Previous Page Next Page 
మైదానం పేజి 10


    మామయ్య మౌనవ్రతం పూని కూచున్నాడు, అమీర్ వొచ్చాడు.
    "అప్పుడే వొచ్చావేం! మేమింకా ఉపోద్ఘాతంలోనే వున్నాము. మళ్ళీ కొంచెం వెళ్ళిరా."
    మళ్ళీ వెళ్ళాడు పాపం.
    "చూశావా ఎట్లా వెంట తిరుగుతాడో. ఒక్క నిమిషం వొదలక! నా భర్తలేడూ ఆయన వారంరోజులకి ఓ సారైనా నా మొహం చూసేవాడు కాడు. తలంటి పోసుకుని, తల్లో మరువం జాజిపువ్వులు పెట్టుకుని కొత్త సిల్కు చీర కట్టుకుని దగ్గిరికి వెడితే, కాయితాల్లో తల పెట్టుకుని....
    "మొన్న నీ చేతికి పదిరూపాయల నోటిచ్చాను కదా, అది కావాలి. ఓసారి తెచ్చి యియ్యి" అన్నాడు. ఇచ్చిన తర్వాత తలెత్తి చూసి,
    "మొన్న తెప్పించిన శీకాయి అంతా ఖర్చు పెట్టేశావా?" అన్నాడు. నవ్వుతోనేలే? అయితే మాత్రం....?"
    "ఎంత పొగరిక్కిందే నీకు! అతను తలుచుకుంటే యీ వెధవని ఖైదుకి పంపగలడు తెలుసునా?"
    "ఆ, ఈ వెధవ తలుచుకుంటే ఆయన్ని నిన్నుకూడా తలకాయ పగలకొట్టి, ఆయిక్కడ పాతెయ్యగలడని కూడా తెలుసుకో"
    "సరే నువ్విక్కణ్ణించి కదిలి రావన్నమాట. నాకు ముందే తెలుసు నీ మతం. కానీ, వాళ్ళందరూ పోరి యింకా సంగతులు బయటికి రాకముందే నిన్ను తీసుకొచ్చి దిగబెట్టమని పంపారు."
    "మరి నేనేమయినా ననుకుంటున్నారు?"
    "పుట్టింటికి వెళ్ళావని చెప్పుకు చస్తున్నారు."
    "నమ్మేరూ?"
    "అందరికీ తెలుసులే. కాని మాతో అనడానికి ధైర్యమేదీ? మా మాట నమ్మినట్టే నటిస్తున్నారు. ఆ గతికి తెచ్చావు మమ్మల్ని నిన్ను పెంచి పెద్దదాన్ని చేసినందుకు."
    "పాపం. మర్యాదస్థులకి యెన్ని బాధలు! మీ దొంగ మర్యాదలూ, అబద్ధాలూ కాపాడ్డానికి నేను మళ్ళీ ఆ నరకంలోకి వొచ్చి వుండాలా? ఎందుకు రావాలి?"
    "ఎందుకేమిటి? ఏదో ఓసారి తెలివితక్కువ పనిచేస్తే, పెద్దవాళ్ళ మాట విని అన్నా సర్దుకోవాలి. ఏదో యిట్లాంటివి ప్రతివారూ చేస్తారు. కాని అదే బావుందని, భ్రష్టయై నాశనమౌతానని పట్టుపట్టేదాన్ని నిన్నొకదాన్ని చూసా నీనాటికీ."
    "అవును. నేను రాను, రాను."
    "ఈనాడిట్టానే అంటావు. ఎన్నాళ్ళులే వీడి మోజు! తరవాత నీకు దిక్కెవరు!"
    "నారాయణుడు. కాని అమీర్ ప్రేమ పోదు."
    "ఆ, చాలా చూశాము!"
    "సరేకాని యీ దయంతా నా కోసమేనా?"
    "పోనీ, అమ్మని తలుచుకో. నిన్ను పెంచి పెద్దదాన్ని చేసి, యేదో మా అందరికి ప్రతిష్ట తెస్తావని...."
    "అవన్నీ చిన్నప్పుడు కుమారీశతకంలో చదువుకున్నాను. దానికేం! నా సౌఖ్యమే మీరు కోరేవారైతే, యిక్కణ్ణించి తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చెయ్యరు. అయినా నేనిప్పుడొస్తే మాత్రం లోకమంతా ఎలా చూస్తుంది? ఆ కాపరం యెంత రమ్యంగా వుంటుంది? లేచిపోయిందని చూద్దామని అందరూ రావడమూ, గుమ్మంలోకి వొచ్చి మొహాలు మర్యాదగా మార్చుకోవడమూ, నేను లోపలికి వెళ్ళగానే నవ్వుకోవడమూ, వాళ్ళు నాసంగతులేమీ తెలీనట్టే మాట్లాడడమూ, దొంగ మర్యాదలూ, యెవరన్నా ధైర్యం గలవాళ్ళు నన్ను కార్యానికి పిలవకపోతే, నా భర్త ఆ అవమానం నావల్ల కలిగిందని యాడవడమూ, తిట్టడమూ, దెప్పడమూ, నేనే స్వేచ్చ నడిగినా, బైట తొంగిచూసినా, నా పూర్వ ప్రవర్తనని జ్ఞాపకం చేసి నోరు ముయ్యడమూ- దీనికేగా నన్ను రమ్మంటున్నావు! నేను పిచ్చిదాన్నా."
    "ఏనాటికన్నా మా గుమ్మం తొక్కవా-" అంటున్నాడు చాలా కోపంగా పైకిలేచి.
    "అమీర్ వొదిలేస్తేనా? అమీర్ నన్ను వొదిలేసిన తరవాత, నేనేమైపోతేనేం? ఇంక ఆ లోకంలోనే శరణ్యం. మీ గుమ్మాలు తొక్కుతానని యేమాత్రం భయం లేకుండా బతకండి."
    అమీర్ వొచ్చాడు. అతని వొంక నిదానంగా పరీక్షించి చూశాను. ఈ అమీర్ నన్ను వొదులుతాడా?
    అమీర్ కళ్ళలో ఆకలి ఆడుతోంది.
    "మామయ్యా, నీ భోజనం సంగతేమిటి?"
    "నేను పళ్ళు తెచ్చుకున్నాను."
    "ఇక్కడ గడ్డి కూడా వుంది" అన్నాడు అమీర్.
    పడమటి కొండ వెనకాల రంగుల మబ్బుల్లో శుక్రుడు అస్తమిస్తున్నాడు. తామర పువ్వుమీది మంచు బొట్టుమల్లే. గాలి నిశ్శబ్దంగా వుండడం వల్ల యేరు కొండమీదినుండిపడే శబ్దం వినబడుతోంది. చీపుర్లూ, నేపాళాలు పగలు రాత్రిగా మారే విచిత్రాన్ని చూస్తూ కదలక నుంచున్నాయి. పగటి గట్టుమీద నుంచి సరస్సులో దూకటానికి సంశయించే దానివలె ఒక్క నిమిషం ఆగింది కాలం. హృదయం ఒక్కసారిగా ఆనందంతో పొంగింది. పొయ్యిమీది వేడెక్కే అన్నంవలె. మామయ్య అరటిపళ్ళు తింటూ యెదురుగా కూచోకపోతే, ఆ ఆరాటమంతా అమీర్ మీద కనపరచేదాన్ని.
    ఒక గంటసేపు మా బంధువుల్నీ, వాళ్ళ క్షేమాల్నే అడుగుతూ కూచున్నాను. మామయ్యతో మాటాడుతూ వుంటే మూడునెలల కిందట నా జీవిత దృష్టినంతా ఆక్రమించుకున్న యీ బంధవు లందరూ యెంతో దూరమై పోయినట్లుగా తోచారు. నేను చచ్చిపోయి, అన్ని బంధనాలు తెంచుకొని మళ్ళీ వాటిని కల్పించకునే ఆశా, శక్తీ లేక, యేం తోచక తమాషాకి ప్రశ్నిస్తున్నట్టుంది, భూలోకం నుంచి వచ్చిన మామయ్యని. మృత్యువులోనైనా అంతే గావును! ఈ ప్రపంచాన్నీ, ఎత్తయిన, విశాలమైన, సంబంధ రహితమయిన వున్నత దృష్టితో లీలగా పరీక్షించడం గావును! దృష్టికోణం బేదించి అమీర్ అనే నేత్రయంత్రంలోంచి చూసేటప్పటికి అన్ని విలవలూ మారిపోయినాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS