"అరగొరలేని పూన్కి చెలువారఁగ, నెమ్మెయి ఘర్మబిందువుల్
మరిమరి జాలువారఁగ, శ్రమంపడి రొప్పుచు, నోటివెంబడిన్
నురుగులు గ్రక్కుకొంచును ననుం గెలిపింప మనోజవంబునన్!
బరుగులు వెట్టి వచ్చితి వపారము నీ ఋణ మెట్లు తీర్చెదన్!
ఎంత కష్టపడితివే అశ్వరాజమా!
బాధ నీది; విజయఫలము నాది;
స్వార్ధపరుఁడ నగుచు శ్రమపెట్టితిని నిన్ను
పందెమందు గెలుపునందుకొరకు."
ప్రియహయమ్ము నిట్లు ప్రేమార్ధ్రదృష్టితో
బుజ్జగించి, పందె ముజ్జగించి,
మందిరంము సేరె మనుజేంద్రసూనుండు
జనకు మానసమ్ము సంభ్రమింప.
శాంతమనోజ్ఞమై, అరుణసారథికంబయి, ఏకచక్ర వి
క్రాంతము సప్తసప్తి రుచిరంబగు స్యందనమెక్కి, స్వర్ణ సం
క్రాంతులతో, సహస్రకర కాంతులతో భువనత్రయిన్ ప్రభా
వంత మొనర్చె సూర్యభగవానుడు విశ్వవిరాజమానుడై.
వనవిహారము
అవతరణాలు కాంతికి; జనాళికి జాగరణాలు; సత్యమున్
శివమును సుందరమ్మయిన సృష్టి కలంకరణాలు; సర్వ మా
నవుల కశేష దోషహరణాలు; శుచిస్ఫురణాలు; లోక బాం
ధవకిరణాలు; లోకశరణాలు; సముద్దరణాలు శాంతికిన్!!
అంత సౌవర్ణకాంతి క్రాంత మొక ని
శాంతమున ప్రాంతకాననోపాంతమునకు
బాలసిద్దార్ధమూర్తి వాహ్యాళి వెడలె
నీడుజోడు నెచ్చెలికాండ్రతోడఁ గూడి.
లలితాకారుఁడు రాకుమారుఁడు మహోల్లాసంబు నిండార, నె
చ్చెలులం గూడి, ప్రసన్నమైన ఉదయశ్రీ శ్రీముఖమ్మందు ము
ద్దుల కాశ్మీరము దిద్ది తీర్చు భగవంతున్ పద్మినీకాంతునిన్
దిలకించెన్; బులకించె నెంతయు రసార్ధ్రీభూతచేతస్కుఁడై.
"కొదమగిత్తలు తోలుకొని పోవుచున్నాఁడు
సేద్యకాఁ డామూల చేను దున్న;
గుగ్గిళ్ళకై కోసికొనుచుండి రావైపు
కాఁపు కన్నెలు క్రొత్త కందికాయ;
గొల్లబొట్టెలు మేపుకొనుచున్నవా రదే
ఆలమందల శాద్వలాలయందు;
అల్లదే! ఎదురుగా నరుదెంచుచున్నాఁడు
పాలకావడితోడ పాలికాఁపు;
కంటిరే రోహిణీనదీ గర్భమందు
ప్రతిఫలించెను స్వర్ణప్రభాతలక్ష్మి;
జనని యనురాగ పూర్ణ వక్షమ్మునందు
పసిఁడినిగ్గుల పాలపాపాయివోలె!
రాగమయమైన ప్రకృతి సామ్రాజ్యమందు
ప్రతిపదంబును రసవైభవమ్ము విలుచు;
రసమయంబైన సుకవిసామ్రాజ్యమందు
ప్రతిపదంబున రాగసంపదలు నిలుచు."
