Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 85


    తన పదవికి ఎసరుపెట్టాలని తన పార్టీకి చెందిన అసమ్మతి వర్గం ఓ పక్క బలంగా ప్రయత్నిస్తుంటే, రాయ్ ఇలా మాట్లాడ్డం చాలా ఆనందంగా వుంది. పైగా ప్రధానమంత్రితో అతడెంత చనువుగా ఉండేదీ వాసుదేవరావుకీ తెలీని విషయం కాదు.
    
    ఏ క్షణంలో అయినా మనసు మార్చుకుంటాడేమో అని రాయ్ గురించి అనుకుంటుంటే, ఇప్పుడు మరోమారు మనం కాబోయే వియ్యంకులము' అనడం మంత్రంలా పనిచేసి కృతజ్ఞతగా రాయ్ చేతుల్ని పట్టుకున్నాడు.
    
    "ఈ సమస్య నుంచి మీరే గట్టెక్కించాలి."
    
    పగలబడి నవ్వాడు రాయ్. "ఈ గొడవలో పడి మీరు పెళ్ళి ఏర్పాట్లు మరిచిపోకండి."
    
    "ఇంత దూరం వచ్చాక ఇక ఆగుతుందా రాయ్ గారూ! ఈ నెలాఖరుకి ముహూర్తాలు ఖాయం చేసేశాంగా."
    
    ఖాయం చేసినా ఇంకా కార్ద్సు అచ్చు వేయించకపోవటానికి కారణం వాసుదేవరావు మనసులో అలజడిగా ఉంది. పదవి గురించి కాదు, ప్రబంధ గురించే. ప్రబంధ అంగీకరించిందనే వార్త కోసం చాలా ఆందోళనగా ఎదురుచూస్తున్నాడతను.
    
    మొండిగా దూసుకుపోయేవాడే - కానీ ప్రబంధ కూడా దేనికీ వెనకాడని మొండిపిల్ల అని తెలీడంతో, రోజుల్ని కాదు నిముషాల్నీ, సెకండ్లనీ లెక్కపెట్టుకుంటూ గడుపుతున్నాడు.
    
    రాత్రి తొమ్మిదిన్నర దాకా ఆయనతోబాటే ఉన్న కెపి. రాయ్ వెళ్ళిపోయాక ఇక అదుర్ధాని భరించలేని ముఖ్యమంత్రి వైజాగ్ ఫోన్ చేశాడు. కాని ఎంగేజ్ డ్ శబ్దం వినిపించింది.
    
    ఒకటి రెండు సార్లు కాదు, వరసగా పదిసార్లు ప్రయత్నించాడు. నిజానికి ఫోన్ ఎంగేజై లేదు. రిసీవర్ ని పక్కన పెట్టింది సౌదామిని.
    
    తను రాయని నాటకంలో ప్రబంధని కీలకమైన పాత్రగా మార్చి అప్పటికే ఆదిత్య దగ్గరకు పంపించింది. ఏం చేయాలో మరోమారు వివరంగా తెలియచెప్పి.
    
                                                              * * *
    
    మొదలైన తుఫానుకి తార్కాణంగా ఆకాశంలో ఫెళ ఫెళార్భాటాలు.
    
    చీకటిని ఖడ్గాల్లా చీల్చుతున్న మెరుపులు.
    
    అనిత గురించి ఆందోళనగా ఆలోచిస్తూ కూర్చున్నాడు ఆదిత్య.
    
    సౌదామిని మాటలు ప్రతిధ్వనుల్లా వినిపిస్తున్నాయి ఇంకా.
    
    "నీ కోసం ప్రబంధ తపించిపోతూంది."
    
    "నీ ప్రేమకోసం తన సర్వస్వాన్ని కాలదన్నుకుని ర్వతానికి సిద్దంగా వుంది."
    
