కోనేటి దినం
(ఈ కధ పూర్తి పేరు మ.రా.రా.శ్రీ జటావల్లభుల కోనేటిరావు పంతులుగారి దినచర్య")
హెడ్డు గుమాస్తా కోనేటిరావు పంతులు పదకొండు
గంటలయింది. గుమాస్తా కోనేటి హెడ్డు పదకొండు గంటలు
కొడుతున్నారు. ఆఫీసువేళ కోనేటిగంటల గందరగోళం
తొందర భోజనం ముగించుకుని చుట్ట బిగించుకుని బట్ట
సవరించుకుని పాగా తగిలించుకుని ఒసే కుర్రాళ్ళు జాగ్రత్త
మిలిటరీ కార్లు చిల్లరడబ్బు లేవేనా ఉంటె ఇలా జేబులో
వెయ్యి.
ఆఫీసుకాగితాల అరుపులు వినబడుతున్నాయి. కోనేటి కాగితాల దొరనిండా కోపం జోళ్ళలో కాళ్ళు జొరబడ్డాయి. కాళ్ళు శరీరాన్ని మూటకట్టి మోస్తున్నాయి. శరీరం జీవితాన్ని పొట్లంకట్టి వేస్తున్నది. కాళ్ళని నడిపించే రోడ్డు మధ్యాహ్నపు నల్లని మండుటెండ ధరించిన రోడ్డు తారురోడ్డు కోప్పడతారు కాబోలు దొరగారు. కోనేటి చెమట మూడుపెట్టి గుణకారం పిల్లింగర్రలాంటి చుట్టపీలిస్తే పలకదు. బల్లమీద చుట్ట గాలికి కదులుతున్నాడు.
అసలే కూర్మావతారం ఆఫీసు అరమైలు దూరం కోనేటి కాళ్ళు కొలుస్తున్నాయి, దూరాన్ని కరుస్తున్నాయి గడ్డి. ఇంతేనా బతుకు పగలంతా బతుకును ఆఫీసులో పచ్చకర్పూరంలా వెలిగించవలసిందే వెచ్చించ వలసిందే వెధవ బతుకు వెధవ వుద్యోగం. వెధవ సంసారం. తస్మాత్ జాగ్రత్త వెధవ జాగ్రత్త! రయిలుబళ్ళలో ఉమ్మి వేయరాదు. లోగళబారదు గూడ్సుబళ్ళలో ఉమ్మివేయచ్చు కాబోలు. గూడ్సుబండిలాగ రొప్పుతూ రోజుతూ నడుస్తున్నాడు. వెధవ నడక రోజు రోజూ వెధవరొప్పు గోడలమీద తాజావార్తలు.
......గారి కూతురు - గాడితో -గా - గా - అలాగా దడిగాడు వానసిరా జీడికి రాజు ఎవరు ఆచార్యంగా అధ్యక్షత రయిన మహాసభ రాజుల హొటేలు కాంభోజరాజు రోజుకి రెండాటలు. వార్తాపత్రికలకు బదులు గోడల్ని చదువుకోవడం మంచిది. గోడలమీద నిజం కొంచెం సేపే నిలుచుంటుంది. తర్వాత ఇంకో నిజం ఆ స్థలాన్ని ఆక్రమిస్తుంది.
- పంతులుగారూ బాకీ చెల్లించారు కాదు.
- వొచ్చే ఫస్టుకి తప్పకుండా.
ఎప్పటికీ రాదు ఫస్టు తారీఖు వొచ్చినా ఎంతోసేపుండదు. ఎప్పుడూ వుండేది ఆఫీసు మాత్రమే అదుగో ఆ కనబడుతున్నదే నిన్నటి లాగే ఉంది ఇవాళ కూడా (ఎప్పుడూ తిరిగే యంత్రం దానితోపాటు తానూ తిరగాలి ఎంత తెల్లగా వుందో ప్రభుత్వంవారి అమాయకత్వం లాగ ఎప్పుడూ తెల్లగానే ఉంటుంది. ఈ గోడల్ని చదివితే ఏమీ బోధపడదు)
నిశ్శబ్దంగా పనిచేసుకుంటూన్న ప్రభుత్వ యంత్రంలో నిర్మితస్థానానికి వెళ్ళిన కోనేటి కళేబరం కోటువిప్పి కుర్చీ వీపుకు తొడిగి పాగాతీసి బల్లమీద పెట్టి ఎదురుగుండా గోడగడియారం కుశలప్రశ్న వేస్తే కోనేటి కళ్ళు కృతజ్ఞత తెలియజేశాయి కాబోలు పాగా పక్కనే తలకాయ కూడా తీసి పదిలంగా పెట్టి పనిలో మునిగిపోయింది యంత్రంలో యంత్రం.
కోనేటి యంత్రం స్కూళ్ళు మరలు మీటలు అలవాటు ప్రకారం వాటి పనిలో అవి, తలకాయ మాత్రం బల్లమీద అలవాటు ప్రకారం కళ్ళు గడియారం ముళ్ళమీద కాఫీ వేళకోసం తపస్సు చేస్తూ అలవాటు ప్రకారం తలలేకుండా మరలు. అలవాటు ప్రకారం చేతులు అలవాటు ప్రకారం ఎర్రటేపు ప్రకారం ఫైల్సు డిశ్చార్జ్ క్లర్కుగారు తపాలాబిళ్ళలు తినేస్తాడా? తిండి ఎంతసేపూ తిండి లంచాన్ని తినవొచ్చు నా మామూళ్ళు మామూలు బతుకు - నిన్నటిలాగే ఇవాళ బతుకు.
ఎవరు నడిపిస్తున్నారో ఈ యంత్రాన్ని చక్రాలు లేకుండానే కాదు, గడియారానికున్నట్లు కడుపులో చక్రాలు పైనిమాత్రం ముళ్ళు నున్నని గాజుమొగం ఇందులో ఉద్రేకానికి చోటు లేదు. దయా దాక్షిణ్యం నైజాన్తా టైము ప్రకారం అన్నీ జరిగిపోవాలి. కోనేటి మొగం కునుకుపాట్లు పడుతోంది.
టంగ్ టంగ్ కాఫీవేళ రెండు గంటలు అమ్మయ్య కొద్దిగా విశ్రాంతి.
కోనేటి చేతులు స్క్రూతిప్పి మెడకి తలకాయ తగిలించుకున్నాయి. కోటు తొడుక్కోబడింది. తలపాగా తన టేబిలుకి కాపలాదారు. బైట దుకాణంలో వేడివేడి పొంగరాలు పొంగరంగరంగరాలు చిల్లరడబ్బులు లోపలి జేబులోంచి వెలుపలి జేబులోకి బదిలీ దొరగారి కెప్పుడవుతుందో బదిలీ.
కోనేటి చేతులు కోటుబొత్తాయి తీస్తే లాల్చీ బొత్తాయిలు తీస్తే బనియన్ చినిగిపోయినచోట్ల సరిగ్గా కడుపుదగ్గర మీట తలుపు తెరచినట్టుగా చర్మం తొలగించి కడుపు పైకితీసి పట్టుకున్నాడు రెండు పొంగరాలు తినాలనికుని డబ్బు ఖర్చవుతుందని ఒకటే అడగబోయి అజీర్ణం చేస్తుందని అదీ మానేసింది. కోనేరు కడుపుకొక గళ్ళా తగిలించి కప్పున్నర కాఫీ మాత్రం అందులోపోసి గళ్ళా పారేసి కడుపుని దాచేసి చర్మతలుపు మామూలుగా మూసేసి లాల్చీ బొత్తాలూ ఆఖర్ని కోటు బొత్తాయిలూ కోనేరు వెళ్ళి మళ్ళీ కుర్చీలో కూలబడింది.
మళ్ళీ టేబిలుమీద తల మళ్ళీ గడియారం మీద కళ్ళు సాయంత్రం కోసం కుర్చీవీపున కోటు మళ్ళీ ఆఫీసుఫైళ్ళు మళ్ళీ మామూలు ప్రకారం తిరిగే మర క్రమక్రమంగా కరిగిపోయే కాలం క్రమంగా తనకు తెలియకుండానే అలసి ఎడమచెయ్యి ఊడిపోయి కింద పడిపోయింది. కుడిచెయ్యి మాత్రం రాజపుత్రవీరుని కరం యుద్దరంగంలో కత్తిని వదలనట్లు కలాన్ని వదలకుండా గట్టిగా కాళ్ళ స్క్రూళ్ళు సరిగ్గా లేవు. కీళ్ళు పట్టుతప్పి పోతున్నాయి. సంధ్యావేళ సాక్షాత్కరిస్తే బాగుండును. నా ఎడంకాలు ఎక్కడకో వెళ్ళిపోయింది. సాయంత్రం దాకా సెలవిచ్చేశాను. ఈ మరలో భాగాలు ఎక్కడి వక్కడ ఊడిపోతున్నాయి. వీటికి నా సెలవుకూడానా వీటికి నా లక్ష్యం లేదు.
గడియారం మొగంమీద సాయంత్రం కనిపించిన మీదట కోనేటిరావు పంతులు మళ్ళీ మనుష్య రూపం ధరించి గృహోన్ముఖుడయినప్పుడు ఎదురుగుండా పశ్చిమాకాశం మీద ఇంకోదినం దగ్ధమయి పోయిందనే సూచనగా ఎర్రని మంటలు కనబడ్డాయి.
--౦౦౦౦--