ఇట్లు ప్రాభాత శోభా సమీక్షణమున
స్వాంతనళినమ్ము అనురాగ సరసిఁ దేల
మిత్రులం గూడి చిత్రవిచిత్రమైన
సృష్టి సౌందర్యమును బ్రశంసించుకొనుచు-
ఒకచెట్టునుండి యింకొంక చెట్టునకు 'చెంగు
చెంగున' దుముకు ప్లవంగములును,
ఒకకొమ్మనుండి యింకొక కొమ్మపై 'కల్ల
నల్లన' నేగురు విహంగములును,
ఒక పూవునుండి యింకొక పూవుమీఁదికి
'రింగురింగున' నేగు భృంగములును,
ఒక పుట్టనుండి యింకొక పుట్టలోనికి
'చరచర' ప్రాఁకు భుజంగములును
ఒక్క పొదనుండి యింకొక ప్రక్క పొదకు
చెంగలించెడి బాల కురంగములును
కలిగి కన్నులపండువౌ కాననంబు
కాంచి హర్షించె శాక్యభూకాంతసుతుఁడు.
వచ్చుచునున్న సూర్యభగవాను కరమ్ములు సోకి అప్పుడే
విచ్చుచువిచ్చుచుండె అరవిందకులంబు కొలంకులందు; గో
ర్వెచ్చని తియ్యదేనియల విందులు సిద్దమొనర్చి స్వాగతం
బిచ్చుచునుండె సుందరవనేందిర తుమ్మెదముద్దరాండ్రకున్.
మంజుల పింఛముల్ గగనమండలమందు పదేపదే తటిత్
పుంజములన్ రచింప ఫణిభుక్కులు చక్కఁగ సల్పె నాట్యముల్;
కుంజకుమారికల్ సరస కోమలహస్తము లెత్తి భక్తి పు
ష్పాంజలులన్ వెలార్చె విరజల్లిన ప్రేమ పరీమళమ్ముతో.
మిలమిలలాడు మంచుమలమీఁది నవారుణరేఖఁ గాంచుచున్
కలకల కూయుచున్న విహగమ్ముల గీతిక లాలకించుచున్
జలజల పారు నిర్ఘరుల చల్లని జల్లుల మున్గితేలుచున్
కిలకిల నవ్వు పువ్వు లొలికించు మరందము లాహరించుచున్.
మోదముమీర కేల శరముల్ ధనువుల్ ధరియించి దేవద
త్తాది సుహృద్గణమ్ము మృగయాభిరతిన్ దిరుగాడుచుండ, నా
హ్లాదము నందె శాక్యతనయాగ్రణి మంజుల మాలతీ లతా
చ్చాదిత రాగరంజిత కిసాల రసాల తరూపవేదికన్.
ఒక సరస్సు తటాన గూర్చుండి, ఎదుట
ప్రతిఫలించు వినీలాంబరమ్ము నుదుట
జీవనపథాలఁ దళుకొత్తు యౌవనంపు
వంపులం గాంచు శాక్యభూవరసుతుండు.
చల్లని పిల్ల గాడుపుల చక్కిలిగింతల నెమ్మొగమ్ముపై
నల్లని ముంగురుల్ చెదరి నాట్య మొనర్ప గనెం గుమారుఁ డు
త్ఫుల్ల విలోలనేత్రములతో, ప్రతిబింబితమౌ నభస్థ్సలిన్
దెల్లని దూదిపింజలగతిన్ బయనించు పయోదపంక్తులన్.
.jpg)
"అంత మెటో యెరుంగని యనంతపథ,మ్మున నీ ప్రయాణ మి
ట్లెంతటిదాఁక సాగునొ గదే! యిపు డింతగఁ గూడి, యంతలో
వింతగ వీడి, గాలి యెటు వీచిన దా మటు పోవు నీ మొయ్యి;
ళ్ళెంత విచిత్ర! మందదుకు లీబ్రదుకుల్ మదినెంచి చూచినన్!"
అంచు సరోవరాంతర పయః ప్రతిబింబిత మేఘలక్ష్మి చే
లాంచల చంచలత్వముల నారసి పద్మదళాలపై ప్రకా
శించు తుషార బిందు చల జీవనముల్ గమనించువేళ రా
యంచలరీతి తోఁచిన నృపాత్మజుఁ డౌదల యెత్తి చూచినన్-
