18
త్యాగతి : ఏమిటి అంత తీవ్రంగా మాట్లాడుతున్నారు?
లోకే : గాంధీమహాత్ముని గురించి వాదన వచ్చింది,ఇద్దరికీ.ఆమె వాదన సంగతి త్యాగతికి విపులంగా చెప్పింది లోకేశ్వరి.
త్యాగతి : హిమాలయాను గురించి వాదన వస్తే ఎంతో,మహాత్ముని గురించి వచ్చినా అంతే! అమ్మా సోఫీ,ఆంగ్లరాజ్యానికి చర్చిల్ ఎప్పుడు ముఖ్య పురుషుడు. అతను లేకపోతె ఆంగ్లేయులు యుద్ధం విజయం పొందటం దుర్ఘటంకదా! కాని, ఆయన చిత్తవృత్తులు మనం అర్ధం చేసికోగలమా?మా మాట అలా ఉంచు.మీ ఆంగ్లజాతిలోని ప్రముఖులు అర్ధం చేసికోగాలరా? అలాంటి సందర్భంలో ఆధ్యాత్మిక దేశమైన మా దేశంలో, ఆధ్యాత్మిక పురుషుడైన మహాత్ముడు మీకు అర్ధంకాడు.కాని మీలోని మహానుభావులనేకు లాయన్ను అర్ధంచేసికొన్నారు. అలాగే మాలో కొందరు చర్చిలును సంపూర్ణంగా అర్ధం చేసుకొన్నావాళ్ళూవున్నారు.
నేను :భౌతికం, ఆధ్యాత్మికం అంటావు. ఏమిటా భౌతికమూ,ఆధ్యాత్మికమూ?
త్యాగతి :హేమం !ఒక సంగతి అడుగుతాను. మనకూ,పశువులకూ తేడా ఏమిటి ?
నేను :పశువులకు మెదడులేదు,మనకు మెదడు వుంది.
త్యాగతి :పశువులకూ మెదడు వుంది కాని అది చిన్నది. మనుష్యుల మెదడంత క్లిష్టమైనదికాదు, సరే. మనుష్యుడూ తన బిడ్డల్ని ప్రేమిస్తాడు.జంతువులూ ప్రేమిస్తవి.ఆ రెంటి ప్రేమలో తేడా వుందా?
సోఫీ :ఉండకేం ? జంతువు అవసరం ఉన్నంతసేపే, తర్వాత ప్రేమనే మరచిపోతుంది.
త్యాగతి :కాని మనుష్యుడు జీవితం వున్న దాకా ఎందుకు ప్రేమిస్తాడు? చచ్చిపోయిన చుట్టాల్ని,స్నేహితుల్ని,గొప్పవారిని ఎందుకు ప్రేమిస్తాడు? దేశం అని ప్రాకులాడుతాడు,మానవలోకం అని గగ్గోలు పడతాడు. ఎందుకు సోఫీ?
19
ఆడవాళ్ళకీ, మగవాళ్ళకీ ఉండే సంబందానికీ -మతానికీ ఏం చుట్టరికం ఉందీ? నైతికం అంటే ఏమిటి? కామపరమైన స్త్రీ పురుష సంబంధము నైతికంగా మానవుల్ని అధోగతిలో పడేస్తుందని ఎలా నమ్మగలము?
ఈ ఆలోచనలు ఒంటిగా ఉన్నప్పుడల్లా నాకు వస్తూనే ఉన్నాయి.ఈ విషయాల గురించి నాతో సమానంగా ఆలోచిస్తుంటాడు తీర్ధమిత్రుడు.నైతికమనేది మానవులలో ఒకరి కొకరు కష్టం కలిగించకుండా ఉండటము.అందుకనే మనుష్యుణ్ణి మనుష్యుడు చంపడము తప్పైనా,వారూ వీరూ ఒప్పుకుంటే యుద్దంలో ఒకర్నొకరు చంపుకోవచ్చును.కాని అది దేశపరం కావాలి, అంతే.
అలాగే స్త్రీ పురుష కామసంబంధము ఈ పక్షం ఆ పక్షం ఒప్పుకుంటే నీతిదూర మెట్లా అవుతుంది? పిలిచేవారు పిలవబడేవారు ఒప్పుకొని కదా భోజనానికి వెడుతున్నారు ?అల్లగే పిలిచేవారు పిలవబడేవారు ఒప్పుకుంటే, స్త్రీపురుష సమాగమం నీతిదూరం కాదనే నాకు తోస్తూ ఉంటుంది.
ఈ విషయంలో నాకూ,త్యాగానికీ భేదాభిప్రాయాలున్నాయి.మా కల్పమూర్తి ఈ వాదన వచ్చేటప్పటికి చెవులు మూసుకుని పరుగెత్తాడు.ఈ వాదనలో సోఫీ నన్ను బలపరుస్తూనే ఉంటుంది. కాని ఆ బలపరచడం వట్టి వాదన కోసమేనని నా అనుమానం.లోకేశ్వరి మాత్రం తన అభిప్రాయ మేమిటో ఎప్పుడూ చెప్పదు.
చదువుకోని భారతాంగనల్లో వివాహం ఐనా,స్త్రీ పురుష సంబంధము నైతికానికీ మోక్షానికీ,కొన్ని వేలకోట్ల యోజనాల దూరము ఉందని సాధారణాభిప్రాయం. మనోబలం కాస్త తక్కువగా ఉన్నప్పుడు కొందరు స్త్రీలు మగవాడి మాయలకు లోబడి,ఎప్పుడైనా తమ దేహాల్ని వాళ్ళ కప్పచెప్పడం ఉన్నది. యివి సాదారణ కుటుంబాలలో అప్పుడప్పుడు జరిగే రహస్య సంఘటనలు. అవి లోకానికి కొంచెముగా తెలియవచ్చును.తెలియక పోవచ్చును. అనేక యుగాలనుంచి వచ్చింది కాబట్టి కాబోలు ఈ నైతిక ఆధ్యాత్మికాభిప్రాయం,నేను నాలో ఎంత వాదించుకున్నా నాకు తెలిసియున్నూ తెలియకుండాన్నూ కూడా నా చుట్టూ గోడలు కట్టుతూ ఉంటుంది.
నాకు ఒక్క పురుషుడున్నూ నచ్చడు,నాలో ఏదో ఒక మహత్తరమైన శక్తి ఉన్నదనీ,నాలోని స్త్రీత్వము అధ్బుతమైన స్వరూపము తాల్చినదనీ,నాలోని స్త్రీత్వము ఒక విధమైన పరిపూర్ణత పొందిందనీ నా చిన్న తనాన్నుంచీ మహావధికమగు భావము పెంపొందిస్తూనే వుంది.ఈ భావమే నా హృదాయలో గీటురాయిమీద గీసి వాళ్ళ పురుషత్వాన్ని పరీక్ష చేస్తుంటుంది,నా మనస్సు.
నా పురుష స్నేహితులు నలుగుర్నీ ఆ గీటురాయిమీద గీసుకుని స్నేహం చేయలేదు నేను. ఏ కారణాలవల్ల వీళ్ళు నాకు స్నేహితులయ్యారా అని నేను ఆలోచిస్తూంటాను. అయితే స్నేహానికి కారణాలు వెతికితే దొరక్కపోవు.కొన్ని విషయాలు సంభవించడము కారణాలు చూసుకొని సంభవించవు.అవి సంభవించిన తర్వాత కారణాలు వెతికితే దొరుకుతాయి.
ఆడదానికి ఒక ఆశయ పురుషుడు ఉంటాడు. నాకు వయస్సు వస్తోంది అన్నప్పుడు కామభావాలు కలిగేవి. కాని వాటి తత్వము నాకు ఏమీ తెలియదు.యవ్వనము పొందిన బాలకులు నన్ను చుస్తే నాకప్పుడు ఆనందం.వాళ్ళకు తెలియకుండా వాళ్ళని చూడడమూ ఆనందంగానే ఉండేది.ఈ వికారాలు అనేవి విచిత్రమైన పోకళ్ళు పోయేవి.కరకాగారు వ్రాసినట్లు భారతీయ స్త్రీలకూ,పురుషులకూ కామవికారాలు అంతంత దూరంలోనే ఉంటూ ఉంటాయి.
ఇంతకూ నా ఆశయ పురుషుని రూపం నాకు దిజ్మాత్రంగానే నా భావ నేత్రాలకు గోచరించేది.కాని,ఇది అని నేను నిర్ధారణ చేసుకునే స్పష్టత లేకపోయేది.యవ్వనం ముద్దకట్టినవాడు, దేహం కండలు తిరిగి,నున్నగా గంధం చెక్కతో చెక్కిన పరిమళం,సౌష్టవమూ కలిగినవాడు.సంతతానందమూర్తి,గంభీర కంఠినర్తితగానం కలవాడు,కళామూర్తి,సర్వ విజ్ఞాన కోవిదుడు,ముఖ్యంగా ధనలేమిలేనివాడు,సకల సద్గుణసంపన్నుడు.
