Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 8


    "అవునే కళ్యాణీ! నువ్వు పోలీసు ఆఫీసరు కూతురువి. ధైర్యం చేసి వాళ్ళను కాస్త బెదిరించరాదటే!" అంది గౌతమి. మరొక మాట దొరికిందన్న సంతోషంతో.
    "అమ్మో! నాకంత ధైర్యమే ఉంటే మీ చేత చెప్పించుకునే వరకూ ఆగేదాన్నా? అయినా, అలా బెదిరిస్తే వాళ్ళు నన్ను మాత్రం వదిలి, మీ ఇద్దరి వెంటా పడరని నమ్మకమేమిటి?" అంది కళ్యాణి సమాధానంగా.
    "ఒసే! నువ్వెప్పుడూ వసపోసిన పిట్టలా లొడ లొడ వాగుతా గదే. వాళ్ళలో ఏవో నాలుగు మాయమాటలు చెప్పి ఎలాగోలా వాడి పీడ విరగడయ్యేలా చేయరాదే!" అంది సాహితి.
    "మీ ఇద్దరూ ఎంతో కొంత వెనక ఆస్థి, హోదా ఉన్నవాళ్ళు మీరే వాళ్ళకు బెదిరిపోతే, పేద పిల్లను_ నేను మాత్రం ధైర్యం చేయగలనా? నా వల్ల కాదే!" తన నిస్సహాయతను తెలియపరిచింది గౌతమి.
    ఆడపిల్లలు వాళ్ళ వెకిలి చేష్టలను ప్రతిఘటించక పోవడంతో కుర్రాళ్ళకు హుషారు ఎక్కువయింది. మరికాస్త విజృంభించారు.
    దిక్కుతోచని స్థితిలో పడ్డారు ముగ్గురాడపిల్లలూను. ఉన్నట్టు మెరుపులాంటి ఆలోచన తట్టింది సాహితికి.
    "దొంగ! దొంగ! పట్టుకోండి! పట్టుకోండి!" అంటూ ఒకసారిగా కేకలు పెట్టడం మొదలుపెట్టింది.
    మిగిలిన ఇద్దరూ సాహితి పథకం అర్ధమైనట్టు ఆమెతో జత కలిపారు.
    సరిగ్గా అదే సమయంలో అటుగా బుల్లెట్ మోటార్ సైకిల్ వస్తున్న శబ్దమయింది.
    అది విన్న సాహితీ బుర్ర చురుగ్గా పనిచేసింది. వెంటనే_ "పోలీస్! పోలీస్!" అంటూ అరవసాగింది.
    బుల్లెట్ మోటార్ సైకిల్ మీద నిజంగానే పోలీసు ఇన్ స్పెక్టర్ వచ్చాడు.
    కుర్రకారు గతుక్కుమన్నారు.
    ఇన్ స్పెక్టర్ ను చూస్తూనే సాహితికి ఎనలేని ధైర్యం వచ్చింది.
    "ఎక్స్ క్యూజ్ మీ సర్!" సాహితి చేయెత్తి అతన్ని ఆపింది.
    "ఏదన్నా సమస్యా!" ఇన్ స్పెక్టర్ వీరేష్ బుల్లెట్ కు స్టాండ్ వేశాడు.
    "పట్టణంలో రోడ్ రోమియోలు విచ్చలవిడిగా తిరుగుతుంటే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంటుంది సార్!" సాహితీ ఆవేశంగా అంటూ అప్పటివరకు తమను వెంబడిస్తున్న కుర్రవాళ్ళను చూపుతూ జరిగింది చెప్పింది.
    "ఆల్ రైట్! చర్య తీసుకుంటాను. మీరు రిపోర్టు రాసివ్వండి" ఇన్ స్పెక్టర్ మరింత ఆవేశంగా అన్నాడు.
    "రిపోర్టా? అంటే రేపు మేము కోర్టుల చుట్టూ తిరగాలిగా! ఆడపిల్లలు కోర్టు బోను ఎక్కి సాక్ష్యం చెప్పగల ధైర్యమే ఉంటే ఈ పోకిరీ వెధవలకు నడిరోడ్డుమీదే బుద్ధి చెప్పకపోయేవాళ్ళమా?" సాహితీ తన భయాన్ని వెలిబుచ్చింది.
    "అమ్మాయిలూ! ఇప్పుడు చెప్పండి. ఆడపిల్లలకు రక్షణ లేకపోవడానికి కారణం ఎవరంటారు? మిమ్మల్ని చూస్తే జాలి కలుగుతోంది. మీలో మార్పు రానప్పుడు మీ ఏ చట్టాలూ రక్షణ కల్పించగలవు?"
    అంటూ ఇన్ స్పెక్టరు లాఠీ చేతిలోకి తీసుకున్నాడు.
    తమవైపే వస్తున్న ఇన్ స్పెక్టర్ ను చూసి కుర్రాళ్ళు ఖంగు తిన్నారు.
    "ఏరా! రోడ్ల వెంట తిరిగే మీలాంటి పోకిరీ వెధవలు అచ్చోసి వదిలిన ఆంబోతులకూ తేడా ఏమీలేదు. యూ రాస్కెల్స్! తిడుతూ లాఠీని ఝుళిపించాడు ఇన్ స్పెక్టర్ వీరేష్.
    అప్పటికే చుట్టూ మూగిన జనం జరుగుతున్న తతంగాన్నంతా వినోదంగా చూస్తున్నారు.
    పరిస్థితిని గమనించిన సాహితి, ఆమె మిత్ర బృందం అక్కడ నుంచి జారుకున్నారు.
    జనంలో నుంచి బయటపడిన ఇన్ స్పెక్టరు వీరేష్ కు ఫిర్యాదు చేసి ఆడపిల్లలు పరిసరాలలో ఎక్కడా కనిపించలేదు.


                                                 *    *    *    *


    అభిమానుల మధ్య ఉక్కిరి బిక్కిరయ్యాడు వర్ధమాన యువ రచయిత సమ్రాట్.
    ఆటోగ్రాఫ్ లు, ఫోటోలు, ప్రశ్నలూ, జవాబులు. అంతా కోలాహలం. లాంఛనాలు పూర్తయ్యాయి.
    అభిమానులంతా శుభాకాంక్షలు తెలిపి వెళ్ళలేక వెళుతున్న ఒక్కొక్కరూ జారుకున్నారు.
    "కంగ్రాచ్యులేషన్స్!"
    లోపలికి వెళ్ళబోతున్న సమ్రాట్ ఆడపిల్లల గొంతు విని ఉలిక్కిపడి క్షణం ఆగి వెనుదిరిగి చూశాడు.
    గౌతమి, ఆమెతోపాటు మరి ఇద్దరు ఆడపిల్లలు కనిపించారు.
    చిరునవ్వి "రండి కూర్చోండి!" అంటూ కుర్చీలు చూపించాడు.
    ముగ్గురూ కూర్చున్నారు.
    "గౌతమీ! మీ స్నేహితులను నాకు పరిచయం చేయనేలేదు!" రెండు నిమిషాలు మౌనంగా దొర్లిపోవడంతో సమ్రాట్ చొరవచేసి అన్నాడు.
    గౌతమికీ, సమ్రాట్ కు ఇదివరకే పరిచయం ఉంది.
    "వాళ్ళు కూడా నాలా మీ అభిమానులే. మీకు శుభాకాంక్షలు తెలుపడానికే వచ్చారు" అంది ముసిముసిగా నవ్వుతూ గౌతమి.
    వాళ్ళ పరిచయాలు అయ్యాయి.
    సాహితి చేతిలో ఉన్న నవలలు చూసిన సమ్రాట్ కు నవ్వాగలేదు.
    పగలబడి నవ్వుతున్న సమ్రాట్ ను చూసి విషయం అర్థంకాక సాహితి, కళ్యాణి ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు.
    "సారీ! ఆ నవలలన్నీ మీరు చదివారా?"
    "నేను చదివాను" ఠక్కున అంది గౌతమి.
    "నిన్నుకాదు, గౌతమీ నేనడిగింది. మీ స్నేహితురాలు సాహితిని" నవ్వుతూ ఆమెవైపు చేయి చూపించాడు సమ్రాట్.
    సాహితి మౌనంగా ఉండిపోయింది.
    ఆమె ఆ పుస్తకాలు చదవలేదని ఇట్టే గ్రహించాడు సమ్రాట్. అతనిముందు అబద్ధం ఆడితే ఇక పూల్ అవ్వక తప్పదన్నట్టు నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే మేలనిపించి, పెదవి విప్పింది సాహితి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS