున్నాయి. పమిటచెంగు కొన ఎడమచేతి చిటికెనవ్రేలుకు చుట్టుకుంటూ ఊరుకుంది.
   
    "ఏమిటీ ఆకస్మికాగమనం?" అన్నాడు మళ్ళా.
   
    ఈసారి ఆమె ఏదో చెప్పాలని ప్రయత్నించింది గానీ కంఠం రుద్దమై మాట సాగలేదు.
   
    మూర్తీభావించిన శోకంలావున్న ఈ యువతిని చూస్తే ఎనలేని జాలిపొంగిపోతుంది. మళ్ళీ యీ విగ్రహాన్ని చూడగలుగుతానని తానెన్నడూ అనుకోలేదు. ఈమెకు తను ఆప్తుడుకాదు అన్న విషయం అతనికప్పుడు స్ఫురించలేదు.
   
    "నాతో చెప్పరాదా!" అన్నాడు లాలనగా.
   
    అతి ప్రయత్నంమీద ఆమె జీరపోయిన కంఠంతో "మీకు చెప్పుకుందామనే వచ్చాను.....కానీ...." అని వూరుకుంది.
   
    "నా ముందు బిడియపడే ఆడదాన్ని నేనెప్పుడూ చూడలేదు! భలే!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS