మామూలు భోజనానికి అలవాటుపడ్డవారు అక్కడ ఓ పూట కూడా భోజనం చేయలేరు. అందుకే అతిథులు ఓ పూట వుండి మరో పూటకు అక్కణ్నుంచి వుడాయిస్తారు. వితంతువులకు జిహ్వచాపల్యం వుండకూడదని విమలాబాయి చెబుతుంటుంది.
అమ్మాయిలు టిఫిన్లు ముగించి లేచారు.
టీలు, కాఫీలు వుండవక్కడ. ఎప్పుడైనా ఉపవాసం వున్న రోజుల్లో రాత్రిపూట పాలు మాత్రం యిస్తారు.
వంటశాల నుంచి తమ గదులకు వచ్చిన అమ్మాయిలు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జ్ఞానసముపార్జన చేయాలి. వాళ్ళు అందుకోసం పుస్తకాలు చదవాలి. ప్రాచీన ధర్మశాస్త్రాలూ, పురాణాలూ, ఇతిహాసాలు చదువుకోవాలి. దీనికోసం అనాథ మహిళా సదన్ లో లైబ్రరీ వుంది. అమ్మాయిలంతా అక్కడ చేరి పుస్తక పఠనంలో మునిగిపోయారు.
పన్నెండున్నరకు భోజనం.
భోజనానంతరం అయిదు గంటల వరకు విశ్రాంతి. అయితే నిద్రపోకూడదు. బట్టలుతుక్కోవడం, గదిని శుభ్రం చేసుకోవడం లాంటి చిన్న చిన్న పనులకు ఈ టైమ్ ని కేటాయించాలి. స్త్రీలకు పగటి నిద్ర ప్రమాదకరమని విమలాబాయి నమ్మకం.
అయిదుగంటలకి తిరిగి సభామందిరానికి రావాలి. ఈ సమయంలో విమలాబాయి వచ్చి ఉపన్యసిస్తుంది. భారత స్త్రీ ఎలా నడుచుకోవాలో చెబుతుంది. మగవాళ్ళతో పోటీపడే పాశ్చాత్య స్త్రీలు ఎంతగా దిగజారిపోయిందీ విషాదాన్ని రంగరించి మరీ విపులీకరిస్తుంది.
ఆరోజు కూడా యధాప్రకారం విమలాబాయి మన సాంప్రదాయాలు ఎంత విలువైనవో చెప్పి చివరగా అమ్మాయిల వైపు తిరిగి "ఈ సంవత్సరం శిక్షణ విజయదశమితో ముగుస్తుంది. మీకు ఆరోజు వితంతు దీక్ష యిస్తాను. మీరు నిర్మలహృదయులై పాశ్చాత్య నాగరికతా ధోరణులపై సమరశంఖం పూరించాలి. ఎవరు ఎంత వత్తడిచేసినా మీ దీక్షను వదలకూడదు. ఎక్కడైతే స్త్రీలు మగవారిని ఎదిరించకుండా అణిగిమణిగి వుంటారో అక్కడే సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని మీరి ప్రచారం ప్రారంభించాలి. మీ నడవడిక అందుకు తగ్గట్టే వుండాలి.
ఇప్పటివరకూ ఇక్కడ శిక్షణ పొందిన వితంతువులంతా తమకు అప్పగించిన పనిని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వర్తిస్తున్నారు. మీరూ భౌతిక సుఖాల ఆకర్షణకు లోబడకుండా, దేహాభిమానం వదిలి ప్రవర్తిస్తారన్న నమ్మకం నాకుంది" అని ముగించింది.
అమ్మాయిల ముఖాల్లో వెలుగు.
విమలాబాయి ఉపన్యాసం ముగించగానే అమ్మాయిలు తమ సదన్ లోకి వచ్చి ఆత్మ ప్రక్షాళనా మందిరంలో హాజరయ్యారు. ప్రతిరోజూ సాయంకాలం ఏడుగంటల నుంచి ఎనిమిది గంటలవరకు ఆత్మ ప్రక్షాళనా కార్యక్రమం వుంటుంది. ఇదంతా మౌనిక ఆధ్వర్యంలో జరుగుతుంది.
ఇక్కడ అమ్మాయిలంతా హాజరై ఆరోజు తాము ఏ తప్పులు చేస్తున్నా, ఏవైనా పాపపుటాలోచనలు వచ్చిన సభాముఖంగా చెప్పుకోవాలి. అందుకు సరైన శిక్ష కూడా తమకు తామే విధించుకోవాలి.
అందరూ హాజరయ్యాక కైవల్య లేచింది. సభకు నమస్కారం చేశాక మెల్లగా నోరు విప్పింది. "మధ్యాహ్నం భోజనాల సమయంలో ఓ పాపిష్టి ఆలోచన వచ్చింది. చిక్కుడుకాయ వేపుడు విస్తట్లో పడగానే నా నోట్లో ఎక్కువగా లాలాజలం వూరింది. గతంలో నాకిష్టమైన కూర అది. దాన్ని నోట్లో వేసుకోగానే చిటికెడు ఉప్పు వేసుకుంటే బావుండుననిపించింది" అని చెప్పి తలదించుకుంది.
మిగిలినవాళ్ళు ఏమీ మాట్లాడలేకపోయారు.
తిరిగి కైవల్యే ప్రారంభించింది. "అంటే నాకింకా జిహ్వచాపల్యం చావలేదన్న మాట. నాలుకను తెగ్గోసుకుందామన్న కసి పుట్టుకొచ్చింది"
"కైవల్యా' మౌనిక గొంతు గంభీరంగా వినిపించింది.
"తమ తప్పు తెలుసుకోవడమే గొప్ప ప్రాయశ్చిత్తం. ఇంకెప్పుడూ అలాంటి ఆలోచనలు రానివ్వకు"
"అలా సరిపెట్టుకోలేదు. శిక్ష పడాల్సిందే. తప్పుకు శిక్ష అనుభవించడమే సరయిన మందు. తప్పు తెలుసుకోవడం కాదు. తప్పు జరక్కుండా చూడాలి"
ఇక కైవల్య తన పట్టు వదలదు.
అందుకే మౌనిక కూడా మౌనంగా వుండిపోయింది.
"ఈరోజు నుంచి విజయదశమి వరకు రాత్రిపూట భోజనం చేయను. అదే నాకు నేను వేసుకుంటున్న శిక్ష" అని చెప్పి కైవల్య ఇంకా తలదించకుండా అందర్నీ చూస్తోంది.
ఆ నిర్ణయం అందరికీ బాధగానే వుంది. కానీ ఏం చేయగలరు? తప్పు జరిగిపోయింది. అందుకు శిక్ష అనుభవించాల్సిందే. ఆత్మ ప్రక్షాళనం అంటే అదే మరి.
"కైవల్యా! నువ్వు మాకు ఆదర్శం" మౌనిక మెచ్చుకోలుగా ఆమెవైపు చూసింది.
"అవును - ఆదర్శం" అందరూ మూకుమ్మడిగా అన్నారు. అంతమంది ఒకేసారి మాట్లాడినా ఆ శబ్దాలు గదినుంచి బయటికి రాలేదు. కారణం వాళ్ళు చిన్నగా మాట్లాడుకుంటారు. అలా మాట్లాడుకోవడం వాళ్ళు ఇక్కడ చేరిన నాటినుంచే నేర్చుకున్నారు.
మరికొంతసేపు అవీ ఇవీ మాట్లాడుకున్నాక రాత్రి భోజనాలకు వెళ్ళారు.
ఓ తాళింపు, సాంబారు, రసం, మజ్జిగ - భోజనమంటే అంతే. పచ్చళ్ళు, ఊరగాయలు, నెయ్యి, అప్పళంలాంటివి తినకూడదు. ప్రాణాలు నిలుపుకోవడానికి తప్ప దేహాన్ని పెంచడం కోసం భుజించకూడదన్నది అక్కడి సిద్ధాంతం.
అందరూ భోజనాలకు వెళ్ళినా కైవల్య మాత్రం గదిలోనే వుండిపోయింది. శిక్ష అమలవుతోంది మరి.
భోజనాలు ముగించి అందరూ తిరిగి తమ గదులకి వచ్చేసరికి తొమ్మిదయింది.
మౌనిక తన గదిలోకి వచ్చి నిద్రకుపక్రమించింది. తొమ్మిదింటికి అందరూ నిద్రపోవాలి. తొమ్మిది దాటాక ఎవరి గదుల్లోనూ లైట్లు వుండకూడదు.
మౌనిక లైటార్పి, దుప్పటిని నిండుగా కప్పుకుంది. 'విజయదశమి రోజుకి దీక్షా ప్రదానం జరుగుతుంది. ఇక అప్పటినుంచి తను అన్నిటికీ దూరం. ఈ బంధాల నుంచి విముక్తి. వితంతువుగానే వుంటూ సనాతన ధర్మాల ప్రచారానికి శేషజీవితం అంకితం. విజయదశమికి శాశ్వతంగా ప్రాపంచిక విషయాలకు దూరమైపోతుంది. అంటే ఇంకా ఇరవైతొమ్మిది రోజులుందన్నమాట' అనుకుంది.
ఆమె ఆనందంగా కళ్ళు మూసుకుంది.
అదే సమయంలో తన నలుగురి అనుచరులతో గణపతిరాజు మహిళా సదన్ లోకి అడుగుపెట్టాడు.
తరుణ్ అక్కడే వుంటాడని ఎందుకనో అతనికి నమ్మకంగా వుంది.
* * * * *
తరుణ్ కి మెలకువ వచ్చింది. ఒక్క క్షణంపాటు తను ఎక్కడుందీ గుర్తుకురాలేదు. అటూ ఇటూ చూశాడు. చీకటి నీళ్ళలాగా రాలుతున్నట్లు చినుకులు. వర్షం పడుతుండటం వల్ల తను లేచాడా? లేక ఆకలి వేయడం వలన మెలకువ వచ్చిందా? లేదూ మెలకువ రావడంతో ఆకలి తెలుస్తోందా? ఏది ముందు? ఈ ప్రశ్న ఒక్కటే మొత్తం తత్త్వశాస్త్రానికి పునాది. భావం ముందా? పదార్ధం ముందా?
