Previous Page Next Page 
అనుక్షణికం -2 పేజి 83


    ఒక్కతే కూతురు. ఐనా రెండో పెళ్ళివాడైనా,ఆస్థిని దృష్టిలో పెట్టుకునీ అతని వయసు తక్కువేకదా అనీ యీ సంబంధానికి నిర్ణయించుకున్నాడు కనకదుర్గ తండ్రి భావనారాయణ.
    "తెలుసుననే అనుకుంటున్నాం. అటు గుంటూరువైపు. కొద్దినెలల క్రితం భార్య వైరల్ ఫీవర్ తో చనిపోయింది, పాపం. యెవరో యీ సంబంధం గురించి చెప్తే అన్నీ బాగానే అనిపించి పెళ్ళిచూపులు యేర్పాటుచేశాం. అమ్మాయీ అబ్బాయీ ఇష్టపడ్డారు__"
    మధ్యలో అందుకుని, "ఆ విషయాల గురించి కాదు. ఒక ముఖ్యమైన విషయం. చిన్నవాణ్ని చెప్పకూడదేమో గాని __ యీ సందర్భంలో మా నాన్నగారు వుండివుంటే చెప్పివుండేవారని చెప్పదలిచాను. అన్నట్లు కార్యం పెళ్ళవగానే నిర్ణయించారా?"
    "యింకా అనుకోలేదు. తొందరలో జరిపించాలని అటునుంచి సూచన కనిపించింది. మూడు నిద్రలకి వెళ్ళొస్తారుగా__ ఆ తర్వాత మంచిది చూసి__"
    "అది రెండు మూడు నెలలు వాయిదా వెయ్యండి వీలైతే. వెంటనే కాపరానికి పంపండి. కాపరానికంటే మరేంలేదు. వెళ్ళి అత్తవారింట్లో వుంటూ వుంటుంది. అతను హైదరాబాదులో వాళ్ళ బాబాయి వాళ్ళింట్లో వుంటాడు. మీకు సంగతులన్నీ తెలిసేవుండాలి. ఆ అన్నదమ్ములు కలిసే వుంటారు. వీళ్ళ అనుకూల దాంపత్యం కోసం నేనీ సూచన చేస్తున్నాను" అన్నాడు ప్రసాద్.
    "బాబూ ఏదైనా విషయం వుంటే చెప్పు బాబూ. పిల్లతండ్రిని. ఒక్కగానొక్క బిడ్డ గొంతు కోయదలచనుగా__ ఇప్పటికీ మించిపోలేదు. అంత విషమమైనదేదైనా వుంటే__" అన్నాడు సంచలనంగా.
    "అట్లాంటిదేంలేదండి. విజయ్ కుమార్ వ్యాపారం తదితర విషయాల్లో మంచి దిట్ట. కాకపోతే కాస్త తిరుగుబోతు"
    మధ్యలోనే అందుకుని "చూచాయగా అదీ తెలిసింది గానీ యేదో కుర్రతనం దానిదేముంది అమ్మాయి వెళ్ళినాక అంతా సరైపోతుందని నలుగురూ అంటేను__"
    "అదే నేను చెప్పబోయేది. అక్కడ అతని పిన్నిని తప్ప యెవరినీ విశ్వసించకూడదు. మళ్ళీ అందరితోనూ మంచిగానే వుండాలి. అతని పిన్ని చాలా యోగ్యురాలు, వుత్తమురాలు. కానీ ఆమె మాట యెందులోనూ సాగదు, మేము వుండేది అక్కడేగా. నేనూ మా ఆవిడా వుంటాం. కలుసుకుని సహకరిస్తాం. అమ్మాయిని ఒకసారి చూడదలిచాను. పరిచయం వద్దు. లోనకి వెళ్ళి చెప్పి అమ్మాయితో మంచినీళ్ళు తెప్పించి ఇవ్వండి" అన్నాడు ప్రసాద్.
    భావనారాయణ వెళ్ళాడు, తెల్లని దుబ్బుజుట్టు సవరించుకుంటూ.
    పెళ్ళిచూపుల్లో ఒకరినొకరు చూసుకున్నారు, విజయ్ కుమార్ పక్కన అంత నల్లగా అనిపించదుగానీ, నలుపే. పోలికలు_యేదో వుంటాయి. అనాకారి కాదు. విజయ్ కుమార్ కంటికి కనకదుర్గ అవయవాలూ అవీ నచ్చి రూపం కోర్కె పుట్టించేదిగా వుండి __ సంతోషించాడు. లేకపోయినా కాదనకపోను. కనకదుర్గకి విజయ్ కుమార్ బాగానే అనిపించాడు. సంబంధం చూశారు. పెద్దలు నిర్ణయిస్తే కాదనాల్సినంత యిదిగా యేమీ అనిపించలేదు ఆమెకి. చిన్నప్పుడు హైదరాబాద్ కాన్వెంటులో ఐదారేళ్ళు చదువుకుంది, వాళ్ళ మేనమామ ఇంట్లో వుండి. అతనికి ఢిల్లీ బదిలీ అయ్యి వెళ్ళినప్పుడు వూరు వచ్చింది. ఆమెకి చదువంటే ఆసక్తి లేదు. లలితకళలంటే చాలా యిష్టం. అయితే యేవీ అభ్యసించలేదు.
    భావనారాయణ వచ్చి, "బాబూ సందేహించకు. యేదైనా ముఖ్యమైన అంశం వుంటే __ తర్వాత బాధపడాల్సి వచ్చేదైతే __ కావాల్సిన వాడివి. నేనే అడుగుతున్నాను. చెప్పు నాయనా" అన్నాడు.
    "అట్లాంటిదేం లేదండీ. మీరు నిశ్చింతగా వుండండి. అమ్మాయి భర్తని కాస్త అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అందుకని కార్యం వెంటనే జరగనివ్వకండి. ఆలోగా హైదరాబాద్ లో మేము పరిచయం చేసుకుంటాం" అని తన విజిటింగ్ కార్డు భావనారాయణకి ఇచ్చాడు ప్రసాద్.
    అంతలో కనకదుర్గ మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది.
    "మన రామకృష్ణ ప్రసాద్ గారబ్బాయి" అని కూతురితో అన్నాడు భావనారాయణ.
    గ్లాసు అందుకుంటూ పరిశీలనగా చూశాడు ప్రసాదు. 'మనిషిని చూస్తే బాగా పలుకున్నదాన్లాగా వుంది' అనుకున్నాడు.
    ఆమె కళ్ళలో చురుకుదనమూ పదునూ వున్నాయి.
    పెళ్ళి తరవాత దంపతుల్ని విజయ్ కుమార్ వాళ్ళ సొంతవూరు తీసికెళ్ళారు. కనకదుర్గతోపాటు వాళ్ళ చిన్నత్త కూతురు మరొకరు వెళ్ళారు. ఆచారం ప్రకారం దంపతులు కలుసుకునే అవకాశం తక్కువ. ఆడవాళ్ళలోనే వుంటుంది పెళ్ళికూతురు.
    ఆ తరవాత నెలరోజులకి కనకదుర్గని హైదరాబాద్ తీసుకువచ్చాడు తండ్రి. ఉదయం వచ్చారు. సాయంత్రం నాలుగింటికే భావనారాయణ ప్రసాద్ యింటికి వెళ్ళాడు. "మావయ్యగారూ__" అంటూ మర్యాద చేసింది విమల.
    వ్యాపారం తదితరమైన కబుర్లు.
    "యింక వెళ్తానమ్మా_" అని లేస్తుంటే, "మేము బజారు వెళ్తున్నాం, దారిలో మిమ్మల్ని డ్రాప్ చేస్తాం" అన్నాడు ప్రసాద్.
    కారు విజయ్ కుమార్ వాళ్ళ ఇల్లు చేరాక, భావనారాయణ దిగి, "రెండు నిమిషాలు రాకూడదూ?" అని, విమలవైపు చూసి, "అమ్మాయిని చూడలేదుగా. పెళ్ళికి మీ ఆయనతో కలిసి రాకపోతివి" అన్నాడు.
    లోనకి వెళ్ళారు.
    విజయ్ పినతల్లి వచ్చి, "ఆయన రాత్రికి గానీ రారు. అబ్బాయి యిప్పటిదాకా వున్నాడు. యిప్పుడే బయటికెళ్ళాడు" అని కనకదుర్గని పిలిచింది.
    అవీ యివీ కబుర్లు. కాఫీ_
    ప్రసాదు, విమల బయల్దేరారు. పంపించటానికి భావనారాయణ వాళ్ళు కూడా మేడమెట్లు దిగాడు, కూతుర్ని కూడా రమ్మని సౌంజ్ఞ చేస్తూ.
    మెట్లు దిగుతూ విమలతో, "ఆ అమ్మాయిని అట్లా మొక్కల్లోకి తీసుకెళ్ళు" అన్నాడు ప్రసాద్ చిన్నగా.
    పోర్టికోలోకి వెళ్ళాక, "కొన్నాళ్ళు వుంటారా?" అన్నాడు ప్రసాద్ భావనారాయణతో.
    రెండు రోజుల్లో వెళ్ళాలనీ వూళ్ళో జరూరు పనులు యేకరువు పెడుతున్నాడు భావనారాయణ.
    "గార్డెన్ బాగుందికదా?" అంది విమల కనకదుర్గతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS