Previous Page Next Page 
తుపాన్ పేజి 14

    ఇల్లాంటి ఉత్తమ పురుషు దెవ్వరు,ఎక్కడ ? అతన్ని ఊహించుకొని నేనూ పాటలు రాసుకునేదాన్ని.

                                                   ఎచ్చటుంటివోయీ ఓ పురుషమూర్తీ!
                                                   ఏల  రావైతివీవూ !
                                                   పసిమి పచ్చని బలము బంగారు పండునో
                                                   మిసిమి యవ్వనకాంతి మేలమ్ములాడునో?
                                                   ఎచ్చటుంటివోయి !
                                                   నీవేన  నాధుడవు!నీవేనా ఈ శుడవు!
                                                   నీలోననే నేను నృత్య మయ్యేడి దాన
                                                   ఎచ్చటుంటివోయీ!

                                                                        20

    మా అమ్మగారూ,మా నాన్నగారూ అదితికశ్యపులు!మా నాన్నగారి పేరు వినాయకరావుగారు.మా అమ్మగారి పేరు వెంకటరామమ్మ.మా అమ్మ మా నాన్న రెండవభార్య అని ఎవ్వరూ అనుకోరు.మా తలిదండ్రులకు నేనే ప్రాణం, నేనే బ్రతుకు. మా అక్క చిన్నతనంలో పోవడంవల్ల అప్పటికి ఆరేళ్ళ బాలికనైన నన్ను తీసుకవచ్చి,ఏడుస్తూ చివికిపోతూ మదరాసులో కాపురం పెట్టారు.మేము వచ్చిన రెండేళ్ళకు మైలాపురంలో అళ్వారు పేటలో పిటాపురంవారి'దేన్మోర్ హౌస్ 'స్థలాల్లో ఒక అందమైన మేడ కొన్నారు మా నాన్నగారు.  
   
    సంగీతానికి ఒక మేష్టరు; ఇంగ్లీషు,లెక్కలు,ఫిజిక్సు,కేమిష్టరీ మొదలయిన వాటికి ఒక బి ఏ.;  తెలుగు,సంవత్సరం, చరిత్ర,భూగోళంకు ఒక తెలుగు సంవత్సరం ఎం.ఏ.గారు-నాకు ముగ్గురుపాద్యాయులు.నా ఇష్టం వస్తే చదివేదాన్ని.లేకపోతే మానేసేదాన్ని.మా భవనంలో నేనే రాణిని.

    మా నాన్నగారికి అరవై రెండేళ్ళు వచ్చాయి.మా అమ్మకు నలభై మూడు.అయినా వాళ్ళిద్దరూ జీవికా జీవుల్లాగే ఉంటారు.మా నాన్నగారు కొంచెం బొద్దుమనిషి అయినా అట్టే అంత ముసలివానిలా ఉండరు.కాని,చిన్నతనంలో ఉన్న శక్తి అవీ లేవంటూ,ఏదో మూల్గుతూనే ఉంటారు.డాక్టరు వెంకటప్పయ్యగారు వారానికి మూడురోజులు మా ఇంటికి రావలసిందే.

    మా అమ్మగారు నలభై మూడేళ్లకే తల నెరిసిపోయి,పండులా అయిపోయింది.రహస్యంగా నాకు తెలియకుండా ఎంత ఏడ్చేదో!అందు కోసమే ఆవిడ కళ్ళకు ఎప్పుడూ   జబ్బులే.ఎప్పుడూ కళ్ళ వైద్యమే!కళ్ళాస్పత్రి కోమన్ నాయరుగారు ఆమెకు ఎప్పుడూ ఏదో వైద్యం చేస్తూనే ఉంటారు.

    మా అక్క కోసం మా అమ్మ ఏడ్వని రోజులేదు.ఎవరైనా చుట్టాలు రావడం మా కందరికీ భయం.ఏ పండుగ వచ్చినా భయమే!నన్ను చూచి కళ్ళు తుడుచుకొని వెడనవ్వు నవ్వుతుంది.''ఎందుకే అమ్మ ఆ కళ్ళనీళ్ళు ''అని అంటే తన కంటిలో ఏదోనలక పడిందంటుంది,''అమ్మా మళ్ళీ ఏడుస్తున్నావూ''అని నేనంటే ''ఛా! నేనేడ్చానా  నాన్నా !నువ్వు వట్టి వెఱ్ఱి తల్లివి నాన్నా !నీకు అస్తమానం నా కళ్ళల్లో నీళ్ళే కనబడతాయి''అని అంటుంది.       
 
    మా అమ్మా మా నాన్నా దుఃఖంచూసి,మా అక్క కోసం అంతా ఏడుస్తారు.ఆవిడ ఎంత మంచిదో అని అనుకుంటాను.మా అక్క పేరు శకుంతల.మా అక్క నాకు అంత జ్ఞాపకం లేకపోయినా మా అక్కను గురించి అన్ని కబురులు వినడంచేత,మా అక్కను చూచినట్లే ఉంటుంది నాకు.

    మా పినతండ్రి పినపాపారావుగా రున్నారు. వారు అప్పుడప్పుడు సకుటుంబంగా మదరాసు వచ్చి మా దగ్గిర ఓ పదిహేనురోజు  లుంటూ ఉంటారు.మా పినతండ్రి అంటే మా నాన్నగారి పెదతండ్రికొడుకు.మా పాపారావు బాబయ్య  నవ్యసాహిత్య  కవుల్లో ఒకడు. ఆయన కవిత్వం అచ్చంగా రాయప్రోలు  సుబ్బారావుగారి కవిత్వంలాగే ఉంటుంది.ఆయన మా అక్కను వర్ణించి చెప్తూవుంటే నా కళ్ళు చెమరించి,నా గుండె దడదడ మని,ఈలాంటి అక్కను ఎట్లా పోగొట్టుకున్నానా అని,నేను రహస్యంగా కళ్ళనీళ్ళు కుక్కుకునేదాన్ని.

    పాపారావు బాబయ్యకూ,మా త్యాగతికీ ఎందుకో విపరీతమైన స్నేహం. మా నాన్నగారు,మా అమ్మ మా త్యాగతితో అంత చనువుగా ఉండడం మా స్నేహితలో కాని కందరకూ ఆశ్చర్యము వేసేది.ఎవ్వరీ త్యాగతి?

    ఓ రోజున మా లోకేశ్వరి,మా పాపారావు బాబయ్యతో చాలాసేపు మాట్లాడి, నా దగ్గరకు వచ్చింది. ఆ రోజున లోకేశ్వరి హృదయంలో ఏదో రహస్య విషయం ప్రవేశించిందని ఆశ్చర్యపడ్డాను.

    మా బాబాయి గుంటూరు వెళ్ళిపోయాడు సకుటుంబంగా.ఆయన కుమార్తెలు-నా చెల్లెళ్ళు-వనకుమారి, రాగామాలికాదేవి నన్ను కౌగిలించుకుని''అక్కా గుంటూరు ఒక్కసారి రావే!పెదనాన్నగారు మదరాసు కదలరు.నువ్వూ మదరాసు కదలవు!వెడితే విశాఖపట్నం ఉపన్యాస పరీక్షకు వెళ్తావు,బొంబాయి వెడతావు,కలకత్తా వెడతావు.గుంటూరుకూ యూనివర్సిటీ వచ్చిందిలే,నీ చదువు పూర్తి అయింది.మా చదువులు చూడడానికయినా రావే!''అని అన్నారు.

    వాళ్ళిద్దరినీ కౌగిలించుకొని,ముద్దులు పెట్టి,ఎన్నో బహుమతులు ఇచ్చి పంపాను.రైలుకు వెళ్ళి ఇంటరులో కూచోబెట్టి వచ్చాను.ఇంటికి రాగానే మా లోకేశ్వరి నా చేతిలో ఓ కట్ట పెట్టింది.

    ''హేమం ఇదంతా ఈ రాత్రే చదువు! నా చేతికి ఈ ఉదయమే వచ్చింది.స్చూలులో పాఠాలు ఎల్లా చెప్పానో,కాని వ్రాత పుస్తకం మాత్రం పూర్తిచేశాను''అని పారిపోయింది.ఆ చక్కని బైండు పుస్తకంపై  పేరు చూస్తే 'త్యాగతి కథ'అని వుంది.అది చూడగానే ఎందుకో నా చేతులు వణికినవి.నా కపోలాల చిరుచెమటలు పట్టినవి.
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS