Previous Page Next Page 
ఆలింగనం పేజి 98


    ఆయన బోస్ చెయ్యి పట్టుకుని "నా కూతుర్ని చేసుకుంటున్నట్లు నాకు చెప్పలేదే? లిల్లీ నా కూతురయ్యా... నా స్వంతకూతురు. ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ హర్! తన సెలెక్షన్ కి హేట్స్ ఆఫ్" ఎక్సైట్ అయిపోతూ అన్నాడు.

 

    "నాకు తెలుసు డాడీ!" వినయంగా చెప్పాడు అతను.

 

    బోస్ లిల్లీతో "అందరిముందూ ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు విన్నావుగా...ఇప్పటికైనా నీ పట్టుదల తీరిందా?" అన్నాడు.

 

    లిల్లీ "డాడీ!" అంటూ ఆయన గుండెలమీద తల వాల్చింది.

 

    "ఇంక లోపలికి రండి...రండి..." రిజిస్ట్రార్ వాచీ చూసుకుంటూ అరిచాడు.

 

    పెళ్ళికొడుకు చాలా బావున్నాడు! కానీ ఎక్కడో చూశాను... ఎక్కడా? నాకు సడెన్ గా స్ట్రయిక్ అయింది. నిన్న చిత్ర పెళ్ళిలో... ఇతను మేం వచ్చేస్తుంటే ఎదురుపడి "ఎక్స్యూజ్ మీ...మిమ్మల్ని ఎక్కడో చూశాను. మీ పేరూ?" అని అడిగాడు.

 

    నేను చెప్పకుండా వచ్చేశాను.

 

    "అరె...రె...ఎంత పని చేశానూ! ఇప్పుడు నా గురించి ఏం అనుకుంటాడో ఏమో! లిల్లీ పరిచయం చెయ్యగానే 'నీ స్నేహితురాలికి మినిమమ్ మేనర్స్ కూడా లేవు!' అంటాడేమో.

 

    "అబ్బాయి పేరు చంద్రబోస్... అమ్మాయి పేరు లిల్లీ... ఇక్కడ సంతకాలు పెట్టండి..." అన్నాడు క్లర్క్.

 

    "చంద్రబోస్!" పూర్తిపేరు ఇదా?

 

    "ఆముక్తా... నా పక్కకిరా!" లిల్లీ పిలిచింది.

 

    అతను లిల్లీ వేలికి ఉంగరం తొడుగుతూ తల ఎత్తి నా వైపు చూశాడు. అతని కళ్ళల్లో అదే విస్మయం.

 

    లిల్లీ కూడా అతని వేలికి ఉంగరం తొడిగింది.

 

    ఇద్దరూ సంతకాలు చేసి భార్యాభర్తలయ్యారు.  

 

    నేను సిద్ధంగా ఉంచిన గులాబీ, చేమంతీ రేకులు జల్లగానే, మిగతా వాళ్ళు కూడా అలాగే చేసి వధూవరులని దీవించారు.

 

    "ఈ అమ్మాయి ఎవరూ?" అతను లిల్లీని అడిగాడు.

 

    "నే చెప్పలేదూ...నా క్లోజ్ ఫ్రెండ్...ఆముక్త!" లిల్లీ పరిచయం చేసింది.

 

    నేను చేతులు జోడించాను.

 

    అతను కూడా నమస్కరించాడు.

 

    "పదండి...లంచ్ కి టైం అయింది" లిల్లీ తమ్ముడు తొందరపెట్టాడు.

 

    ముందే ఏర్పాటుచేసిన బఫే ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయి. లిల్లీ ఆఫీసు స్టాఫ్ అంతా వచ్చారు.

 

    బోస్ నా దగ్గరికి వచ్చి "మిమ్మల్ని ఎక్కడో బాగా చూసినట్లుగా అనిపిస్తోంది. కర్నూల్లో ఎప్పుడైనా ఉన్నారా?" అడిగాడు.

 

    నేను నోట్లో పెట్టుకోబోతున్న స్వీటు జారి మళ్ళీ ప్లేట్లో పడిపోయింది!

 

    "కర్నూలా?" అన్నాను.

 

    "ఆ...గుర్తొచ్చింది...మీరు...మీరు...అచ్చు కాళిందిలా ఉన్నారు. కాళింది మీకు ఏమౌతుందీ?" ఆత్రంగా, ఆనందంగా అడిగాడు.

 

    నాకు భూకంపం వచ్చి నేను పాతాళంలోకి కూరుకుపోతున్నట్లుగా అనిపించింది.

 

    "మా అక్క...మీకెలా తెలుసు?" అడిగాను.

 

    అతని కళ్ళల్లో లీలగా తడి. "నాకు చాలా కావలసిన మనిషి! దేవుడు కాకుండా చేశాడు. ఆమె ఎప్పుడు నా జ్ఞాపకాల్లో సజీవంగానే ఉంటుంది. షి ఈజ్ రేరెస్ట్ ఎమాంగ్ ది రేర్ పర్సన్స్" అన్నాడు.

 

    "మీరేనా చంద్ర!!" వణుకుతున్న గొంతుతో అడిగాను.

 

    "అవును...మీకు నేను తెలుసా?...కాళింది చెప్పిందా?" నా భుజం మీద చెయ్యివేసి ఉద్విగ్నంగా అడిగాడు.

 

    నేను కంగారుగా తలతిప్పి చుట్టూ చూశాను. లిల్లీ ఎవరితోటో అటు తిరిగి మాట్లాడ్తోంది.

 

    "ప్లీజ్...లిల్లీకి మీరు కాళింది తెలుసని చెప్పకండి. కాళింది మీద ఏమాత్రం ప్రేమవున్నా ఈ వాగ్దానం చెయ్యండి చాలు!" అతని చెయ్యిపట్టుకుని బ్రతిమాలుతూ అన్నాను.

 

    "ఓ.కే!" అర్థం చేసుకుంటున్నట్లు తల ఆడించాడు.

 

    "లిల్లీ నాకు మా అక్కకన్నా ఎక్కువ! ఐయామ్ రియల్లీ వెరీ హేపీ! లిల్లీకి తగ్గ వరుడు దొరికాడు" కన్నీళ్ళు తుడుచుకుంటూ డగ్గుత్తికతో చెప్పాను.

 

    అతను నా తల నిమిరాడు. ఆ స్పర్శలో... ఆ చూపులో చిన్నక్క జ్ఞాపకాలు! ఎంత దయని వర్షిస్తున్నాయి ఆ కళ్ళు! అక్క చెప్పిన సంగతులూ...లిల్లీ చెప్పిన సంగతులూ అన్నీ అతని వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తుతూ చెవుల్లో హోరుమంటున్నాయి. సముద్రంపక్కనే నిలబడి కెరటాల హోరు వింటున్న దాన్లా నా చెవులు రెండూ ఘళ్లుపడ్డాయి!

 

    ఎంత ప్రయాసపడ్డానూ...ఎక్కడెక్కడో వెతికాను...ఉయ్యాల్లో పిల్లాడ్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు లిల్లీకూడా నాతో వెతికింది! తప్పకుండా దొరుకుతాడు అంట. దొరికాడు...తనకి!

 

    'నేను చూసినవాడ్నే చేసుకుంటానని ఏ ముహూర్తంలో అందో... తధాస్తు దేవతలు తమపని కానిచ్చేశారు!  

 

    లిల్లీకి ఈ విషయం తెలియకూడదు!

 

    కళ్ళు తుడిచేసుకున్నాను.

 

    "ముక్తా..." లిల్లీ పిలుస్తోంది.

 

    లిల్లీ నాకు అచ్చు చిన్నక్కలా కనిపిస్తోంది.

 

    దగ్గరికి వెళ్ళి గాఢంగా కౌగలించుకుని ఆమె చెక్కిలిమీద ముద్దు పెట్టుకున్నాను.

 

    "ఏమిటీ పని? మా వారు యీర్ష్యపడగలరు!" అని నవ్వింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS