శుద్దాంతః కరణమ్మునన్ జనకుఁడౌ శుద్దోదనుం డంపఁగా
శ్రద్దాభక్తులతో గురూత్తముని 'విశ్వామిత్రు' సేవింపుచున్
సిద్దార్దుండు కళాప్రపూర్ణుఁడయి భాసించెన్ యథాకాల సం
బుద్ధ ప్రాక్తన యోగ్యభాగ్యలహరీపూరం బపారంబుగన్.
'అక్షరదీక్ష' గైకొని, 'పదార్ధవిదుం' డయి, 'వాక్యకల్పనా
దక్షత' నంది, 'రీతి గుణ ధర్మవిభేద' మెరింగి, 'వ్యంజనా
లక్షణముల్' గ్రహించి, సమలంకృతులన్ గృతులం బఠించి, శా
క్యక్షితిపాలనందనుఁడు గాంచెను విశ్వకళా రహస్యముల్.
శ్రుతుల తత్త్వార్ద సంహిత లెల్లఁబఠియించి
స్మృతుల నానార్ధ సంగతులు చదివి
నిఖిల శాస్త్రాల పాండిత్యమ్ము గడియించి
యఖిలాస్త్రశస్త్ర రహస్య మెరిఁగి
తంత్రవాదనముల యంతస్సార మూహించి
మంత్రవాదమ్ముల మర్మ మరసి
రమణీయ కావ్య సారస్య మాస్వాదించి
కమనీయ సాహితీ క్రమము దెలిసి
వ్యష్టిలోన సమష్టి భావమ్ము నించి
సృష్టి నెల్ల విశిష్ట దృష్టికి లగించి
విబుధవరు లైన గురుల సేవించి మించి
ప్రజ్ఞమై మాయకొడుకు 'సర్వజ్ఞుఁ' డయ్యె.
ధనురాకర్షణ బాణవర్షణ కళాదక్షున్, గదా ఖడ్గ చా
లన పారీణుని, మల్ల యుద్ధ విజయోల్లాసున్, గృతాభ్యాసు, స్యం
దన మాతంగ తురంగ ధావన రహస్తత్వజ్ఞు, వీరాధివీ
రుని, సిద్దార్ధకుమారునిన్ గనె నరేంద్రుం డుజ్జ్వలానందుఁడై
అంకురమై, రసోల్లసితమై కొనసాగి, నవప్రవాళ రే
ఖాంక దళాంచలోచ్చలితమై, నరనాథు నదృష్టవల్లి న
ల్వంకలఁ బ్రాఁకి సౌరభములన్ విరజిమ్ముచు, పుష్పమండలా
లంకృతులన్ మనోరథ ఫలప్రద మయ్యెఁ గ్రమక్రమమ్ముగన్.
అనుభూతి
ఉదయలక్ష్మీ నవాభ్యుదయ భంగిమలోని
యనురాగ సరసిలో మునిగిపోయి-
నీలిమేఘాల కన్నీటి చుక్కలలోని
కరుణారసమ్ములోఁ గరగిపోయి-
లలిత లతా మతల్లుల జీవితములోని
కమ్మ నెత్తావిలోఁ గలసిపోయి-
నేలరాలిన పూలబాల గుండెలలోని
జాలి నిట్టూర్పులోఁ దేలిపోయి-
కేళికా లోల లీల మరాళ గతుల
బాలసిద్దార్ధ హృదయమ్ము పరువులెత్తు
ప్రేమమూర్తి సందర్శనాపేక్షతోడ
ప్రకృతిసౌందర్య భావ సోపాన పంక్తి.
ఒకవేళ చిరునవ్వు లొలకబోసెడి చిట్టి
పాపల మొగ మదేపనిగఁ జూచు
ఒకసారి మండుటెండకు మూడు కర్షక
వ్రాతమ్మునకు సానుభూతి తెలుపు
ఒకతేప తోడిబాలకుల నొక్కెడఁ జేర్చి
తీయని నుడుల సందేశ మొసఁగు
ఒకమాటు రోహిణీ సికతాతలమ్ముపైఁ
గూర్చుండి కన్నీరు గార్చుచుండు
ఒక్కపరి మేడచివర నిల్చుండి విపుల
కపిలవస్తుపుర మ్మెల్లఁ గలయఁజూచు
అపరిచిత విశ్వవీణలో ఆత్మగీతి
మేళనమొనర్ప శాక్యభూపాలసూతి.
గగనాంగణమున బంగారు గీతలు గీయు
శంపాలతాంగి చాంచల్య మెంచి
బాలభానుని పైడి పాదాలు ముద్దాడు
పద్మినీదేవి సంబరము చూచి
చిగురాకు సెజ్జపైఁ జిరునవ్వు చిందించు
హిమబిందువుల యమాయికత నరసి
నెలఁతకు వెండివెన్నెలతీగ లందించు
ప్రియచకోరస్వామి ప్రేమఁ గాంచి
ఏడురంగుల మకుటంబు నెత్తికొన్న
ఘన ఘనా ఘనమూర్తి జీవనముఁ దలఁచి
'యుస్సు'రని యొక్క వేడినిట్టూర్పు పుచ్చి
క్రిందుమీఁదౌను శాక్యరాణ్ణందనుండు.
నీలాభ్రమాలలోనికిఁ జొచ్చుకొనిపోవు
నగచక్రవర్తి యౌన్నత్యమునకు
కడుపులో బడబాగ్ని నిడి కాలుకదపని
ప్రేమాంబురాశి గాంభీర్యమునకు
కరగి నీరై లోకకంఠము పూరించు
ధారాధరేంద్రు నౌదార్యమునకు
అంధసృష్టికి దృష్టి నందించి మేల్కొల్పు
లోకబాంధవు దయాళుత్వమునకు
చలువదోసిళ్ళ పాలవెన్నెలలు చిలికి
యోషధులు పెంచు శశి నిశాశ్లేషమునకు
హృదయమున నేవియో యూహ లుదయమంద
ముందడుగు వేయు 'శ్రీఘనానందమూర్తి'.
'తలవంచు' మండుటెండలలోన మాడుచు
పొలము దున్నెడి కృషీవలులఁ గాంచి
'నిట్టూర్పుపుచ్చు' జానెడుగుడ్డ మొలఁ జుట్టి
జాలిగొల్పెడు బీదరాలిఁ గాంచి
'కన్నీరు నించు' చక్కని పూలకన్నెల
గొంతులు నులుము భక్తులను గాంచి
'కరగి నీరౌ' వ్రేళ్ళు కాయలుగాయ, క
ట్టెలు కొట్టుకోను కార్మికులను గాంచి
'సానుభూతి వహించు' గ్రీష్మమ్మునందు
నెండి కార్శ్వమ్ము గను సెలయేళ్ళు గాంచి
విశ్వకారుణ్యభావసంవేద్యమాన
మానసుండయి శాక్యభూజానిసుతుఁడు.
అనుకంప
తోడి నృపాల బాలకులతో హిమవద్గహనాంతరాల వే
టాడఁగఁ బోయి 'శాక్యతనయాగ్రణి' యచ్చటఁ బారిపోవ కా
లాడక త్రాస చంచల దృగంచలమై తలద్రిప్పి చూచు నా
లేడినెలంతపై విసరలేఁడు నిశాతశిలీముఖమ్ములన్.
ఆ గతిహీన దీన హరిణాంగన చూచిన జాలిచూపులన్
దాగుడుమూఁతలాడు కరుణామయి గౌతము లేతగుండెకున్
స్వాగతమిచ్చి విన్నపము సల్పెను విశ్వ విషాదగాథ, బా
ధాగత గద్గదత్వము కతమ్మున మ్రోగని మూఁగగొంతుతో.
అమ్మృగమూర్తిలో భువన మంతయుఁ దానొక ప్రేమమూర్తియై
కమ్మని భావ మేదొ యువగౌతము గుండెల మేలుకొల్పె; వి
ల్లమ్ములు పారవైచి యతఁ డార్తి మెయిం జనె, సానుభూతిపైఁ
గ్రమ్ము రసానుభూతి కడకన్నులఁ గాలువలై స్రవింపఁగన్.
వాలము వాల్చి మస్తకము వంచి నిలంబడు నెంతలేసి శా
ర్దూలములైన; తుండములతో ప్రణమిల్లి తొలంగు మత్త శుం
డాలములైన; భీకరసటాల మృగేంద్రము లోసరిల్లి వీ
డ్కోలు భజించు శాక్యతిలకుం దిలకించి వనాంతసీమలన్.
'అందరు మిత్రులం దెవరి యశ్వము ముందరపోవునో కనుం
గొంద' మటంచు పందె మిడి గుఱ్ఱములం దుమికించు వేళలన్
పందెమునందు గెల్చియు నృపాలసుతుండు కృపాప్రపూర్ణుఁడై
కొందలమందు డెందమున గూర్మిహయమ్ముఁ గనున్ బ్రియమ్మునన్.
కనికని రాజనందనుఁడు కారునికత్వము పొంగి బాష్పముల్
కనుగొనలన్ స్రవింప తురగమ్మును నిల్పి నిజోత్తరీయ చా
లనమునఁ జల్లఁగా సముపలాలన సేయును పాణిపల్లవ
మ్మున మెలమెల్లగా చరణముల్ స్పృశించి శ్రమమ్ము వాపుచున్.
