Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 84


    "అవును. నేనింకా చూడనేలేదు. పొద్దుటేగా వచ్చాను" అంది.
    విమల "అది సన్ ఫ్లవర్ మొక్కా?" అని రెండడుగులు అటు వేస్తూ కనకదుర్గ వంక చూసింది. ఆమె కూడా వచ్చేందుకు.
    యిద్దరూ అటు వెళ్ళారు.
    "నే విన్నదాన్నిబట్టి మీవారితో చాలా కష్టం జాగ్రత్తగా వుండాలి, కావలసినవాళ్ళు కాబట్టి చెప్తున్నాను. ఆవిడ మీ చిన్నత్త చాలా వుత్తమురాలు__"
    మధ్యలోనే అందుకొని "మొదటి భార్య యెట్లా చచ్చిపోయింది. అంత సడన్ గా? వైరల్ ఫీవరంట కదా, అవునా?" అంది కనకదుర్గ.
    "ఆ మనిషిప్పుడు లేదుగా యెట్లా పోతే యేంగానీ__"
    భయంగా చూసి, "ఐతే__" అని ఆగిపోయింది కనకదుర్గ.
    "ఐతేలేదు గియితేలేదు. భయపడాల్సిందేమీ లేదు. మీ చిన మామయ్య మీవారూ లేనప్పుడు ఫోను చెయ్యండి" అని ఫోను నెంబరు చెప్పింది విమల.
    అంతలో ప్రసాద్ పిలిచాడు, తిరిగి వెళ్ళారు.
    "వీలైతే మీరిద్దరూ రేపు సాయంత్రం వొకసారి రాకూడదూ?" అన్నాడు ప్రసాద్.
    "అట్లాగే వస్తాం" అన్నాడు భావనారాయణ.
    మరుసటిరోజు సాయంత్రం, "చెల్లెమ్మా వూళ్ళో తెలిసిన వాళ్ళింటికి అట్లా వెళ్ళొస్తాను, అమ్మాయిని తీసుకుని" అన్నాడు భావనారాయణ.
    "అయ్యో ముందుగా తెలిస్తే కారు అట్టిపెట్టి వెళ్ళేవారుగా! విజయ్ కూడా లేడు వేళకి" అంది నొచ్చుకుంటూ.
    'యెప్పుడో వచ్చాను సిటీకి. వూరు చూస్తా వెళ్ళొస్తాం" అన్నాడు భావనారాయణ.
    ఆరింటికి వెళ్ళారు.
    వీళ్ళు వెళ్ళేసరికి, విమల ప్రసాద్ లు వాకిట్లో పూలమొక్కల్లో టచ్చాడుతున్నారు. చూసి, గేటు దగ్గిరికి వచ్చి లోనకి తీసుకువెళ్ళారు.
    భావనారాయణ ప్రసాద్ తండ్రీ వాళ్ళ బంధువుల కబుర్లు చెబుతున్నాడు.
    అంతలో ఫోను మోగింది. విమల అందుకుని విని, "పిలుస్తాను వుండండి" అని రిసీవర్ మీద చెయ్యి ఆన్చి మూసి, "ఫ్యాక్టరీ నుంచి మీకు" అంది.
    ప్రసాద్ లేచి వెళ్ళి అందుకుని చొరవ తీసుకుని "అట్లా అంటున్నారా, అదెట్లా వీలవుతుంది అనే వస్తున్నానిప్పుడే__" అని భావనారాయణ వంక చూసి, "అర్జంటు పని వచ్చిపడింది, వెళ్ళిరావటమేననుకోండి. ఆలస్యం అవదు. మీరూ రాకూడదూ. మా ఫ్యాక్టరీని చూసినట్లు అవుతుంది" అన్నాడు.
    "మేము కబుర్లు చెప్పుకుంటూ వుంటాం వెళ్ళిరండి" అంది విమల.
    ఆ యిద్దరూ వెళ్ళారు. వాళ్ళు అటు వెళ్ళగానే, "మావారి సంగతి_ విజయ్ కుమార్ గారి ఘనత కొద్దిగా విన్నాను కాని_ అసలు విషయం ఏంటో చెప్పకూడదూ?" అంది కనకదుర్గ.
    "మీ శుభలేఖ చూడగానే ఆయన చాలా వర్రీ అయ్యారు. మీరు మావారికి బంధువులట. మీరు వొక వరసన చెల్లెలు యింకో వరసన మరదలు అవుతారట. కొన్ని కొన్ని దూరపు వరసలు తమాషాగా వుంటాయ్ కదా!" అని చిన్నగా నవ్వి, "మీ పెళ్ళి విజయ్ కుమార్ గారితో అని తెలిసి వెంటనే పెళ్ళికి వచ్చేశారు. లేకపోతే రాకపోనేమో. ఆ టైంలో ఫ్యాక్టరీలో గొడవేదో వుందికూడా__"
    మధ్యలో ఆపి, "మొదటి భార్య పేరు సీత__అని విన్నా. ఆమె యెట్లా చచ్చిపోయిందో చెప్పండి ముందు" అంది కనకదుర్గ.
    "మనిషి యెట్లా చచ్చిపోతారు? ప్రాణం పోయి!" అని చిన్నగా నవ్వింది విమల.
    సహజమరణం కాదు కదా?"
    "యేమో. ఆత్మహత్య అని వినికిడి హత్య కాకపోవచ్చు. వైరల్ ఫీవరేనేమో__
    మధ్యలోనే ఆపి, "విజయ్ కుమార్ గారి స్వభావం యెట్లాంటిది?" అంది కనకదుర్గ.
    అంతలో వాకిట్లో కారు ఆగిన చప్పుడు, కారులోంచి వందన దిగింది.
    లోపలికొస్తూ. "హలో విమ్మీ ఇంట్లకెల్లి స్టార్ట్ అయినప్పుడు యెరికలే యిటొస్తనని సడన్ గా నువ్వు గుర్తొచ్చి వచ్చేస్తి" అంది వందన కూర్చుంటూ.
    "ఈమె వందన" అని కనకదుర్గవైపు తిరిగి "కనకదుర్గ అనీ__" అంటూ చెప్పబోతోంది విమల.
    మధ్యలోనే అందుకుని, "బై ఎనీ ఛాన్స్__ సెన్ట్ యేన్స్ లో చదివిన__' అని వందన అంటూండగానే, "హలో వందనా నేనూ__" అని కనకదుర్గ అంటూంటే, అందుకుని, "హాయ్ దుర్గీ ది బ్లాక్ గాడెస్ వాటె సర్ ప్రైజ్. యెక్కడా? యేమీ? వీళ్ళు మీకు రిలేటివ్సా?" అంది వందన.
    "మా వారికి చుట్టాలు. యిప్పుడు నాకూ" అని నవ్వింది విమల.
    అమాంతం వందనా కనకదుర్గా లేచారు. ఒకరినొకరు కావలించుకున్నాడు. కనకదుర్గ వందన బుగ్గ పట్టుకుని లాగింది.
    "యింకా అప్పటి మిస్చిఫ్ పోలే పోరీ! అని, కనకదుర్గ జబ్బమీద గిచ్చింది వందన.
    "మా జాయ్ ఫుల్ మీటింగ్ లో నిన్ను మర్చిపోయినం కదా విమలా" అని వందన కనకదుర్గ చెయ్యి పట్టుకుని__ఇద్దరూ ఒకే సోఫాలో పక్కపక్కనే కూర్చున్నారు.
    "ఇంతకూ మీరిద్దరూ__" అంటోంది విమల.
    "ఈ పోరి__" అని వందన చెప్పబోతూంటే__"ఈ కర్రి పోరీ" అని అందించింది కనకదుర్గ.
    "ఆల్సో ఈ బ్లాక్ గాడెస్__చిన్నప్పుడు ఐదారేండ్లు మేమిద్దరం క్లాస్ మేట్స్ మి. అద్సరే ఇంత కాలానికి" అని విమలవైపు తల తిప్పి, "వీండ్లని చూసేదానికి వస్తివా?" అంది వందన.
    "అత్తవారింటికి వచ్చింది. విజయ్ కుమార్ గారి భార్య. నవవధువు అంది విమల.
    "ఏ విజయ్ కుమార్?"
    "మన నిజాం కాలేజీ విజయ్ కుమారే" అంది విమల.
    "డోంట్ కట్ సచ్ టెరిబుల్ జోక్స్" అంది వందన.
    "టెరిబుల్ అయినా గిరిబుల్ అయినా అది జోక్ కాదు" అంది విమల.
    "అదెట్లా జరిగింది విమలా. నువ్వేమి చెప్పలే అంది. అంతలో ఫోను మోగింది. విమల అందుకుని నే వస్తున్నా" అంది వందన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS