మామయ్య మాటాడకుండా నా వంక రెండు నిమిషాలు చూశాడు. చిన్నప్పుడు నేను పెంకి మాటలు మాటాడినప్పుడు బెదిరించడానికి చూసినట్టు. కాని ఈ తురక రాజ్యంలో ఆ మంత్రం పారక, పైపెచ్చు నేను నవ్వడం చేత, అతనికి తీవ్రమైన ఉక్రోషం ఒచ్చింది. తన బాణాలన్నీ రావణుడి యడల వ్యర్థమయినప్పటి రాముడివలె.
"సిగ్గులేదుటే. నీ మొహానికి! అంత మరీ చెడిపోయినావుటే! ఆ తురక వెధవ నిన్ను ఒదలలేకపోవడం ఒక గొప్పగా, బడాయిగా...."
"ఒక్క నిమిషం వదలలేని ప్రేమ ననుభవించడం కన్న అదృష్టం యేముంది స్త్రీకీ! నీ కర్థం కాదులే"
పళ్లు పటపట కొరికాడు. ఇంకేం చాతగాక!
"ఎందు కర్థమైతుంది? కుక్కలమల్లే, పందులమల్లే-"
ఇంకేవో మాటలన్నాడు. చెడిపోయినదాన్ని నా నోటి నుంచి కూడా రావు ఆ మాటలు.
"పుణ్య పురుషులు, బ్రాహ్మణులు మీరుమాత్రం అంతేగా! కుక్కల కన్న, పందులకన్న, అధమంగా. ఆ మాత్రం చాతగాక-"
ఇంక కోపం చూపించే విధం తోచలేదు మామయ్యకి.
"పాపం, పుణ్యం-సిగ్గూ, యెగ్గూ లేకుండా రాత్రులనక, పగలనక యీ అడవిలో దున్నలవలె పడి-యెందుకు యీ బతుకు బతకడం యింతకంటె దేంట్లోనన్నాపడి చావరాదూ?"
"మొదట్లో నా ప్లీడరు పెనిమిటీ ఓ వారం యిట్లానే వుండేవారు. తరవాత శక్తీ, రసికత్వమూ తగ్గి పవిత్ర పురుషుడైనాడు. ఆయన్ని యేమీ అనరేం!"
"పవిత్రమయిన కాపరానికీ, యీ గుడిసేటితనానికీ సాటి తీసుకొచ్చావా? నీ నోరుపడ?"
"మరి ఆ పవిత్రమయిన కాపరంలో కంటె, యిక్కడే ఆనందంగా ఆరోగ్యంగా వున్నానే!"
"ఉండదూ? ఆనందంగా వుండదూ మరి! అడ్డూ, ఆటంకమూ లేకుండా కులమూ, గోత్రమూ లేకుండా...."
"ఎంత అసహ్యంగా, క్షోభగా కుళ్ళుగా వుంటే అంత పుణ్యమన్నమాట!"
"ఎందుకు అసహ్యంగా వుంటుంది. దుర్భుద్ధికి అలా తోచింది గాని"....
"ఆ దుర్భుద్ధి మీ పెంపకం వల్లనా? లేక అలాంటిదాన్ని మీ అక్క కన్నదా? దేవుడిచ్చిన బుద్ధికి ఇంక మీరు యేడ్చి యేం ప్రయోజనం?
"వీపు చీలిస్తే బుద్ధి కుదుట పడుతుంది."
"సమయం మించిపోయింది."
ఆలోచిస్తున్నాడు.
"వూరికే పేర్లతో మనకీ తగాదా యెందుకు మామయ్యా!"
"అంటే."
"అదే! పవిత్రం, అవినీతి, పశువులమల్లే పాతివ్రత్యం .... యిలాంటి మాటలకి శాశ్వతంగా అర్థాలు ఏర్పడ్డాయి. వాటి నిజమయిన అర్థమేమా అని మనుషులు ఆలోచించడం మానేశారు.... నిజం చెప్పినా- మనుషులమయిన తరవాత మనం వాంఛలన్నీ వొకటే. తురకాడైతేనేం, బ్రాహ్మణుడైతేనేం. కాని ఇక్కడ సంతుష్టిగా, నిర్భయంగా అనుభవించడానికి వీలుంది. అక్కడ మాయమాటలతో, ఆధ్యాత్మికమని, యీశ్వరుడి మీద భారంవేసి, చివరికి అనుభవించడానికి జంకుతాము. ఇంత కామమూ, పోనీ అనుభవించడం చాతనైతే బావుండుననే కోర్కె అక్కడా వుంది. కాని ఈ రసికత్వమూ, ఈ సత్తువా అక్కడ లేవు. అందుకనే కుళ్ళు వాయువులూ, బోధనలూ, వేదాంతాలూ, మర్యాదలూ, కచేరీ కబుర్లూ ఎక్కువ అక్కడ...."
"వూరికే యింక మనసెలా యీడిస్తే అలా పోయి, బాగా యీ శరీర సుఖాలు అనుభవించడమేనన్నమాట యీ బతుక్కి అంతం?"
"అక్కడ వున్నా అంతేగా? తినడమూ, నిద్రా, మర్యాదా, చాకిరీ, అంతేగా! వాటివల్లే ఏదో పుణ్యలోకాలు వొస్తాయని దొంగ బోధనలు పైగా."
"మరి ధర్మమూ, పతిభక్తీ, సంసారమూ ఇవన్నీ?"
"ఎందుకు మామయ్యా, ఆ పేర్లన్నీ యాకరువు పెడతావు? ఎవరికి కావాలి అవన్నీ! తంతాడనీ, తిండి పెట్టడనీ, వేరు గతిలేకా, అనుభవించడం చాతకాకా. అంతమాత్రం ధైర్యమూ, రసికత్వమూలేకా, మొహాన్ని, చూసి ముచ్చటపడేవారు లేకనేగా ఆ పతిభక్తీ, పవిత్రతా! ఆ మొగుడి నించే తిట్లూ తన్నులూ తిని అడ్డమయిన చాకిరీ చేసి, తగాదాలు పడి, పోట్లాటలతో కాలం గడుపుతూ చస్తే, మోక్షమా! ఏ దేవుడు చెప్పాడు."
"మరి త్యాగమంటూ లేదా ఏమిటి?"
"నా అమీర్ కోసం నేను చేసిన త్యాగాలూ...."
"చాల్లే! ఇంక పశువుకి నీకూ భేదమేమిటి?"
"ఏమీలేదు. ఇదివరకు పశువుకన్న అధమమయిన బతుకే బతికే దాన్ని. ఇప్పుడు పశువునై సుఖపడుతున్నాను."
"ఇంక తల్లి తోడు...."
"అక్కడ.... ఆ చివాట్లలో.... అసహ్యాలలో యెన్నడూ జ్ఞాపకం వొస్తారు తల్లి తోడూ - సంతోషమనేది చిన్తనంతోనే సరి. అందువల్ల అన్నలన్నా తమ్ములన్నా అంత ప్రేమ. ఇక్కడ యీ దివ్య సౌఖ్యంలో యెవరూ జ్ఞాపకం రారు. నిజమయిన అత్తవారిల్లు, అందర్నీ మరిపించే స్వర్గం."
"ఇంకెప్పుడూ యింతేనన్నమాట. మళ్ళీ యింటికి రావడమూ అదీ లేదూ?"
"నన్ను రానిస్తారా?"
"రానిస్తే వొస్తావా మరి?"
"నేనా వొచ్చేది! నేను రాకేం! ఎందుకు వొస్తాను?"
"ఇదే శుభ్రంగ వుందా నీకు. ఈ కుండలూ, బొచ్చలూ, యీ అవతారమూ-"
"ఎందుకు అబద్ధాలు మాట్లాడుతావు? అద్దాలు లేకపోతేనేం ఆ యేరులేదూ? అమీర్ నేత్రసరోవరాలు లేవూ? నా పాప చూసుకోడానికి! అయినా అమీర్ చూపులకి బావుంటే చాలదా నా అవతారం."
