తేలేదా ? మరిచిపోయావా? కాదు . మరిచిపోలేదు. నీ సరళను నువ్వు మరిచిపోలేవు. చెప్పు. నన్ను మరిచిపోలేదని చెప్పు . భగవాన్! నేనిది భరించలేను."
మాధవను అల్లేసుకుని ఏడ్చేసింది సరళ. అప్రయత్నంగా సరళ వీపు నిమిరి బుజ్జగించాడు మాధవ.
"ఛీ! ఛీ! నిన్ను మరిచిపోవడమేమిటి సరళా! హడావుడిగా ప్రయాణమయి వచ్చేశాను. ఆ సందట్లో పువ్వులు కోయించలేకపోయాను. రైల్లో ఎక్కినప్పడీ నుండీ పువ్వులు తేలేకపోయానే అని బాధపడుతూనే ఉన్నాను."
సరళ కళ్ళు తుడుచుకుని మాధవ ముఖంలోకి చూసి నవ్వింది.
"పోనీలే! నువ్వు బాధపడుతున్నావుగా! ఎప్పుడూ తెచ్చే పూలకన్నా ఇప్పుడు నువ్వు పడుతున్న భాదే అందంగా ఉంది. కాని ఇంక బాధపడకు. నువ్వలా ముఖం ముడుచుకు కూచుంటే నేను సహించలేను. నవ్వెయ్యి ఆ అదీ అలా నవ్వాలి. హమ్మయ్యా! ఎంత హడలగొట్టావ్! గుండెలు పగిలిపోయాయి. ఇంక నేను వెడతాను. చదువుకోవాలి, రెపోస్తాను...."
"ఎందుకూ రేపు రావటం? చదువు పాడవదూ?"
"ఇంకోసారి ఈ ధోరణిలో మాట్లాడితే లెంపలు వాయిస్తాను. నీ దర్శనమయ్యాకే చదువయినా పరీక్షలయినా అని చెప్పానా , లేదా?"
మృదువుగా మాధవ లెంపలు తట్టి నవ్వి, వెళ్ళిపోయింది సరళ.
ఈ నవ్వులపిల్ల జీవితంలో తను చిమ్మబోయే చీకట్లను గురించి ఆలోచిస్తూ వణికిపోయాడు మాధవ.
మోహన్ కూడా మాధవ పనిచేస్తున్న కాలేజిలేనే లెక్చరర్. ఒకరోజు మోహన్ ఆహ్వానం మీద మోహన్ ఇంటికి టీకి వెళ్ళాడు మాధవ. మోహన్ బి.ఎస్. సి లో ఉన్న తన చెల్లెలు సరళను పరిచయం చేశాడు మాధవకు. ఆకర్షకమైన కళ్ళతో చురుగ్గా ఉన్న సరళ మాధవ చూపులను ఆకట్టుకోగలిగింది. ఆ తరువాత మోహన్ మరి రెండు మూడు సార్లు టీకి ఆహ్వానించాడు. మోహన్ మాధవలతో పాటు సరళ కూడా కూచుని కబుర్లు చెప్పేది. ఒకరోజు మాటల సందట్లో సరళ "నాకు కెమిస్ట్రీ సరిగ్గా రావటం లేదు. దాన్లోనే డౌట్ గా ఉంది" అంది. "నా సబ్జెక్ట్ కెమిస్ట్రీ యే. మీకు కావాలంటే నేను సాయం చెయ్యగలను." అన్నాడు మాధవ.
"బ్రతికించావోయ్. రేపటి నుండే నీకు వీలైతే ఒక అరగంట దీనికి చెపుదూ! ట్యూషన్ పీజు తీసుకుందువుగానిలే!" అన్నాడు మోహన్.
"ఆ మాట అన్నావంటే రేపటి నుండి అసలు మీ ఇంటికే రాను" కోపం అభినయిస్తూ అన్నాడు మాధవ.
'అంతా నీ ఇష్టమే! మిగిలిన విషయాలు తర్వాత ఆలోచిద్దాం. ముందా కెమిస్ట్రీ సంగతి చూడు" తేలిగ్గా నవ్వేశాడు మోహన్. మొదట వారం రోజులు కేవలం కెమిస్ట్రీ పాఠాలే సాగాయి సరళ మాధవ్ ల మధ్య.
ఆరోజు మధవ వచ్చి కెమిస్ట్రీ పుస్తకం తెరవబోతుంటే "అబ్బ! ఈవాళ పాఠం వద్దు మాస్టారూ! తలనొప్పిగా ఉంది" అంది సరళ బద్దకంగా.
మాధవ పుస్తకం మూసేసి లేవబోయాడు.
"కూచోండి . అప్పుడే వెళ్ళిపోతారా? ఇప్పుడేగా వచ్చారు?
"పాఠం వద్దన్నవుగా!"
"వెళ్ళి పోమ్మనలేదుగా!"
"మరేం చెయ్యను?"
"ఇంకేమైనా నేర్పించండి"
:ఇంకా నీకేందులో డౌట్?" ఆశ్చర్యంగా అడిగాడు మాధవ. సరళ అదోలా నవ్వింది.
"క్లాసు పాఠాలు కాక నేర్పవలసినవేమీ ఉండవా?" అప్పటికి మాధవకు అర్ధమయింది. అతని గుండె ఝాల్లుమంది. అతనికి సరళలో ఆకర్షణ లేకపోలేదు. కాని, అంతవరకూ స్థిరమైన అభిప్రాయానికి రాలేదు.
