"కాని..." ఇక్కడ ఆ విషయం చర్చించడం అవసరమో, అనవసరమో అతడికీ తెలీదు. కానీ చెప్పాడు అసహనంగా- "నేను ప్రణయ అనే మరో అమ్మాయిని ఇష్టపడుతున్నాను."
"ఇష్టపడుతున్నారా? ప్రేమిస్తున్నారా?"
జవాబు చెప్పలేకపోయాడు.
"ఇష్టపడటం కన్నా ప్రేమించటం గొప్పదైతే మీకన్నా ప్రబంధ మీ విషయంలో ఎక్కువగా ఆశలు పెంచుకుంది ఆదిత్యా! మిమ్మల్ని ప్రేమించే వ్యక్తికోసం మీరు ఆలోచించడం మీ ఇష్టం కన్నా ఆ ప్రేమే గొప్పదనుకోవడం న్యాయంకదూ?"
"వద్దు! నాకీ ప్రేమలూ, ఇష్టాలూ అక్కర్లేదు. నా చెల్లెలు కావాలి!"
చెల్లికోసం అతడు ఎంత ఆందోళనపడుతున్నదీ ఆమెకి బోధపడి పోయింది. "ఒకవేళ మీ చెల్లికోసం ప్రబంధకి దగ్గరకావడమే తప్పనిసరైతే, అల సీరియస్ గా చూడకు ఆదిత్యా! మాటవరుసకి అడుగుతున్నాను-ఒకవేళ ప్రబంధపైన ప్రేమే మీ చెల్లిని రక్షించగలిగే మార్గాన్ని అందిస్తే ఆ మార్గంలో మీరు నడవడానికి సిద్దంగా ఉన్నారా?"
"అబ్సర్డ్! బ్లాక్ మెయిల్ తో ప్రేమ పుట్టుకురాదు!"
"ఎందుకయ్యా, ప్రబంధలో ఏ లోపం కనిపించిందని ఇలా మాట్లాడుతున్నావ్? ప్రణయ కన్నా ఎదులో ఆమె తక్కువని? అందంలోనా, చదువులోనా?" అడిగింది మరింత చనువుని ప్రదర్శిస్తూ.
"కేవలం అర్హత లొక్కటే ప్రేమను గెలుచుకోటానికి సాధనాలు కావు."
"అంగీకరిస్తున్నాను ఆదిత్యా! నీ ఆలోచనల్ని మనస్ఫూర్తిగా సమర్ధిస్తున్నాను. కాని, పరిపక్వత లేని పరిచయాన్ని ప్రేమగా భావిస్తూ చెల్లిని దూరంచేసుకోవటాన్ని మాత్రం హర్షించలేకపోతున్నాను. అవునా ఆదిత్యా! ఇప్పుడు జరగాబోయేదేమిటో తెలుసా? సరైన నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకోకపోతే నీ చెల్లి జీవితం అన్యాయమైపోతుంది. ఆ తరువాత ఇదంతా జరిపింది ప్రబంధే అన్న ఆలోచనతో ప్రబంధని ద్వేషిస్తావ్. అటు చెల్లిని మరిచిపోలేక నువ్వు, ఇటు నిన్ను మరిచిపోలేక ప్రబంధ, ఒంటరిగా ఓ జీవితకాలంపాటు జీవితాల నుంచి దూరంగా జరిగి కుమిలిపోవటాన్ని జీవితాలుగా మార్చుకుంటారు. ఎందుకిలా మాట్లాడుతున్నానో అర్ధం చేసుకో నిన్ను, మీ చెల్లిని శౌరి బెదిరించింది కూడా నువ్వు ప్రబంధని ద్వేషించాలనే!"
అర్ధంకానట్టు చూశాడు ఆదిత్య.
"అవును ఆదిత్యా! నీ నీడనే గిట్టనట్టు నిరసించే శౌరి తన చెల్లితో నిన్ను కలిసి పోటీల్లో పాల్గొనమని బెదిరించాడూ అంటే అర్ధంకాలేదా? అలా చేయించిందంతా ప్రబంధని నువ్వనుకోవాలి. ప్రబంధని నువ్వు ద్వేషించాలి. అదీ శౌరి ఉద్దేశ్యం. నువ్వయితే ప్రబంధని అపార్ధం చేసుకున్నావ్. కాని ప్రబంధ తన అన్న ఆలోచన గుర్తించింది. తన ప్రాణాలు తీసుకుంటానని శౌరిని బెదిరించింది అంతే! నీ మీద మరింత కక్షని పెంచుకున్న శౌరి ఇప్పుడు తన మాట ప్రకారం నీ చెల్లిని కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత నాశనం చేస్తాడు."
చాలా విషయాలు అర్ధమైన ఆదిత్య ఆమె తర్కాన్ని కాదనలేకపోయాడు. అది తర్కం కూడా కాదు, జరిగిన వాస్తవం.
"ఇప్పుడు అనితని కిడ్నాప్ చేసింది నేను ప్రబంధకి దూరంగా ఉండాలనే అయితే, నేను ప్రబంధతో చనువుగా ఉండటం శౌరిని ఇంకా రెచ్చగొట్టే విషయమవుతుందిగా?"
