ఇంట్లోనే ఉంటూ చేసే వ్యాపారం అమ్ వే ప్రోడేక్ట్సు కి ఏజన్సీ వ్యాపారం.
మధ్య మధ్య మీటింగ్స్ అటెండ్ అవుతున్న తరుణం లో పరిచయం అయ్యాడతను. నాకన్నా నాలుగేళ్ళు చిన్నవాడు. మొదటిసారిగా వంటరిగా బైటకు వచ్చానేమో, తెలియని విషయాలు చాలా ఉన్నాయి. తెలుసుకోవాల్సిన ఆవశ్యకతా ఉంది. తెలియ చేసేవాళ్ళు కావాలి. అందుకే అతనితో పరిచయం స్నేహంగా మారడానికి ఎన్నో రోజులు పట్టలేదు. చిన్న సందేహం తీర్చుకోవడం కోసం ఏర్పడిన మా పరిచయం ఇరవై నాలుగ్గంట ల్లోనే స్నేహంగా మారించి. ఆ స్నేహంలో కబుర్లు, హాస్యాలు, చర్చలు, ఆ తరువాత హటాత్తుగా అతని మాటల్లో నా అందం పట్ల ప్రశంసలు, నావైపు చూసే అతని కళ్ళల్లో నా పట్ల ఆరాధన, అయినా, యాభై ఏళ్ళకు చేరువైన నేను అతనితో పెరిగిన , పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చూసి కలవరపడలేదు. కానీ, హటాత్తుగా అతను నా అందాన్ని పొగిడి నప్పుడు ముందు నిర్ఘాంత పోయాను. తరవాత మురిసిపోయాను.
మీ అందం నన్ను పిచ్చి వాడ్ని చేస్తోంది. ఈ వయసులో ఇంత అందంగా ఎలా ఉన్నారు? మీకు ఎదిగిన కొడుకులున్నా రంటే నమ్మలేకపోతున్నాను.
పాతికేళ్ళ అమ్మాయితో మరో పాతికేళ్ళ కుర్రాడు అనే మాట.
నాలో ఆ క్షణం కలిగిన భావానికి నిర్వచనం అందలేదు. సమాధానంగా చిరునవ్వు నవ్వడం తప్పే అయింది. మీ నవ్వు ఎంత బాగుందో తెలుసా? ఎప్పుడన్నా మీవారు చెప్పారా? చెప్పారా? ఏమో నాకేం గుర్తులేదు. ఎప్పుడో పెళ్ళి అయిన కొత్తలో బహుశా శోభనం రోజు అన్నారేమో ఆ తరవాత జీవితం యాంత్రికం అయింది. కాకపొతే పెళ్ళికి ముందు చాలామంది అన్నారు.
కానీ ఇతను అంటుంటే నాకేదోలా అనిపించింది. ఎక్కడో మారుమూల అంతరాంతరాల్లో చిన్న ప్రకంపన.
ఈ వయసులో కూడా నేను మగాళ్ళ ని ఆకర్షించగల అందగత్తె నా?
నా అందాన్ని చాలామంది పొగిడారు. అప్పుడెప్పుడూ కలగని స్పందన ఇతను పొగుడుతుంటే అదోలా ఉంది. ఎంత ఒద్దనుకున్నా, అతని మాటలు పదేపదే వినాలన్న కోరిక, సహజ సౌందర్యానికి కొంత మెరుగు, పెట్టుకోవాలన్న తపన అనుకోకుండానే నాలో ఏదో మార్పు, ముందు మానసికంగా, ఆ తరవాత అతనితో పరిచయం ఒద్దంటున్న పెరుగుతోంది. అయన పదకొండు దాటితే గానీ ఇల్లు చేరరు. అయన పనులలాంటివి. నేనేం చేయగలను? అందుకే వంటరితనాన్ని అధిగమించడానికి అతని కంపెనీ బాగానే ఉందనిపించింది.
మీటింగ్ నుంచి నన్ను అతను తన కారులో డ్రాప్ చేయడం, మధ్యమధ్య హోటల్స్ లో కాఫీ, టిఫినూ అంటూ తిప్పడం , చిన్న చిన్న బహుమతులు ఇవ్వడం.
ఓ రోజు పిల్లల విషయంలో బాధపడుతోంటే హటాత్తుగా దగ్గరకి తీసుకున్నాడు నన్ను. తమాషా అనుభూతి ఏంతో కాలంగా మర్చిపోయాననుకున్న మధురానుభూతి నా భర్త నుంచి కూడా పొందలేక పోయిన పారవశ్యం. ఆరోజే నాకెందుకో భయం వేసింది. నేను పతనం వైపు ప్రయాణిస్తున్న భావన. నా పాతివ్రత్యం మంట గలిసి పోతోందన్న ఆవేదన. మానసిక సంఘర్షణ. ఆరోజే ఆయనతో అన్నాను. ఈ వ్యాపారం మానేస్తానండి. అనవసరంగా కొత్త పరిచయాలు, కొత్త మొహమాటాలు.
"నీ తలకాయ ఎప్పుడు చూసినా కూపస్థ మండూకం లా ఉంటానంటావెం? ఏమైందిప్పుడు? నీకేం కష్టం" నాకేం కష్టమో నోరు తెరిచి చెప్పలేక పోయాను. ఇంక ఇప్పుడెలా చెప్పగలను? జరిగింది కష్టం కాదు, నష్టం అనిఎలా చెప్పగలను.
నా మీద వ్యామోహమో, అతనిలోని కామమో నాకు తెలియదు. ఆ ఒక్క బలహీన క్షణాన్ని క్యాష్ చేసుకున్నాడు. నేనునిశ్చేష్టురాలై పోయాను.
అంతా అయాక "సారీ మీ అందం నన్ను వివశుడ్ని చేసింది" అంటూ వెళ్ళిపోయాడు.
సారీ! ఎంత ఈజీగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నాశనం కాబోతున్న నా బతుకు ఈ రెండక్షరాలతో నిలబడుతుందా?
కాసేపట్లో అయన వస్తారు. చెదిరిన నా జుట్టు, నా బొట్టు చూస్తారు. నా వాలకం చూడగానే ఏం జరిగిందో అర్ధం చేసుకుంటారు. ఆ తరవాత నా బతుకేంటి? నా పిల్లలకి నేనేం సమాధానం చెప్పాలి?
అలా అని ఏమీ జరగనట్టు ఎప్పటిలా ఆయన్ని స్వాగతించాలా? పిల్లలతో ఎప్పటిలా ఉండగలనా? నా అంతరాత్మకి నేనేం సమాధానం చెప్పాలి?చెప్పి నా జీవితం నేనే చేతులారా నాశనం చేసుకోనా? అలా జరక్కూడదు.
నేనే ఏం జరగనట్టు చిరునవ్వుతో ఆయనకి స్వాగతం పలకాలి. ఈ తప్పే అయన వల్ల జరిగితే అయన మనసులో ఇంత ఘర్షణ జరిగేదా? అయితే అయన ఇంతవరకు శ్రీరామ చంద్రుడి లాగే ఉన్నారా? ఏమో! నాకు తెలియదేమో ఏదన్నా జరిగే ఉంటుందా? ఛీ, ఛీ ఏంటి? ఆయన్ని అనుమానిస్తున్నాను సిగ్గు లేకుండా కామెర్ల రోగిలా . ఛ, ఎంత దిగజారిపోతూన్నాను!
నేను ఇంకా, ఇంకా దిగజారకుండా ఉండాలంటే నాకు అయన అండ కావాలి. ఈ ఇల్లు కావాలి. నా పిల్లల ప్రేమ కావాలి. అవును నేను నా ఈ సంసారం అనే కంచుకోటను వదులుకోకూడదు. అందుకే ఏం జరుగానట్టు ఉండాలి. ఈ కంచుకోట దాటానంటే నా బతుకు బజార్న పడుతుంది. బంధువుల్లో సుగుణవతిగా, శీలవతి గా పేరు పొందిన నేను ఇప్పుడు పతిత గా భర్త చేత త్వజించబడి వీధుల పాలవనా? పిల్లల్ని చూడకుండా, అయన లేకుండా బతకగలనా?ఏం చేయను? ఏం చేయను? ఘర్షణ, సంఘర్షణ.
అవును తప్పదు. నా సంసారం నాశనం కాకుండా ఉండాలంటే ఆయన్నీ వంచించాలి. నన్ను నేను వంచించుకోవాలి. తప్పదు. ఈ యాభై ఏళ్ళ వయసులో తను కాలుజారిందంటే పిల్లాలు క్షమిస్తారా? క్షమించరు. అందుకే ఏం జరగనట్టే ఉండాలి.
అలా అని చెప్పకుండా ఎలా? ఇన్నేళ్ళుగా మామధ్య దాపరికాలే లేవు. ఎంతో నిజాయితీతో కూడిన సంసార జీవితం నాది. నేనిప్పుడు తప్పు చేశాను. చేసిన పాపం చెబితే పోతుందట. ఆయనకి చెప్పి అయన ఒడార్పులో నన్ను నేను ప్రక్షాళన చేసుకోవాలి. అయన తప్పకుండా క్షమిస్తారు. నా సహచరుడు ఇంత కాలం తనకిసేవలు చేస్తూ, సుఖాన్ని ఇస్తూ, తన తల్లితండ్రు లని కంటికి రెప్పలా కాపాడుతూ, తన పిల్లల్ని కనిపెంచి వృద్ది లోకి తీసుకొచ్చి తన వంశాన్ని నిలిపి నందుకు నేను చేసిన ఈ తప్పును ఒక యాక్సిడెంట్ గా భావించి క్షమిస్తారు. అవును క్షమిస్తారు. అయన క్షమించాకే లోపలికి వెడతాను. అప్పుడే మరోసారి ఈ ఇంట్లోకి ఆయనతో కలిసి కుడికాలు పెడతాను. తప్పదు.లేదంటే ఓ న్యాయ మూర్తిగా అయన నాభవిష్యత్తుకి ఇచ్చే తీర్పుని శిరసావహిస్తాను. అయన విధించే శిక్ష ఏదైనా సరే భరిస్తాను.
అదిరే గుండెలతో, అంధకారం అలుముకున్న నా భవిష్యత్తు లో చిరు వెలుగు కోసం వెతుక్కుంటూ అయన కోసం ఎదురు చూస్తూ ఆ చీకట్లో ఆ మంచులో అలాగే నిలబడిపోయాను.
అ క్షణం రానే వచ్చింది. అయన వచ్చారు. కారుచప్పుడైంది.
నా కాళ్ళు శిలలై స్తంభించిపోయాయి. గుండెల్లో ఫిరంగులు మోగుతున్నాయి. కళ్ళల్లోంచి వేడి రక్తం బొట్లు, బోట్లుగా ధరణి గుండెల్లోకి జారి ఆ గుండెల్ని చీలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. గాలి, గాలి హాహాకారాలు చేస్తున్న ధ్వని . అయన బూట్ల శబ్దం ఆ నిశ్శబ్దంలో భయంకరంగా వినిపించ సాగింది.
శిలకి చైతన్యం వచ్చినట్టు కొద్దిగా కదిలి, బలవంతంగా అడుగులు వేస్తూ వీధి వైపు బాల్కనీ లోకి నడవసాగాను.
అయన కారు పార్క్ చేసి తాళం చేతులు విలాసంగా తిప్పుతూ,మరో చేత్తో సెల్ పట్టుకుని హుందాగా నడిచి వస్తున్నారు. ఆనడక లో రాజసం, హటాత్తుగా సెల్ ఫోన్ మోగింది.
నేను ఊపిరి బిగపట్టి, నన్ను నేను కూడదీసుకుంటూ , ఆయనతో మాట్లాడానికి అక్షరాలూ వెతుక్కుంటుంటే, దగ్గరగా మరీ దగ్గరగా అయన గంభీరమైన స్వరం సరదాగా వినిపించింది. "ఏయ్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు. నీ దగ్గర్నుంచి బయలుదేరి అరాగంట కాలేదు. అప్పుడే విరహామా? రేపు వస్తాగా... ష్యూర్ ... నీ దగ్గరకు రాకుండా నేను బతకగలనా?ఒకే డార్లింగ్ బై. గుడ్ నైట్.."
డమాల్ , డమాల్ , డమాల్ విస్పోటనాలు....నెత్తిన , సరిగా నా నడి నెత్తిన విరిగిపడుతున్న కొండచరియలు, కళ్ళముందు పరచుకున్న చీకటి తెరలు, తెరలుగా విడిపోతూ .....మంచుముద్దలా నామీదే పడుతున్న భావన.అయన అడుగుల శబ్దం దగ్గరైంది. హటాత్తుగా నా శరీరం చలితో వణకడం ప్రారంభించింది.
నిశ్శబ్దంగా ,నిర్జీవంగా లోపలికి నడిచాను.
***