    "అనిత ఇప్పటికే కాదు మరెప్పటికైనా క్షేమంగా ఉండాలీ అంటే ప్రబంధ నీ మనిషి కావాలి. ప్రబంధ నిన్ను వదులుకోలేనంత చేరువైన ఆడపిల్లని తెలిస్తే తప్ప ఈ దాడి ఆగదు."
    
    ప్రణయ గుర్తుకొచ్చింది. వెనువెంటనే రూపమూ స్ఫురించింది.
    
    పాలరాతి చెక్కడాల్లో, ఇంద్రనీలాల కట్టడాల్లో అనర్ఘవర్ణ శిల్పంలా బ్రతకాల్సిన ప్రబంధ తనలో ఏం చూసి అంతగా ఇష్టపడుతూంది?
    
    కలలా సాగాల్సిన బ్రతుకునుంచి కల్లోలం వైపు కావాలని ఎందుకు పరుగులు పెట్టాలనుకుంటూంది? అసలిప్పుడేం జరగబోతూంది?
    
    సౌదామిని చెప్పింది మననం చేసుకుంటుంటే మనసు అడకత్తెరలో ఆలోచనలు ముక్కలవుతున్నాయి. అణువంత భయమూ చోటు చేసుకుంటుంది.
    
    ఏది ఏమైనా ప్రబంధ ద్వారా తప్ప తను సమస్య నుంచి బయటపడలేడేమో!
    
    దూరంగా ఉరిమినచప్పుడు.
    
    మరుక్షణం నేలని తాకిన ఓ మెరుపు.
    
    ఆ మెరుపు కాంతిలో అప్పుడు చూశాడు ఆదిత్య. వర్షంలో తడిసిన పారిజాతంలా, ప్రకృతి తెరిచిన తొలిపుటలా ప్రబంధ నిలబడి వుంది ద్వారం దగ్గర.
    
    ముందు కలేమో అనుకున్నాడు.
    
    సన్నగా వణుకుతున్న ప్రబంధ నిజంగానే వచ్చిందని అరక్షణంలో అర్ధం చేసుకున్నాడు.
    
    "ప్రబంధా!"
    
    గర్జనలా కాదు. అణువంత ఆర్తిగా పలకరించాడు ఆదిత్య. అదోలాంటి ఊరట.
    
    అప్రతిభురాలై చూసింది. ఎందుకో చాలా ప్రతిఘటన్ని ఊహించింది కాని ఆదిత్య మరోలా ప్రవర్తిస్తున్నాడు.
    
    "వర్షంలో తడిసిపోయినట్టున్నారు!" టవల్ అందించబోతుంటే, అవసరం లేదంది తల వంచుకునే.
    
    ఆదిత్యకీ బిడియంగా వుంది. అంతకుమించి ప్రబంధ కూడా లజ్జగా నిలబడిపోయింది.
    
    "చీర విప్పేయరాదూ!"
    
    చివాలున తల పైకెత్తింది ఆ వాక్యంలో అనుకోని భావమేదో ధ్వనించగానే.
    
    "ఆహా... తడిసిపోయారు కదా అని" గొంతు పెగలడంలేదు ఎందుకో.
    
    సౌదామిని ఉద్బోధే గుర్తుకొచ్చి అలా ముకుళించుకుపోయిందో, లేక తను ఎందుకింత సాహసం చేస్తున్నానూ అన్న భావమే మనసులో మెదిలిందో కంపించిపోతూంది.
    
    "జలుబు చేస్తుంది" చీర మార్చుకోమన్నట్టు మరోసారి గుర్తు చేశాడు.
    
    తల వంచుకునే ఆలోచిస్తూంది.
    
    తనతోనే ఇలా మాట్లాడుతున్నాడా, ప్రణయతో కూడా యిలానే వుంటాడా?
    
    అయినా తనను చూడగానే రోషంగా కలయబడతాడనుకుంటే ఇంత సాదరంగా ఆహ్వానిస్తున్నాడేం? తన తప్పేమీ లేదని తెలుసుకున్నాడా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS