"చాలా నచ్చచెప్పాను."
"... ...."
"ఈ ప్రపంచంలో ప్రేమకన్నా తండ్రి పరువుప్రఖ్యాతులు ముఖ్యమని గట్టిగా వాదించాను."
"..... ...."
"నీ మీద నమ్మకంతో బ్రతుకుతున్న నీ తండ్రి మనసు గాయం చేయటం క్షమించరాని నేరమన్నాను."
"అర్ధం చేసుకుందా?"
"లేదు."
"మరి?"
"మరింత మొండికేసింది."
"... ..."
"ఎవరు కాదన్నా నాకు నా ప్రేమే ముఖ్యమంది."
ఉక్రోషంగా వినిపించింది- "మరి నాకెందుకు చెప్పలేదు?"
"ఇలాంటి నిర్ణయం ఇంక తొందరగా తీసుకుంటుందని తెలీక."
"ఏం నిర్ణయం?"
"నిశ్శబ్దం."
"చెప్పు సౌదామినీ....ఇప్పుడేమైంది? ప్రబంధ ఎక్కడ?"
"ఇంట్లో లేదు."
"వ్వాట్! ఎక్కడికి వెళ్ళింది?"
"బహుశా..."
"వాడి దగ్గరికి... అవునా... డామిట్..." ఆవేశంతో రొప్పుతున్నాడు- "ఇంత జరిగినా నేను ఫోన్ చేసేదాకా ఇదంతా రహస్యంగా ఉంచావు. ఏడి...శౌరి ఎక్కడ?"
గావుకేకలు పెడుతుంటే, రిసీవర్ పక్కనుంచి వేగంగా వెళ్ళి శౌరిని నిద్రలేపింది.
తండ్రి పేరు చెప్పగానే మత్తువదిలిన శౌరి, ఒక్క అంగలో దూసుకొచ్చి రిసీవర్ అందుకున్నాడు- "డాడీ!"
"బాస్టర్డ్! నీ చెల్లెలు ఎవడితోనో వ్యవహారం చక్కబెడుతుంటే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నావా?"
అర్ధంకాలేదు శౌరికి- "ఏమిటి డాడీ?"
"గో..." ఓ శాసనంలా అన్నాడు- "వెంటనే వెళ్ళి..."
శౌరి మొహంలో రంగులు మారటం సౌదామిని స్పష్టంగా గమనించింది.
ఏ ప్రమాదాన్నో ఊహించి వారించబోయింది కాని, అప్పటికే రిసీవర్ క్రెడిల్ చేసిన శౌరి పరుగెత్తాడు.
ఉరుములు, మెరుపులతో వాతావరణం భయానకంగా ఉంది.
సౌదామిని సైతం ఆలస్యం చేయలేదు.
తనూ అనుసరించింది గేరజ్ లో ఉన్న ప్రబంధ కారు తీసుకుని.
* * *
ఆదిత్య చూపుల్లోని ఏ భావం ఆమెను కలవారపరిచిందో ప్రబంధ క్రీనీడలోకి జరిగింది సన్నగా కంపిస్తూ.
అదోలాంటి స్థితి.... ఎన్నడూ అలవాటు లేనిది. ఇంతదాకా పరిచయము కానిది.
"అడగండి" ఆమె గొంతు పూడుకుపోయింది. అతడి ఉద్విగ్నతకి వారధి వేసిందీ అదే.
"సారీ!" అన్నాడు తలవంచుకునే.
"దేనికి?" గొణుగుతున్నట్టుగా వినిపించింది.
"పోటీలో కూడని నియామకానికి."
"నేను మనస్ఫూర్తిగా అంగీకరించానుగా!"
"అయినా ఇది దారుణం..."
"ఓడిపోతానన్న భయమా?" ప్రబంధ రెచ్చగొట్టాలని అందో, లేక సీరియస్ గానే తన ఆలోచన్ని వ్యక్తం చేసిందో తెలీదు కాని- ఆదిత్యకి ఉక్రోషం ముంచుకొచ్చింది.
"ఇప్పటికైనా విరమించుదాం."
"తడిసిపోతున్నందుకు కంగారు పడుతున్నట్టున్నారు."
"ప్రబంధా!" చివరి హెచ్చరికలా అన్నాడు- "నేను మగాడిని."
"అయితే?"
"ఈ పోటీలో మీరు ఓడిన మరుక్షణం..." చెప్పలేకపోయాడు ఆ తరువాత.
"ఓడితేగా?"
"ఓడించడం కష్టం కాదు."
"కానప్పుడు ప్రయత్నించండి."
"మీరున్నది నా యింట."
"తెలిసే వచ్చాను."
"అదికాదు ప్రబంధా!" తన మనసులోని భావాన్ని ఎలా వ్యక్తం చేయాలో బోధపడటం లేదు తను నిగ్రహాన్ని కోల్పోకుండా ఉండలేనన్న భయం కావచ్చు. అయినా ఆ విషయాన్ని ఎలా చెప్పగలడని?
"మీ ఆలోచన నాకు అర్ధమైంది ఆదిత్యా!" స్వగతంలా అయినా, నిక్కచ్చిగా అంది "కేవలం మీ దగ్గరే ఇలాంటి పోటీకి సిద్దపడిన అమ్మాయిగా వచ్చాను. పర్యవసానానికి పూర్తిగా నేనే బాధ్యురాల్ని."
ఆ క్షణంలో ఆమెకు హఠాత్తుగా ప్రణయ గుర్తుకురావడం యాదృచ్చికము కావచ్చు కాని ఇక్కడ తన ప్రయత్నంతో ఆమె మీద గెలుపునే అన్వయించుకోవాలని దృఢంగా అనుకుంటూంది ఎంత నష్టమయినా గానీ, కేవలం ప్రబంధలాంటి మొండిపిల్లకి మాత్రమే సాధ్యపడే పోరాటమిది.
రేయి గడుస్తోంది. బయట వర్షపు హోరు ఇంకా అధికమౌతోంది.
"మీ ఇష్టం" అన్నాడు ఇబ్బందిగా.
"మీరు కంటిన్యూ చేయొచ్చు."
ప్రతి క్షణమూ మాత్రమే కాదు, ఆమె ప్రతిమాటా అతడికో సవాలుగా అనిపిస్తుంటే బయటి చీకటిలోకి చూస్తూ అడిగాడు.