"మామూలుగా అయితే ఆ విశ్లేషణ రైటే కాని నువ్వో విషయం మరిచిపోతున్నావ్. నీకు నీ చెల్లెలిమీద ఉన్న ప్రేమ శౌరికీ తన చెల్లిమీద ఉంది అంటే శౌరిని సాధించాలీ అంటే ప్రబంధ నీకు ఇంకా అనుకూలం కావాలి. కనీసం నీ దగ్గరకు రావాలి. ఇంచుమించు నీ భార్యలా నీ దగ్గరే తిష్ఠ వేయాలి. ఆ చివరి కార్డుని డ్రాప్ చేస్తే చాలు శౌరికీ వ్యతిరేకంగా నువ్వు ఆట పూర్తి చేసినట్లవుతుంది."
"కాని...."చెల్లి కోసం ఎదిఅనా చెయ్యాలని వుంది కాని, ఇదంతా ఎలా సాధ్యమో అర్ధంకాలేదు ఆదిత్యకి. "ప్రబంధ నా దగ్గరకి ఎలా వస్తుంది? అటు అనితకేమైందో తెలీకుండా ఇక్కడ నేనెలా ప్లే చేయగలను?"
"ఆదిత్యా!" అతడు మెత్తబడుతున్నాడని గ్రహించిన సంతృప్తితో అంది సౌదామిని- "శౌరిపరంగా అనితకే సమస్యా వుండదు. ఎందుకంటే ఇప్పటికే ఆ విషయం నా దృష్టికి వచ్చిందని శౌరికి తెలుసు కాబట్టి. అనితకేమైనా అన్యాయం చేస్తే నేనే ప్రబంధకి చెబుతానని బెదిరించాను కాబట్టి. ఇకపోతే ప్రబంధ నీ దగ్గరకు రావాడమంటావా - నువ్వు అనుమతిస్తే చాలు నీ దగ్గర జీవితకాలం సెటిలవ్వాలనుకుంటున్న ప్రబంధని నేను యుక్తిగా నీ ఇంటికి పంపటం ఓ సమస్య కాదు. కాకపోతే ఆ తరువాత జరగాల్సిందే అతి ముఖ్యమైన ఘట్టం. నీ సంస్కారం నిన్ను అడ్డు పెట్టొచ్చు ఆదిత్యా! కాని నువ్వు ప్రబంధతో చనువుగా ఉండాలి. కనీసం నటించాలి. అది చాలు నేను శౌరిని సాధించటానికి! అలా అయితే మీ సమస్యలు తాత్కాలికంగా కాదు. శాశ్వతంగా పరిష్కారమై పోతాయి."
ప్రబంధ పెళ్ళి విషయం ఆమె ప్రస్తావించలేదు. అవసరమైన విషయాలు మాత్రమే 'ఇంజక్ట్' చేయాల్సిన చోట, అనవసరమైన ప్రసక్తిని తీసుకురావటం సమంజసం కాదని ఆలోచించగలిగే సౌదామిని, ఆదిత్యని ఎంత ప్రభావితుడ్ని చేసిందీ అంటే- అనితకోసం ప్రబంధకి అర్జంట్ గా తాళి కట్టడానికైనా సిద్దపడేట్టున్నాడు.
"కాని.... ప్రబంధకీ, నాకూ వున్న సంబంధం...అదే మా మధ్య అంతగా అటాచ్ మెంట్ ఉందని శౌరికి ఎలా తెలుస్తుంది?"
నవ్వేసింది సౌదామిని ఇందాక ప్రబంధ సంశయాన్నే ఇప్పుడు ఆదిత్య కూడా వ్యక్తం చేస్తున్నాడు. "ఆ విషయం నా కొదిలెయ్ ఆదిత్యా! అందాకా ప్రబంధని నీ మనిషిగా మార్చుకుంటావో, నువ్వెలా నటిస్తావో నీకే వదిలేస్తున్నాను. అలా చేస్తే నలభై ఎనిమిది గంటల్లో అనిత నీ దగ్గర వుంటుంది."
వెళ్ళిపోయింది సౌదామిని. అధ్యాయంలో రాయాల్సిన చివరి పుటకి స్ఫూర్తినందించే ప్రయత్నంగా.
* * *
సరిగ్గా ఇదే సమయంలో...
రాజధానిలోని ముఖ్యమంత్రి పర్సనల్ ఛాంబర్ లో కూర్చున్న ప్రముఖ పారిశ్రామికవేత్త కె పి. రాయ్, సి ఎం. వాసుదేవరావ్ తో ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రోజక్ట్ వర్క్ పూర్తయి, కోట్ల రూపాయల ఖర్చుతో విదేశాల నుంచి మెషినరీని దిగుమతి చేసుకుంటున్న నేనుమాత్రం ఎలా ఊరుకుంటాననుకున్నారు? అవసరమైతే ప్రధానమంత్రితో మాట్లాడతాను. అదృష్టవశాత్తూ రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఉన్నది ఒకే పార్టీ ప్రభుత్వాలు కాబట్టి అవకాశం తీసుకుంటాను. పైగా మనం కాబోయే వియ్యంకులంగా."
