Previous Page Next Page 
ఆలింగనం పేజి 99


    దూరంనుండి బోస్ మమ్మల్ని చూసి నవ్వాడు.

 

    ఆ నవ్వు చాలా మనోహరంగా వుంది!

 

    అతనికి రెండు విషయాలు తెలిస్తే అలా నవ్వడు. ఒకటి...చిన్నక్క ఆమె కిడ్నీ అతనికోసం దానం చేసిందనీ...రెండు నేను అతన్నే పెళ్ళి చేసుకోవాలని పిచ్చిగా అన్వేషించాననీ!

 

    లిల్లీకి ఒకే విషయం తెలీదు. తన ప్రాణ స్నేహితురాలు కోరుకున్న వాడ్ని తను చేసుకుందని! వాళ్ళిద్దరికీ ఈ విషయాలు యెప్పటికీ తెలీవు. తెలిసే ఆస్కారంలేదు. ఇంటికి వెళ్ళగానే ఎర్ర డైరీ మసి చేసెయ్యాలి!


                                                          *  *  *


    ఇంటికొచ్చేసరికి గుమ్మంలో ఉత్తరం కనిపించింది. తీసి చదివాను. రషీద్ దగ్గర్నుంచి... చంద్ర హైద్రాబాద్ వచ్చాడనీ, అతని పెళ్ళి వివరాలూ వ్రాశాడు.

 

    నేను చీర కూడా మార్చుకోకుండా హడావుడిగా కాయితం తీసుకుని "మేం కలుసుకోవాలనుకున్న చంద్ర దొరికాడనీ, రషీద్ చెపుతున్న చంద్ర మాకు తెలియదనీ, అసౌకర్యానికి చింతిస్తున్నామనీ రాసి వెంటనే వెళ్ళి పోస్ట్ చేసి వచ్చాను.

 

    ఎర్రడైరీతో పని అయిపోయింది. దాన్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళి మంట పెట్టాను.

 

    "ఏం చేస్తున్నావే?" అమ్మ అడిగింది.

 

    నీ ఇద్దరి కూతుళ్ళ జీవితాల్లో నీకు తెలీని పుటల్ని తగలబెట్టేస్తున్నాను అనుకున్నాను.


                                                          *  *  *


    ఆ వేళ ఏడో తారీఖు. నాకు గుర్తే లేదు. కానీ శ్యాంసుందర్ వచ్చి గుర్తుచేశాడు ఆ సాయంత్రం!

 

    అతను కళ్ళల్లో దీపాలు వెలిగించుకుని వచ్చినట్లున్నాడు. సంధ్య ఎరుపురంగు పులుముకుంటోంది. మిగిలిపోయిన వెలుతురు మేఘాలమాటున దాక్కుంది.

 

    కాఫీ ఇవ్వనా?" అడిగాను.

 

    "నాకు మీ నిర్ణయం కావాలి" యెదురుచూసే ఓపిక లేనట్లుగా అన్నాడు.

 

    "పెరట్లో తులసికోట దగ్గర కూర్చుందాం" అన్నాను.

 

    తులసెమ్మలో సందెదీపం మినుకుమంటోంది. ఇద్దరం వసారామెట్లు మీద కూర్చున్నాం. అమ్మా, నాన్నా రామాలయములో హరికథ వినడానికి వెళ్ళారు. రుక్మిణీ కళ్యాణం!

 

    "చెప్పండి" అన్నాడు.

 

    నేను గొంతు సవరించుకుని మొదలుపెట్టాను.

 

    "మీకు నేను నచ్చానన్నారు. నా గురించి ఏవీ తెలుసుకోకుండా కేవలం ఒకగంట పెళ్ళిచూపుల్లో చూసి నీపేరు నచ్చిందీ...నువ్వు నచ్చావూ అన్నారు. అలా కాకుండా నా గురించి పూర్తిగా తెలుసుకుని అప్పటికీ నాపట్ల ఇష్టం ఉంటే... నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను" అన్నాను.

 

    "మీరేం చెప్పినా నాకు మీరంటే ఇష్టమే!" శ్యాంసుందర్ అడ్డుపడ్డాడు.

 

    "అలా కాదు. ముందు పూర్తిగా వినండి. అప్పుడు చెప్పండి" అన్నాను.

 

    "సరే...కానివ్వండి" చేతులు కట్టుకున్నాడు.

 

    "ఆముక్త...అంటే ఎప్పుడూ ముట్టుకోబడనిది అని అర్థం... అది నా పేరు!"

 

    అతను నవ్వుతూ వింటున్నాడు.

 

    నేను నాకే చెప్పుకుంటున్నట్లుగా చెప్పుకుపోతున్నాను. అతని ముఖంలో కలవరం...గగుర్పాటు... నిరసన...జాలి...బాధ...ఎన్నెన్నో భావాలు... ఆకాశంలో మేఘాల్లా కదలాడి తునాతునకలవుతున్నాయి!

 

    శివ...సందీప్...సిద్ధార్థ...చైతన్య...మాధవ్...విక్రమ్...చంద్ర ఒక్కొక్కరి గురించీ నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పసాగాను.

 

    ఇరవై ఏళ్ళకే అనుభవాల ఆదికావ్యమైన జీవితం! ఎదుటివాళ్ళకి ఇరకాటంలో పడేసే వ్యక్తిత్వం! నన్ను నేను సుఖపెట్టుకోలేని నిజాయితీ! ఎదుటివాళ్ళకి సుఖం ఇవ్వలేని పరిణితి!

 

    ఆకాశాన్ని ఎవరో చిలికినట్లు వెన్నముద్దలాంటి చంద్రుడు బయట పడ్డాడు!

 

    అన్నీ విప్పిచెప్పి నా మనసుని మధిస్తే హాయైన నిట్టూర్పు బయటపడింది!

 

    కొబ్బరి మొవ్వలు వెన్నెల పూసింది. కానీ శ్యాం ముఖంమీద నీలినీడలు అలుముకున్నాయి.

 

    అమ్మా, నాన్నా వచ్చారు. మమ్మల్ని డిస్టర్బ్ చెయ్యడం ఇష్టంలేక అటు పక్కగా రాలేదు.

 

    నా గురించి అన్ని వివరాలూ చెప్పడం పూర్తయ్యేసరికే రాత్రి పది గంటలు అయింది. నేను శ్యాంసుందర్ ముఖంలోకి జవాబుకోసం చూశాను.

 

    "నాకు మంచినీళ్ళు కావాలి!" అన్నాడు.

 

    నేను మారుమాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళి చెంబునిండా మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాను.

 

    అతను ఆపకుండా గటగటా త్రాగాడు.

 

    ఆ తర్వాత లేచి నిలబడి "ఆముక్తగారూ...ఆరోజే మీరు తలవంచుకుని వివాహానికి మీ అంగీకారం చెప్పి వుంటే ఈ పాటికి మన పెళ్ళి ముహూర్తం నిశ్చయం అయ్యేది. కానీ మీరు ఇలా నిజాయితీగా నాకు మీ జీవితంలోని వ్యక్తులందర్నీ పరిచయం చేశారు.

 

    ఒక సామాన్యమైన మగవాడు ఆ అమ్మాయికి తను మొట్టమొదటి ప్రియుడు కాదన్న విషయం తెలిశాక కూడా పెళ్ళి చేసుకోగలడా? చేసుకుని వాళ్ళతో ఏదో ఒక సందర్భంలో తనను పోల్చుకోకుండా ఉండగలడా? మీరే ఆలోచించండి..." అన్నాడు.

 

    నేను నిర్వికారంగా చూస్తున్నాను.

 

    "నేను వెళ్ళొస్తాను" అన్నాడు.  

 

    మళ్ళీ రావడం ఉండదని తెలుసు!

 

    "మంచిది" అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS