కోనేటి రాత్రి
పగటి కోనేటిరావు వేరు స్థూలకాయుడు జీవిత
మధ్యాహ్నం గడిచిపోయినవాడు హెడ్డు గుమాస్తా బందెడు
కుటుంబం జటావల్లభుల కోనేటిరావు పంతులు పేరు
పేపర్లో కనబడదు. రేడియోలో వినబడదు. అతని
పగళ్ళన్నిటికీ ఆకారం ఒక్కటే.
రాత్రి నిద్రపోతూన్న కోనేటికళ్ళ వెనుకనుంచి అతని
అపస్మారక మనస్సు లోని స్వప్న విన్యాసాలు చూదాం
రండి.
"సినిమా ప్రపంచానికొక కొత్త వెలుగు. కథానాయకుని నటనానైపుణ్యం అమోఘం. అద్వితీయం. అవాజ్మానస గోచరం! ఆజానుబాహువు. సౌందర్యాపరమత్స్య లాంఛనుడు. మన కోనేటిరావు కథానాయికను దుర్గమారణ్యాలనుండి సింహశరభశార్దూల గవయంగండకాది భయంకర జంతుజాలంనుంచి తప్పించి సురక్షిత స్థానం చేర్చాడు. నాయిక కృతజ్ఞత జాలువారే కాళ్ళతో చూస్తోంది. ఆమె కళ్ళలోనికి తానుకూడా అనురాగంగా చూస్తూ - పాట! సంగీతం, సినిమా సంగీతం జంత్రగాత్రముల రాల్గగరించు విమల గాంధర్వ అందుకున్నాడు కోనేటిరావు."
చేతిపిల్లడు జడుసుకుని కెవ్వుమని ఏడిస్తే నిద్రాభంగమయింది కోనేటిరావుకి.
* * *
"ద్వితీయప్రపంచ మహాసంగ్రామం అల్లకల్లోలంగా సాగిపోతోంది. సముద్ర భూమ్యా కాశాలు యుద్ద సంరంభంతో ఘూర్నిల్లిపోతున్నాయి. అట్లాంటిక్ మహా సముద్రాన్ని చీల్చుకుంటూ వస్తూన్న ముఫ్ఫయి అయిదువేల టన్నుల బ్రిటిష్ యుద్దనౌకను చూశాడు జర్మన్ సబ్మెరిన్ కమాండర్ జటావల్ కోనేట్. వెంటనే దాన్ని టార్పీడో చెయ్యమని తన పరివారాని కుత్తురువిచ్చాడు. వెల్టాన్ షాంగ్ డెర్ అంటర్ డెన్ లిండెన్! గెస్టాల్ట్ డెర్ డాయిష్లాండ్ ఊబర్ ఆల్స్! మంచినీళ్ళ ప్రాయంగా జర్మన్ భాష మాట్లాడేస్తున్నాడు తునాతునియలయి పోయింది యుద్దనౌక అందులోని నావికులు చిన్నచిన్న పడవలలో ప్రాణాలు రక్షించుకొనబోతూఉంటే వాళ్ళమీద మెషీన్ గన్లు పేల్చమని ఆర్డరువేశాడు కమాండర్ కోనేట్. ఫోల్కిషేర్ బియో బాక్టర్! గెహెన్నా ఆఖ్ టంగ్! జైట్ గైస్ట్! మైన్ కాంఫ్."
పిల్లి పాలగిన్నె పడదోసిన చప్పుడు. కోనేటిరావుకి మెలకువ వచ్చింది.
* * *
గంగానది మొదలు కావేరీనదివరకు భారతదేశంలోని అన్ని నదులనూ కలిపి ఆనకట్టలు కట్టిన అసాధారణ ఇంజనీరింగ్ జీనియస్ కు అమెరికా ప్రభుత్వం స్వాగతం ఇస్తోంది మా టెన్నిస్సీలోయ తమరు పరిశీలించాలి. అమూల్యమైన మీ సలహాలు శిరసావహిస్తాము. సిఫారసులు తక్షణమే అమలుచేస్తాము......అబ్బే! అదెంత మాట! అల్పజ్ఞున్ని నన్నేదో పెద్దవాణ్ణిచేసి పొగుడుతున్నారు. నామాత్రం తెలివైనవాళ్ళు మీ అమెరికాలో లేకపోయారా! అంతదూరంనించి ప్రత్యేకం నన్నిక్కడకు ఆహ్వానించడం మీ ఔదార్యాన్నే చాటుతోంది. అయినా ఈ సన్మానం నాదికాదు. ఆంద్రదేశానిదీ గౌరవం. జై, ఆంద్రమాతాకు జై!"
ఇంకో కుర్రాడి యేడుపు.
* * *
"మళ్ళీ సత్యాగ్రహోద్యమం ప్రారంభమయింది. ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఈ యింగ్లీషువాడు మనల్ని వదిలిపెట్టేటట్టు లేడు. ఈసారి దీని అంతు చూడవలసిందే కేవలం ఆహింసనే పాటిస్తూ కూచోకూడదు. మహారాజశ్రీ జటావల్లభుల కోనేటిరావు పంతులు ఆఫీసు బీరువాలు విరక్కొట్టేస్తున్నాడు. కుర్చీలూ, బల్లలూ గుండపిండి చేసేస్తున్నాడు. కాగితాలు తగలబెట్టేస్తున్నాడు. సిరాబుడ్లు గోడలకివేసి కొట్టేస్తున్నాడు. కలాలు విసిరి పారేస్తున్నాడు. ఎదురుగుండా దొరగారు వస్తే గూబ గింయిమనేటట్టు వాడికొక లెంపకాయ యిచ్చుకున్నాడు. ఒక పెద్ద పేపర్ వెయిటు తీసి ఆఫీసు గోడగడియారాన్ని చూసి విసిరాడు."
తెల్లారిపోయింది నాన్నా!
కోనేటి నిద్ర కొండెక్కి పోయింది.
---౦౦౦---