"నీకు తెలియనివయితే కదా నేను నేర్పటం?' సరళ కళ్ళలోకి చూస్తూ అన్నాడు.
సరళ కళ్ళు వాలిపోయాయి. పెదవులపై చిరునవ్వు విరిసింది.
"నాకన్నీ ఎలా తెలుస్తాయి?" అంది అమాయకంగా. అతనేం మాట్లాడుతున్నాడో అర్ధం కానట్లు. ఆ అమాయకత్వపు అభినయం మరింత ఆకర్షించింది మాధవను.
"సరే! ఏమిటి తెలుసో చెప్పు. ఏం తెలుసుకొవాలనుందో అడుగు" అన్నాడు కవ్విస్తున్నట్లు.
కొంచేసేపటి వరకూ సరళ ఏం ,మాట్లాడలేకపోయింది.
"అడగవేం?" రెట్టించాడు మళ్ళీ.
"నాన్నడిగి తెలుసుకుని ఏం చెప్తారు మీరు? నాకు చెప్పవలసినదేమిటో మీరే అర్ధం చేసుకుని చెప్పాలి కాని....." వెక్కిరించి పారిపోయింది సరళ.
ఆ వెక్కిరింత మాధవను గిలిగింతలు పెడ్తూ ఊపేసింది. సరళ తనతో చనువుగా ఉండటాన్ని మోహన్, సరళ తల్లి దండ్రులు కూడా హర్షిస్తున్నారని అర్ధం చేసుకున్నాడు మాధవ.
ఈ రోజుల్లో మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్ళి పెద్ద సమస్య అయిపొయింది. సరళా మాధవ్ లు ప్రేమించి పెళ్ళి చేసుకుంటే మంచిదే అన్న అభిప్రాయంలో ఉండి సరళను గట్టిగా మందలించలేదు తల్లిదండ్రులు. తల్లి మాత్రం ఒకటికి పదిసార్లు "నీ హద్దుల్లో నువ్వుండు" అని హెచ్చరించటమే కాక, ఎంత స్వేచ్చ ఇచ్చినా ఒక కంట కనిపెడుతూనే ఉంది. సరళ చేతిలో పుస్తకం అందుకుంటున్నప్పుడు సరళ చేతి వేళ్ళు తగిలి శరీరం పులకించినా, సరళ కళ్ళల్లో చిందులాడే చిలిపితనం రక్తాన్ని ఉరకలెత్తించినా , సరళ పెంకె చిరునవ్వులు నరాలను తొందర చేసినా, తమని ఇంకొకరు కనిపెట్టి చూస్తున్నారనే దృష్టితో చచ్చినట్లు బుద్దిగా ఉండేవాడు మాధవ.
కాలేజి కింకా టైముంది. ఆరోజు పాఠం చూసుకుంటున్నాడు. తలుపు చప్పుడైతే తలెత్తి చూశాడు. సరళ , వణికిపోతూ ఒక చేత్తో తలుపు పట్టుకుని నించుంది.
"సరళా!" అన్నాడు ఆశ్చర్యంగా.
"అంత ఆశ్చర్యపోతే పారిపోలేను" మూతి ముడుచుకుంటూ అంది సరళ.
"ఎందుకొచ్చావ్?"
"తెలిసిన విషయాన్ని అడగటమెందుకు?"
మాధవ క్షణకాలం సరళ ముఖంలోకి చూసి చేతిలో పుస్తకం మూసి సరళ దగ్గరకు వచ్చాడు. చటుక్కున సరళ చెయ్యి పట్టుకుని లోపలికి లాగి తలుపులు వేసి సరళను గాడంగా కౌగలించుకున్నాడు. ఆర్తితో అతని నల్లెసుకుంది. ఎవరు అందించారో, ఎవరు అందుకున్నారో ఎవరికీ అర్ధం కాకుండానే వారి పెదవులు ఒకదానికొకటి అందుకున్నాయి.
"నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను సరళా!" అన్నాడు సరళతో మాధవ.
మాధవ గుండెల్లో తల దాచుకుంది సరళ.
"మిమ్మల్ని చేసుకోలేకపొతే , నేనసలు పెళ్ళేచేసుకోను. ఇంకొక్క సంవత్సరం. నా చదువు పూర్తయ్యాక " అపూర్వమైన సంతృప్తితో కళ్ళు మెరుస్తుండగా మధ్యలో ఆపేసింది.
ఆ మెరిసే కళ్ళను ఆప్యాయంగా ముద్దాడాడు మాధవ. ఆనాటి నుండి సరళ అప్పుడప్పుడు మాధవ దగ్గరకు వస్తూనే ఉంది. అల్లరి కబుర్లతో, చిలిపి వేళాకొళాలతో , భావిని గురించిన బంగారు కలలతో కాలం పరుగు పెట్టేసింది.
ఇంత దృడంగా అల్లుకున్న బంధాన్ని తెగగొట్టగలడా? సరళ మనసుకు నొప్పి కలగకుండా జానకికి అన్యాయం జరగకుండా చూడగలడా? తన జానకిని సరళకెలా పరిచయం చెయ్యాలి?
ఆలోచనలతో మనసు వేగిపోతుంటే చికాగ్గా లేచి గదికి తాళం వేసేసి సినిమాకు బయలు దేరాడు మాధవ.
4
ఉత్తరమైనా రాయకుండా అకస్మాత్తుగా వచ్చిన కుసుమను చూసి తెల్లబోయింది జానకి.
"ఎందుకలా బిత్తరపోయి చూస్తావ్? నీకోసం బెంగ పెట్టుకుని వచ్చేశాను"
