"ఎందుకు పిన్నీ! ఇవే ఎక్కువ, కాస్త తగ్గించండి" మొహమాటానికి అనేవాణ్ణి.
షాహజాద్, ఖుర్షీద్ చూపులు ఆశగా నన్నూ, నిరాశగా పిన్నినీ చూస్తుండేవి. షాహీజాద్ వచ్చి నాపక్కన కూర్చుంటాడు. ఖుర్షీద్ పిల్లవాణ్ణి పట్టుకొని చాపమీద కూలబడ్తాడు. పిల్లవాడు రొట్టెల్ని చూచి ఏడుస్తాడు. నేనో రొట్టెముక్క పిల్లవాడికి ఇస్తాను. నా దాతృత్వం మీద షాహీజాద్ కు కోపం వస్తుంది. "వెధవ పుక్కెపు తిండి తిని బలుస్తున్నాడు. మీరు వాడికి రొట్టె ఇవ్వకండి" అంటాడు. "మున్నా ఇటుతే కాకికి ఇస్తా" అని రొట్టెముక్క లాక్కొని నోట్లో వేసుకుంటాడు.
బాబాయి తల మోకాళ్లలో ఆనించి ముఖం దాచుకొంటాడు. ఇంతలో దగ్గుపొర వస్తుంది. ఉక్కిరిబిక్కిరయి ఏదో చెప్పాలనుకుంటాడు, నా నోట్లో ముద్ద విషంలా అనిపిస్తుంది. ఖుర్షీద్, షాహజాద్, మురాద్ భార్య, పిన్నీ-వీళ్ల నరాల్లోంచి లాగిన రక్తంలో నా వేళ్లు మునుగుతున్నాయి!!!
"మీరేం చేస్తుంటారు" ముంచుకొస్తున్న సిగ్గును కప్పిపుచ్చుకోవడానికి షాహీజాద్ ను అడిగాను.
"ఏంచేయను? ఏమీచేయను" అన్నాడు నా భోజనం మీద చూపు నిగిడించి "నాల్గుసార్లు మెట్రిక్ పరీక్ష ఇచ్చాను" అన్నాడు ముద్దమింగుతున్న నన్నుచూచి.
"ఏం చేయాలనుకుంటున్నారు?"
"నాకు ఫిలిం లైనులో పోవాలని ఉంది. కొద్దిగొప్ప డ్యాన్సు నేర్చుకున్నాను పాట కూడా వచ్చు" ఆవులిస్తూ అన్నాడు.
"చిన్నన్న జానీవాకర్ అవుతాడు" ఖుర్షీద్ అందించాడు.
"నోర్మూయ్ బే" ఒక్క తన్ను తన్నాడు అఖాఖ్ సాహెబ్. "జానీ వాకర్ అంటే నాకిష్టం. తాగుబోతు పాత్ర వాడికంటే బాగా చేయగలను. కాని ఫిలిం ఫీల్డులో అందమైన అమ్మాయైనా ఉండాలి, గట్టి సిఫారసైనా కావాలి."
"ఒకసారి చిన్నన్న వదిన గొలుసు తీసుకొని.... .... ...." ఖుర్షీద్ ఏదో చెప్పబోయాడు కాని షాహీజాద్ పళ్లు రాలేట్లు చెంప వాయించాడు. ఈ గొడవచూచి బాబాయి మేల్కొన్నాడు. లోకం ఎలా ఉందో చూడ్డానికి మేల్కొన్నట్లున్నాడు. లోకంలో వ్యాపించిన అంధకారం, అన్యాయం, అక్రమం చూచి తన "ఉటోపియా" లోకి వెళ్లిపోయాడు.
"మా నాన్నగారికో పిచ్చి, కొడుకులను పెంచి పెద్దవాళ్ళను చేస్తే పైస పైస రాబట్టాలను కొంటారు, వారికి తిండిని గురించి తీవ్రం ఎక్కువ. అన్నాను బి.ఏ. చదివించడానికి నాలుగువేలు పోశాడు. ఇప్పుడు చూడండి ఇక్కడ మా వదిన ఆరిపోతూంది. నన్నూ అలాగే చేయాలని ఎత్తు"
మాట్లాడుతున్నా అతని దృష్టి నా తిండిమీదనే ఉంది.
"నేను ఒప్పుకోలేదు. మిలటరీలో దరఖాస్తు ఇచ్చాను-చేరాను. కాని ఏం చెప్పను- నెలరోజుల్లోనే ఎముకలు నుసి అయినాయి. గండం గడిచి బయటపడ్డాను. ఇప్పుడిహ ఉద్యోగం అంటే అసహ్యం నాకు. ఇవ్వాళ కూడా రుచిగా ఉన్నట్లుంది." అని గుటకలు మింగాడు - మూడో రొట్టె ముట్టుకోకుండా భోజనం ముగించాలని అతని ఉద్దేశం.
"అన్న వస్తే కొంత డబ్బు తీసుకొని బొంబాయి వెళ్లి ప్రయత్నిస్తాను."
"పాపం, ఇంటి ఖర్చుకు ఇబ్బందిగా ఉన్నట్లుంది." అందమైన పాదాలను చూచి అనాలని అన్నాను.
"ఖుర్షీద్ బాగా సంపాయిస్తాడు. కాని మా ఇల్లే అంత. ఎంతవచ్చినా ఇంతే." అన్నాడు కాళ్లు ఊపుతూ.
క్రమక్రమంగా ఆ ఇంటి విషయాలన్నీ నాకు తెలిసిపోయాయి. పరిచయాలూ పెరిగాయి. పిన్ని తలుపు వార కూర్చొని తన పిల్లిగొంతుతో గంటల తరబడి మాట్లాడేది, కొడుకుల లక్షణాలు, పొరుగమ్మల ముచ్చట్లు, మొగుని నవాబు లాంటి ఖర్చూ, కోడలు టెక్కులూ ఎన్నో చెప్పేది. కోడలు మీద చాడీలు మెండు. కోడలుకు హిస్టీరియా! వంట తప్పించుకోవాలని మూడుసార్లు పొయ్యి మీద పడిపోయింది!! ఆమెకు తన అందంమీద గర్వం. భర్తంటే పడదు. పాపం వాడెంతో ప్రయత్నించాడు- అయినా ఉద్యోగం దొరకంది వాడేంచేస్తాడు చెప్పండి? తనకు కళ్ల కలకలు. మురాద్ తిరిగివస్తే ముందు వైద్యం చేయించుకుంటుంది. షాహజాద్ వదిన నగలన్నీ స్వాహా చేశాడు.
మాటలు అయిపోయాయనుకోండి - పాత ముచ్చట్లు అప్పగించేది. అప్పుడు ఆమెకు అయిదు గేదెలుండేవి. బాబాయి పేష్కారు. నేతితో తప్ప వంటలు చేసేదికాదు.
పిన్నితో వివరంగా మాట్లాడితే కాని నిద్రపట్టేదికాదు. ఆ నాజూకు పాదాలు నిప్పుకల మీద ఉరుకుతాయి. ఏకుతున్న దూదిలా నిద్ర చెదిరిపోతుంది. తెల్లని పూలల్లో భూమ్యాకాశాలు దాక్కుంటాయి. క్రమంగా పూల తెలుపుదనం పసుపుపచ్చగా మారుతుంది. తరవాత ఎరుపు అవుతుంది. అగ్గిమంటలు లేస్తాయి మంటలు - మంటలు - మంటలు.
ఉదయం లేస్తే అలిసిపోయినట్లుంటుంది - రాత్రి సాంతం రాళ్లు మోసినట్లు కనిపిస్తాను.
నెల చివరిరోజుల్లో కాళీ గదిలో వంటరిగా కూర్చోవలసి వస్తుంది. లోన ఏదో ఉడుకుతుంటుంది. బయటికి ఎవరు రారు. తుదకు పిన్ని తలుపు చాటుకు వచ్చి "చాలా ఆలస్యంగా వచ్చారు. బయట తినివచ్చారనుకున్నాం, సరే వండుతాలేండి. ఎంతసేపు" అంటుంది. నేను వద్దంటాను. అనవసరంగా వదినకు శ్రమ.
కొన్నాళ్లు జబ్బు నెపంతో వెళ్లలేదు. నాలుగు రోజులు వెనుక. ఇంటిల్లపాదీ బిలబిలా బయటికి వచ్చారు. పాపం బాబాయి కూడా ఈ పాడు లోకాన్ని చూడాల్సి వచ్చింది.
"బిడ్డా! ఈ నెలలో నాలుగురోజులు నీకు బాకీపడ్డాం. ఆ నాలుగు రోజులూ బోంచేసిపో బిడ్డా!"
"అదేమిటి నాలుగురోజులేమిటి? తరవాత రావద్దంటారా ఏం?"
