Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 13


    లాగి చెంపపైన కొట్టాలనిపించింది అభినయ్ కి. అది రైల్వేస్టేషన్ అని ఆవేశాన్ని ఆపుకున్నాడు.
    "సరే.... పద.... పద..." అన్నాడు హడావిడి చేస్తూ కూలీ లగేజీ బెర్త్ కింద సర్దేసి వెళ్ళిపోయాడు డబ్బులు తీసుకుని.
    ట్రైన్ మెల్లగా బయలుదేరి వేగం పుంజుకుంది. అభినయ్ కోపంతో ఏం మాట్లాడలేదు.
    విరాజ అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ "కోపమా?" అంది.
    అతను తన చెయ్యి లాగేసుకుని ముఖం తిప్పుకున్నాడు.
    విరజ కళ్ళల్లో నీళ్ళు...
    "సారీ అభీ! రియల్లీ సారీ! ఇంటికి రాకుండా, డైరెక్ట్ గా స్టేషన్ కి వచ్చేస్తానన్నాననే కోపంతో, నీకు టెన్షన్ తెప్పించాలని... సారీ.... సారీ.... సారీ...' అంది లెంపలేసుకుంటూ.
    "సర్లే, సెల్ ఎందుకు ఆఫ్ చేశావు? కనీసం ఫోన్ లో కాంటాక్ట్ చెయ్యడానికి కూడా వీల్లేకుండా..."
    "ఇద్దరం కలిసి వెళ్తున్నాం కదా అని నా సెల్ ఆఫ్ చేసి అలమారులో పెట్టేసాను".
    "గొప్పపని చేశావ్".
    ఎదురుగా ఉన్న ముసలి దంపతులు వీళ్ళ సంభాషణకి నవ్వుతూ వీళ్ళవైపే చూస్తున్నారు.
    "ఎందుకమ్మా మరి అలా చేశావ్! అబ్బాయి ఎంత కంగారు పడ్డాడో తెలుసా?" అంది ఆవిడ ఆప్యాయంగా.
    "అవునా ఆంటీ!" అంది విరాజ కూడా నవ్వుతూ ఆవిడ మాటల్లో పడిపోయింది విరజ.
    తనపేరు సత్యవతి అని, కూతుర్ని చూడ్డానికి వైజాగ్ వెళ్తున్నానని చెప్పింది ఆవిడ.
    కూతురికోసం పిండివంటలన్నీ చేసి తీసుకు వెళ్తున్నట్టుంది సీల్ డబ్బాలు మెరుస్తూ బుట్టలో కనిపిస్తున్నాయి.
    కాసేపటి తర్వాత ఆవిడ పేపర్ ప్లేట్లు తీసి, ఆ డబ్బాలో ఉన్న సున్నిఉండలు, కోవాకజ్జికాయలు, కారప్పూస పెట్టి అభినయ్ కి, విరజకి, భర్తకి ఇచ్చింది.
    "వద్దాంటీ!" అన్నా వినలేదు ఆవిడ. ఆప్యాయంగా తీసుకోమంటూ గొడవ చేసింది.
    అభినయ్ కి అలాంటివన్నీ ఏమీ ఇష్టం వుండవు. అతనికి అప్పటికప్పుడు తయారుచేసిన టిఫిన్సే ఇష్టం.
    అదే చెప్పింది విరజ ఆవిడకి.
    "అన్నీ పెట్టాలమ్మ భర్తకి, ప్రతిదీ అలవాటు చెయ్యాలి. ఏంటో ఈ కాలం పిల్లలు... సరిగ్గా తిననే తినరు..."
    "నేర్చుకో.... విను" అంది అభినయ్ చెవిలో మెల్లగా విరజ.
    కోపంగా చూశాడు అభినయ్.
    అదేం పట్టించుకోలేదు విరజ. అతనికోపం తామరాకుమీద నీటి బొట్టులాంటిదని తెలుసు.
    
                                                               * * *
    
    "బోర్ కొడుతోంది విరజా! ఏదైనా గేమ్ ఆడదామా? అన్నాడు అభినయ్ కాసేపటి తర్వాత.
    "ఏం ఆడదాము?"
    "పేపర్స్  వున్నాయా? నీ దగ్గర"
    "ఆఁ! ఉండు చూస్తాను..." అంటూ బ్యాగ్ వెతికింది. ఎప్పుడో చీరలు కొన్న బిల్లులు, చెప్పల్స్ కొన్న బిల్లులు కనపడ్డాయి అందులో అవితీసి "వాటివెనక ఆడదాం" అంది పెన్ తీస్తూ.
    "అలాగే" అన్నాడు అభినయ్.
    "ఏమాత చెప్పు?"
    "చుక్కలాట... ఆడదాం..."
    "అదేంటి?"
    "చుక్కలన్నీ పెట్టి చూపించాడు. అవన్నీ కలపాలి. ఒకరితర్వాత మరొకరు. ఎవరికెక్కువ బాక్స్ లు వస్తే వాళ్ళు గెలిచినట్లు అన్నమాట. ఆ బాక్స్ లో వారి పేరులోని తొలి అక్షరం రాయాలి."
    "సరే... సరే..." అంది విరజ ఉత్సాహంగా.
    ఇద్దరూ అడ్డం మొదలు పెట్టారు.
    సత్యవతి కూడా ముందుకు జరిగి, విరజకు సలహాలు ఇవ్వసాగింది.
    ఈ గేమ్ లో తాము గెలిచినా, గెలవకున్నా పర్లేదు. ఎదుటివారు మాత్రం గెలువకుండా చూసుకోవాలి. అదీ టెక్నిక్.
    మొత్తానికి విరజ, అభినయ్ ఆ గేమ్ ఆడ్డంలో మునిగిపోయారు.
    చివరికి అభినయే గెలిచాడు.
    "ఛ... ఛ... మోసంచేసి ఆడావు..." అంది విరజ గబగబా ఆ కాగితం చింపేస్తూ.
    "ఒట్టి కుళ్ళుమోతువి. పోన్లే నువ్వె గెల్చావనుకో.." దయతలుస్తున్నట్లు అన్నాడు అభినయ్.
    "వద్దు నేను చపాతీ, చికెన్ కర్రీ తెచ్చాను నీకిష్టమని. కొంచెం కర్డ్ రైస్ కూడా తీసుకొచ్చాను అవి చాలు".
    అభినయ్ మనసు కలుక్కుమంది.
    "అరె! నా కోసం కష్టపడి చేశావా?" అన్నాడు.
    "అవును నీకిష్టం కదా ట్రావెలింగ్ లో చపాతీ కర్రీ అందుకే చేశాను".
    "థాంక్యూ...."
    "ఇట్స్ ఆల్ రైట్ సర్...." అంది నవ్వుతూ.
    
                                  * * *
    
    కాసేపు కబుర్లు చెప్పుకున్నారు.
    నైట్ నైన్ కి ఎదురుబెర్తువాళ్ళు "ఇక పడుకుందామా?" అన్నారు.
    "విరూ? ఏం చేద్దాం?" అన్నాడు అభినయ్.
    విరజకి అభినయ్ వడిలో తలపెట్టుకుని పడుకోవాలని వుంది. అందుకే....
    "ఆంటీ! మీరు పడుకోండి. మేం కాస్సేపున్నాక పడుకుంటాం..." అంది.
    "సరేనమ్మా!" అంటూ ఆవిడ టాయ్ లెట్ కి వెళ్ళి వచ్చింది.
    వాళ్ళు బెర్త్ పై వాళ్ళు పడుకున్నారు.
    లైట్ ఆఫ్ చేసింది విరజ. వాళ్ళకి డిస్ట్రబ్ కాకూడదని.
    ఏ.సి. చాలా హైరేంజ్ లో పెట్టడంవలన చల్లగా అయిపోయింది మొత్తం కంపార్ట్ మెంట్ అంతా. రైల్వే వాళ్ళు నీట్ గా సర్దిపెట్టిన బ్లాంకెట్, పిల్లోని చేతిలోకి తీసుకుంది విరజ.
    "పడుకుంటావా?" అడిగాడు అభినయ్.
    "పడుకుంటాను..... నీ వొళ్ళో.... తలపెట్టుకుని..." అంది ఏమంటాడోనని భయపడుతూ.
    "సరే..." అన్నాడు అభినయ్ అభయమిస్తున్నట్టు. అతను కూర్చున్నాడు. విరజ అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంది.
    "నీకేం డిస్ట్రబెన్స్ కాదుగా" అంది అతనికి నిద్ర వస్తోందేమోనని.
    "ఏంలేదు. పడుకో..." అన్నాడు ముంగురులు సవరిస్తూ.
    అతని కాలుపై తలపెట్టి, అతనివైపు చూస్తూ పడుకుంది విరజ.
    అతను ఆమె తల నిమురుతూ- ఉండిపోయాడు.
    విరజకి అన్పించింది. ఆ క్షణం తనో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అనీ, కోటీశ్వరురాలని కూడా గుర్తు రాలేదు. హాయిగా, నిశ్చింతగా అలాగే అతని ఒడిలో ఎంతసేపయినా పడుకోవాలనిపించింది.
    కానీ అభినయ్ కి కాలు నొప్పిపెడితే....
    అమ్మో! తను భరించలేదు.
    "అభీ! ఇక చాల్లే వెళ్ళి నీ బెర్త్ పై పడుకో....' అంది.
    "ఏం అప్పుడేనా? ఏవైనా కబుర్లు చెప్పు విరజా!" అన్నాడు అభినయ్ తలనిమురుతూ.
    అప్పటికే కంపార్ట్ మెంట్ లో అందరూ బెర్త్ లు పరుచుకుని నిద్రకు ఉపక్రమించారు. లైట్స్ కూడా ఆఫ్ చేశారు.
    నీలిరంగు చిన్న బల్బ్ మాత్రం వెలుగుతోంది డిమ్ గా. చలికి అందరూ సప్లయ్ చేసిన రగ్గుల్ని కప్పుకున్నారు. ఆ నిశీధి రాత్రిలో విరజతో కల్సి రైల్లో ప్రయాణించటం ఎంతో థ్రిల్లింగ్, లవ్లీగా వుంది అభినయ్ కి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS