Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 10


    దీనికి జవాబు చెప్పే పద్ధతిలోనే తత్వవేత్తలు రెండుగా చీలిపోతారు.

 

    ఈ ప్రపంచం రాక, ఈ ప్రపంచాన్ని సృష్టించిన అఖండభావం ఏదో వుందని అనేవారు భావవాదులు. దానికి వ్యతిరేకంగా పదార్ధం ముందు, దాని రూపమే భావం అనేవారు భౌతికవాదులు.

 

    ఈ రెండు వాదనలు మధ్య ఘర్షణ ఈ రోజుది కాదు. ఉపనిషత్తుల కాలం నుంచీ వుంది. ఉద్ధాలకుని భౌతిక వాదానికి వ్యతిరేకంగా యాజ్ఞవల్క్యుడు భావవాదాన్ని పట్టుకొచ్చాడు. ఇక ఆనాటినుంచి నేటివరకూ పోరాటం జరుగుతూనే వుంది.

 

    అయినా ఈ గొడవంతా యిప్పుడెందుకు?

 

    ఇప్పుడు టైమ్ ఎంతయ్యుంటుంది? పదయ్యుండచ్చు.

 

    అతను పైకి లేచాడు. తెల్లవారి పడుకున్న తరువాత యిప్పుడే మెలకువ రావడం. అంటే దాదాపు పన్నెండు గంటలు నిద్రపోయాడు. అంత మొద్దు నిద్ర ఎప్పుడూ పోలేదు. ఇంతరాత్రి ఎక్కడికని వెళ్లడం?     

 

    గణపతిరాజు మనుషులు తనకోసం యిక్కడికొచ్చే అవకాశముందికాబట్టి జాగ్రత్తగా వుండాలి. గణపతి రాజు ఎక్కడో ఓ రాజకీయ నాయకుడితో మాట్లాడుతున్నప్పుడు చూసినట్టు గుర్తు.

 

    సుతారంగా ఆకాశంలోంచి అప్సరస దిగుతున్నట్లు చినుకులు పడుతున్నాయి.

 

    అతను నడుచుకుంటూ యివతలికి వచ్చాడు.

 

    వరుసగా యిళ్ళు.

 

    ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకుని వరండాలో పడుకోవాలన్నది అతని ఆలోచన.  

 

    మొదట వున్న యింటి దగ్గర కొచ్చాడు.

 

    అన్ని ఇళ్ళున్నా చిన్న శబ్దమయినా లేకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలగజేసింది.

 

    మెట్లెక్కి వరండాలో నిలబడి తలుపు తట్టబోయాడు. కానీ ఏదో బెరుకు చేతిని వెనక్కి లాగేస్తోంది.

 

    రెండు మూడు క్షణాలు తటపటాయించి ఇక తప్పదనిపించి మెల్లగా తట్టాడు.

 

    వర్షం పెద్దదయినట్లు జల్లు వలలా మీద పడుతోంది. ముడుచుకున్నట్లు శరీరాన్ని లోపలికి లాక్కున్నాడు.

 

    తలుపు తట్టి నిముషమైనా ఎవరూ రాలేదు.

 

    తాళం వేసుందేమోనని చూశాడు.

 

    తాళం లేదు. అంటే లోపల ఎవరో ఒకరు వున్నారన్న మాట. ఇంకాస్త చప్పుడయ్యేటట్లు తట్టాడు.

 

    తలుపు శబ్దం చేస్తున్నట్లనిపించడంతో మౌనిక దుప్పటిని ముఖం మీద నుంచి తీసి, తలుపు తీసి చూసింది. ఎవరో తలుపు కొడుతున్నారు.

 

    కైవల్యానంద ఇంకా పశ్చాత్తాపం నుంచి తేరుకోలేక వచ్చిందా? దుప్పటిని క్షణంలో తొలగించి, మంచంపై నుంచి లేచి తలుపు తీసింది.

 

    వానజల్లు ఒక్కసారిగా ఆమె ముఖాన్ని లాగి కొట్టింది. అయితే అదేమీ గమనించలేనంత షాక్ లో అలా నిలబడి చూస్తోంది.

 

    ఒకరికొకరు కనపడేందుకు సాయంచేయాలని కాబోలు అప్పుడొక మెరుపు మెరిసింది.

 

    అతన్ని చూసి కెవ్వున అరవబోయి, ఎలాగో తమాయించుకుంది ఆమె. అతనూ అంతే.

 

    ఎవరో గంధర్వకన్య దారి తప్పి ఆ రాత్రి అక్కడ తలదాచుకుంటున్నట్లు అనిపించింది.

 

    "నా పేరు తరుణ్. విధిలేని పరిస్థితుల్లో యిటొచ్చాను. ఈ రాత్రికి మీ వరండాలో పడుకుంటాను. అందుకు మీకేమీ అభ్యంతరం లేదు కదా?" అన్నాడు.

 

    ఆమె ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. అంత దగ్గరగా ఒక యువకుడ్ని చూడటం సంవత్సరం తరువాత అదే మొదటిసారి.

 

    తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్న చిన్నపిల్ల తల పైకెత్తి చూస్తే తన తండ్రికి బదులు ఎవరో కొత్త వ్యక్తి కనిపించినట్లు అయిపోయింది ఆమె పరిస్థితి.

 

    ఆమె ఏమీ మాట్లాడలేకపోవడంతో అతను ఆమెను పరిశీలించి చూడడానికి ప్రయత్నించాడు.

 

    మళ్ళీ మెరుపు.

 

    'రాతిరియన్ పవల్ మరపురాని హొయలు..." అల్లసాని పెద్దన పద్యపాదం గుర్తొచ్చింది. నిజం - ఆమె ముఖం అంత అందంగా వుంది.

 

    మళ్ళీ ఓ మెరుపు.

 

    'పడతి గుబ్బలు మీఱు భద్రకుంభని రూఢి...' రామరాజభూషణుడు రచించిన మనుచరిత్రలోని పద్యం మనసులో మెదిలింది. నిజం - ఆమె ఎద అంతా అద్భుతంగా వుంది.

 

    మళ్ళీ ఓ మెరుపు.

 

    'నడుమే పసలేదు నారీమణికిన్...' చేమకూర చమత్కారంగా చెప్పిన చమక్కు గుర్తొచ్చింది. నిజం - ఆమె నడుం అంత సన్నగా వుంది.

 

    మళ్ళీ ఓ మెరుపు.

 

    ఒథెల్లో డిస్టిమోనాను కౌగిలించుకుని - ఈ కౌగిలిలోనే చనిపోతే ఎంత బావుండు' అని ఎందుకన్నాడో ఆ సమయంలో తెలిసింది అతనికి.

 

    ఆమె సన్నగా వణుకుతోంది.

 

    చలివల్లో, భయంవల్లో తేల్చుకోలేకపోయాడు.

 

    "మొన్నటివరకూ ఓ దినపత్రికలో పనిచేశాను. మీరేమీ భయపడనక్కర్లేదు" అన్నాడు ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ.

 

    ఆమె ఏమీ మాట్లాడలేకపోతోంది.

 

    అతను చెప్పినదంతా ఆమె చెవులకు ఎక్కలేదు. అప్పుడు ఒక్క కళ్ళు తప్ప ఏ అవయవమూ పనిచేయడంలేదు.

 

    "ఎవరు మీరు?" అతను ఆమెని ప్రశ్నించాడు.

 

    ఆమెకి ఆ మాట మాత్రం వినిపించింది. రాత్రి - ఎదురుగా ఓ యువకుడు నిలబడి ఎవరు నువ్వు అంటే ఏం చెప్పాలి? సంవత్సరంగా సాగుతున్న తన శిక్షణలో ఇలాంటి  సందర్భం వస్తే ఏం చెప్పాలో ఎవరూ నేర్పలేదు.

 

    "ఎవరు మీరు?"

 

    అతను మళ్ళీ అడుగుతున్నాడు.

 

    అతనికి ఏం చెబుతావు మౌనికా? ఏదో ఒకటి చెప్పు.

 

    వేదాంతులు చెప్పినట్లు తనుగా కనిపిస్తున్న ఈ రూపం అసత్యం. సత్యమైంది ఒక్కటే - అది ఆత్మ. కాబట్టి నశించే ఈ దేహానికి ఏం పేరు వుంటే మాత్రం ఏం? నశింపులేని ఆత్మకు పేరు పెట్టడం కుదరదు.

 

    "ఎవరు మీరు?" మళ్ళీ అదే ప్రశ్న.

 

    ఈసారి న్యాయవైశాషికులు చెప్పే రీతిలో చెపితే ఎలా వుంటుంది ? మా దేహం మొత్తం అణుసముదాయం వల్ల ఏర్పడింది. ప్రతి కార్యానికీ ఒక కారణం వుంటుంది. ఆ కారణమే భగవంతుడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS