"ఎంత అందంగా ఉన్నావో! ఏ నగ ఇయ్యగలదు నీకింత అందాన్ని? సరే వెళ్ళు. వెళ్ళి చదువుకో . అంతా నాకు చెప్పక్కర్లేదులే! నాకు సంబంధించిన విషయం ఏమైనా ఉంటే, వాడు నన్ను కూడా గుర్తుంచుకుని రాస్తే నాకు చెప్పు."
జానకి కవరు అక్కడే చింపబోయింది.
"ఆ! ఆ! ఇక్కడోద్దు. మీ గదిలో కెళ్ళి చదువుకో! భర్త దగ్గరి నుంచి వచ్చిన ఉత్తరాన్ని ఏకాంతంలోనే చదువుకోవాలి" చిరునవ్వు నవ్వింది కాత్యాయని.
సిగ్గుతో ఎరుపెక్కిన ముఖాన్ని పైకేట్టలేక తడబడే అడుగులతో తనగది చేరుకొని తలుపులు దగ్గరగా వేసి మంచం మీద వాలి ఉత్తరం తెరిచింది జానకి.
డియర్ జానకీ!
........
.......
ఆ రెండు పదాల దగ్గరే నిలిచి పోయాయి జానకి కళ్ళు. 'డియర్ జానకి!' తనలో తను చాలాసార్లు అనుకుంది. ఆ ఉత్తరాన్ని గాడంగా హృదయానికి హత్తుకుంది. కొంతసేపు అలానే పడుకుని మళ్ళా ఉత్తరాన్ని చదవటం మొదలుపెట్టింది.
ఈ ఉత్తరం పూర్తిగా , ఓపిగ్గా చదువుతావు కదూ! ఆ మాత్రం కనికరమైనా చూపించాలి మరి! నా మనసు స్థిరత్వంలో నీకు నమ్మకం కలిగాకే నన్ను భర్తగా అంగీకరిద్దువుగాని. అందాకా మనం స్నేహితుల్లాగా ఉండటానికి నీకు అభ్యంతరం లేదుగా!
సెలవు వున్నా, అలా అకస్మాత్తుగా బయలుదేరి వచ్చేశానని అత్తయ్య కష్ట పెట్టుకుంది. అత్తయ్య కెలా అర్ధమవుతుంది మరి? మగవాడైయుండి అందాలరాశిని భార్యగా పొంది ఆ దేవి పాదపూజ చేసుకోవాలని తహతహ లాడుతూ కూడా అందుకు అవకాశం లభించని వాళ్ళకు అర్ధమవుతుంది నా క్షోభ.
సారీ! నిన్ను నిందించటం లేదు దేవీ! నా బాధ చెప్పుకుంటున్నాను. భయపడి ఉత్తరం మూసేయ్యకు. నీ గులాబీ చేతుల్ని నా చేతుల్లో అదుముకోవాలని ఎంత ఆత్రుతపడుతున్నా, ఊరించే నీ పెదవుల పై నా పెదవులోత్తి నీ గుండెల్లోని మధువుతో నా గుండె నింపుకోవాలని తపస్సు చేస్తున్నా, నిన్ను నిన్నుగా ఉండనీక నాలో ఒక భాగంగా కలిపేసుకోవాలని వెర్రెత్తిపోతున్నా నీ మనసుకి మాత్రం నొప్పి కలిగించను. ఏనాటికో ఒకనాటికి యీ దీనుడి ప్రణయ నివేదన నువ్వు స్వీకరించగలవనే నమ్మకం ఉంది. ఆ ఆశతోనే నవ్వగలుగుతున్నాను. మాములుగా బ్రతకగలుగుతున్నాను.
ఇంకా ఈ ఉత్తరం పోస్టులో వెయ్య్హనేలేదు. అప్పుడే నీ సమాధానం కోసం నా మనసు ఆత్రుతపడుతోంది . చూడు! ఎంత త్వరగా సమాధానమిస్తావో మరి, నీ దయ.
నీ మాధవ.
ఆ ఉత్తరం పదేపదే చదువుకుంది. జానకి శరీరమంతా పులకించింది. ఆమె ఊపిరి ఆమెకే వెచ్చగా సోకింది. సమస్త శరీరాన్ని ఏదో మాంద్యం ఆవహించింది. మనసు జానకికి తెలియకుండానే అంతకుముందు అనుభవించని ఆ అత్యంత మధుర సన్నివేశాలను యదేచ్చగా ఊహించటం ప్రారంభించింది.
దగ్గర దగ్గర ఒక గంట వరకూ ముఖంలో కమ్ముకున్న ప్రేమోన్మత్తత ప్రతి ప్తలిస్తుండగా అలా చైతన్యం లేకుండా పడుకుని ఉండిపోయింది.
సమాధానం రాయాలి. రాయకుండా ఉండకూడదు. కాగితం మీద కలం పెట్ట బోతుండగానే అసలు సమస్య ఎదురయింది జానకికి. ఏమని సంభోధించాలి? నిర్లక్ష్యంగా కనిపించకూడదు. తను వెలితిపడకూడదు. తన మనసులో మమకారం ధ్వనించాలి. ఎంతోసేపు అలోచించి, ఎన్నో ఉత్తరాలు చింపేసి , చివరికేలానో ముగించింది.
నా జీవిత సౌభాగ్యదాతకు!
నమస్కారాలు. మీ ఉత్తరం చేరింది. అందుకో మీరు చూపించిన అభిమానానికి కృతజ్ఞురాలిని. తెలిసో తెలియకో మన పరిచయంలో ప్రారంభం నుంచీ మీకు చికాకు కలిగిస్తున్నానా అని భయపడుతున్నాను/ మీకు సంతోషం కలగటం కంటే నాకు కావలసింది లేదు. ఎటొచ్చి దాన్ని మీరు హృదయ పూర్వకంగా, సంతోషంగా భావిస్తున్నారో, లేక అందినదానితో తృప్తి పది దాన్నే సంతోషంగా సరి పెట్టుకుందామనుకున్నారో , కొంత స్థిమితంగా ఆలోచించుకోమని ప్రార్ధిస్తున్నాను. అంతే, ఏ రకమైన బంధలతోనూ మిమ్మల్ని కట్టేయ్యకుండా మిమ్మల్ని స్వేచ్చగా మీ సంతోషాన్వేషణ పధంలో వదలాలని తప్ప వేరు ఉద్దేశమే లేదు నాకు. మీకంటే అన్ని విధాల అల్పురాలిని . నన్ను స్నేహితురాలిగా అంగీకరించగలిగిన మీ హృదయ వైశాల్యానికి ఎంతని మెచ్చుకోగలను!
ఉంటాను.
మీ దాసీ జానకి.
తిరుగు టపాలో జానకికి సమాధానం వచ్చింది.
డియర్ జానకి!
నువ్వు పరమ క్రూరురాలివి. నీ దగ్గర నుండి ఉత్తరం వచ్చిందన్న సంతోషాన్నంతటినీ ఆ ఉత్తరంలోని "కృతజ్ఞత ' 'దాసి' 'హృదయ వైశాల్యం ' వగైరా పదాలు మింగేశాయి. మరోసారి ఉత్తరంలో యీ మాటలు వాడావా వెంటనే నీ దగ్గర కొచ్చి నీ లెంపలు టపటప వాయించేస్తాను. ఆ తరువాత నన్ను కాముకుడని నువ్వు నిందించినా సరే!
సంతోషాన్వేణ పధంతో నాకు నిమిత్తం లేదు జానకీ. అసలు అన్వేషణతో నిమిత్తం లేకుండానే, ఏ దివ్య శక్తి వరం వల్లనో నా బ్రతుకు మొత్తాన్ని పువ్వుల బాట చేయగలిగిన మధురమూర్తి నాకు లభ్యమయింది. ఇంక నాకు అన్వేషణ దేనికి? నా మాటలు నిన్ను వెంటనే నమ్మమనటం లేదు సుమా! నా మనసులోది చెప్పాను. అంతే! నీకు నమ్మగలిగిన శక్తి వచ్చిననాడు నమ్ముదువు గాని, అంతవరకూ మంచి స్నేహితులం. ఇంకమీదట దాసీ, గీసీ అంటూ రాయవుగా!
నీ మాధవ.
పి.యస్. 'సౌభాగ్యదాత' కూడా బాగులేదు. తెలుగులో పదాలే కరువయ్యాయా నన్ను పిలవటానికి?
మాధవ.
ఆ ఉత్తరం చదివి నవ్వుకుంది జానకి. ఏదో నూతనోత్సాహం ఆమెలో పురులు విప్పుకుంది.
నా స్వామికి ,
మీ ఉత్తరం అందింది. ఉత్తములు తాము చూపించిన కరుణ క్షణంలో మరిచిపోగలరు. కాని ఆ కరుణను స్వీకరించినవారు కూడా మరిచిపోవటం న్యాయమవుతుందా? ఎంత మాటన్నారు! నేను మిమ్మల్ని నిందిస్తానా? మీ మేలుకోరి కాస్త హెచ్చరించాను. అంతే. ఏ దివ్యశక్తి వర ప్రసాదమో మన విహహమనుకుంటే ఆ వర ప్రసాదం నాకు. దాన్ని మీదిగా భావించటం అన్యాయం సుమా! 'దాసీ' అనవద్దని రాశారు. ఏం? ఆ పదానికేం తక్కువైంది? నిరంతరమూ మీ సాహచర్యంలో వుండి మీ సేవలు చెయ్యగలిగే సౌభాగ్యం ఎంత అనందదాయకమో మీరు ఆడవారయితే తెలిసేది. అప్పుడు 'దాసీ' అన్న పదాన్ని చులకనగా చూడరు. సరేలెండి. మీరు ఆజ్ఞాపించినట్టే.
మీ జానకి.
నా జానకీ!
అతి అమాయంగా కనిపించే నీలో ఇంత అల్లరి ఏమూల దాక్కుందో అర్ధం కావటం లేదు. 'దాసీ' అననులెండి అంటూనే 'మీరు ఆజ్ఞాపించినట్లే' అంటావా? అజ్ఞాపించాను కనుక నాదానివవుతావా? అబ్బా! జానకీ! నువ్వు నన్నేప్పటికర్ధం చేసుకుంటావు? నువ్వు నాదానివి కాకపోయినా భరించగలనేమో కాని ఆజ్ఞాపించి నాదానిని చేసుకోగలననుకుంటున్నావా? నేను ఆడదాన్ని కాను. సేవలో అనందం మాట నాకు తెలియని సంగతి నిజమే. కాని సాహచర్యంలో మాత్రం మాధుర్యం తెలుసును. మొగవాడ్ని కదా! నీ ప్రతి చిన్న కదలికతో నా ఎదలో పులకలు నింపే నీ సాహచర్యం కోసం నేను తక్కువ ప్రతీక్షిస్తున్నాననుకుంటున్నావా? సేవలు చెయ్యడంలో అనందం నీకయితే సేవా సమయ సంస్పర్శలు నాకు అనందదాయకాలు. కాని జానకి ఈ ఏప్రిల్ వరకూ నిన్నక్కడకు తీసుకురాలేను. మాకు సెలవులియ్యగానే నేను ఆకక్డికి వచ్చేస్తాను. మళ్ళీ జులైలో మనమందరం కలిసే ఇక్కడకు వద్దాం జానకీ! ఈ ఉత్తరం అందిన కొద్ది రోజుల్లో నీకో పార్శేలు కూడా అందుతుంది. మొన్న బజార్లో వెడుతుండగా ఒక అందమైన తెల్లచీర కనిపించింది. కొన్నాను. నీకు కాక ఎవరికి పంపించను? నా ఈ బహుమతి కాదనకుండా స్వేకరిస్తావు కదూ! ఈసారి నేను వచ్చేసరికి నువ్వు నాకా చీరలోనే కనిపించాలి. కనిపిస్తావు కదూ?
నీ
మాధవ.
ఉత్తరాన్ని చదివి పొంగిపోయింది జానకి. వెంటనే సమాధానం రాసింది. అలా ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిపోయాయి.
* * *
