ఆ రాత్రి హఠాత్తుగా ఒకానొక అమూల్య మహిమవల్ల ఒక కాంతి నా ముందు దీప్తివంతమయింది. ఈ అరణ్య మానవునిని ఏదో విధముగా రక్షించగలిగితే నేను గొప్ప కార్యము చేయడానికి సమర్దుడనవుతానని గ్రహించాను. నేను రాత్రంతా కనురెప్ప వాల్చకుండా అతనికి ఉపచారము చేశాను. కాని పిన్ని సంపత్తిని పిన్నికి తిరిగి ఇవ్వలేకపోయాను. నా గుమాస్తా వెళ్లిపోతున్నాడు.
భీష్మ, ద్రోణ, భీమార్జునులు గొప్పవారే, కాని ఈ మనిషికి కూడా విలువ తక్కువేంలేదు. అతని విలవను ఏ కవీ ఊహించలేదు. ఏ పాఠకుడూ ఆమోదించలేదు. ఇందువల్ల అతని విలువ తక్కువ అని అనరాదు. ఒకప్రాణి అతని కొరకు తనదంతా దోచిపెట్టాడు. తిండి బట్టతోకూడా నెలకు 9 రూపాయలు దొరికేవి. అదయినా పన్నెండు మాసాలు దొరికేది కాదు. గొప్పతనము తన జ్యోతి నుంటి స్వయముగా ప్రకాశిస్తుంటుంది. కాని మనసాటి కాంతివిహీన మానవుడు బయటి ప్రేమరూప జ్యోతితో వెలుగొందుతాడు. పిన్ని ప్రేమ కరదీపికను పుచ్చుకుని మానవుడు యెలా ప్రేమతో హఠాత్తుగా ప్రకాశిస్తాడో మనం చూడగలుగుతాము. చీకటిలో ఏదీ కనిపించనిచోటు, ప్రేమ రూపకిరణము పడడంతో, జనంతో నిండివుందనీ హఠాత్తుగా గోచరిస్తుంది"
నిర్ఘరిణి మందహాసం చేసి. "మీరు ఇంతకు ముందుకూడా తమ విదేశీలేఖకుని మాట వినేవున్నారు. అతని మాట వినిన తరువాత మనదేశీవంటవాడు. నీకు జ్ఞాపకం వస్తూన్నాడు. కొద్దిరోజుల క్రితం యిద్దరు పిల్లలను వదలి అతని భార్య మరణించింది. ఆ తరువాత కూడా వాడు పనిచేస్తూనే మధ్యాహ్నం పూట పంకా లాగుతుంటాడు. కాని యిపుడు అతని నవ్వు అణగిపోతుంది. ఇపుడు వాడు దుర్బలుడయిపోయాడు. వాని రూపంచూసి నాకు చాలా దయ కలిగింది. చాలా కష్టం వేసింది. కాని ఆ కష్టం అతని కోసం నా మనసులో లేదు. పైగా మానవత్వం కోసం వుంది. నేను నా మనసును బాగా తెలుసుకున్నాను. ఆ మానవత్వంలోని ఈ పరిస్థితిని చూసి యెపుడూ నాకు కన్నీరు ప్రవహిస్తూంటుంది" అని అన్నది.
"యిందులో ఒక సబబు వుంది. అతనికి ఆ నౌకరుకు కలిగిన కష్టాలు మానవత్వానివి. సకల మానవులు ప్రేమిస్తారు. వియోగమపుడు మృత్యువువల్ల దుఃఖ మనుభవిస్తారు. పంకాలాగే ఆ నౌకరు మలిన ఖిన్న ముఖంమీద సమస్తప్రాణుల ధ్యాన ప్రతిబింబం చిత్రతమయింది" అని నేను అన్నాను.
దానిమీద నిర్ఘరిణి, "ఇంతేకాదు. నా అభిప్రాయంలో భూమి మీద కష్టాలు ఎన్ని వున్నాయో తెలియదు. కొందరు ఓర్పుతో పనిచేయ లేకపోతున్నారు. కొందరు అనవసర ప్రేమానుబంధంలో చిక్కుకుంటున్నారు. నా నౌకరు నోరు మెదపకుండా పంకా లాగుతున్నాడు. పిల్లలు తీవాసీమీద దొర్లుతున్నారు. కిందపడి కేకలువేస్తూ లేస్తున్నారు. అపుడు తండ్రి ముఖం నిమిరి కేకలు వేయడానికి కారణం తెలుసుకోవడంలో నిమగ్నమయినాడు. కాని పంకా వదలి వెళ్లడానికి సాహసించలేదు మానవులకు జీవితంలో చాలా తక్కువ విశ్రాంతి రాసిపెట్టివుందా, లేదా తిండీచింతా వారిని సర్వకాల సర్వావస్థలందూ పీడిస్తుంటుందని అనుభవం మీద తెలుసుకున్నాను. జీవితంలో కావలసినన్ని దుర్ఘటనలు యెందుకు జరగడం లేదు? గుప్పెడు బియ్యంకోసం నాగా పెట్టకుండా పనిచేస్తున్నారు. ఒక క్షణం ఆలశ్యమయితే యెవరూ క్షమించరు. భూమిమీద అటువంటి మనుష్యుల కష్టాలను, దుఃఖాలను నేను కొంచమయినా అర్దంచేసుకోలేదు. వారికికూడా కష్టాలు వస్తాయని, వారు కూడా మానవులేనని, వారుకూడా గానుగెద్దులాగా పనిలో నిమగ్నమయి జీతం తీసుకొంటారు. వారిమీద స్వాంతనం, దయ, స్నేహం చూపించం. భూమి ఒక్కసారిగా చీకటిలో మరుగుపడితే మనదృష్టి వారిమీద పడదు. కాని నిజానికి కాంతివిహీనమయిన దేశమందలి మానవులు కూడా ప్రేమిస్తున్నారు. వారు కూడా ప్రేమకు యోగ్యులే. గౌరవం లేని మనుష్యులు, తమకు తాము ద్యోతకం చేసుకోలేరని నాకు అనిపిస్తూంటుంది. మూగ, చెవిటి వారికి కష్టాలు వస్తూనే వుంటాయి. వారిని మానవులుగా పరిచయం చేయడం, ఆత్మీయుడనే భావం తీసుకురావడం, వారిమీద కావ్యకాంతిని ప్రసరింపజేసి ప్రకాశింపజేయడం నేటి మన కర్తవ్యం" అని అన్నది.
