పద్మా, చారుమతీ పంక్తిలో చివర, మూలగా కూర్చున్నారు. తక్కిన ఆడపిల్లలంతా శ్రీదేవిమీద ఛలోక్తులు విసురుతూ సరదాగా ఉన్నా, అందరితో కలవలేకపోయారు ఇద్దరూ. సిల్కు బట్టలు కట్టుకుని చక్కగా ముస్తాబైనవాళ్ళ పంక్తిలో కూర్చోడానికి సిగ్గుగా ఉంది చారుమతికి. 'తను కట్టుకున్నది ఎప్పుడో పదహారు రూపాయలు పెట్టి కొనుక్కున్న పువ్వుల జార్జెట్ చీర. ఎలా ఉన్నవాళ్ళయినా చక్కటి బట్టలు కట్టుకుంటే అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. అందమైన చీరలు కట్టుకున్న అందమైన కాలేజీ అమ్మాయిలమధ్య తను గులాబీపూల మద్య గడ్డిపువ్వులా ఉన్నాను' అనుకుంది చారుమతి.
తన కాపరంలో కనిపించే వెలితీ, తనకీ భర్తకీ మధ్య ఉండే దూరం మననంచేసుకుంటున్న పద్మ ముభావంగా ఉండిపోయింది.
విందు చాలా ఘనంగా ఉంది. మూడు రకాల పిండివంటలూ, మూడు రకాల కారపు పిండివంటలూ, నాలుగు కూరలూ, పప్పూ, పెరుగుపచ్చడీ, ఊరగాయలు, అప్పడాలు, ఒడియాలు - అరిటాకుల నిండా వడ్డించారు. కాని ఒక్కటీ రుచించలేదు చారుమతికి. ఇంట్లో శాంతమ్మ, భానుమతి ఏ అధరువూ లేకుండా పట్టి అన్నం పచ్చిమిరపకాయతో తింటారనే జ్ఞాపకం గొంతులో అడ్డుపడి, విందు భోజనం మింగుడుపడలేదు.
భోజనాలయ్యాక శ్రీదేవి దగ్గిరికి వెళ్ళారు స్నేహితురాళ్లిద్దరూ.
"ఎక్కడున్నారు ఇంతసేపూ, పద్మా? నాకు కనిపించనేలేదు" అంది శ్రీదేవి.
"నీపక్కనే ఉన్నాం. అయినా మేం ఎందుకు కనిపిస్తామింక? లోకమంతా ఒకరే కనిపిస్తారు నీకు!" అంది చారుమతి.
"పో, చారూ!" అంటూ శ్రీదేవి చారుమతి వీపుమీద చిన్న దెబ్బ వేసింది.
శ్రీదేవి అలిసినట్టు కనిపించినా, కొత్త అందంతో ఎంతో నిండుగా ఉంది. తెల్ల జరీ మధుపర్కం చీర అక్షింతలు పడి పసుపురంగు పులిమినట్లయింది. మెళ్ళో వేసిన కర్పూరదండలూ, మల్లెదండలూ చిక్కుపడి పోయాయి. వాటిమధ్య కొత్త మంగళసూత్రాలు తొంగి చూస్తున్నాయి. జడనిండా కుట్టిన మల్లెమొగ్గలు విచ్చుకుని సౌరభాలు వెదజల్లుతున్నాయి. పెళ్ళికూతురికి రూపకల్పనలా ఉంది శ్రీదేవి.
"మళ్ళీ ఎప్పుడు వస్తారు?" శ్రీదేవి అడిగింది.
"నీ ప్రోగ్రాం ఏమిటి, చెప్పు? అత్తవారింటికి ఎప్పుడు వెళ్ళటం?" అంది చారుమతి.
"ఏమో, నాకేం తెలుసు?" శ్రీదేవి మొహమాట పడింది.
"ఏమండీ, ఈ అమ్మాయి ఏమీ తెలియదని తప్పించుకుంటూంది, మీరేనా చెబుతారా?" అంది చారుమతి, శ్రీదేవి అక్క ప్రభావతిని చూస్తూ.
"ఏముందమ్మా! పెళ్ళితంతు ఇంకా మిగిలిపోయింది. హోమం, సప్తపదీ, అప్పగింతలు ఉండిపోయాయి. పొద్దున్న అవి అయిపోతాయి. రాత్రి మరి శోభనం తంతు జరిపేస్తారు. అమ్మాయి ఒకటే తొందర పడుతూందా!" అంటూ ఆగి చెల్లెలివైపు చూసింది ప్రభావతి.
"ఏమిటి, అక్కా, నువ్వుకూడా!" అంటూ బుంగ మూతి పెట్టి కోసం నటించింది శ్రీదేవి.
ప్రభావతి హృదయపూర్వకంగా నవ్వి అంది: "పోనీ, మీ ఆయన తొందరపడిపోతున్నారు. సరేనా! ఎల్లుండి పొద్దున్నే గృహప్రవేశానికి వరంగల్ తీసుకువెళతారు. బస్సు మాట్లాడేరు."
"ఎల్లుండి ఎన్నింటికి తీసుకువెళతారు?"
"ఉదయం కాఫీ, టిఫిన్ తీసుకు వెళతారు. ఎలా లేదన్నా తొమ్మిది అవుతుంది."
"ఎల్లుండి పొద్దున్న వస్తాం, దేవీ" అంది పద్మ. చారుమతికూడా అదే అంది.
ప్రభావతి రెండు కాయితం పొట్లాలు తెచ్చి ఇచ్చింది ఇద్దరికీ.
"ఇవేమిటి?" అంది చారుమతి తీసుకోకుండా.
"ముందర తీసుకో. ఇందులో కొంచెం లడ్లు పెట్టాను. ఇంట్లో అక్కావాళ్ళకి ఇవ్వు."
"ఇంత రాత్రి ఎలా వెళతారు, చారూ? ఎవరినేనా పంపనా?" అంది శ్రీదేవి.
"ఎవరూ అక్కరలేదు. శంకరం వచ్చాడు. ఇద్దరం వెళ్ళిపోతాము" అంది చారుమతి.
"శంకరం భోజనం చేశాడా?"
"ఆఁ, చేశాడనుకుంటాను" అంది చారుమతి బయటికి వస్తూ.
"చేశాడనుకోడం ఏమిటి? అక్కా, నువ్వు చారుతో వెళ్ళి వాళ్ళన్న భోజనం చేశాడో లేదో కనుక్కో!" అంది శ్రీదేవి, ప్రభావతిని కూడా పంపుతూ.
ప్రభావతి, చారుమతి, పద్మ బయటికి వచ్చేసరికి, శంకరం వీళ్ళకోసమే ఎదురుచూస్తూ గేటుదగ్గిర తచ్చాడుతున్నాడు.
"ఏమయ్యా, భోజనం చేశావా? ఇక్కడ నుంచున్నా వేమిటి, ఇంట్లో కూర్చోక" అంది ప్రభావతి.
"భోజనంచేశానండీ" అన్నాడు ముభావంగా శంకరం.
తరవాత ప్రభావతి దగ్గిర సెలవు తీసుకుని, పద్మ, చారుమతి బయటపడ్డారు.
పౌర్ణమి ముందు రోజులు. రోడ్లమీదంతా వెన్నెల పడుతూంది. పైగా, వేసవికాలం రాత్రులు. అప్పుడే కొద్దిగా చల్లగాలి ప్రారంభమై, నడవటానికి బాగుంది.
"నడిచిపోదామా, పద్మా? మేం ఇద్దరం మీ ఇంటి దాకా నిన్ను దిగబెట్టి, మా ఇంటికి వెళతాం" అంది చారుమతి.
"మీ ఇల్లో పక్కా, మా ఇల్లో పక్కా, మీకు చుట్టూ తిరిగినట్టు అవుతుంది. నేను రిక్షామీద వెళ్ళిపోతాను" అంది పద్మ.
"మీరు ఒంటరిగా ఇంత రాత్రి ఎలా వెళతారు? మేం దిగబెట్టి, వెళ్ళిపోతాం" అన్నాడు శంకరం పద్మని చూస్తూ.
పద్మ 'సరే' అని ఊరుకుంది. ముగ్గురూ మౌనంగా నడుస్తున్నారు.
రోడ్డు మీద ఇళ్ళనీడలు పడుతున్నాయి. సగం వెన్నెల, సగం నీడ. 'జీవితం ఇంతే! వెలుగునీడల సమ్మేళనం. సుఖదుఃఖాల కలయిక అంటారు' అనుకుంది చారుమతి. 'ఇప్పటిదాకా చీకటీ, కష్టాలే చూశాను. వెలుగు, సుఖం అన్నవి వస్తాయా జీవితంలో? కనుచూపుమేరలో ఆ ఆశ కనిపించడం లేదు' అనుకుంది. తిరిగి.
"పరీక్షలు బాగా రాశారా?" శంకరం పద్మని అడిగాడు.
"బాగానే రాశాను. అయినా రిజల్ట్సు వచ్చేవరకూ నమ్మకం లేదు" అంది పద్మ.
"మీకేమండీ, ఆడపిల్లలకి చదువుకోడానికి బోల్డు టైము. ఇట్టే పాసయిపోతారు."
"అబ్బాయిలకి ఎందుకు లేదు టైము?" పద్మ ఆశ్చర్యంగా అడిగింది.
"అబ్బాయిలకి లెక్కలేనన్ని వ్యావర్తులు. సాయంత్రం మేం అలా ఒకసారి తిరిగి వస్తాం. అమ్మాయిలు ఎక్కడికీ వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని భట్టీయం వేస్తారు." నవ్వుతూ అన్నాడు శంకరం.
శంకరం మాటలలో అర్ధం కనిపించలేదు చారుమతికి. కావాలని పద్మతో కలిపించుకు మాట్లాడుతున్నట్టు ఉంది.
శంకరం ప్రవర్తన వింతగా ఉంది. మాటిమటికీ పద్మని చూస్తున్నాడు. ఉత్సాహంగా ఉన్నాడు.
పద్మమాత్రం తనకి ఏమీ పట్టనట్టూ, ఎవరితో ఏ సంబంధం లేనట్టూ పరాకుగా నడుస్తూంది.
వెన్నెల పద్మ అందానికి మెరుగులు దిద్దుతూంది. ఎర్ర పట్టుచీర, రవ్వలదుద్దులు, మెడలో నల్లపూసలు పద్మని అపురూప సౌందర్యవతిని చేశాయి. తమలపాకులతో ఎర్రబారిన పెదవులు ఎర్ర గులాబీ రేకులలా ఉన్నాయి. పద్మ నవ్వితే ఎంతో అందంగా ఉంటుంది. విశాలమైన కళ్ళు కిందికి వాల్చి, సిగ్గు పడుతున్నట్టు నవ్వుతుంది.
'నేనే పద్మ అందానికి ఇంత ఆకర్షితురాలి నవుతున్నాను. ఇంక శంకరం మెచ్చుకునే కళ్ళతో పద్మని చూడటంలో ఆశ్చర్యమేముంది?' అనుకుంది చారుమతి.
పద్మ ఇల్లు వచ్చేవరకూ ముగ్గురూ మౌనంగానే ఉండిపోయారు.
14
గృహప్రవేశానికి వరంగల్ తీసుకెళ్ళడానికి బస్సు సిద్ధంగా ఉంది. పెళ్ళివారంతా తయారయ్యారు. శ్రీదేవి మాత్రం స్నేహితురాళ్ళకోసం ఆత్రతతో ఎదురుచూస్తూంది. నిన్న సాయంత్రందాకా పెళ్ళి కొడుకుముందు ఉన్న సిగ్గు రాత్రి పరిచయంతో వదిలిపోయింది. రాత్రి అతను చెప్పాడు: వరంగల్ లో మూడు రోజులు గడిపి హనీమూన్ కు మైసూరు, బెంగుళూరు వెళతారు. అక్కడ పదిహేను రోజులుండి వెనక్కి వెళ్ళి హైదరాబాద్ చేరుకుంటారు.
"తరవాత?" అంది శ్రీదేవి సిగ్గుపడుతూ.
"తరవాత ఏముంది? అమ్మాయిగారు అబ్బాయి గారితో కాపరం చేస్తారు హైదరాబాదులో" అంటూ శ్రీదేవిని ముందుకు లాక్కున్నాడు.
ఇక కాకినాడ రాదు. అటునించి అటే కాపరానికి వెళ్ళిపోతుంది శ్రీదేవి. ఈ తలపు అంత బాధాకరంగా లేదు. భర్తతో పరిచయం ఒక్క రోజుదే అయినా అతన్ని విడిచి ఒక్కక్షణం ఉండలేననిపిస్తూంది శ్రీదేవికి, కాని వెళ్ళేముందు చారుమతితో, పద్మతో చెప్పి వెళ్ళాలి. లేకపోతే బాధపడతారు.
"దేవీ, మీ ఫ్రెండ్సు వచ్చారు" అంటూ లక్ష్మీ దేవి చారుమతినీ, పద్మనీ తీసుకువచ్చింది.
శ్రీదేవి దగ్గిరగా వచ్చి ఇద్దరి చేతులూ పట్టుకుంది.
"నేనింక కాకినాడకి ఇప్పట్లో రానేమో, చారూ" అంది మెల్లిగా.
"అదేం! వరంగల్ నించి రావా?" అంది చారుమతి. తమ ప్రయాణ వివరాలు చెప్పింది శ్రీదేవి.
ముగ్గురూ మౌనంగా ఉండిపోయారు. శ్రీదేవి అంత హఠాత్తుగా తమని విడిచిపోవడం కష్టం కలిగించింది చారుమతికి, పద్మకి. పద్మ తన చేతిలో ఉన్న పాకెట్ తీసి శ్రీదేవి చేతిలో పెట్టింది. అందులో వెండిని రెండు చక్కటి దీపపు కుందెలు ఉన్నాయి.
"ఎందుకివన్నీ, పద్మా! ఇంత ఖరీదువి ఎందుకు తెచ్చావు?"
"ఏదో నాకు నచ్చింది ఇచ్చాను. నీకు నచ్చితే సంతోషం."
"నా కెంతో నచ్చాయి, పద్మా. బహుమతి వెనక ఉండే భావం మరీ బాగుంది. నేను ఇక రోజూ వీటితోనే దేవుడికి దీపాలు వెలిగిస్తాను."
"ఇది నా కానుక దేవీ" అంటూ ఒక చిన్న బౌండు నోటుపుస్తకం ఇచ్చింది చారుమతి.
అది చూడగానే చలించిపోయింది శ్రీదేవి. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆ పుస్తకంలో తనకు నచ్చిన గేయాలన్నీ చక్కటి అక్షరాలతో రాసుకుంది చారుమతి. ముగ్గురూ మామిడిచెట్టుకింద కూర్చుని ఆ పుస్తకంలో గేయాలు చదువుకుని ఆనందించేవారు, అందులోని గేయాలే తీయని గొంతుతో పాడేది చారుమతి.
"నా కిది ప్రియాతిప్రియమైనది. అదే నీకు ఇస్తున్నాను. ఇంతకంటే ఏమి ఇవ్వగలను?"
శ్రీదేవి ప్రేమగా చారుమతి చేతిని తన చేతిలోకి తీసుకుంది. ఇంకో చేతితో పుస్తకం తెరుస్తూ, "ఇంతకంటే ఏ బహుమతీ నాకు విలువైనదికాదు, చారూ" అంది గద్గదకంఠంతో.
ముగ్గురి స్నేహానికి, మధురమైన సాయంత్రాలకి చిహ్నంగా నిలిచిపోయిన ఆ గేయాల సంపుటిని చూస్తూ కూర్చున్నారు ముగ్గురూ.
"దేవీ, వస్తావా?" అంటూ వినిపించిన మగగొంతుక విని ముగ్గురూ తల ఎత్తారు.
శ్రీదేవి భర్త గుమ్మందగ్గిర చిరునవ్వుతో నుంచుని ఉన్నాడు.
శ్రీదేవి సంభ్రమంగా లేచి నుంచుంది. స్నేహితుల ముందు భర్త 'దేవీ' అంటూ చనువుగా పిలవడంతో సిగ్గూ, ఆశ్చర్యం, తత్తరపాటూ కలిగాయి. భర్త రాక వల్ల కలిగిన ఆనందం ఆమెలో ప్రస్ఫుటంగా కనిపిస్తూంది. సిగ్గుతో ముఖం ఎర్రగా అయిపోయింది.
చారుమతీ, పద్మాకూడా కలవరపాటుతో లేచారు.
తన రాకవల్ల వాళ్ళలో కలిగిన తత్తరపాటు చూసి మొహమాటపడ్డాడు అతను. అది కప్పిపుచ్చుకుంటూ, "మీ ఫ్రెండ్సా?" అన్నాడు శ్రీదేవిని చూస్తూ.
"అవును వీళ్ళిద్దరూ నాకు మంచి ఫ్రెండ్సు. ఈమె పద్మ, ఈమె చారుమతి." ఇద్దరినీ పరిచయం చేసింది శ్రీదేవి. అతను నమస్కారం చేశాడు.
"మరి నన్ను వాళ్ళకు పరిచయం చెయ్యవా? ఈయన పేరు హనుమంతరావండీ. పెళ్ళి పత్రికలో చూసే ఉంటారనుకోండి." నవ్వుతూ అన్నాడు, తనని తనే చూపించుకుంటూ శ్రీదేవి భర్త.
ముగ్గురమ్మాయిలు నవ్వారు.
"క్షమించండి. మా ప్రయాణానికి వేళైపోతూంది. శ్రీదేవిని మీదగ్గిరనించి తీసుకెళ్ళిపోవాలి" అన్నాడు అతనే తిరిగి.
"వెళ్ళు, శ్రీదేవీ" అంది చారుమతి ఆమెను ముందుకు తోస్తూ.
బయట బస్సు సిద్ధంగా ఉంది. మగపెళ్ళివారంతా బస్సులో ఎక్కి కూర్చున్నారు. ఆడపెళ్ళివారంతా వారిని సాగనంపడానికి వీథిలో బస్సుపక్కనే నుంచుని ఉన్నారు.
శ్రీదేవీ, హనుమంతరావు అందరికీ నమస్కారాలు చేశారు. శ్రీదేవి తల్లి కూతురుని ఆశీర్వదిస్తూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. శ్రీదేవి కళ్ళనీళ్ళు చెంపలమీది నించి జారుతున్నాయి. తొందరగా నీళ్ళు తుడుచుకుంటూ, "వెళతాను, పద్మా వెళతాను, చారూ మరిచి పోకండి" అంది దగ్గిరికి వచ్చి.
"ఉత్తరాలు రాస్తూండు, దేవీ" అంది పద్మ గద్గదస్వరంతో.
