Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 11

 

    "నువ్వు ఇంట్లోనే వుండు. ఆ గోపాల్ ని కబురు పెట్టి రప్పిస్తాను. అతని కిష్టమైతే మీ ఇద్దరికీ  పెళ్ళి జరిపిస్తాను అన్నాడు రామభద్రయ్య.
    తర్వాత లలితను వెళ్ళమని గోమతినిపిలిచారా దంపతులు.
    గోమతికి చాలామంది  బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారిలో విక్టర్ ఒకడు, విక్టర్ స్మగ్లర్ అని ఆమెకు తెలియదు. తెలియక అతడికి కొన్ని వ్యవహారాల్లో సహకరించింది.
    "నువ్వు కూడా ఎవర్నైనా ప్రేమిస్తున్నావా ?' అన్నాడు రామభద్రయ్య.
    ఆమె బాబూరావు అనే అతడి పేరు చెప్పింది. రామభద్రయ్య బాబూరావింటికి కబురు పంపించి -- కొడుకును పిలిచాడు.
    రామభద్రయ్య కొడుకు మోహన్ కు ఇరవై ఏడేళ్ళు . మొదటిసారిగా తల్లి, తండ్రి కలిసి తనను గదిలోకి పిలిచినందుకు ఆశ్చర్యపడుతూ వచ్చాడతను.
    రామభద్రయ్య అన్ని వ్యాపార వ్యవహారాలను గురించి అడిగాడు. మోహన్ చెప్పింది విన్నాక "నా ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోంది. ఇంతవరకూ నేను సంపాదించింది చాలు. ఇంకా నువ్వు వ్యాపారం చేయక్కర్లేదు. కాంట్రాక్టుల గురించి ఆలోచించక్కర్లేదు. ఉన్న ఆస్థిని తీరుగా ఖర్చు చేస్తూ ఇంట్లో అందరి అవసరాలు చూస్తుండు. ఈ రోజు నుంచి ఈ ఇంటికి, ఈ ఆస్థికి నువ్వే పెట్టందారువి. నువ్వు కూడా ఎవర్నైనా ప్రేమించి వుంటే చెప్పు..." వెంటనే పెళ్ళి జరిపించేస్తాను...."అన్నాడు రామభద్రయ్య.
    మోహన్ గౌరీ అనే పేదవాళ్ళ పిల్లను ప్రేమించాడు. "నీకు నచ్చితే చాలు, కోతయినా ఫరవాలేదు , నీ పెళ్ళి జరిపించేస్తాను...." అన్నాడాయన.
    
                                                           3
    ఏ ఆర్భాటమూ లేకుండా రామభద్రయ్య పిల్లల మూడు పెళ్ళిళ్ళు రిజిస్ట్రాఫీసులో  ఆరోజు  జరిగిపోయాయి. కూతుళ్ళు ఇద్దరికీ రెండేసి లక్షల రూపాయలు ఇచ్చాడు రామభద్రయ్య. ఈ పెళ్ళిళ్ళ గురించి వూరంతా ఆశ్చర్యంగా చెప్పుకున్నారు.
    తను అన్ని రకాల కాంట్రాక్టు వ్యాపారాల నుండీ విరమించు కుంటున్నాననీ , తన కొడుకు అందుకు అవసరమైన ఫార్మాలిటీస్ అన్నీ చూస్తాడనీ  రామభద్రయ్య ఓ ప్రకటన కూడా చేసాడు.
    ఆ సాయంత్రం రామభద్రయ్య ఇంట్లో పెద్ద విందు జరిగింది. ఎందరో పెద్దలు ఆ విందును పురస్కరించుకుని రామభద్రయ్యతో మాట్లాడాలని ప్రయత్నించారు. అయితే అయన ఎవ్వరికీ ఆ అవకాశం యివ్వకుండా తప్పించుకు తిరిగాడు.
    విందు తొమ్మిది గంటలకు ముగిసింది.
    రాత్రి పదయ్యే సరికల్లా ఆ ఇంట్లో నిశ్శబ్దం వెలసింది.
    మూడు గదుల్లోని మూడు జంటలకూ ఆరోజు రామభద్రయ్య గదిలో రమాదేవి కూడా ఆయనకు జంటగా  వుంది.
    "చాలా విచిత్రమైన రోజిది!" అందిరమాదేవి.
    "ఇంతవరకూ గుక్కెడు కూడా పుచ్చుకోలేదు నువ్వు " అంటూ గుర్తు చేశాడు రామభద్రయ్య.
    'పుచ్చుకుంటాను కానీ ....పిల్లల పెళ్ళిళ్ళు యిలా క్షణాల మీద జరిపించేశారు. ఏమయింది మీకు?' అనడిగింది రామాదేవి.
    "వాళ్ళందరికీ వయసులు మించిపోతున్నాయి. యెంత సంపాదించినా తనివి తీరడం లేదు నాకు. ఓ పిల్లాడు పోయాడని మిగతా వాళ్ళందరి జీవితాలు బుగ్గిపాలు చేస్తున్నావు నువ్వు. మనకు పిల్లలై పుట్టినందుకు వాళ్ళు ముగ్గురికీ అన్నీ వుండీ అస్తవ్యస్త జీవితం అయిపొయింది. వాళ్ళందరికీ ఇప్పుడు బాధ్యత లేర్పడ్డాయి. అమ్మాయిల బాధ్యత అల్లుళ్ళు వహిస్తారు. అబ్బాయిని  కోడలు అదుపులో వుంచుతుంది...."
    "కానీ మీరు వ్యాపారం కూడా మానేస్తానన్నారు...."
    "అవును మరి... చావుకు సిద్దపడుతున్నాను...." అన్నాడు రామభద్రయ్య.
    'అవేం మాటలండీ?" అంది రమాదేవి.
    "ఇందులో నీకు బాధేముంది? నేను చచ్చిపోతే కాస్త డోసు పెంచి ఆ బాధ మరచిపోగలవు నువ్వు" అన్నాడు రామభద్రయ్య.
    'ఈరోజు మీరు నన్ను మాటలతో హింసిస్తున్నారు"
    "నిమ్మరసం పుండు మీద పడితేనే మండుతుంది. నాలిక మీద వేసుకుంటే పుల్లగా రుచిగా వుంటుంది. నేను చెప్పిన నిజం నిమ్మరసంలా పని చేస్తోంది. పుండు లాంటి నీ శరీరం మీద....' అన్నాడు రామభద్రయ్య విరాగిలా.
    రమాదేవి భర్త వంక అదోలా చూసి -- "ఈ రోజు నుంచి నేను తాగను....' అంది.
    "నా మీద ఒట్టేయ్ ...."
    ఒక్కక్షణం తటపటాయించి - ఒట్టే!" అంది రమాదేవి.
    "ఒకవేళ నేను ఈ రాత్రే చచ్చిపోయాననుకో -- అప్పుడీ ఒట్టు కు విలువుంటుందా?"
    రమాదేవి కనుకొలకుల్లో నీళ్ళు నిలిచాయి -- "ఎందుకండీ ఇలా మాట్లాడతారు! నేను తాగుడుకు అలవాటు పడ్డ మాట నిజం. కానీ ఆ ప్రభావం పిల్లల మీద పడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాను. ఏ ఒక్కరోజైనా మీరు తాగవద్దని నిర్బంధించి వుంటే నాకీ గతి పట్టి వుండేది కాదు. మీ ప్రోత్సాహం మీదనే నాకిది అలవాటయింది. నా ఈ అలవాటు పోగొట్టడానికి మీరేన్నడూ ప్రయత్నించలేదు. ఇన్నాళ్ళకు పూనుకున్నారు. ఇరవై ఏళ్ళ ఈ అలవాటు పోగొట్టుకోదానికి నా శాయిశాక్తుల ప్రయత్నిస్తాను...."
    "ప్రయత్నించు రమా! నేను నిన్ను తప్పు తప్పడం లేదు. మన కుటుంబం ఎదుర్కొన్న అవకతవకలన్నీ నా కారణం గానే నాకు తెలుసు. ఎటొచ్చీ నేను చనిపోయాక మన కుటుంబం నలుగురూ వేలెత్తి చూసేలా ఉండకూడదని నా ఆశయం. అందుకే నీకు ఇంతలా చెబుతున్నాను. ఈరాత్రి నేను చనిపోయాననుకో నీకు రేపట్నించి రహస్యంగా బ్రాందీ ఎవరూ తెచ్చి పెడతారు?' అన్నాడు రామభద్రయ్య.
    "ఏమండీ -- మీరాత్మాహత్య ప్రయత్నం చేస్తున్నారా?' అనడిగింది రమాదేవి అనుమానంగా.
    "లేదు రమా! కానీ భగవంతుడు నాకీ రాత్రికి ఉరిశిక్ష విధించాడు. బహుశా ఈరాత్రీ నా చావు తప్పదు అన్నాడు రామభద్రయ్య.
    "నేను మీ పక్కనుండగా -- అ యముడు కూడా మీ జోలికి రాలేదు. " అంది రమాదేవి.
    "రాత్రి పన్నెండు గంటలకు యముడి పిలుపు ఇంట ప్రతిధ్వనిస్తే  నువ్వు మాత్రం ఏమి చేయకు రమా!" అన్నాడు రామభద్రయ్య- "అయినా ఇప్పుడు చావంటే భయం లేదు . ఈరోజు మనసు ప్రశాంతంగా వుంది-"

                                    4
    రాజారావు ఆ ఇంటి తలుపు తట్టాడు. ఓ యువతి తలుపు తీసింది.
    "మీవారింట్లో లేరా?"
    "ఆఫీసుకు వెళ్ళారు...." అందామె.
    "నేను నీతోనే మాట్లాడాలి. లోపలకు రావచ్చా?
    ఆమె అంగీకారసూచకంగా తలాడించి లోపలికి నడిచింది. రాజారవామెను  అనుసరించాడు.
    లోపలకు వెళ్ళి కూర్చున్నాక -- "గుర్తున్నానా ?" అన్నాడు రాజారావు.
    "ఊ"అందామె.
    'అదృష్టమే -- పెళ్ళయ్యాక కూడా నన్ను గుర్తు పెట్టుకున్నావు...."
    "ఎరిగున్న మనుషుల్ని మరిచిపోవడం కోసం ఎవరు పెళ్ళి చేసుకోరు...."
    "రాజుగారి కోటలో ధనముందిట. నువ్వు నన్ను జ్ఞాపకం ముంచుకోవడం వల్ల కూడా అంతే లాభం నాకు...." అని నిట్టూర్చాడు రాజారావు.
    "నాతొ ఏదో మాట్లాడాలన్నావ్!" అందామె.
    "అవును. నేను నిన్నింకా ప్రేమిస్తూనే వున్నాను. ఇప్పుడు నేను ఇదివరకటి నేను కాదు. నా దగ్గర చాలా డబ్బుంది ...." అంటూ అతను జేబులోంచి నోట్ల కట్టలు బయటకు తీసి టేబుల్ మీద పెట్టాడు -- "నువ్వు కావాలంటే ఈ క్షణంలో ఈ డబ్బంతా నీకిచ్చేయగలను...."
    ఆమె ఆ డబ్బు కేసి ఆశగా చూసింది -- "డబ్బంటే ఎవరికి చేదు కాదు. ఇంతకీ నువ్వు చెప్పబోయేదేమిటో?"
    "నీ భర్తను వదిలిపెట్టి నాతొ వచ్చేసేయ్ . మన మిద్దరం హాయిగా జీవిద్దాం...."
    ఆమె తెల్లబోయి అతని వంక చూసి -- "స్పృహలో వుండే మాట్లాడుతున్నావా?' అంది.
    "ఏం?"
    "నామీద నీకింకా అలాంటి దృష్టి ఉండడమే తప్పు. పెళ్ళికి ముందు ఏమో కాని -- పెళ్ళయ్యాక నేను పూర్తిగా వారి సొంతమై పోయాను. వారు లేని జీవితాన్నూహించుకో లేను. నువ్వెంత డబ్బు ఆశ చూపించినా నేనాయన్ను వదిలి రాలేను" అందామె.
    "కానీ ఒకప్పుడు డబ్బు లేదన్న కారణంగానే నువ్వు నన్ను తిరస్కరించావు" అన్నాడు రాజారావు.
    "ఎందుకు రాజా -- అలాంటి అభియోగం వేస్తావు? నేను నిన్నెప్పుడూ తిరస్కరించలేదు. నిన్ను పెళ్ళి చేసుకోవడం కోసం నన్ను కని పెంచిన తల్లిదండ్రులన్నేదిరించే సాహసం చేయలేకపోయాను. వాళ్లైనా డబ్బు గురించి నిన్ను కాదనలేదు. నీ గురించి వాళ్ళ కట్టే వివరాలు తెలియవు. నీ తల్లిదండ్రులు గురించిన వివరాలు నువ్వేమీ చెప్పలేకపోయావు. ఆడపిల్ల నిచ్చుకునేటప్పుడు కుర్రాడి గురించి వెనుకా ముందు తెలుసుకోవాలని ఎవరైనా అనుకుంటారు గదా!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS