అతని చెయ్యి ఆమె గుండెలమీద పడినప్పుడు ఆమె పెదవి కదిపింది.
"ఒక్క కోరిక."
"ఏమిటి?" అన్నట్టు చూశాడు చాలా మామూలుగా.
"మిగతా జోగినులలా అందరి మనిషినీ చెయ్యకండి. జీవితాంతం మీరే వుంచుకోండి."
"అలాగే" అన్నట్టు చూశాడు.
తరువాత ఆమె బట్టలు వొలవడం ప్రారంభించాడు. జోగినిగా మారిన వాసంతి - ఏం చేసినా ఏ పాపమూ అంటకూడని వాసంతి అతనికి అంకితం అవుతోంది. తనని తను ఆహుతి చేసుకుంటూ కాసేపటికి "అమ్మా" అన్న మూలుగు చీకటి పొరలను చీలుస్తూ.
* * * *
రాత్రి పదకొండు గంటలవేళ శ్రీహర్ష, విలాస్ ఓ యింటి అరుగుమీద పడుకున్నారు. ఆ ఊళ్ళో ఉన్న చిన్న హోటల్లో అంతకు ముందెప్పుడో భోజనం చేశారు.
"శ్రీహర్శా! ఇక్కణ్ణుంచి రేపొద్దున వెళ్ళిపోదామా" అన్నాడు విలాస్.
"నువ్వెళ్ళు. నేను రాను" అన్నాడు శ్రీహర్ష.
"అదేమిటి?"
"విలాస్! నిన్న మొన్నటిదాకా కాలేజీలో డిగ్రీ తీసుకోవడమే జీవితగమ్యమని భావించి, కేవలం చదువే సర్వస్వమని అనుకుంటూ వచ్చాను. ఎందుకు పుట్టిందో, సైకిలు మీద దేశ పర్యటన చేద్దామని బుద్ధి పుట్టింది నాకు. తెలీని జీవితం, వేగం ఎంత ఉందో ఎలాంటి ఆటవిక, అనాగరిక సమాజం మన చుట్టూ ఎంత పేరుకుపోయిందో గ్రహించాను. ఊపిరాడనివ్వకుండా చేసే ఈ భయంకరమైన మూఢాచారాలు, వాటిని తమ స్వార్థానికి వాడుకునే మనుషుల్లో కరుడుగట్టుకుపోయిన దుర్మార్గం_నన్ను మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా శాసిస్తున్నాయి. నేను మధ్య తరగతి కుటుంబంలో పుట్టాను. పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే తాహతు నాకెలాగూ లేదు. ఎక్కడో అక్కడ చిన్న ఉద్యోగంతో జీవితం మొదలు పెట్టవలసిన వాడ్ని. ఆ పని యిక్కడే చేస్తాను. చుట్టుప్రక్కల చాలా గ్రామాలున్నాయి. ఇక్కడగానీ, దగ్గర్లో వున్న ఏ ఊళ్ళో గాని ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు.
"నీ నిర్ణయం అంతేనంటావా?" శ్రీహర్ష జవాబివ్వలేదు. అతని మౌనం ... అందులోని దృఢత్వం విలాస్ కు అర్ధమయింది. మాట్లాడకుండానే ప్రక్కకు తిరిగి పడుకున్నాడు.
వారం రోజులు గడిచాయి. విలాస్ ఆ మరునాడే జోగాపురం విడిచి వెళ్ళిపోయాడు.
ఆ వూళ్ళో ఓ యాభైయేళ్ళ వితంతువు వొంటరిగా తన పెంకుటింట్లో నివసిస్తోంది. పేరు వకుళాంబ. ఆమెకు ముందూ వెనుక ఎవరూ లేరు. ఆమె ఇంట్లో ఓ గది ఖాళీగా వుంది. హోటల్లో కాఫీ త్రాగుతుండగా ఎవరో చెబితే శ్రీహర్ష ఆమెను వెళ్ళి కలుసుకున్నాడు. వకుళాంబ చాలా సాత్వికురాలిగా కనిపించింది. అతణ్ని అట్టే ప్రశ్నలతో వేధించకుండా అద్దె గురించి అట్టే బేరసారాలు చేయకుండా అతనికి గది ఇవ్వడానికి వొప్పుకుంది. ఆరోజే అతనాయింట్లోకి వచ్చి చేరిపోయాడు.
మొదటి మూడు నాలుగు రోజులూ ఉ ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా ఊళ్ళో నాలుగు వైపులూ తిరిగేశాడు. ఊరు మరీ అంత చిన్నదేమీకాదు. రకరకాల ప్రవృత్తులవారు, వృత్తులవారు ఆ వాతావరణంలో యిమిడిపోయి వున్నారు. ఒకరోజు దూరంగా వున్న కొండలు దాటి అడవులకేసి వెళ్ళాడు. ఆకుపచ్చ కొండలమీద, అవరోధాలు తొలగించుకుంటూ నడుస్తోంటే అతనికి చాలా ఉల్లాసంగా అనిపించింది. అక్కడక్కడా గొర్రెలను కాచుకునే కుర్రాళ్ళు కనిపించారు. ఓ రోజు హరిజనవాడలోకి వెళ్ళి కలయ తిరిగి వచ్చాడు.
ఇంటినుంచి తెచ్చుకున్న డబ్బులు కరిగిపోతున్నాయి. ఇహ ఉద్యోగం కోసం వేటకు బయల్దేరాలి. వకుళాంబ కొన్ని పేర్లు సూచించింది వెళ్ళి కలుసుకోమని. ఆవిడ ప్రకారం వెళ్ళి మొదట పరంజ్యోతిని కలుసుకున్నాడు.
అతను వెళ్ళిన సమయానికి పరంజ్యోతి ఉయ్యాలబల్ల మీద కూర్చుని ఊగుతున్నాడు. వ్రేళ్ళమధ్య గోల్డ్ ఫేక్ ఫిల్టర్ సిగరెట్ కాలుతోంది.
