Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 14

 

    'వాటితో మీకేంపని. ఇటియ్యండి. ఎక్కడ పెట్టాలి సంతకం - 'శారద పెన్నుచేత్తో తీసుకుంది. ఒక్కక్షణం ఆగి సంతకం పెట్టేసింది.
   
    అది అన్నగారిపేర తండ్రి, తక్కినవాళ్ళు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ - అంటే నాన్నగారు ఏ ఊరెళ్ళినా, ఆరోగ్యం ఎలా వున్నా ఆయన తరపున బేరసారాలుచేయటానికి, రిజిస్టరు చేయించడానికి అందరి తరపున కాగితం అది - అందరూ తలో ఊర్లో వున్నారు కనక అందరూ ఒకసారి చేరటం కూడా ఇబ్బందేకావచ్చు అందుకే ఇది - పెద్దన్నయ్య వివరించాడు.
   
    'ఆస్తి తీసుకుంటే సరికాదు తల్లీ, బాధ్యత కూడా వహించాలి' - గట్టిగా అంది చిన్నవదిన.
   
    శారదమాట్లాడలేదు - అంటే వాళ్ళ ఉద్దేశం - తోట అమ్మిన డబ్బులో తనకీ కొంత యిస్తారు కనక బాధ్యత వహించాలా - అంటే ఎవరి బాధ్యత - పెద్దన్నయ్య కూతురు పెళ్ళిబాధ్యత - చిన్నన్నయ్య కొడుకు చదువు బాధ్యతా - పైగా ప్రస్తుతం తనకి పిల్లలులేరు - భర్తతో విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోంది. కనక తనకి డబ్బుతో ఏం పనీ అని వాళ్ళ ఉద్దేశమా - కాదు, శారదకి అర్ధమయింది వాళ్ళనే బాధ్యత ఏమిటో - ముసలితండ్రి బాధ్యత !-
   
    'మీరంతా ఏ బాధ్యత నా నెత్తిన పెట్టి నా భరిస్తాను. అంతేకాదు ఆ డబ్బు మీరివ్వక పోయినా నాకు అభ్యంతరం లేదు' శారద లేచి భోజనానికొచ్చింది. అక్కడ వాతావరణం అంతా ఎంతో కొత్తగా వున్నట్టు అనిపించింది. అమ్మలేనిలోటు ఒక్కసారిగా తెలిసిపోయింది శారదకి.
   
    అన్నయ్యకూతురు పన్నెండేళ్ళపిల్ల అచ్చం శాంతమ్మ లాగేవుంది. తల్లిని చూస్తున్నట్టే అనిపించింది ఆ పిల్లని చూస్తుంటే శారదకి. ఆ పిల్ల, దాని అన్న శారదవైపే చూస్తున్నారు. ఏదో గుసగుస చెప్పుకుంటున్నారు.
   
    'పందెం వేద్దామా' ఆ పిల్ల అంది.
   
    'ఆ. వేద్దాం. ఎంత' పిల్లాడు అన్నాడు శారదవైపు చూస్తూ.
   
    'పది రూపాయలు' పిల్ల శారద వైపేచూస్తోంది. ఇద్దరూ శారద దగ్గరకొచ్చారు.
   
    'అత్తా నీకు పెళ్ళి అయిందికదూ' - పిల్లాడు శారద వంక చూస్తూ అన్నాడు.
   
    శారద ఒక్కసారి ఉలిక్కిపడింది.
   
    'ఆ' అంది వెంటనే.
   
    'చూశావా నేనే గెల్చాను. ఇయ్యి పదిరూపాయలు' చెల్లెల్ని చూస్తూ అన్నాడు.
   
    'నిజంగా నాఅత్తా. మరి, మరి మా అమ్మ, పిన్నివాళ్ళు వేసుకొనేవి నువ్వు వేసుకోవేం. నీకు వేళ్ళకి అవి లేవేం - ఆ పిల్లచాలా ఆసక్తిగా అడిగింది.
   
    శారదకి ఏం చెప్పాలో తెలియలేదు - ఈ మాటలు పిల్లలవేనా వాళ్ళ అమ్మలు అడిగిస్తున్నారా, ఏమన్నా కానీ, --
   
    'నేను అవన్నీ వేసుకోను - నా కిష్టం వుండదు' - శారద అనడంతోనే 'నువ్వు పెళ్ళి చేసుకున్నావు - అంతే నాక్కావలసింది - ఇయ్యి పదిరూపాయలు' - రెట్టించాడు పిల్లాడు.
   
    ఒక్కరోజు వుండేసరికి ఇంక అక్కడ ఉండబుద్ది పుట్టలేదు శారదకి.
   
    'వెళ్ళగానే నేను పెద్ద ఉత్తరం రాస్తాను నాన్నగారూ' శారద రిక్షా ఎక్కిస్టేషను కొచ్చేసింది. మనసంతా శూన్యంగా వుంది ఎందుకో!
   
                                  *    *    *
   
    శారద తలుపు తీసుకుని లోపలకొచ్చింది. రోజూ తనొక్కర్తే వుండే ఇల్లే - అయినా ఈ రోజు మరీ బోసిగా, ఇల్లంతా ఏదో వెలితిగా అనిపించింది శారదకి.
   
    'అయినా తనకేమిటో వంటరి బతుకు - ఛీ' - శారద చిరాగ్గా ఇల్లంతా తుడుచుకుంది. స్నానం చేసి వచ్చింది. టీ పెట్టుకుతాగుతుంటే కాలింగ్ బెల్ మోగింది. తను ఊరినించి వచ్చినట్టు అప్పుడే ఎవరికీ తెలిసిందో అనుకుంటూ తలుపుతీసిన శారద ఆశ్చర్యపోయింది. ఎదురుగా లలిత!-
   
    'చాలా రోజులయింది మా యింటికొచ్చి నువ్వు - నాన్నగారూ బాగున్నారా' శారదని పల్కరించింది లలిత.
   
    'అ - అదే బాగుండటం. నువ్వు ఊళ్ళో లేవా "-
   
    'ఏం - నువ్వెప్పుడొచ్చావు'
   
    'వరుసగా రెండు రోజులనుంచి వస్తున్నాను' - లలిత అటు ఇటు చూస్తోంది.
   
    'ఏమిటి -నాతోపనేదైనా వుందా' -
   
    శారద లలితని ఈ మధ్య కలుసుకోటమేమానేసింది. ఎప్పుడైతే నీరజ, దినేష్ లతో స్నేహం పెరిగిందో అప్పుడే లలిత స్నేహం తగ్గింది దీనికి తోడు తానుగా విడాకులకు నోటీసు రామనికి పంపిందో, అప్పటినుంచి ఒక్కసారికూడా లలితను చూడలేదు శారద'
   
    'రామం మళ్ళీ సిటీకే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు' అంది లలిత.
   
    'ఎందుకనో హైదరాబాదు వదిలి వుండలేడా' అంది శారద.
   
    లలిత నోటి వెంట రామం పేరు వినడంతో శారద ఒళ్ళు భగభగమండిపోయింది. ఒకనాడు ఎంతో ఆదర్శమూర్తిలా కనిపించి తనని మోసం చేసి పెళ్ళిచేసుకున్నాడని, తనకి అతనికి అభిప్రాయభేదాలున్నాయని, మనసులు కలవకుండా మనుషులు కలసి జీవించడం అసాధ్యమని చెప్పి, ఇవే ముఖ్యాంశాలుగా విడాకులకు కేసువేసింది శారద. ఆనాడు నోటీసు అందుకున్న రామం ఏం చేయాలో తోచక లలిత దగ్గరకొచ్చాడు అయ్యో, విడాకులకు నోటీసిచ్చిందా. రామం, నీలాటి మంచి మనిషి దానికి మళ్ళీ జన్మలో దొరుకుతాడా ఉండునేవెళ్ళి మాట్లాడుతాను అంది ఆవేశంతో లలిత ఆనాడు 'ఒద్దు లలితా -కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది - కొన్నాళ్ళయ్యాక శారద మనసు మారచ్చు, కేసు విత్ డ్రా చేసుకోవచ్చు. ఏమో, ఎంత ఆశావాదివి రామం నువ్వు అభినందించింది లలిత. రాజీకుదర్చటానికి ఎంతో ప్రయత్నం చేసింది లలిత. రామం వైపు న్యాయవాది రామనాథం రెండు మూడుసార్లు కబురుపెట్టాడు. రామం శారద ఒక్కసారి కలసి మాట్లాడుకుంటే ఇద్దరికీ మంచిదని - కానీ శారద ఒక్కసారికూడా ఆ ప్రయత్నం చేయలేదు 'విడాకులు తీసుకుని బతకలేననుకుంటున్నాడా. కావాలనుకుంటే తనను పెళ్ళి చేసుకుందుకు ఎందరో ముందుకొస్తారు. అతను చేసుకోవచ్చు కూడా. అయినా నాకేం భయం. నేనెందుకు కేసువిత్డ్రా చేసుకుంటాను. ఏం, విడాకులు తీసుకున్న ఆడవాళ్ళు సంఘంలోలేరా. తనూవాళ్ళలో ఒకతే ఈమాటలునావిగాపోయి చెప్పు ఆ రామానికి అంది శారద ఎంతో గర్వంగా కోపంతో.
   
    'ఇప్పటికి కేసు మూడు సార్లు వాయిదా వేయించావు మీప్లీడరు చేత - ఇప్పుడు, అదే ఈనెలాఖరుకి వుంది ఈమాటురామం ప్లీడరు ఎలాగైనా ఆర్నెల్లపైవరకూ కేసుఎటూతేలకుండా చేస్తానంటున్నాడు - చూడు శారదా - నీకనిపించవచ్చు - నా కెందుకు మధ్యలో అని - కానీ నువ్వు రామం పెళ్ళిచేసుకున్నపుడు సాక్షి సంతకం పెట్టింది నేను - మీరిద్దరూ కలసి హాయిగా జీవించాలని కోరుకున్నది నేను - అందుకేనేను ఎలాగైనా మిమ్మల్ని మళ్ళీకలపాలని చూస్తున్నాను -
   
    లలిత మాటలు అర్ధంకావటం లేదు శారదకి - అంటే, తను కేసు విత్ డ్రా చేసుకోవాలా - పొరబాటైంది మేము కలసి జీవిస్తామని మళ్ళీ జడ్జిగారి దగ్గర చెప్పుకోవాలా ఇవన్నీ నా ప్లీడరు చేత చేయించాలా ఎందుకు, ఎందుకు - అసలు లలితకేం బాధ్యత వుంది ఈ విషయంలో - 'నో, నో' - శారద గట్టిగా అరిచింది.
   
    'ఏమిటది - ఫిట్స్ లాగ - నెమ్మదిగా చెప్పు  ఏం చేయాలో లలిత శారద వంక ప్రశాంతంగా చూసింది. 'నాకు పిల్లలు లేరుకనక, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను కనక అతని దగ్గర నుంచి నాకేమీ రాదు - ఏమెయింటెనెన్సుకోరటంలేదు. ఏం, నేనేం చేశానని -ఈలోకానికంతటికీ శత్రువైన ఆడపిల్లను కనను అంటే తప్పా - అందుకే ఇలాటి సంకుచితత్వం ఉన్న వ్యక్తితో జీవించలేను - లలితా - ననన్నెందుకు విసిగిస్తావు వెళ్ళిపో - ఆరామం పేరు మరోసారి నా ముందు తీసుకురావద్దు - శారద కోపంగా లేచింది - అంతలో దినేష్ వచ్చాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS